ఉద్యోగిగా ఎంపికైన సంస్థలో ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే ఆ సంస్థ లక్ష్యాలు నెరవేర్చగలరన్న నమ్మకాన్ని యాజమాన్యానికి కలిగించాలి. సంస్థలో చేరిన తొలిరోజు నుంచే యాజమాన్యం ఉద్యోగి సామర్థ్యాలను బేరీజు వేస్తుంటుంది. అందుకే ప్రాంగణ ఎంపికలకు హాజరయ్యేసరికే నైపుణ్యాలు అభ్యర్థుల్లో ఉండాలి. అందుకు విద్యార్థిదశ నుంచే వీటిని సిలబస్‌లో భాగంగా భావించి శిక్షణ పొందాలి!
ఏ విజయానికైనా బలమైన టీమ్‌వర్క్, స్పష్టంగా కమ్యూనికేట్ చేయగల బృందాలు అవసరం. ఒక జట్టును విజయవంతంగా తీర్చిదిద్దాలన్నా, ఇదివరకే ఉన్న జట్టును బలోపేతం చేసి విజయం సాధించాలన్నా జట్టులో ఉన్న ప్రతి సభ్యునికీ జవాబుదారీతనం ఉందాలి. ప్రతి సభ్యుడూ ఫలితాలకు బాధ్యత తీసుకున్నప్పుడే, వ్యక్తిగతంగా తాము ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రయత్నిస్తారు. వ్యక్తిగత జవాబుదారీతనం ఉన్నప్పుడే చేపట్టిన పనిని విజయవంతం చేసేందుకు వీలవుతుంది. టీమ్ లీడర్లు వ్యక్తిగత విజయం సాధించి, టీమ్ సభ్యుల్లో ఉత్సాహం నింపి సభ్యులందరిలో జవాబుదారీతనం పెంచవచ్చు.
భయంభయంగా పనిచేయడం జవాబుదారీతనం కాదు. ఏదైనా పొరపాటు జరిగినపుడు ‘ఇది నావల్లే జరిగిం’దని బాధ్యత తీసుకోవటమూ కాదు. జవాబుదారీతనం అంటే పనిలో ఒక నిబద్ధత, వ్యక్తులలో ఆలోచనాతత్వం, ఒక బాధ్యత.
వృత్తిపరమైన భిన్న నేపథ్యాలు, అనుభవాలు, ఆలోచనా విధానాలున్న వ్యక్తులను సభ్యులుగా ఎంచుకుంటే టీమ్ భిన్నమైన ఫలితాలు అందిస్తుంది. అలాంటి కలయిక అందుబాటులో లేకపోతే సభ్యులకే అలా శిక్షణ ఇవ్వొచ్చు.
చిన్న బృందాలు..
ఒక బృందం సమర్థంగా పనిచేస్తూ సంస్థ నిర్ద్దేశించిన లక్ష్యాలను సాధించాలంటే- జట్టులోని ప్రతి సభ్యుడూ సహకారాన్ని అందించాలి. నిజానికి బృందంలోని ప్రతి సభ్యునికీ తన బాధ్యత స్పష్టంగా, నిర్దిష్టంగా తెలపాలి. వ్యక్తిగత లక్ష్యాలపై శ్రద్ధ చూపిస్తే బృందంలో సమష్టిగా నిర్వర్తించవలసిన బాధ్యతను విస్మరించినట్లవుతుంది. బృందం చేపట్టిన పెద్ద ప్రాజెక్ట్ ఉందనుకుంటే- దాన్ని నిర్దిష్ట సమయంలో పూర్తిచేయడానికి వివిధ పనులు, కార్యక్రమాలు చేపట్టాలి. ఆ ప్రాజెక్ట్ పూర్తిచేసే క్రమంలో బృందంలోని సభ్యులను చిన్నచిన్న టీములుగా విభజించి పనులు కేటాయించవచ్చు. లేదా కొంతమందికే కొన్ని బాధ్యతలు అప్పగించవచ్చు. ఉదా: అవసరమైన గణాంకాలు సేకరించే పని ఒకరికి, విశ్లేషణ ఇంకొకరికి, పరిశోధన, సమస్యలను గుర్తించడం మరొకరికి..ఇలా.సభ్యులు తమ బృందంలోనే కొత్తకొత్త పాత్రలు పోషించే అవకాశం వారికి ఉత్సాహాన్నిస్తుంది.
నూతనత్వం.. నిరంతరం
జట్టులోని సభ్యుల పాత్రపై స్పష్టత ఉన్నపుడే నూతన ప్రయోగాలు చేసేందుకు వారికి వీలుంటుంది. ఈ కొత్త ఆలోచనల్లో వచ్చే ఫలితాలను పరిగణించాలి. సభ్యులకు నేర్చుకోడానికి పుష్కలమైన అవకాశాలు కల్పిస్తూ రిస్క్ తీసుకోవడానికి స్వేచ్ఛ నివ్వాలి. దీంతో మెరుగైన ఫలితాలు గమనించవచ్చు.
బృంద నాయకుడు జవాబుదారీతనం పెంపొందించుకోవడంతోపాటు జట్టులోని ప్రతి ఒక్కరిలోనూ స్పూర్తి నింపాలి. ఇతరుల్లో జవాబుదారీతనాన్ని పెంపొందించడం తేలిక కాదు. నిజానికి ప్రాజెక్ట్‌లో విజయం సాధిస్తే వ్యక్తిగత అభినందన కోసం ఎదురుచూడకుండా సమష్టి విజయంగా స్వీకరించే మానసిక స్థాయికి సభ్యులు ఎదిగితే ఆ టీమ్‌కు జవాబుదారీతనం ఉన్నట్టే.
ఒక పనికి జవాబుదారుగా చేయాలంటే ఓ సభ్యుని నుంచి ఏమి ఆశిస్తున్నారో ముందే అతనికి తెలియజేయాలి. బృందంలోని సభ్యులు, బృంద సారథీ కలిసి చర్చించుకుని పరస్పర అంగీకారానికి రావాలి. అలాంటి సందర్భాల్లో ఫలితాలు ఆశించినంతకంటే అధికంగా వస్తాయి.

*************************************
మరింత సమాచారం ... మీ కోసం!
‣ బీస్కూల్స్ ప్రవేశానికి మ్యాట్
‣ ఆశావహ ధోరణితో అనుకూల ఫలితాలు
‣ ఏ బోర్డులో చదివితే గెలుపు సులువు?
‣ Read Latest job news, Career news, Education news and Telugu news
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.