• facebook
  • whatsapp
  • telegram

వచ్చే ఐదేళ్లలో మీరెక్కడ?  

మౌఖిక పరీక్ష (ఇంటర్వ్యూ) ప్రధానోద్దేశం.. ఉద్యోగానికి సరిగ్గా సరిపడే అభ్యర్థిని ఎంపిక చేయడమే. ఈ ప్రక్రియలో భాగంగా అభ్యర్థిని రకరకాల ప్రశ్నలు అడుగుతుంటారు. వాటికి వచ్చే సమాధానాలను బట్టి అభ్యర్థి ఆలోచనా విధానాన్ని అంచనా వేస్తారు. ఇంటర్వ్యూ సమయంలో సాధారణంగా ఎదురయ్యే ప్రశ్నల్లో ఒకటి- ‘రాబోయే ఐదేళ్లలో మిమ్మల్ని మీరు ఎక్కడ చూసుకోవాలనుకుంటున్నారు?’. మరి దీనికి ఏ రకంగా సమాధానం చెప్పాలి?

ఇదేదో కాలక్షేపానికి అడిగే ప్రశ్న అనుకుంటే పొరపాటే. స్వీయ అవగాహన, ప్రేరణ, భవిష్యత్తు మీద అభ్యర్థికి ఉండే ఆశావహ దృక్పథాలను తెలుసుకోవడానికే ఇలాంటి ప్రశ్నను అడుగుతుంటారు. దీనికి సరైన సమాధానం చెప్పాలంటే.. ఇంటర్వ్యూ ముఖాముఖి జరిగినా లేదా ఆన్‌లైన్‌లో జరిగినా కొన్ని విషయాలను గుర్తుంచుకుంటే మంచిది. 

భావోద్వేగాలకు గురికాకూడదు: వ్యక్తిగతంగా భావోద్వేగాలకు గురవుతూ సమాధానం చెప్పకూడదు. అలాగే జవాబులో ఎక్కడా నిరాశ కనిపించకుండా జాగ్రత్త పడాలి. ‘నేను ఇప్పటివరకూ పెద్దగా సాధించింది ఏమీ లేదు. భవిష్యత్తులో సాధిస్తాననే నమ్మకమూ లేదు’ అన్నారనుకోండి. ఉద్యోగం ఇచ్చే సంస్థ కూడా మిమ్మల్ని నమ్మడానికి సంకోచిస్తుంది. మిమ్మల్ని మీరు నమ్మకుండా... ఎదుటివాళ్లు మాత్రం మిమ్మల్ని నమ్మాలని అనుకోవడం అత్యాశే కదా? ఇది గుర్తుంచుకుని ఎక్కడా నిరాశ ధ్వనించకుండా సమాధానం చెప్పాలి. 

సరిగ్గా సరిపోవాలి: మీరిచ్చే సమాధానం వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించాలి. ‘రాబోయే ఐదేళ్లలో కస్టమర్‌ సర్వీస్‌ కో ఆర్డినేషన్‌ టీమ్‌కు నేనే లీడర్‌నవుతా’ అని సమాధానం చెప్పారనుకుందాం. కానీ మీరు దరఖాస్తు చేసింది డేటా ఎనలిస్ట్‌ ఉద్యోగానికి. ఆ సంస్థలో కస్టమర్‌ సర్వీస్‌ విభాగమే లేదనుకోండి... పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి.  అందుకే మీరిచ్చే సమాధానం చేరబోయే ఉద్యోగానికి సరిగ్గా సరిపోయేలా ఉండాలి.

సరదాగా తీసుకోవద్దు: ఈ ప్రశ్నకు సరదాగా సమాధానం చెప్పాలని ప్రయత్నించకూడదు. ఇలా చేయడం వల్ల కెరియర్‌ విషయంలో మీరు సీరియస్‌గా లేరని ఎదుటివారు ఒక అంచనాకు రాకవడానికి అవకాశముంది. లేదా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం ఇష్టంలేక విషయాన్ని తేలిగ్గా తీసుకుంటున్నారనీ ఎదుటివారు అనుకోవచ్చు. 

పొంతన లేనివి వద్దు: మీకు స్పష్టమైన ఆలోచన ఏమీ లేకపోతే.. అదే విషయాన్ని నిజాయతీగా చెప్పేయొచ్చు. అంతేగానీ ఇదే కంపెనీకి సీఈఓ కావాలనుకుంటున్నాను. లేదా మంచి పుస్తకం రాయాలనుకుంటున్నాను... లాంటి సమాధానాలు చెప్పొద్దు. ఈ తరహా సమాధానాల వల్ల అప్పటివరకు మీ మీద ఉన్న సదభిప్రాయం కాస్తా పోతుంది.

సాధన ముఖ్యం: ఇంటర్వ్యూకు వెళ్లే ముందు తప్పనిసరిగా సాధన చేసి వెళ్లాలి. కంపెనీకి సంబంధించిన వెబ్‌సైట్‌లోకి వెళ్లి సంస్థ దీర్ఘకాలిక లక్ష్యాల గురించి తెలుసుకోవాలి. ప్రణాళికాబద్ధమైన సాధనతో వాటిని సాధించడానికి ప్రయత్నిస్తానని చెప్పొచ్చు. ఈ మాటలు సంబంధిత ఉద్యోగానికి మీరు అర్హులనే నమ్మకాన్ని కలిగిస్తాయి. 

 అంకితభావంతో పనిచేసి మిమ్మల్ని మీరు నిరూపించుకుని భవిష్యత్తులో ఉన్నత స్థానానికి వెళ్లాలని ఆశపడుతున్న విషయాన్ని ఎదుటివారికి అర్థమయ్యేలా చెబితే సరిపోతుంది! 
 

Posted Date: 10-06-2021


 

మౌఖిక పరీక్ష

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం