• facebook
  • whatsapp
  • telegram

మంచి నోట్స్ ఎలా ఉండాలి?

    నోట్సు రాసుకోవడం రెండు రకాలు. రిఫరెన్సు పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు చదువుతూ దానిలోంచి ముఖ్య సమాచారం నోట్సుగా రాసుకోవడం, అధ్యాపకుడు చెప్పే ఉపన్యాసం వింటూ నోట్సు రాసుకోవడం. రెండింటి లక్ష్యమూ, రెండు చోట్లా అనుసరించే పద్ధతీ దాదాపుగా ఒకటే అయినా మొదటిదానికన్నా రెండోది కష్టం. కారణం సమయాభావమే. పుస్తకం చదువుతున్నప్పుడు ఆగి, ఆలోచించుకొని, అర్థం చేసుకొని నోట్సు రాసుకునేందుకు తగినంత సమయం ఉంటుంది. తరగతి గదిలో ఉపన్యాసం వినేటప్పుడు పై పనులన్నిటికీ తగిన అవకాశం ఉండదు. మనం ఈ వ్యాసంలో పాఠం వింటూ నోట్సు రాసుకోవడం గురించి చర్చిద్దాం.

మంచి నోట్సు (అ) పాఠ్యాంశం సారాంశాన్ని సంక్షిప్తంగా అందిస్తుంది, (ఆ) ముఖ్యమైన సమాచారాన్ని ఎత్తిచూపుతుంది (ఇ) సులభంగా ఆ సమాచారాన్నంటినీ మళ్లీ గుర్తుచేసుకొనే అవకాశం కల్పిస్తుంది.

కార్నెల్ నోట్స్ పద్ధతి

Cue Column

Note - Taking

Area

Summaries

     మనం క్లాసులో రాసుకున్న నోట్సును ఆ తర్వాత ఎలా ఉపయోగిస్తాం అనేది కూడా చాలా ముఖ్యం. క్లాసులో రాసుకున్నది, రాసుకున్నట్లుగా ఇంటి దగ్గర చదువుకొనేందుకు పనికి వస్తుందనుకోవడం, అలా ఉపయోగించడం మంచిపద్ధతి కాదు. క్లాసు రూములో విన్న ఆలోచనలని సాధ్యమైనంత ఫ్రెష్‌గా ఇంటికి తీసుకెళ్లడం, అక్కడ వాటిని సరైన పద్ధతిలో అమర్చుకోవడం నోట్సు రాయడం ఉద్దేశం.

      చదువుకు సంబంధించిన అన్ని పనుల్లో, నోట్సు రాసుకోవడంలో కూడా శారీరక, మానసిక ప్రయత్నాలు రెండూ ఉంటాయి. పాఠం వింటూ నోట్సు రాసుకోవడానికి కొంత మానసిక సన్నద్ధత అవసరం. ఇది మళ్లీ రెండు రకాలుగా ఉంటుంది.

ఒకటి పాఠానికి సంబంధించిన సన్నద్ధత, రెండు వ్యక్తిగత సంసిద్ధత. ఇవాళ చెప్పే పాఠం ఏమిటి? అందులో ఏ రకమైన అంశాన్ని బోధిస్తారు? పరీక్ష దృష్ట్యా, మన లక్ష్యం దృష్ట్యా పాఠం ప్రాధాన్యతను తెలుసుకోవడం పాఠ్యపరమైన మానసిక సంసిద్ధత.

బోధించే ఉపాధ్యాయుడు లేదా అధ్యాపకుడి బోధనాశైలి ఏమిటో తెలుసుకొని ఉండటం, ఉపాధ్యాయుడి బోధన వల్ల మనకు ఆ పాఠంలోని ముఖ్యాంశాలు, అదనపు సమాచారం బాగా తెలుస్తాయని, ఉపాధ్యాయుని నోట్లోంచి వెలువడిన సమాచారం సాధ్యమైనంత ఎక్కువగా మనం నమోదు చేసుకోవడం మేలనే అవగాహనతో, విశ్వాసంతో ఉండటం వ్యక్తిగతమైన సంసిద్ధత.

      పాఠం చెప్పే ఉపాధ్యాయుడు, బ్లాక్ బోర్డు బాగా కనపడేలా, బాగా వినపడేలా కూర్చోవడం, కుర్చీ, రాతబల్ల అనుకూలమైన స్థితిలో ఉంచుకోవడం, నోట్సు రాసుకొనేందుకు అనువైన పుస్తకాన్ని, కలాలను సిద్ధంగా ఉంచుకోవడం, చెబుతున్న పాఠానికి సంబంధించిన టెక్ట్స్ బుక్‌ను, సిలబస్‌ను అందుబాటులో ఉంచుకోవడం శారీరక సంసిద్ధత. ప్రత్యేకంగా చూస్తే ఇవన్నీ చిన్న చిన్న విషయాల్లా కనిపిస్తాయికానీ వేగంగా పాఠం చెప్పే ఉపాధ్యాయుని తరగతిలో నోట్సు రాసుకోవాల్సి వచ్చినప్పుడు ఇవన్నీ చాలా అనవసరమైన విషయాలు.

     నోట్సు రాసుకొనేందుకు చాలా పద్ధతులున్నాయి. ఏ పద్ధతి మంచిది అనేది మన వ్యక్తిగత అనుకూలత, మనం సన్నద్ధమవుతున్న పరీక్షను బట్టి పాఠంలోని విషయాన్ని బట్టి ఉంటుంది. మనం క్లాసులో రాసుకున్న నోట్సును ఆ తర్వాత ఎలా ఉపయోగిస్తాం అనేది కూడా చాలా ముఖ్యం. క్లాసులో రాసుకున్నది రాసుకున్నట్లుగా ఇంటి దగ్గర చదువుకొనేందుకు పనికి వస్తుందనుకోవడం, అలా ఉపయోగించడం మంచి పద్ధతి కాదు. క్లాసు రూములో విన్న ఆలోచనలని సాధ్యమైనంత ఫ్రెష్‌గా ఇంటికి తీసుకెళ్లడం, అక్కడ వాటిని సరైన పద్ధతిలో అమర్చుకోవడం నోట్సు రాయడం ఉద్దేశం. అందుకే చాలా మంది టాప్ ర్యాంకర్లు క్లాసు నోట్సు వేరుగా, చదివే నోట్సు వేరుగా ఉంచుకుంటారు.

     సంప్రదాయ పద్ధతిలో ఉపాధ్యాయుడు చెబుతున్నది శ్రద్ధగా వింటూ అందులో ముఖ్యమైన అంశాలని మనకు అనిపించిన వాటిని లేదా ఉపాధ్యాయుడు బ్లాక్‌బోర్డు మీద రాసిన వాటిని నోట్సులో నమోదు చేసుకుంటాం. దీనికి వేగంగా రాయడం రావాలి. ఒకపక్క పాఠం వింటూనే మరో పక్క ఏది ముఖ్యమో, ఏది కాదో తేల్చుకొని, రాసుకోవాలి. క్లాసులో కూర్చునే ముందే మనం పాఠం ఒకసారి చదువుకు వెళితే ఇదేమంత కష్టమైన పని కాదు. అయితే ముఖ్యమైన పాయింట్లు, అంత ముఖ్యంకాని పాయింట్లు, వివరణలు, పాఠం వింటూండగా మనకొచ్చిన సందేహాలు ఇవన్నీ కలిసిపోయి ఉండటం ఈ రకమైన నోట్సులో పెద్ద లోపం. అలాగే పాఠాన్ని మాస్టారు చెప్పిన క్రమంలో తప్ప మనకు అవసరమైన క్రమంలో రాసుకోవడం కుదరదు. ఎప్పుడైనా పాఠం మధ్యలో ఉపాధ్యాయుడు అదనపు అంశాలు (పాఠ్యాంశ లక్ష్యం దృష్ట్యా అంత ముఖ్యం కానివి) చెప్పినప్పుడు మనం వరుసలో నమోదు చేసుకుంటూ వెళ్లిపోతాం. అది రివిజన్ సమయంలో అనవసరంగా మన దృష్టిని పక్కకు మళ్లించే, తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది.

     ఈ లోపాలను అధిగమించేందుకు కార్నెల్ నోట్సు అనే శాస్త్రీయ పద్ధతిని అభివృద్ధి చేశారు. నోట్సులోని ప్రతి పేజీని మూడు భాగాలుగా విడగొట్టుకుని ఒక దానిలో ముఖ్యాంశాలు, మరో దానిలో వివరణలు, మూడోదానిలో సంక్షిప్త సారాంశం నమోదు చేసుకోవడం ఈ రకమైన నోట్సులో పద్ధతి. సారాంశాన్ని పాఠం వినడం పూర్తయ్యాక ఎప్పుడు వీలు దొరికితే అప్పుడు పూర్తిచేయాలి. ముఖ్యాంశాలను, వివరణలను పాఠం చెబుతుండగానే పూర్తిచేయడం ఉత్తమం. పాఠం స్వభావాన్ని బట్టి ఉపాధ్యాయుడు చెబుతుండగా వివరాలు రాసుకుని వాటిలోని ముఖ్యంశాలు పక్కన రాసుకోవడం లేదా ముందు ముఖ్యాంశాలు రాసుకుని వాటికి సంబంధించిన వివరణ ఆ తరువాత రాసుకోవడం గానీ చేయాలి. అక్కడ ముఖ్యాంశాలంటే శీర్షికలూ, ఉపశీర్షికలూ నిర్వచనాలు యూనిట్లూ, ప్రదేశాలు, వ్యక్తుల పేర్లు, తేదీలు, ఇతర ముఖ్యమైన అంకెలు వస్తాయి. ఇవన్నీ యథాతథంగా గుర్తుంచుకోవాల్సిన సమాచారం. వీటికి సంబంధించి మన సొంత భాషా ప్రయోగం కుదరదు. ఈ ముఖ్యాంశాల మధ్యలో సంబంధం ఉన్న సొంత వాక్యాల్లో రాసుకోవచ్చు. ఉదాహరణకు మొదటి పానిపట్టు యుద్ధం, 1526, బాబరు, ఇబ్రహీం లోడి అనేవి ముఖ్యాంశాలు. వీటిని మార్చడం కుదరదు. వీటిని కలుపుతూ రాసే వాక్యం సొంత భాషలో ఉండొచ్చు. ఉదాహరణకు దీన్నే ఒక విద్యార్థి '1526లో జరిగిన మొదటి పానిపట్టు యుద్ధంలో బాబరు, ఇబ్రహీం లోడీని ఓడించెను అని, మరో విద్యార్థి 'పానిపట్టు వద్ద 1526లో జరిగిన మొదటి యుద్ధంలో మొగలు వంశస్థుడైన బాబరు, ఢిల్లీ సుల్తాను ఇబ్రహీం లోడీని జయించెను అని రాసుకోవచ్చు.

ఒక పేజీలో రాసుకున్న నోట్సు మొత్తానికీ ఆ పేజీ కిందే సారాంశం రాసుకోవడం కార్నెల్ నోట్సులో మరో ప్రధాన అంశం. ఇలా రాసుకోవడం వల్ల రెండు ప్రయోజనాలుంటాయి.

     సారాంశం రాసుకోవడం కోసం ఆ పేజీలో ఉన్న అంశాన్ని తక్షణం రివిజను చేసుకుంటాం కాబట్టి పాఠం ప్రవాహంలో మనం విస్మరించిన లేదా మనకు అర్థంకాని అంశాలను అక్కడికక్కడే పరిష్కరించుకొనే అవకాశం లభిస్తుంది. పరీక్షల ముందు వేగంగా రివిజను చేసుకోవడం చాలా తేలికవుతుంది.

ఫ్లో చార్టు పద్ధతి మరో ఆధునికమైన నోట్సు రాసుకునే విధానం. దీన్నే మైండ్ మ్యాపింగ్ పద్ధతి అని కూడా అంటున్నారు. ఈ పద్ధతిలో ముఖ్యాంశాలను బాక్సుల్లో రాసుకొని వాటి మధ్య సంబంధాలకు అనుగుణంగా బాక్సులను కలుపుకుంటూ వెళ్లడం. ఈ రకమైన నోట్సు రాయడానికి కొంచెం అనుభవం కావాలి. అందుకే ముందు పుస్తకాలనుంచి నోట్సు రాసుకునేటప్పుడు ఈ పద్ధతిని వాడి చూసి ఆ తర్వాత క్లాసులో పాఠం వినేటప్పుడు ప్రయోగించడం మంచిది.

ఏ పద్ధతిలో నోట్సు రాసుకున్నా ఈ కింది విషయాలను మనసులో ఉంచుకోవాలి.

మన నోట్సును మనం చదువుకోవడానికే అయినా అందులో చేతిరాత బాగుండాలి. నోట్సులో ఉన్న అంశాలు రాసుకున్న ఏడెనిమిది నెలల తర్వాత చదివినా అర్థం కావాలి.

'నోట్సు మన జ్ఞాపకాల భాండాగారానికి తాళంచెవి' అని ముందే చెప్పుకున్నాం. కాబట్టి క్లాసులో విన్న అంశాలను సాధ్యమైనంత స్పష్టంగా గుర్తు తెచ్చుకునేలా నోట్సు ఉండాలి.

     నోట్సు సాధ్యమైనంత సంక్షిప్తంగా ఉండాలి. నీ సందేహాలు, అభిప్రాయాలు, ఆలోచనలు నోట్సులో నమోదు చేసుకున్నప్పుడు వాటి ఫాలోఅప్ కూడా రాసుకోవాలి. ఉదాహరణకు ఒక పాయింట్ దగ్గర 'మరింత స్పష్టత కావాలి అని మరో పాయింట్ దగ్గర 'దీన్ని బాగా చదవాలి అని రాసుకున్నాం అనుకోండి. ఆ తర్వాత కాలంలో ఆ పని పూర్తిచేసినప్పుడు అక్కడ దాన్ని నమోదు చేయాలి. అంటే బాగా చదవాలి అని రాసినదాని దగ్గర టిక్ పెట్టడం, స్పష్టత కావాలి అని రాసుకున్నదాని దగ్గర పేజీ నంబరు (స్పష్టంగా ఎక్కడ రాసుకున్నామో ఆ పేజీ నంబరు) వేసుకోవడం చేయవచ్చు.

నోట్సుతో పాటు అది రాసుకున్న తేదీ ఉండాలి. కరెంట్ ఎఫైర్స్‌కు సంబంధించిన అంశాలు రాసుకునేటప్పుడు ఇది తప్పనిసరి. అలాగే అంకెలు రాసుకునేటప్పుడు రిఫరెన్సు కూడా రాసుకోవాలి. యూనిట్లు రాసుకోవాలి. అంకె మాత్రమే వేసి ఊరుకుంటే అది వేలో, లక్షలో, కోట్లో అసలు రూపాయలో మరొకటో అర్థం కాదు.

Posted Date: 11-09-2020


 

నోట్సు రాయడం ఎలా?

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం