• facebook
  • whatsapp
  • telegram

'STUDENT' అంటే...

ఈ కింది లక్షణాల కలబోత

ఎస్ ఫర్ సిన్సియారిటీ (నిజాయితీ)

విద్యార్థి తన చదువుపట్ల నిజాయితీగా ఉండాలి. తనకు అర్థం కాని దాన్ని అర్థమైనట్లుగా, రాని దాన్ని వచ్చినట్లుగా నటించకూడదు. తన బలహీనతల పట్ల నిజాయితీగా ఉండాలి. ఉదాహరణకు రాత్రిపూట ఎక్కువసేపు మేలుకొని ఉండలేకపోవడం లేదా ఒకేసారి పావుగంట కంటే ఎక్కువసేపు చదవలేకపోవడం మన బలహీనత కావచ్చు. దాన్ని నిజాయతీగా గుర్తించి, పెద్దలతో, గురువులతో చర్చించాలి.

టి ఫర్ టఫ్‌నెస్ (దృఢత్వం)

అలసిపోవడం అనేది శరీరానికీ, మనసుకీ రెండింటికీ సంబంధించింది. మరో అరగంట చదవాలంటే దానికి శరీరం, మనసూ రెండు సహకరించాలి కదా. ఇది ఓటమిని, అవహేళనలను, నిరాశా నిస్పృహలను తట్టుకొనే శక్తినీ కూడా సూచిస్తుంది. ఒక్కోసారి ఒక్కోలెక్క ఎంతచేసినా రాదు. ఒక్కోప్రశ్న చదివినా గుర్తుండదు. అయినా మనం ప్రయత్నం మానకపోవడమే దృఢత్వం

యు ఫర్ అండర్‌స్టాండింగ్ (అర్థం చేసుకోవడం)

విద్యార్థికి ఉండాల్సిన ప్రధాన లక్షణాల్లో ఒకటి కొత్త విషయాలను అర్థం చేసుకునే శక్తి ఉండటం. తనకు అప్పటికే తెలిసినదానితో కొత్తగా తెలుసుకుంటున్న దాన్ని జతపరుచుకోవడమే అర్థంచేసుకోవడం. దీనికి ఏకాగ్రత, అప్రమత్తత, పరిశీలన లాంటివి అవసరమౌతాయి.

డి ఫర్ డెడికేషన్ (అంకితభావం)

చదువులో విజయం సాధించడానికి మిగిలినవాటిని వదులుకునేందుకు సిద్ధపడటం. ఐఐటీ సీటు సాధించటం, 'పాడుతా తీయగా'లో ఫస్టు రావడం రెండూ కావాలంటే కుదరదు. ఒకదానికోసం మరొకటి వదులుకోవాల్సిందే. పెద్ద లక్ష్యాల మాట పక్కనపెట్టినా ఒక్కోసారి చిన్నచిన్న సరదాలు కూడా వదులుకోవాల్సి రావచ్చు. 'తప్పదు కాబట్టి వదులుకోవడం' కాకుండా మనస్ఫూర్తిగా వదులుకోగలగాలి.

ఇ ఫర్ ఎంథూసియాసం (జిజ్ఞాస)

కొత్త విషయాలు నేర్చుకోవాలనే కూతూహలం. కొంతమంది ఏమి నేర్చుకోమన్నా ఎందుకు అని అడుగుతుంటారు. అది అంత మంచి పద్ధతి కాదు. మీరు నేర్చుకొనే అంశాలన్నీ మీకు తక్షణ ప్రయోజనం కలిగించకపోవచ్చు. అంతమాత్రాన నిరాసక్తత పనికిరాదు. కుతూహలం అభివృద్ధికి పునాది.

ఎన్ ఫర్ నావెల్టీ (సొంతముద్ర)

దీన్నే మరోరకంగా సృజనాత్మకత అని కూడా చెప్పవచ్చు. ప్రతి మనిషికి సొంతశైలి ఉంటుంది. దాన్ని మెరుగుపరుచుకోవాలి.

టి ఫర్ టైంసెన్స్ (సమయపాలన)

విద్యార్థికి తప్పక ఉండాల్సిన లక్షణాల్లో ఒకటి సమయపాలన. అనుకున్న సమయానికి అనుకున్న పని చేయడం, వాయిదా వేయకపోవడం కూడా ఇందులో భాగమే. ఈ లక్షణాల్లో ఏది లేకపోయినా మంచివిద్యార్థి అని చెప్పడం కష్టమే.

ఇంకోలా చెప్పాలంటే విద్యార్థి తన చదువు అనే రైలుబండిని గమ్యం, మార్గం అనే రెండు పట్టాలు తప్పకుండా నడిపించాలి. కృషి అనే ఇంజిన్‌ని ఇష్టం అనే ఇంధనంతో నింపాలి. ఉత్సాహం అనే యాక్సలేటర్‌ని, జాగ్రత్త అనే బ్రేకులను తగిన సమయాల్లో ఉపయోగించాలి. అవకాశాలు అనే గ్రీన్ సిగ్నల్స్‌నూ, ప్రమాదాలు అనే రెడ్‌సిగ్నల్స్‌నూ గమనిస్తూ ఉండాలి. తల్లిదండ్రులనే గార్డుల సూచనలనూ, ఉపాధ్యాయులనే స్టేషను మాస్టర్ల ఆదేశాలనూ పాటిస్తూ, తరగతి గదులనే స్టేషన్లలో మాత్రమే ఆగాలి.

Posted Date: 11-09-2020


 

ఆవశ్యకత

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం