• facebook
  • whatsapp
  • telegram

కొలువు సులువు చేసే... డిజిటల్‌ మెలకువలు!

ఇటీవలి కాలంలో డిజిటల్‌ సాంకేతికత పాత్ర ఎంతగానో పెరిగింది. ప్రతి రంగంలో దీని వినియోగం అధికమైంది. దీంతో సంస్థలు తమ అభ్యర్థుల నుంచి ఆశించేవాటిలో డిజిటల్‌ నైపుణ్యాలూ వచ్చి చేరాయి. అందుకే..ఉద్యోగ పోటీలో ముందు వరసలో నిలవాలనుకునేవారు వీటిపై దృష్టి సారించడం తప్పనిసరి. విద్యార్థులూ అకడమిక్‌ అంశాలతోపాటు వీటిపైనా దృష్టిసారించాల్సిన సమయమిది.

సోషల్‌ మీడియాలో ఫొటో అప్‌లోడ్‌ చేసేముందు చిన్నచిన్న హంగులు అద్దడం, ఫొటోలతో వీడియో ఎడిటింగ్, ఈమెయిల్‌ పంపడం.. ఇవన్నీ కాస్త టెక్నాలజీ పరిచయం ఉండి, స్మార్ట్‌ఫోన్‌ చేతిలో ఉన్నవారెవరికైనా పరిచయమున్న అంశాలే! ముఖ్యంగా యువత బాగా ఉపయోగించే డిజిటల్‌ మెలకువల్లో ఇవీ కొన్ని. కానీ వీటిలోనే ఇంకాస్త నైపుణ్యాన్ని పెంచుకోగలిగితే కెరియర్‌ని బాగా మలచుకోగలరన్నది నిపుణుల మాట. టెక్నాలజీ ప్రతి ఒక్కరి జీవితంలోకి చొచ్చుకొని వచ్చేసింది. ఒకప్పుడు ఫాంటసీగా భావించేవెన్నో ఇప్పుడు సాధారణమన్న స్థితి వచ్చేసింది. ఈ దశాబ్దకాలంలో వివిధ రంగాల సంస్థలన్నీ తమ కార్యకలాపాలకు డిజిటల్‌ మార్గాన్ని ఎంచుకున్నాయి. గత ఏడాదిగా వీటి అవసరం, వినియోగం మరింత పెరిగింది. దీంతో జాబ్‌ మార్కెట్‌లో నిలిచి గెలవాలనుకునేవారికి ఇవి తప్పనిసరి నైపుణ్యాలయ్యాయి. 

ఉదాహరణకు- ఏదైనా విషయాన్ని వాక్యాల్లో కన్నా.. డిజిటల్‌ వీడియో ద్వారా అర్థం చేసుకునేలా చేయడం సులభతరం. ఇది కొత్త ఆవిష్కరణలకు దారి తీస్తుందనేది ప్రముఖుల భావన. అందుకే ఉద్యోగకల్పనలో డిజిటల్‌ నైపుణ్యాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. రెజ్యూమెలో వీటికి చోటిచ్చిన వారికి మొగ్గు ఉంటుంది.  

కంటెంట్‌ క్రియేషన్‌

సాధారణంగా ఏదైనా సందేహం/ సమాచారం కోసం బ్రౌజర్‌లో వెతుకుతుంటాం. దానికి సంబంధించి కొన్ని వందల, వేల లింకులు వస్తుంటాయి. దాన్ని డిజిటల్‌ కంటెంట్‌గా చెబుతాం. ఏదైనా సమాచారాన్ని డిజిటల్‌ మాధ్యమాల ద్వారా అందించడమే ఇది. వెబ్‌సైట్లలో అప్‌డేట్లు, బ్లాగింగ్, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ఆన్‌లైన్‌ కామెంట్రీ, సోషల్‌ మీడియా అకౌంట్ల నిర్వహణ, జిఫ్‌లు.. అన్నీ డిజిటల్‌ కంటెంట్‌ కిందకే వస్తాయి. సంస్థల విషయంలో.. సాధించిన విజయాలు, భవిష్యత్‌ వ్యూహాలు, ప్రణాళికలను వివరించడానికి ఈ నైపుణ్యాలు అవసరమవుతాయి. బ్రాండ్‌కు విలువను పెంచుకోవడంలోనూ వీటి పాత్ర ఎక్కువే. కాబట్టి, విద్యార్థులు ప్రాజెక్టులు, అసైన్‌మెంట్లలో తమ ఆలోచనలను వివరించడంలో భాగంగా ఈ నైపుణ్యాలను ఉపయోగించవచ్చు. సామాజిక వేదికల సాయమూ తీసుకోవచ్చు.

ఈమెయిల్‌

డిజిటల్‌ రూపంలో సమాచారాన్ని చేరవేసే ప్రధాన వేదికల్లో ఈమెయిల్‌ ఒకటి. ఈమెయిల్‌ తాజా ఆవిష్కరణ ఏమీ కాదు. అయితే దాని పరిధి మాత్రం బాగా విస్తరించింది. స్టార్టప్‌ల నుంచి ఎంఎన్‌సీల వరకు ఆన్‌లైన్‌ వేదికగా ఎదురయ్యే సమస్యలు, సందేహాలతోపాటు క్యాంపెయిన్‌.. మొదలైన అన్నింటికీ ఈమెయిల్‌ తప్పనిసరి మార్గమైంది. ఇక్కడ అవతలివారిని ఈ వేదికగా ఒప్పించడమూ ఒక కళగా అయ్యింది. సులభంగా, ఒప్పించగలిగేలా రాసే ఈ కళపై రంగంతో సంబంధం లేకుండా దృష్టిపెట్టాలి. కానీ మార్కెటింగ్‌ వారి విషయానికొచ్చేసరికి వారు ప్రధానంగా దృష్టిపెట్టాల్సిన నైపుణ్యమిది.

కోడింగ్‌

అంతర్జాతీయ భాషగా దీనికి పేరు. ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించే టెక్నాలజీలు, సాంకేతిక సౌకర్యాల వెనుక దీని ప్రమేయం ఉంది. బైనరీ డిజిట్‌లు, కొన్ని ప్రత్యేక కోడ్‌లను ఉపయోగించి సంబంధిత అప్లికేషన్లు, సాఫ్ట్‌వేర్లను తయారు చేస్తుంటారు. టెక్నికల్‌ వారితోపాటు నాన్‌టెక్నికల్‌ వాళ్లూ దీన్ని నేర్చుకునే వీలుంది. ఇప్పుడు పాఠశాల స్థాయి నుంచే ఈ నైపుణ్యాలను నేర్పిస్తున్నారు. వ్యక్తిగత ఆసక్తి మేరకు నేర్చుకోవచ్చు. అయితే గణిత, సైన్స్‌ శాస్త్ర అంశాలపై కొంత పట్టు అవసరం. ఆసక్తి ఉన్నవారు సీ, సీ++ లాంగ్వేజెస్‌తోపాటు హెచ్‌టీఎంఎల్, సీఎస్‌ఎస్‌ బేసిక్‌ అంశాలపై దృష్టి పెట్టటం మంచిది.

ప్రెజెంటేషన్‌

ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులతోపాటు ఉద్యోగులకీ బాగా పరిచయమున్న నైపుణ్యమిది. సమాచారాన్ని ఒక క్రమపద్ధతిలో తేలికగా అర్థమయ్యేలా తీర్చిదిద్దడంగా దీన్ని చెప్పొచ్చు. అయితే ఇందుకు వివిధ టూల్స్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. సైన్స్, బిజినెస్, బ్యాంకింగ్‌ మొదలైన దాదాపు అన్ని రంగాల్లో సమాచారాన్ని భద్రపరచడం, భవిష్యత్‌ అవసరాలకు ఉపయోగించడం ఉంటాయి. అందుకు ఒక్కొక్కరు వివిధ టెక్నిక్‌లను ఉపయోగిస్తారు. వ్యాపార రంగాల్లో వీటికి ప్రాధాన్యం ఎక్కువ. కాబట్టి, డాక్యుమెంట్లు, స్ప్రెడ్‌ షీట్లు, పీపీటీలు, ఇన్ఫోగ్రాఫిక్స్, వీడియోలు మొదలైనవాటిని కళాశాల పనిలో భాగంగా చేయడం లాంటివి ప్రయత్నించాలి. మొదట్లో నేర్చుకోవడానికి కొంత కష్టంగా భావించినా, భవిష్యత్‌లో బాగా సాయపడే నైపుణ్యాలివి.

సోషల్‌ మీడియా

ప్రపంచ వ్యాప్తంగా కొన్ని బిలియన్ల యాక్టివ్‌ యూజర్లు ఉపయోగిస్తున్న వేదిక ఇది. దీని పేరు వినగానే చాలామందికి సమయం వృథా అనే భావన వచ్చేస్తుంది. ఖండాంతరాలను చెరిపేస్తూ స్నేహసంబంధాలను ఏర్పరుచుకునే వీలుతోపాటు వ్యాపార సంబంధాలకూ సామాజిక మాధ్యమాలు ప్రధాన వేదికగా తయారయ్యాయి. సమాచారాన్ని ఎలక్ట్రానిక్‌ వేదికగా త్వరగా చేరవేయగల అవకాశమూ దీని విషయంలో ఒక సానుకూలాంశం.

దీన్ని ప్రభావవంతంగా ఉపయోగించడమూ ఒక ప్రధాన నైపుణ్యమే. వినియోగదారులను ఆకర్షించే క్రమంలో సంస్థలు వారు ఎక్కువ సమయం కేటాయించేచోట తమ మార్కెటింగ్‌ను ప్రారంభిస్తుంటాయి. సోషల్‌ మీడియా విధానమూ అంతే. ఇక్కడవారిని తమ వెబ్‌సైట్‌వరకూ వచ్చేలా లేదా తమ వస్తువును కొనేలా ప్రోత్సహిస్తుంటారు. అలాగని సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ అనగానే ఒక పోస్టింగ్‌/ ట్వీట్‌కే పరిమితమవదు. వివిధ బ్రాండ్‌లు, అవి తమ వినియోగదారులపై చూపే ప్రభావంపై వంటి అంశాలపై పూర్తి అవగాహన అవసరమవుతుంది. ఈ నైపుణ్యం విషయంలో.. విద్యార్థులు తమ అభిప్రాయాలను సానుకూలంగా, ఆకర్షించేలా రాసే ప్రయత్నం చేయొచ్చు. వస్తువు, సబ్జెక్టు, నచ్చిన అంశం ఏదైనా ఇందుకు ప్రయత్నించవచ్చు.

ఇమేజ్, వీడియో ఎడిటింగ్‌

సంస్థలు తమ బ్రాండ్‌ ఇమేజ్‌ను పెంచుకోవడానికి వివిధ సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకోవటం ఇప్పుడు మామూలు విషయమైంది. మిగతావాటి కంటే మెరుగైన వ్యూహాలను ఉపయోగించడం వారికి ఎదురయ్యే ప్రధాన సవాలు. దీంతో సృజనాత్మకమైన, కొత్త సూచనలు చూపేవారి కోసం సంస్థలు చూస్తుంటాయి. ఇందుకుగానూ టార్గెట్‌ వినియోగదారులను ఆకర్షించడానికి ఆకట్టుకునే వీడియోలు, ఇన్ఫోగ్రాఫిక్స్‌లతో కూడిన మార్కెటింగ్‌ వ్యూహాలను రూపొందిస్తుంటారు. కాబట్టి, ఇమేజ్, వీడియో ఎడిటింగ్‌ స్కిల్‌.. కీలక నైపుణ్యంగా తయారైంది. ఇప్పుడు వీటికంటూ ప్రత్యేకంగా కోర్సులు చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. ఎన్నో వేదికలు అనుకున్న పనిని సులభతరం చేస్తున్నాయి. కాకపోతే వాటిలో ఎంతవరకూ సృజనాత్మకతను మిళితం చేస్తున్నారన్నది ఇక్కడ ప్రధానాంశం.

సాంకేతిక పదజాలం

ఒక్కో అంశం, అవసరాన్నిబట్టి వివిధ డిజిటల్‌ టూల్స్‌ను ఉపయోగించడం కనిపిస్తుంటుంది. వీటికి ప్రత్యేకమైన సాంకేతిక భాష (టర్మినాలజీ) ఉంటుంది. విభాగాన్ని బట్టి వాటి వాటి అర్థం మారుతుంటుంది. వివిధ అంశాలను అర్థం చేసుకోవడంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తుంటాయి. ఆప్‌లు, ఫైల్స్, ఫోల్డర్లు, వాటి సైజులు, అవి ప్రాతినిధ]్యం వహించే అంశాలు వంటివి అర్థం చేసుకోవడం వంటివి దీనికి ఉదాహరణలుగా చెప్పొచ్చు.

ఇంకా.. కాపీరైట్, ప్లాగియరిజమ్‌ (వేరొకరి సృజనను కాపీ కొట్టడం) అంశాలపై అవగాహన పెంచుకోవాలి. ఎంఎస్‌ ఆఫీస్, గూగుల్‌ డ్రైవ్, డేటా బ్యాక్‌అప్, ఫైల్‌ కన్వర్షన్స్, బ్లాగింగ్, రిసెర్చ్‌ మొదలైన అంశాలపైనా దృష్టిపెట్టాలి. సంస్థలు తమ పోటీదారులను ఎదుర్కొని నిలబడటానికి గట్టిగా ప్రయత్నిస్తుంటాయి. అందుకు వారికి బలమైన బృందం అవసరమవుతుంది. ఈ డిజిటల్‌ దశాబ్దంలో తెలివి, సృజనాత్మకత, కొత్త ఆవిష్కరణలతోపాటు సాంకేతికంగా బలంగా ఉండేవారి అవసరం బాగా పెరుగుతోంది. దీంతో ఈ నైపుణ్యాలు చాలా అవసరమవుతున్నాయి. నచ్చిన రంగంలో కెరియర్‌ నిర్మించుకోవాలంటే సంబంధిత డిజిటల్‌ నైపుణ్యాలపై పట్టు ఉండాల్సిన సమయమిది.

Posted Date: 15-01-2021


 

డిజిటల్‌ స్కిల్స్

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం