• facebook
  • whatsapp
  • telegram

నెట్‌ విలువలకు.. నెటికెట్‌

‣ ఆన్‌లైన్‌ ప్రపంచంలో పాటించాల్సిన నియమాలు


 


మనందరికీ ‘ఎటికెట్‌’ తెలుసు.. నలుగురిలో ఉన్నప్పుడు పాటించవలసిన మర్యాదలు.కానీ ఇప్పుడు కొత్తగా ‘నెటికెట్‌’ గురించి కూడా తెలుసుకోవాలి! ఎందుకంటే ఇవి డిజిటల్‌ ప్రపంచంలో పాటించాల్సిన కనీస మర్యాదలు. సర్వం డిజిటల్‌మయమై ప్రతి ఒక్కరికీ ఆన్‌లైన్‌ జీవితాలు, కెరియర్లు ఉంటున్న ఈ తరుణంలో ఒకరితో ఒకరికి సరైన సంబంధాలు ఉండేందుకు ఈ నెటికెట్‌ చాలా అవసరం. మరి దీని గురించి ఇంకా తెలుసుకుందామా!


పూర్వం ఎవరైనా ఇంటికి వస్తే భోంచేసి వెళ్లేవరకూ ఇంట్లో వారు ఊరుకునేవారు కాదు, అది అప్పటి మర్యాద! ప్రాంతాన్ని బట్టి, కుటుంబాలను బట్టి ఒక్కొక్కరిదీ ఒక్కో మర్యాద. వాస్తవిక ప్రపంచంలో ఉన్నట్టుగానే ఆన్‌లైన్‌ ప్రపంచంలోనూ కొన్ని పాటించాల్సిన విలువలున్నాయి. వీటినే నెట్‌ పరిభాషలో ‘నెటికెట్‌’ అంటున్నారు. ఈ మాట నెట్‌, ఎటికెట్‌ అనే పదాల కలయికతో ఆవిర్భవించింది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఎలా ఉన్నా.. ఇవి అధికారులు, పనిలో సహచరులు, అంతగా పరిచయం లేని వ్యక్తులతో మాట్లాడేటప్పుడు తప్పకుండా పాటించాల్సిన నియమాలు. వీటి గురించి కెరియర్‌ కౌన్సెలింగ్‌ నిపుణులు ఇలా వివరిస్తున్నారు.


1 ఎందుకు..

నిజానికి ఆన్‌లైన్‌లో మాట్లాడేటప్పుడు మనం ఎవరో అవతలి వారికి తెలియదులే అనే ఒక విధమైన భావం ఉంటుంది. కానీ అది సరికాదు. వాస్తవ ప్రపంచంలో మనం ఎదుటివారితో సంభాషించేటప్పుడు, వారిని కలిసేటప్పుడు పాటించే మర్యాదలనే ఇంటర్నెట్‌లోనూ అమలు చేయాలి. మనం మాట్లాడేది కంప్యూటర్లు, ఫోన్లతో కాదు, అవతలి ఉన్నది సైతం వ్యక్తులే అనే విషయం నిరంతరం గుర్తుంచుకోవాలి. బయట ఎలా అయితే మంచి పౌరులుగా నడుచుకుంటామో ఆన్‌లైన్‌లోనూ అదే విధంగా ఉండాలి. రాతపూర్వకంగా జరిగే సంభాషణలు, ఈ-మెయిల్స్‌ వంటి వాటిలో ఇది కచ్చితంగా పాటించాలి. ఇలా జరిగే సంభాషణలు మరీ తేలికగా కాకుండా అలా అని మరీ గంభీరమైన విధంగానూ లేకుండా చూసుకోవాలి. ఇదే సమయంలో సాంస్కృతిక భేదాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఎదుటివారి భాష, పరిమితులను అర్థం చేసుకుని నడుచుకోవాలి.


2 మంచి మాటలే..

ప్రతి ఒక్కరిలోనూ ఒక చెడు కోణం ఉంటుంది. కానీ సమూహంలో విచక్షణతో మసులుకుంటారు. ఆన్‌లైన్‌లో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. స్నేహపూరిత, మర్యాదపూర్వక సంభాషణలు పరిచయాలను పదిలంగా ఉంచుతాయి. ఒక విషయంతో విభేదించినప్పుడు కూడా అవతలి వారికి మర్యాద ఇస్తూనే తెలియజేయాలి. నెటికెట్‌ ముఖ్యంగా పొలైట్‌నెస్‌,
ప్రొఫెషనలిజం కోసం ఉద్దేశించినది.


3 రాతలోనూ..

సాధారణంగా ఆన్‌లైన్‌లో పూర్తిగా క్యాపిటల్‌ లెటర్స్‌లో రాసే వాక్యాలను అరవడంగా భావిస్తారు. కానీ కొందరు తెలియక మనం చెప్పాలనుకుంటున్న విషయాన్ని నొక్కి చెబుతున్నాం అనుకుంటూ క్యాపిటల్స్‌లో రాస్తుంటారు. నిజానికి ఇది దురుసుతనాన్ని సూచిస్తుంది. అవసరమైన చోట చెప్పాలనుకుంటున్న విషయాన్ని ఎలా రాస్తున్నాం అనేది కూడా ముఖ్యం.


4 పూర్తిగా చదివాకే..

ఏవైనా సంభాషణల్లో పాల్గొనేటప్పుడు అప్పటివరకూ జరిగిన దాన్ని పూర్తిగా చదవాలి. అప్పుడు మాత్రమే మన సందేహాలు, ప్రశ్నలు, అభిప్రాయాలు వెలిబుచ్చాలి. అలా కాకుండా పైపైన చదివి మాట్లాడటం వల్ల ఎదుటివారికి తక్కువ అభిప్రాయం కలుగుతుంది.


5 భాష

ఏది రాసినా పంపేముందు మరొక్కసారి సరిగ్గా చూడటం తప్పనిసరి. వ్యాకరణ, అక్షర దోషాలు లేకుండా, చెప్పాలనుకుంటున్న విషయం సరిగ్గా అర్థమయ్యేలా రాశామా లేదా అనేది సరి చూసుకోవాలి. అలా లేని వాక్యాలను చదివి, వాటి అర్థం ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించడం అవతలివారికి విసుగ్గా అనిపించవచ్చు. దాంతో అసలు విషయం పక్కకు వెళ్లిపోవచ్చు. ఈ-మెయిల్స్‌ రాసేటప్పుడు ఇది మరింత గుర్తుంచుకోవాలి.


6 ఇతరుల ప్రైవసీ

ఏ సందర్భంలో అయినా ఇతరుల పేరు, చిత్రాలు వినియోగించాల్సి వచ్చినప్పుడు కచ్చితంగా వారి అనుమతి తీసుకోవాలి. మనకు వచ్చిన మెయిల్స్‌ను అలాగే వేరే వారికి పంపకుండా, ముందుగా పంపిన వారి అనుమతితోనే పంపాలి. సీసీ (కార్బన్‌ కాపీ) కాకుండా, బీసీసీ (బ్లైండ్‌ కార్బన్‌ కాపీ) ఉపయోగించడం ఒక పద్ధతి. అలాగే వేరే వారు ఉన్న చిత్రాలు, వీడియోలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలన్నా ముందుగా వారికోమాట చెప్పడం ఉత్తమం. ఇతరుల ప్రైవసీని కచ్చితంగా గౌరవించాలి.


7 సమయం

మన తాతలు, తండ్రుల కంటే మనం వేగవంతమైన కాలంలో జీవిస్తున్నాం. ప్రపంచంలో ఏ మూల ఉన్నవారికి అయినా క్షణాల్లో సమాచారం అందిపోయే సమయమిది. ఏది చెప్పినా, మాట్లాడినా సూటిగా, వేగంగా చెప్పాలనుకుంటున్న విషయాన్ని తెలియజేయాలి. అనవసర విషయాలు చోటివ్వడం, చెప్పాల్సిన వాటిని ఆఖరివరకూ నాన్చడం వంటివి చేయకూడదు. ఎదుటివారి సమయాన్ని వృథా కానివ్వకూడదు.


8 పట్టించుకోకుండా..

ఆన్‌లైన్‌లో ఉండే అందరూ నెటికేట్‌ పట్ల అవగాహన ఉన్నవారు కాకపోవచ్చు. అందువల్ల మనం మర్యాదగా ప్రవర్తించినా ఎదుటివారి నుంచి అటువంటి తరహా ప్రవర్తన ఎదురుకానప్పుడు పట్టించుకోవడం, ప్రతిస్పందించడం కంటే దూరంగా ఉండటం ఉత్తమం అంటారు నిపుణులు. ఒకవేళ పెద్ద తప్పులుగా అనిపించినప్పుడు నలుగురిలోనూ కాకుండా ప్రైవేట్‌ మెసేజ్‌ ద్వారా తెలియజేస్తే వారిని నొప్పించకుండా ఉంటుంది. కానీ ఎక్కువ సందర్భాల్లో ఊరుకోవడం అంత ఉత్తమం లేదనే పాత సామెతనే కొత్తగా నిపుణులు సూచిస్తున్నారు.


9 దుర్వినియోగం చేయకుండా..

మిగతావారి కంటే టెక్నికల్‌గా కానీ ఇతర ఏ విధంగా అయినా మన చేతిలో పవర్‌ ఉంటే దాన్ని దుర్వినియోగం చేయకూడదు. ఉదాహరణకు సిస్టమ్‌ అడ్మినిస్ట్రేటర్స్‌కు టెక్‌ సపోర్ట్‌ ఉంది కదా అని సహోద్యోగులు, ఇతరుల వేతన వివరాలు లాంటివి చూడటం అంత మర్యాదకరమైన ప్రవర్తనగా అనిపించదు.


10 కోపంలోనూ..

ఆన్‌లైన్‌ సమాజంలో వాదోపవాదాలు, వ్యక్తిగత దూషణల వంటివి సర్వసాధారణంగా జరుగుతుంటాయి. ఏ కారణంతోనైనా ఇటువంటి వాటిలో పాలుపంచుకోకపోవడం ఉత్తమం. ఎంత కోపంలో అయినా అసభ్య పదజాలం ఉపయోగించడం, బెదిరింపులకు దిగడం వంటివి న్యాయపరంగానూ సమస్యలు తెచ్చిపెట్టగలవు. అందువల్ల ఇటువంటి గొడవలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.


మరింత సమాచారం... మీ కోసం!

‣ భారీ వేతన వరప్రదాయిని.. కోడింగ్‌

‣ సోషల్‌ మీడియా ఖాతాల ముఖ్యపాత్ర

‣ మార్కెట్‌ మందగమనంలో ఉద్యోగ సాధన!

‣ మ‌లిద‌శ ప‌రీక్ష‌లో గెలుపు వ్యూహం!

‣ మూడు నెల‌ల్లో గేట్ మొద‌టి ర్యాంకు

‣ ప్రసిద్ధ సంస్థల్లో బీబీఏ, ఎంబీఏ కోర్సులు

Posted Date: 04-04-2024


 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం