• facebook
  • whatsapp
  • telegram

వాలంటరీ వర్క్‌తో ఐటీ ఉద్యోగానికి తోవ!

జాబ్‌ స్కిల్స్‌-2024
 


అమెరికా, యూరప్‌ దేశాల్లోని ఆర్థిక మాంద్య ప్రభావం జాతీయ కంపెనీలపై పడింది. అంతర్జాతీయ దిగ్గజ టెక్‌ కంపెనీలు మైక్రోసాఫ్ట్, గూగుల్‌ నుంచి మొదలుకొని మధ్య, చిన్న స్థాయి సంస్థల వరకూ ఉద్యోగుల కోతలను దశలవారీగా అమలు చేస్తున్నాయి. దీంతో దేశీయ టెక్‌ కంపెనీలు చాలావరకు తాజా నియామకాలను తగ్గించుకుంటున్నాయి. ఒకవేళ ఎంపికలు చేపట్టినా ఆచి తూచి అడుగులు వేస్తున్నాయి. ఈ ప్రతికూల పరిస్థితులకు ఉద్యోగార్థులు  బేజారు పడటం కంటే కాస్త భిన్నంగా ఆలోచించి అడుగులు వేస్తే సానుకూల ఫలితం సాధించవచ్చు!  



ఉద్యోగ మార్కెట్‌ ఉవ్వెత్తున లేస్తున్న సమయంలోనైతే కేవలం ఇంజినీరింగ్‌ చేసి ఉన్నా... కావలసిన నైపుణ్యాలు కంపెనీలో నేర్చించుకుందామని ఎగరేసుకుపోతారు. విరివిగా ప్రాజెక్టులు వచ్చి పడుతుంటే తలల లెక్కింపు కోసమైనా నియామకాలు జోరుగా సాగుతాయి. కానీ ఒకప్పుడు బాలెన్స్‌ షీట్‌లో వేలకోట్లు కళ్లజూసిన కంపెనీలు కూడా నేడు కొత్త రిక్రూట్‌మెంట్‌ అంటే జంకుతున్నాయి. రిజర్వ్‌ నిధులు నిండుకుండలా ఉన్న సంస్థలు కూడా నియామకాలంటే బిత్తర చూపులు చూస్తున్నాయి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఎదురీదితేనే బెదురు లేకుండా ముందుకెళ్లగలం. ఏదో ఒక అవకాశాన్ని చేజిక్కించుకోగలం. 


  చొరవ చూపాలి  

అవకాశాలు ఎండమావులైనప్పుడు మెండైన ఆలోచనలతో ముందుకు వెళ్లగలగాలి. చొరవతో అడుగులు వేయాలి. ఈ సందర్భంగా ఓ యువతి విజయగాథను తెలుసుకుందాం.  

నవ్య ద్వితీయ శ్రేణి పట్టణంలో ద్వితీయ శ్రేణి కాలేజీలో ఇంజినీరింగ్‌ చేసింది. మామూలుగా మార్కెట్‌ ఉరకలెత్తుతున్న సమయంలో నాలుగైదు కంపెనీలు ప్లేస్‌మెంట్‌ డ్రైైవ్‌ నిర్వహించేవి. కానీ ప్రస్తుత స్తబ్ధ పరిస్థితుల్లో ఏ ఒక్క కంపెనీ ఆమె కాలేజీ వైపు కన్నెత్తి చూడలేదు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లో బీటెక్‌ చేసిన నవ్య డీలా పడలేదు.  


ఆన్‌లైన్‌లో తన ఏఐ పరిజ్ఞానాన్ని మెరుగు పెట్టుకుంటూనే, అవకాశం కల్పించే కంపెనీలేమైనా ఉన్నాయేమోనని వారం రోజులు అన్వేషించింది. వివిధ అవసరాలకు యాప్స్‌ రూపొందించే ఒక స్టార్టప్‌ ‘రిమోట్‌’ విధానంలో ఇంటర్న్‌షిప్‌ ఆఫర్‌ చేస్తున్నట్టు గమనించింది. ఏఐ పరిజ్ఞానంతో దివ్యాంగులకు కావలసిన కదలికలు ఇచ్చే వీల్‌చైర్స్, అంధులకు ముందున్న ప్రమాదాలను పసిగట్టి హెచ్చరిక చేసే బ్లైండ్‌ స్టిక్స్‌ వంటి వాటికి అనుసంధానం చేసే యాప్స్‌ చేయడంలో ఆ స్టార్టప్‌ నిమగ్నమైందని గుర్తించి, ఇంటర్వ్యూకు ఆన్‌లైన్‌లో హాజరైంది. 


నవ్య ఉత్సాహాన్ని గుర్తించిన కంపెనీ యాజమాన్యం ఆమెకు ఇంటర్న్‌షిప్‌ అవకాశం కల్పించింది. ఆర్నెల్ల వ్యవధిలో ఆమె ఎన్నో ప్రాజెక్టుల్లో వివిధ బృందాలతో పనిచేసింది. ఆమె పనితీరునూ, చొరవనూ అభినందిస్తూ కంపెనీ ఇంటర్న్‌షిప్‌ కంప్లీషన్‌ సర్టిఫికెట్‌ పంపింది. ప్రస్తుతం తమ కంపెనీలో రిక్రూట్‌మెంట్‌పై నిషేధం నడుస్తోందని, లేకపోతే తప్పక ఎంపిక చేసుకునేవాళ్లమనీ హెచ్‌ఆర్‌ మేనేజర్‌ కాల్‌ చేసి చెప్పడం ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.


   మరో మెట్టు  

మంచి ఉద్యోగం దొరికే దాకా సమయం వృథా కాకుండా ఏం చేయవచ్చునా? అని ఆలోచించింది. ఒకరోజు తండ్రి వెంట ఆయన ప్రతివారం సర్వీస్‌ చేసే ఊళ్లోని స్వచ్ఛంద సంస్థకు వెళ్లింది. అక్కడ సంస్థ నిర్వాహకులు సమావేశమై చేస్తున్న సమాలోచనలను  గమనించింది. పట్టణంలోని వివిధ  హోటళ్లలో వృధాగా ఉండిపోయే ఆహార పదార్థాలను సేకరించి ఆరు అనాధ శరణాలయాలకు రోజూ చేర్చే సేవను ఆ సంస్థ గత ఐదేళ్లుగా చేస్తూ పేరు తెచ్చుకుంది. ఇప్పుడు నిర్వాహకులు చర్చిస్తున్న సమస్య- పట్టణంలోని 40 చిన్న, పెద్ద హోటళ్లకు రోజూ చేరుకుని అక్కడ ఆహార పదార్థాలుంటే తీసుకు రావడం- లేకపోతే మరో చోటుకు వాహనంపై వెళ్లడం. దీనివల్ల పెట్రోలు, ఇతర ఖర్చులూ.. సమయం వృథా!  ఫోన్‌లో ‘మిగిలిన ఫుడ్‌ ఉంది, రండి’ అని యాజమాన్యం చెప్పినా తీరా అక్కడకు వెళ్లేసరికి ‘కస్ట్టమర్లు రావడంతో సర్వ్‌ చేశాం’ అన్న జవాబు వచ్చేది. 


   ప్రయోజనాలున్నాయి    

ఉద్యోగాన్వేషణ పేరుతో రోజంతా సిస్టమ్‌కో, మొబైల్‌కో అంటిపెట్టుకొని ఉండటం కంటే రోజులో కొంత సమయం బయటకు వచ్చి మీ సబ్జెక్టుకు సంబంధించిన వాలంటరీ వర్క్‌ చేస్తే పదిమందితో పరిచయాలు పెరుగుతాయి. మీ గురించి వారికి తెలుస్తుంది. సోషల్‌ నెట్‌వర్క్‌కి బీజం పడుతుంది.  

అసలు ఉద్యోగ సాధనకంటే ముందు వాలంటరీ వర్క్‌లో భాగంగా ఒక టీమ్‌లో పనిచేసే అవకాశం వస్తే ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. బలాలు తెలుస్తాయి, బలహీనతలు అర్థమవుతాయి. మీ పరిమితులను ఎలా అధిగమించాలోనన్న అంతర్మథనం మీలో మొదలవుతుంది.  

వాలంటరీ వర్క్‌లో మీకున్న నైపుణ్యాలతో పాటు మరిన్ని అనుబంధ నైపుణ్యాలు నేర్చుకోవాల్సిరావచ్చు. అనివార్యంగా వాటిని నేర్చుకుంటారు. కొత్త స్కిల్స్‌ నేర్చుకోగలిగానన్న ఆత్మవిశ్వాసం పెరిగి ఉద్యోగ సాధనకు ఇదెంతగానో ఉపకరిస్తుంది. 

ఈ సమస్యను అర్థం చేసుకున్న నవ్య టెక్నాలజీతో పరిష్కారం చూపింది. ఆ స్వచ్ఛంద సంస్థ పేరున ఒక యాప్‌ రూపొందించి ఇచ్చింది. దాన్ని హోటళ్ల వారు డౌన్‌లోడ్‌ చేసుకొని గంటకోసారి తమవద్ద మిగిలిన ఆహారం పొజిషన్‌ను తెలుపుతుండటంతో సమస్య పరిష్కారం అయింది. యాప్‌ అందుబాటులోకి రావడంతో.. వేడుకల సమయంలోనూ మిగిలిన ఆహారపదార్థాల సద్వినియోగానికి నిర్వాహకులు సంస్థకు తెలిపేవారు. ఇప్పుడిక తక్కువ ఖర్చు, తక్కువ సమయంలో పట్టణంలోని అనాథ శరణాలయాలన్నింటికీ కావలసిన ఆహారపదార్థాలు సేకరించి ఇస్తోంది. ఇదంతా ఉచితంగా చేసిన నవ్య కృషిని పేర్కొంటూ సంస్థ చక్కటి ప్రశంసాపత్రం అందించింది. 

ఆమె తన ఇంటర్న్‌షిప్, స్వచ్ఛంద సంస్థకు సహకారం తెలిపే పత్రాలతో లింక్డ్‌ ఇన్‌లో తన రెజ్యూమెను ఉంచిన 15 రోజులకు ఊహించని ఆహ్వానం వచ్చింది. ఆమె విద్యార్హతలతో పాటు కృషిని గుర్తించిన బిల్‌గేట్స్‌ స్వచ్ఛంద సంస్థ ఏఐ స్పెషలిస్ట్‌ (సోషల్‌ సర్వీస్‌) పొజిషన్‌కు మంచి ప్యాకేజీతో ఎంపిక చేసింది.  

నిజానికి నవ్య చూపిన చొరవ మనదేశంలో కొత్త కావొచ్చు కానీ అమెరికా వంటి పాశ్చాత్య దేశాల్లో ఉద్యోగాన్వేషణలో భాగంగా చాలామంది అనుసరించే విధానమే ఇది.


   తీసుకోవలసిన జాగ్రత్తలు  

వాలంటరీ వర్క్‌కి అనుసంధానమయ్యే పని ఎంపిక విషయంలో కొన్ని జాగ్రత్తలు అవసరం.  

కెరియర్‌తో సంబంధం: స్వచ్ఛంద సంస్థ కాస్త నలుగురికీ తెలిసినదై ఉండేలా చూసుకోవాలి. ఎంచుకునే పని కెరియర్లో, ఉద్యోగాన్వేషణలో ఉపకరించేదిగా చూసుకోవాలి.   

చేసే పనిపై స్పష్టత: సంస్థ కార్యకలాపాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. సందేహాలు వస్తే నివృత్తి చేసుకోవాలి. అప్పుడు వారి కార్యకలాపాల్లో తనకు కనెక్ట్‌ అయ్యే పనిని ఎంచుకోవాలి. తాను చేయగలిగే పని రోజులో లేదా వారంలో వెచ్చించగల సమయం ముందుగా నిర్వాహకులకు తెలిపాలి. ముందు తక్కువ సమయంతో ప్రారంభించి క్రమేపీ సమయం పెంచుకోవడం మేలు. కానీ ప్రారంభంలోనే ఎక్కువ సమయం చెప్పేసి ఆపై టైమ్‌ తగ్గించుకోవడం మంచిది కాదు.  

శ్రద్ధగా పనిచేయాలి: ఏక్షణంలోనూ చేస్తున్నది ఉచిత సేవ అన్న ఆలోచన మెదడులోకి రానీయకూడదు. చేసే పనివల్ల రేపు తన కెరియర్‌కు ఉపయోగమన్న నిజాన్ని మనసులో నాటుకోవాలి. సంపాదన వచ్చే ఉద్యోగంలో మాదిరి శ్రద్ధగా పనిచేయాలి. అలాగే చేసే పనిలో సంస్థ నిర్వాహకుల అవసరం రీత్యా మార్పునకు సిద్ధంగా ఉండాలి.  


   అవకాశం గుర్తించేదెలా?  

ఉచితంగా చేసేదే కదా అని వాలంటీర్‌ వర్క్‌లో ఎవరిని పడితే వారిని చేర్చుకోరు. ఆ విషయం కూడా ఒక ఉద్యోగ ఎంపికలా సాగుతుంది. ప్రతిష్ఠాత్మక సేవాసంస్థలు సేవను ఒకరికి అప్పగించేందుకు అన్ని కోణాల్లోనూ పరిశీలిస్తాయి. ‘ఈ పని చేయగలుగుతాడా లేదా? పని పూర్తిచేసే స్వభావం ఉందా?..ఇలాంటి అంశాలను దుర్భిణి వేసి చూస్తారు. స్వచ్ఛంద బాధ్యతకు మీరు తగిన వ్యక్తి అని నిరూపించుకోవాలి. 

సంస్థలోకి నేరుగా ప్రవేశం లభించకపోతే ఆ సంస్థ నిర్వహించే ఈవెంట్స్‌/ సమావేశాల నిర్వహణకు సాంకేతిక సహకారం అవసరమేమో తెలుసుకోవచ్చు. అవకాశం వచ్చి ఇలాంటి రెండు, మూడు ఈవెంట్స్‌కు సపోర్ట్‌ చేస్తే మీ పనితీరు నచ్చి సంస్థ విధుల్లోకి తీసుకోవచ్చు.  

వాలంటీరింగ్‌ వర్క్‌ చేసేటప్పుడు మీరు ఫ్రెషర్‌ అని మరవొద్దు. ప్రతి ముఖ్యమైన టాస్క్‌ పూర్తయ్యాక నిర్వాహకుల స్పందన తెలుసుకోవాలి. వారిని ఒక క్లయింటుగా భావించి వారి సూచనలు, అభిప్రాయాలు, అవసరాలు పరిగణనలోకి తీసుకొని మెరుగైన నైపుణ్యాలను అందించగలగాలి. ఈ అలవాటే ముందు ముందు ఉద్యోగంలోనూ ఎంతో ఉపకరిస్తుంది. 


- యస్‌.వి. సురేష్‌

సంపాదకుడు, ఉద్యోగ సోపానం


మరింత సమాచారం... మీ కోసం!

‣ పొరపాట్లు దిద్దుకుంటే.. పక్కా గెలుపు!

‣ రోజుకో గంట చదివితే... రూ.34లక్షల జీతం!

‣ ఆర్థిక రంగ నిపుణులకు ఆహ్వానం!

‣ జాబ్‌ మార్కెట్‌లో ఏఐ జోరు!

‣ పాఠాలు అర్థం కావడం లేదా?

Posted Date: 23-07-2024


 

ఉద్యోగాన్వేష‌ణ‌

మరిన్ని