• facebook
  • whatsapp
  • telegram

నాయకత్వ లక్షణాలు పెంచుకుందాం!

* బెస్ట్‌ కెరియర్‌కు సూచనలు

నాయకత్వం అనేది ప్రత్యేక నైపుణ్యం. విద్యార్థి దశ నుంచే దీన్ని పెంపొందించుకుంటే కళాశాల స్థాయిలోనే విజయాలకు పునాది ఏర్పడుతుంది. స్వతంత్ర ఆలోచనలు వికసించి చక్కని వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటుంది. ఫలితంగా అద్భుతమైన కెరియర్‌కు చక్కని బాట వేసుకోవటానికి వీలవుతుంది! 

విద్యార్థి నాయకత్వం అంటే.. ప్రధానంగా కళాశాలకు సంబంధించిన వివిధ కార్యక్రమాల్లో చొరవ చూపించటం, క్రియాత్మకమైన పాత్ర పోషించటం. ఈ ప్రక్రియలో సానుకూలమైన నైపుణ్యాలు క్రమంగా వృద్ధి చెందుతాయి. అందరితో సత్సంబంధాలు పెరుగుతాయి. ఆత్మవిశ్వాసంతో తమతో పాటు సహ విద్యార్థులు విద్యా, విద్యేతర కార్యక్రమాల్లో దూసుకువెళ్లేందుకు ప్రేరణను ఇవ్వగలుగుతారు.    

కష్టసుఖాలనూ, లాభనష్టాలనూ తట్టుకుని నిలబడగలిగే శక్తి నాయకుడికి పుష్కలంగా ఉంటుంది. నిర్ణయాలు తీసుకునే నైపుణ్యమూ ఎక్కువే. ఒకవేళ తాను తీసుకున్న నిర్ణయం వల్ల నష్టం జరిగినా.. దానికి పూర్తి బాధ్యత తనదేనని నిజాయతీగా ఒప్పుకుంటాడు. ఇంకా ఏయే లక్షణాలు ఉంటాయో తెలుసుకుందామా...


భావవ్యక్తీకరణ
విజయవంతమైన నాయకుడు ఎప్పుడూ తన ఆలోచనలూ, అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేస్తాడు. కాబట్టి బృంద సభ్యులు కూడా ప్రాజెక్టు లక్ష్యాలూ, అంచనాలకు తగినట్టుగా పనిచేస్తారు. ఇతరుల అభిప్రాయాలను జాగ్రత్తగా వింటాడు. మాట్లాడినా, రాసినా ఎలాంటి అనుమానాలూ, అపోహలకూ తావులేకుండా చూసుకుంటాడు. నిజానికి మిగతా నైపుణ్యాలకు ఇది పునాది లాంటిది. ప్రతిభావంతులైన నాయకుడు బృందంలో స్ఫూర్తిని నింపుతాడు. తన ఆలోచనలను సభ్యులకు తెలియజేస్తూ.. వాళ్లందరూ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ అభివృద్ధికి తోడ్పడేలా చేస్తాడు.  


నేర్చుకుంటూనే ఉంటారు
ఎంత ఉన్నత స్థాయికి వెళ్లినా కొత్తగా ఎప్పుడూ ఏదైనా నేర్చుకుంటూనే ఉంటాడు. ఈ క్రమంలో డిప్లొమా, డిగ్రీ, ప్రొఫెషనల్‌ కోర్సులు చదువుతూనే ఉంటాడు. అలాగే గెలుపు, ఓటములు ఏవి ఎదురైనా ఆ అనుభవాలను గుర్తుపెట్టుకుంటాడు. వాటి నుంచి పొందిన పరిజ్ఞానం, నైపుణ్యాలను అందిపుచ్చుకుంటాడు. 


స్వీయ అవగాహన
తన సామర్థ్యాలపై స్పష్టమైన అవగాహన ఉంటుంది. అనుభవ పాఠాలను వృత్తి, వ్యక్తిగత జీవితాల్లో అన్వయిస్తాడు. ఈ విధమైన అవగాహన లక్ష్య సాధనకూ, నాయకత్వ నైపుణ్య దిశగా ఎదుగుదలకూ తోడ్పడుతుంది. 


నాయకులకు ఉండాల్సిన లక్షణాల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఆ దిశగా ఎదగాలంటే ఎలా ప్రయత్నించాలో చూద్దామా... 


బలాలు, బలహీనతలు
మీ బలాలు, బలహీనతలను ముందుగా అర్థంచేసుకోవాలి. దాంతో ఏయే అంశాల్లో వెనకబడి ఉన్నారో, వేటిని మెరుగుపరుచుకోవాలో తెలుస్తుంది. ఆన్‌లైన్‌లో లీడర్‌షిప్‌ క్వాలిటీస్‌కు సంబంధించిన క్విజ్‌లూ అందుబాటులో ఉన్నాయి. వీటిలో పాల్గొనడం ద్వారా మీరే స్థాయిలో ఉన్నారో తెలుసుకోవచ్చు. కొన్ని విద్యాసంస్థలు నాయకత్వ లక్షణాలను మెరుగుపరుచుకునే అవకాశాన్నీ కల్పిస్తున్నాయి. 


అర్థం చేసుకోవాలి
ఏ నాయకత్వ విధానాన్ని అనుసరిస్తున్నారనే విషయంలో స్పష్టమైన అవగాహన ఉండాలి. బృందాన్ని ఆదేశించే విధానాన్నే మీరు ఎక్కువగా అనుసరిస్తున్నారు అనుకుందాం. అలాంటప్పుడు ఎక్కువగా చర్చలకు ప్రాధాన్యం ఇవ్వాలి. డెలిగేటివ్‌ శైలిని అనుసరిస్తూ బృందానికి ఎక్కువగా స్వేచ్ఛను ఇస్తే.. బృంద సభ్యులూ నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేసుకుంటారు. 


లక్ష్య సాధన
మీ బలాలు, బలహీనతలను గుర్తించాలి. ఏదైనా ఒక నైపుణ్యం మీద ప్రధానంగా దృష్టిని కేంద్రీకరించాలి. అడాప్టబిలిటీ, కమ్యూనికేషన్, కాన్‌ఫ్లిక్ట్‌ మేనేజ్‌మెంట్, క్రియేటివిటీ, క్రిటికల్‌ థింకింగ్, డెసిషన్‌ మేకింగ్, మోటివేషన్‌-ఇన్‌ఫ్ల్లుయెన్స్‌ నెగోషి‡యేషన్, రిలేషన్‌షిప్‌ బిల్డింగ్‌.. ఇవన్నీ నాయకత్వ లక్షణాల కిందికే వస్తాయి. లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాని సాధనకు ప్రణాళిక తయారుచేసుకోవాలి. అభివృద్ధిని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. 


నెట్‌వర్క్‌ పెంచుకోవడం
నాయకత్వ లక్షణాల అభివృద్ధికి.. పరిశీలించడం చాలా అవసరం. ప్రముఖ నాయకుల వ్యవహారశైలి ఎలా ఉంది, వాళ్లు సవాళ్లను ఎలా ఎదుర్కొంటున్నారు, సమస్యలను ఎలా పరిష్కరిస్తున్నారు, నిర్ణయాలు ఎలా తీసుకుంటున్నారు, ఎలాంటి వ్యూహాలను అనుసరిస్తూ బృంద విజయానికి కృషిచేస్తున్నారో తెలుసుకోవచ్చు. పారిశ్రామిక ప్రదర్శనలకు హాజరుకావడం, సోషల్‌  మీడియా సైట్ల ద్వారా ఇతర నాయకులతో పరిచయాలూ పెంచుకోవచ్చు. 


మార్గదర్శి ఉంటే
ప్రపంచవ్యాప్తంగా పేరొందిన క్రీడాకారుల లక్ష్యసాధనకు మార్గదర్శులు ఎంతో కృషిచేశారు. నాయకత్వ నైపుణ్యం, ప్రణాళికలు, లక్ష్యాలను కోచ్‌లు విశ్లేషిస్తారు. సాధారణంగా సీనియర్లు, రిటైర్డ్‌ వ్యక్తులకు పరిశ్రమపైన అవగాహన ఉండటంతో.. అనుభవంతో సలహాలు ఇవ్వగలగుతారు. కొన్ని సంస్థలు నాయకత్వ లక్షణాల మెరుగుదలకు కోచింగ్‌ ప్రోగామ్‌లూ నిర్వహిస్తాయి. అవసరమైతే మెంటర్‌ను స్వయంగా కలిసీ సలహాలు తీసుకోవచ్చు. 


అధ్యయనం, పరిశోధన
కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఉత్సాహం నాయకుడికి ఎప్పుడూ ఉండాలి. పారిశ్రామిక పరిశోధనలనూ, కొత్త పోకడలనూ గమనిస్తుండాలి. పుస్తకాలు చదవడం, సెమినార్లూ, ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరుకావాలి. దీంతో పరిచయాలు పెరిగి, కొత్త అవకాశాలనూ అందిపుచ్చుకోవచ్చు. 


అవకాశాలను వినియోగించుకోవాలి
విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించాలి. ఈ క్రమంలో వచ్చే ఏ అవకాశాన్నీ వదులుకోకూడదు. అలాగే ఉద్యోగం వచ్చిన తర్వాత అలవాటైన పనులు చేయడానికే పరిమితం కాకూడదు. సౌకర్యవంతమైన పరిధి నుంచి బయటకు వచ్చి కొత్త విషయాలను నేర్చుకోవడానికి, కొత్త విభాగంలో పనిచేయడానికీ ప్రయత్నించాలి. కొత్తగా తీసుకున్న పనిని చిన్నగా మొదలుపెట్టి ఏ పద్ధతులను ఉపయోగిస్తే అది త్వరగా పూర్తవుతుందో గమనించాలి. అవసరమైన మార్పులూ, చేర్పులూ చేసుకోవాలి. 


పరిస్థితులకు అనుగుణంగా
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే నేర్పు నాయకుడికి ఉండాలి. ఇలాగే ఉండాలి, ఇలాగే ప్రవర్తించాలి అనే నియమాలు పెట్టుకోకుండా.. ఇతరుల నుంచీ నేర్చుకోవచ్చు. బృంద సభ్యులు, సహోద్యోగుల ఆలోచనలు, అభిప్రాయాలు, సూచనలు, సలహాలూ తీసుకోవచ్చు. నాయకత్వంలో పారదర్శకత ముఖ్యం. ఇతరుల అభిప్రాయాలకూ విలువనివ్వడం వల్ల మేటి నిర్ణయాలు తీసుకునే అవకాశం దక్కుతుంది. 


మరింత సమాచారం... మీ కోసం!

‣ ‘ఏఐ’ ముప్పు తప్పేలా!

‣ ఒకటే పరీక్ష.. లక్షన్నర కొలువులు!

‣ ఎయిమ్స్‌ సంస్థల్లో 3 వేల ఉద్యోగాలు

‣ స్టేట్‌ బ్యాంకులో 8,773 క్లర్క్‌ కొలువులు

Posted Date: 23-11-2023


 

నాయకత్వ సామర్థ్యం

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం