• facebook
  • whatsapp
  • telegram

ప్రేరణతో విజయం సాధ్యం!

* కెరియర్‌ సక్సెస్‌కు సూచనలువిద్యాభ్యాసం అనేది దీర్ఘకాలంలో కొనసాగే ప్రయాణం. ముఖ్యంగా ఇంజినీరింగ్, మెడిసిన్‌ లాంటి వృత్తివిద్యలను ఎంచుకునేవారు ఆ స్థాయికి తగ్గట్టు కృషి చేయటంలో అలసత్వం చూపకూడదు. ప్రవేశపరీక్షల్లో ప్రతిభ చూపి సీటు సంపాదించటం తొలి మెట్టు మాత్రమే. సంబంధిత వృత్తివిద్యకు అవసరమైన నైపుణ్యాలను శ్రద్ధాసక్తులతో నేర్చుకోవటంలో రాజీ పడకూడదు. తమ భవిష్య లక్ష్యాలను చేరుకునేవరకూ కృషి చేయాలంటే.. నిరంతర ప్రేరణ అవసరం. దానికేం చేయాలో తెలుసుకుందాం!  


కొంతమంది విద్యార్థులు ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటారు. దాన్ని సాధించడం కోసం పగలూ, రాత్రీ అనే తేడా లేకుండా కష్టపడతారు. అనుకున్న పని అయిపోయాక విశ్రాంతి, వినోదాలతో విలువైన సమయం వృథా చేస్తుంటారు. అలాకాకుండా అదే స్ఫూర్తిని కొనసాగిస్తే తర్వాత కూడా మరెన్నో విజయాల దిశగా ప్రయాణించవచ్చు.  


‘సాధించినదానితో సంతృప్తిని చెంది అదే విజయమనుకుంటే పొరపాటేనోయ్‌’ అంటూ హితబోధ చేస్తారు మహాకవి శ్రీశ్రీ, ఓ సినీగీతంలో. ఎంతోమంది విద్యార్థులకు ఏదో ఒక సందర్భంలో ఇలాంటి పరిస్థితి ఎదురవుతూనే ఉంటుంది. కెరియర్‌ను తీర్చిదిద్దుకోవడాన్ని వదిలేసి సరదాలూ, సంతోషాలతో కాలం గడిపేస్తుంటారు. అలాకాకుండా ఉండాలంటే కెరియర్లో ఉన్నతస్థాయికి చేరుకున్నపుడు లభించే గుర్తింపు, గౌరవ మర్యాదలు, ఆర్థికంగా పెరిగే హోదా.. వీటన్నిటినీ తరచూ గుర్తుచేసుకుంటూ ప్రేరణను పొందుతుండాలి. ఆదర్శంగా భావించే సీనియర్ల కృషినీ, ప్రముఖ వ్యక్తుల ప్రస్థానాన్నీ గమనించి స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలి.   

కాలయాపన చేస్తూ పోతే.. అలసత్వం అలవాటవుతుంది. గతంలో మాదిరిగా కష్టపడి పనిచేయాలని అనిపించదు. దీనికి విరుద్ధంగా కెరియర్‌కు ఉపయోగడే లక్ష్యాల నిర్దేశం, వాటి కోసం చేసే కఠోర పరిశ్రమ మనల్ని చురుకుగా ఉంచుతాయి. ఉత్తేజాన్నీ ఇస్తాయి.వాయిదా వేయటం

భారీ లక్ష్యాన్ని సాధించిన తర్వాత వెంటనే అదే స్థాయిలో మరో లక్ష్యాన్ని పెట్టుకోనవసరం లేదు. ఏదైనా చిన్న లక్ష్యాన్ని పెట్టుకోవచ్చు. దాన్ని విజయవంతంగా పూర్తిచేసిన తర్వాత మరో దాన్ని మొదలుపెట్టాలి. అంటే.. ప్రయత్నాలను మధ్యలో ఆపేయకుండా నిరంతరంగా కొనసాగించడానికి అలవాటు పడతారు.   

చిన్న లక్ష్యాలంటే ఏం ఉంటాయనే సందేహం రావచ్చు. కొందరు విద్యార్థులు అసైన్‌మెంట్లను గడువు తేదీలోగా పూర్తిచేయకుండా వాయిదా వేస్తుంటారు. ఇలాంటప్పుడు ఎప్పటి పనిని అప్పుడే పూర్తిచేయాలనే లక్ష్యాన్ని పెట్టుకోవచ్చు. అలాగే ఎంతో ముఖ్యమైన స్కాలర్‌షిప్‌ లేదా ఇంటర్న్‌షిప్‌లకు దరఖాస్తు చేయాలనుకోవచ్చు. వీటినీ వాయిదా వేస్తూ వెళ్లడం వల్ల మంచి అవకాశాలు చేజారిపోతాయి. అందుకే ఎప్పటి పనులను అప్పుడే పూర్తిచేయాలనే లక్ష్యాన్ని పెట్టుకోవచ్చు. 

కొందరు పాఠ్యాంశాల్లో ఏమైనా సందేహాలున్నా అధ్యాపకులను అడగడానికి సంకోచిస్తారు. ఇలాంటివాళ్లు ఇకనుంచి వెంటనే నివృత్తి చేసుకోవాలనే లక్ష్యాన్ని పెట్టుకోవాలి. అలవాటయ్యేవరకూ రోజుకు ఒక్కసారైనా సందేహాలను అడిగి తెలుసుకోవాలనే నియమాన్ని పెట్టుకుంటే మెరుగు. లెక్కలంటే భయం 

అందరికీ అన్ని సబ్జెక్టుల్లోనూ పట్టు ఉండకపోవచ్చు. మ్యాథ్స్‌ అంటే కొందరికి భయం ఉండొచ్చు. అలాంటప్పుడు దీంట్లో మంచి మార్కులు సాధించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. అలాగే రోజూ అదనపు సమయాన్ని కేటాయించి మూడు, నాలుగు నెలల్లోగా పట్టు సాధించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకోవచ్చు. 

కొందరు ఒంటరిగా ఉన్నప్పుడు ప్రశాంతంగా చదవగలుగుతారు. కానీ తరగతిలో సహవిద్యార్థులూ, అధ్యాపకుల ముందు పాఠం చదవాల్సి వచ్చినప్పుడు మాత్రం తడబడుతుంటారు. అలాంటప్పుడు వేగంగా, స్పష్టంగా చదవాలనే లక్ష్యాన్ని పెట్టుకుని సాధన చేయొచ్చు. 

కొందరు విద్యార్థులు ఇతరులతో త్వరగా కలవలేరు. కానీ విద్యార్థి దశలో.. బృందంగా ఏర్పడి అసైన్‌మెంట్లు పూర్తిచేయాల్సిన సందర్భాలెన్నో ఉంటాయి. కాబట్టి ఈ ఇబ్బంది నుంచి బయటపడటానికి నలుగురితో కలిసిపోవాలనే లక్ష్యం నిర్దేశించుకుని కృషి చేయటం సత్ఫలితాన్ని ఇస్తుంది.  వీడియో గేమ్‌లు

వీడియో గేమ్‌లు ఆడటం, సోషల్‌ మీడియాలో సమయాన్ని వృథా చేసే అలవాటు చాలామంది విద్యార్థులకు ఉంటుంది. ఈ సమయాన్ని నియంత్రించి దాన్ని చదవడానికి వినియోగించాలనే సంకల్పం పెట్టుకోవచ్చు. ఇది అనుకున్న వెంటనే జరిగిపోయే పని కాదు. అందుకే కాస్త నిదానంగానైనా దీన్నుంచి బయటపడటానికి గట్టిగా ప్రయత్నించాలి. 

సాధారణంగా చేయాలనుకునే పనులనే లక్ష్యాలుగా పెట్టుకుంటారు కదా.. అలాగే కొన్ని పనులు చేయకూడదనే లక్ష్యాన్నీ పెట్టుకోవచ్చు. వ్యాయామాలు, క్రీడలకు దూరంగా రోజులను బద్ధకంగా గడిపేయడం కొందరికి అలవాటు. దీన్నుంచి బయటపడాలనే లక్ష్యాన్నీ పెట్టుకోవచ్చు. 

చివరగా గుర్తించుకోవాల్సింది ఏమిటంటే.. చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకుని వాటిని చేరుకోవడం వల్ల తగినంత ప్రేరణను పొందుతూ సంతోషంగా ముందుకు వెళ్లగలుగుతారు. ఈ అలవాటు భవిష్యత్తులో ఉద్యోగాన్వేషణలోనూ.. ఉద్యోగం సంపాదించిన తర్వాత బాధ్యతలను నిర్వర్తించడంలోనూ ఎంతగానో తోడ్పడుతుంది. 


మరింత సమాచారం... మీ కోసం!

‣ బాడీ లాంగ్వేజ్ ఎందుకు ముఖ్యం?

‣ దిద్దుబాటుతో విజయం తథ్యం!

‣ వాయుసేనలో విశిష్ట ఉద్యోగాలు

‣ 995 ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ కొలువులు

‣ వైరాలజీ సంస్థలో ఉద్యోగాలు

‣ డేటా లిటరసీ.. సరికొత్త నైపుణ్యం!

‣ ఐటీఐ, డిప్లొమాతో సెయిల్‌లో ఉద్యోగాలు

Posted Date: 11-12-2023


 

ప్రేరణ

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం