• facebook
  • whatsapp
  • telegram

అన్నిటికీ పునాది ఆ నేర్పు! 

కెరియర్‌ ఉన్నతికి జీవన నైపుణ్యాలు

చాలామంది మరిచిపోయేదీ, విజేతలు మాత్రమే గుర్తుంచుకునేదీ అయిన విషయం ఒకటుంది. అదే- ముందు తనను తాను అర్థం చేసుకోవడం; ఎదుటివారిని అర్థం చేసుకోవడం. ఈ రెండింటిపైనే మానవ సంబంధాలనేవి ఆధారపడి ఉన్నాయి. కాస్త నిశితంగా పరిశీలిస్తే మళ్లీ ఈ రెండింటిలో మొదటిదే ప్రధానం. అంటే ఒకరు తనను తాను అర్థం చేసుకుంటే ఎదుటివారిని అర్థం చేసుకోవడం సులభం. 

గ్రీకు తత్వవేత్తలు ‘నిన్ను నువ్వు తెలుసుకో’ అని ఏనాడో చెప్పారు. మనిషి తనను తాను తెలుసుకోవడంపైనే భవిష్యత్తులో అతని అస్తిత్వం ఆధారపడి ఉంటుంది. అందుకే స్వీయ అవగాహన (సెల్ఫ్‌ అవేర్‌నెస్‌) జీవన నైపుణ్యాలకు ప్రధాన పునాది. స్వీయ అవగాహనలో తొలిమెట్టు.. తనను తాను అవగాహన చేసుకుని తనను తాను అంగీకరించడం. అంటే అంతర్గత సామర్థ్యాలను గుర్తించడం. అదే సమయంలో తన పరిమితులను అర్థం చేసుకోవడం. వీటిని తన లక్ష్యాలతో అనుసంధానం చేసుకోవడం.

ఇద్దరు మిత్రులు రెండు దారులు

రామ్, శ్యామ్‌ ఇద్దరూ ఇంటర్‌ క్లాస్‌మేట్స్‌. ఇద్దరికీ ఎంబీబీఎస్‌ పూర్తిచేసి డాక్టర్‌ కావాలనుంది. ఇద్దరి లక్ష్యాలూ కలవడమే కాదు; చాలా విషయాల్లో వీరి మధ్య సారూప్యాలున్నాయి. ఇద్దరివీ దిగువ మధ్యతరగతి కుటుంబాలే. ఇద్దరి తండ్రులూ సన్నకారు రైతులు. దీనికితోడు ఇద్దరూ చూపులకు అంత బాగోరు. ఈ పరిస్థితులన్నీ అర్థమవుతున్నా రామ్‌ డాక్టర్‌  కావాలన్న తన ఆశను వదల్లేదు. అలాగని చదువులోనూ అంతగా ప్రతిభ చూపలేదు. దీనికితోడు తాను అంతగా బాగోనన్న న్యూనతా భావం అతడిని వెంటాడుతుండేది. డాక్టర్‌ కావాలని తాను ప్రయత్నిస్తున్నప్పటికీ దాన్ని అందుకునే శక్తి తనకు లేదని తనలో తానే వ్యాకుల పడుతుండేవాడు. ఇలాంటి ప్రతికూల భావాల మధ్య తండ్రిచేత ఉన్న కాస్త పొలం అమ్మించి మెడిసిన్‌లో చేరినా రామ్‌ చదువు కూడా పటిష్ఠంగా సాగలేదు. మరోపక్క రెండేళ్ల తరువాత ఎంబీబీఎస్‌ కోర్సు కొనసాగించేందుకు ఫీజు చెల్లించలేకపోయాడు. సాయం కోసం ఎవరిని అడిగినా రెండేళ్ల చదువులో అతడు పెద్దగా రాణించలేకపోవడంతో ఆర్థికంగా ఆదుకోవడానికి ఎవరూ ఆసక్తి చూపలేదు. చివరకు రామ్‌ చదువు చతికిలపడింది. పల్లెటూరికి వెళ్లిపోయి తన తండ్రితో కలిసి ప్రస్తుతం కూలీకి వెళుతున్నాడు.

శ్యామ్‌ తన పరిస్థితిని ముందే ఆకళింపు చేసుకున్నాడు. యదార్థాన్ని అంగీకరించాడు. తన కుటుంబ ఆర్థిక పరిస్థితి రీత్యా సుదీర్ఘ కాలం సాగే వైద్యవిద్యను ఎంచుకోవడం శ్రేయస్కరం కాదని గుర్తించాడు. తన కల డాక్టర్‌ కావడం అయినప్పటికీ వైద్యరంగంలోకి ప్రవేశించేందుకు ఇతర మార్గాల గురించి పెద్దలను అడిగి తెలుసుకున్నాడు. తన రూపురేఖలు ఇతరులను ఆకర్షించేవి కావు కాబట్టి, వైద్యసేవల ద్వారా ఇతరుల అభిమానం చూరగొనవచ్చని భావించాడు. ఇందుకు తగ్గట్టు మేల్‌ నర్స్‌ కోర్సును పూర్తిచేశాడు. ఆపై ఒక కార్పొరేట్‌ ఆసుపత్రిలో చేరి ఆర్థికంగా తండ్రికి చేదోడు వాదోడుగా నిలిచి అక్క పెళ్లి చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.

రామ్‌-శ్యామ్‌ల్లో చివరికి శ్యామ్‌ విజేతగా నిలిచాడు. నిజానికి ఇద్దరి నేపథ్యాలూ ఒక్కటే అయినప్పటికీ తనలో తాను అవలోకించుకున్నపుడు వెల్లడయ్యే పరిమితులనూ, వాస్తవాలనూ యథాతథంగా అంగీకరించగలగడం ఒక జీవన నైపుణ్యంగా రామ్‌-శ్యామ్‌ ఉదంతంలో నిరూపణ అయ్యింది. చాలామంది తమను తాము అంగీకరించకుండా ఊహాలోకంలో ఉండిపోవడం వల్ల జీవన సమరంలో పరాజితులుగా మిగిలిపోతారు. అయితే- చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా స్వయంకృషితో కోటీశ్వరులైనవారు, పెద్దగా అక్షర జ్ఞానం లేకపోయినా ఆసక్తితో విజ్ఞానఖనులైనవారు, శారీరకంగా అశక్తులైనా మేధాశక్తితో అపురూప విజయాలు సాధించినవారి సంగతేంటన్న ప్రశ్న వస్తుంది.

స్వీయ అవగాహన (సెల్ఫ్‌ అవేర్‌నెస్‌)లో రెండు ముఖ్య విషయాలున్నాయి. తన గురించి తెలుసుకోగలిగే వారెవరైనా ఉన్నారంటే అది ముమ్మాటికీ తాను మాత్రమే. ఇక రెండో విషయం- మనల్ని మనం మెరుగుపరచుకోవాలంటే ఆ పని చేయగలిగేదీ మనం మాత్రమే. పరిమితుల్ని గుర్తించి నిజాయతీగా ప్రయత్నించడం ద్వారా మన మనఃఫలకాలపై నిలిచిన వారెందరో!

అతి సాధారణ కుటుంబంలో పుట్టి ఒరాకిల్‌ వ్యవస్థాపకుడైన మల్టీ బిలియనీర్‌ 

- లారీ ఎలిసన్‌

కాళ్ళూ చేతులూ లేకుండా జన్మించి గజ ఈతగాడిగా, మోటివేషనల్‌ స్పీకర్‌గా పేరొందిన ఆస్ట్రేలియా జాతీయుడు 

- అమెరికన్‌ నికొలస్‌ జేమ్స్‌ వుజిసిక్‌

జన్మతః అంధుడైనా ప్రపంచ ప్రసిద్ధ గాయకుడిగా పేరు తెచ్చుకున్న 

- స్టీవ్‌ వండర్‌

ఇలా తమ పరిమితుల్ని అంగీకరించి, వాటిపై పోరాటం చేసి వీరంతా విజయబావుటా ఎగురవేశారు. స్వీయ లోపాలను అధిగమించాలన్న కాంక్ష ఉన్నవారికి ఈ స్ఫూర్తిబాటలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. 

స్వీయ విశ్లేషణలో నాలుగు దశలు 

‘నాకు నేనే.. నేను ఏదైతే అదే..’ అనే పిడివాదం కుదరదు. మన శక్తిసామర్థ్యాలు బాహ్య ప్రపంచ సవాళ్లకు జవాబు అయినప్పుడు మన జీవనం సాఫీగా సాగుతుంది. అందుకే స్వీయ విశ్లేషణ సమయంలో మన రంగానికి అవసరమైన నైపుణ్యాలు.. అదే కోణంలో మనలో నిక్షిప్తమైన కౌశలాలను అన్వేషించాలి. ఈ రెండింటి మధ్య సమతుల్యత చూసుకోవాలి. స్వీయ అంచనాకు నాలుగు దశలను నిపుణులు సూచిస్తున్నారు.

1. అంతర్గత సామర్థ్యాలు 

మనలో నిబిడీకృతమైన సామర్థ్యాలు. గతంలో వివిధ సందర్భాల్లో ప్రదర్శితమైన సామర్థ్యాల దృష్ట్యా గుర్తింపు. పాఠశాల, కళాశాల, నిజజీవితంలో విభిన్న సమయాల్లో బయటకు వచ్చి ఇతరుల ప్రశంసలు అందుకున్న సామర్థ్యాలపై అవగాహన.

2. మంచి లక్షణాలు

బాహ్య ప్రపంచ ఆమోద, తిరస్కార రీత్యా మనలో ఉన్న మంచి లక్షణాల గుర్తింపు. మంచి లక్షణాలంటే మన దృష్టిలో మాత్రమే కాక యావన్మందీ అంగీకరించే లక్షణాలు. ఉదాహరణకు- వయసులో తనకంటే పెద్దవారి పట్ల గౌరవాభిమానాలు చూపడం, పర్యావరణం పట్ల బాధ్యతగా వ్యవహరించడం.

3. పరిమితులు 

మనకు గల పరిమితులు- శారీరక, మానసిక పరమైనవాటిని నిష్పాక్షికంగా గుర్తించడం. ఉదాహరణకు ఒకరు మానసికంగా దృఢంగా, శారీరకంగా బలహీనంగా ఉండవచ్చు. లేదా దేహదార్ఢ్యం బాగుండి, మానసిక నిర్బలత ఉండి ఉండొచ్చు. ఎవరైనా ఏదైనా నిజాయతీగా గుర్తించగలగాలి.

4. తగిన నిర్ణయాలు  

సామర్థ్యాలు, మంచి లక్షణాలు, పరిమితుల దృష్ట్యా జీవనయానంలో ప్రతి దశలో తెలివిగా నిర్ణయాలు తీసుకోవడమంటే- శారీరకంగా దృఢంగా ఉండి, క్రీడల పట్ల ఆసక్తి ఉంటే ఆత్మస్థైర్యంతో క్రీడలను కెరియర్‌గా ఎంచుకోవడం. అందరూ ఇంజినీరింగ్‌ కోర్సులవైపు పరిగెడుతున్నప్పటికీ తన అంతర్గత సామర్థ్యాలు అకౌంటెన్సీ, టాక్సేషన్‌ వైపు ఉంటే ధైర్యంగా సీఏ కోర్సుకు వెళ్లగలగడం. 

మొత్తమ్మీద జీవితంలో అతి ముఖ్యమైనది.. తన గురించి తనకు సంపూర్ణ అవగాహన ఉండటం. ఈ నైపుణ్యం గలవారు జీవన పథంలో అగ్రభాగాన ఉంటున్నందున లైఫ్‌ స్కిల్‌గా ‘స్వీయ అవగాహన- అంగీకార’  నైపుణ్యాన్ని అలవరచుకోవాలని సిఫారసు చేస్తున్నారు. 

Posted Date: 04-01-2021


 

స్వీయ అవగాహన

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం