• facebook
  • whatsapp
  • telegram

‘ఏఐ’ ముప్పు తప్పేలా!

* ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రంగంలో ఉద్యోగావకాశాలు

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌..గత కొంతకాలంగా మనుషుల జీవితాలను ఎంతగానో ప్రభావితం చేసింది. రాబోయే కాలంలో మరింతగా మన ఉద్యోగాల తీరును ప్రభావితం చేయబోతోంది. ఇప్పటికే ఉన్న కొలువుల్లో కొన్ని ఉంటాయో ఉండవో చెప్పలేని పరిస్థితి. అలాగే కొత్తగా సృష్టించే ఉద్యోగాలకు మనం సిద్ధంగా ఉండటం కూడా చాలా ముఖ్యం. దీనికి అవసరమయ్యే నైపుణ్యాలేంటో, ఇంకా ఈ విషయమై మరింత విపులంగా పరిశీలిద్దామా!

‣ మనం పనిచేసే తీరును ఏఐ మార్చేస్తోంది. ఇప్పుడున్న చాలా ఉద్యోగాలు ఆటోమేట్‌ అయిపోతాయనే విషయం ఇప్పటికే తెలుసు. ఈ నేపథ్యంలో కెరియర్‌ను మొదలుపెట్టే ప్రతి అభ్యర్థి ఇందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ డిజిటల్‌ రివల్యూషన్‌లో మనం స్థిరంగా ఉద్యోగంలో ఉండాలంటే కేవలం కంప్యూటర్లు చేయగలిగే పనులే కాకుండా.. అంతకుమించి నేర్చుకుని సిద్ధంగా ఉండాలి!

 ఉత్పాదకత, సామర్థ్యం, వేగం, కచ్చితత్వం.. వీటిలో ఏఐ మనుషులకంటే ఓ అడుగు ముందే ఉంటుంది. వారు చేసే పనులను ఇంకా సులభంగా చేసేయగలుగుతుంది. ఇప్పటికే డేటాను విశ్లేషించి జవాబులు, ఇన్‌సైట్స్‌ ఇచ్చే ఉద్యోగాలను చాలా సాఫ్ట్‌వేర్‌ సంస్థల్లో ఏఐ ఆక్రమించింది. గతంలో వీటికి ప్రత్యేకంగా ఉద్యోగులు ఉండేవారు. ప్రింటింగ్, విద్యుత్తు, విమానాలు, ఇంటర్నెట్‌.. ఇవన్నీ కనిపెట్టే ముందున్న సమాజం వాటి ఆవిర్భావం తర్వాత చాలా మారిపోయింది. ప్రస్తుతం మనం కూడా అటువంటి సంధి దశలో ఉన్నామని చెప్పవచ్చు.

 ఏఐ వల్ల చాలా ఉద్యోగాలు లేకుండా పోవడం నిజమే అయినప్పటికీ కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయనేది కూడా వాస్తవం. వాటిని అందిపుచ్చుకునేలా ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటూ ఉండటం అవసరం. అప్‌స్కిలింగ్‌ అనేది ఈ పోటీలో నిలబెట్టే ప్రధాన ఆయుధం.  నిపుణులైతే మెషీన్‌ లెర్నింగ్, రోబోటిక్స్, ఇతర అత్యాధునిక టెక్నాలజీపై దృష్టి పెట్టాలని చెబుతున్నారు.


సృజనాత్మకత

అత్యంత తెలివైన కంప్యూటర్‌ కూడా మైమరపించే చిత్రాలను గీయలేకపోవచ్చు, వీనులవిందైన సంగీతాన్ని సృష్టించలేకపోవచ్చు! కారణం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ మనుషుల్లా కొత్త ఆలోచనలు సృష్టించలేదు, తన పరిధి మేరకే ప్రవర్తిస్తుంది. ఊహకు అందని సృజనాత్మకతతో కొత్త అడుగులు వేయడం కేవలం మనుషులకే సాధ్యం. ఇది విద్య, వినోద, వ్యాపార రంగాల్లో ఎక్కడైనా ఏ రూపంలోనైనా అభ్యర్థులను ప్రత్యేకంగా నిలబెట్టగలదు. అందుకే సృజనాత్మకతతో కూడిన రంగాలను ఏఐ ఏమీ చేయలేకపోవచ్చు. సృజనలో ఊహాశక్తి, సందర్భానికి తగిన విధంగా స్పందించడం, పరిస్థితిని చూసి స్ఫూర్తి పొందడం భాగం.. ఇవన్నీ మనుషులు చేసినట్టుగా సాఫ్ట్‌వేర్లు చేయలేవు. 

‣ ఇటువంటి స్కిల్స్‌ అవసరమైన ప్రతి చోటా అభ్యర్థుల అవసరం కచ్చితంగా ఉంటుంది. దీన్ని అలవరుచుకోవడం, ప్రతిదీ కొత్తగా ఆలోచించడానికి, చేయడానికి ప్రయత్నించడం ద్వారా ఏఐతో పోటీలో నెగ్గుకురావొచ్చు. 


నిర్ణయాత్మకశక్తి


ఒక రోబోను ఏదైనా క్లిష్ట పరిస్థితిలో ఉంచి, నిర్ణయం తీసుకోమంటే అది ఏం చేయగలుగుతుంది? ఎటువంటి కెరియర్‌ అయినా సరే నిర్ణయాలు తీసుకునే శక్తి అవసరమయ్యే పోస్టుల్లో మనుషులే ఉండగలరు. సమస్యలను పరిష్కరించడం, సంప్రదింపులు చేసే నేర్పు తదితర నైపుణ్యాలు ఇలాంటి చోట్ల అవసరం అవుతాయి. ‘సిచ్యువేషన్‌ జడ్జిమెంట్, డెసిషన్‌ మేకింగ్‌’ అభ్యర్థులకు ఉండాల్సిన స్కిల్స్‌లో ముఖ్యమైనవి.


ఒకప్పుడు టెలిఫోన్‌లకు ప్రత్యేకంగా ఆపరేటర్లు ఉండేవారు, ఒకరి నుంచి మరొకరికి కాల్‌ వెళ్లాలంటే మధ్యలో వీరే వారధి.. ఇప్పటి తరానికి సినిమాల్లో చూడటం తప్ప ఆ విధానమే తెలియదు! టెక్నాలజీ పెరుగుదలతో కోల్పోయే ఉద్యోగాల గురించి చెప్పాలంటే ఇది మంచి ఉదాహరణ, ముఖ్యంగా ఇటువంటి మార్పుల వేగం కమ్యూనికేషన్‌ రంగంలో మరింత అధికం.


ఏ ఉద్యోగాలు భద్రం?

నిజానికి ఇప్పుడున్న దానికంటే వచ్చే ఐదేళ్లలో ఏఐ మరింత ఎదగనుందని నిపుణుల అంచనా. దీనివల్ల దాదాపుగా అన్ని కెరియర్లూ ఎంతో కొంత ప్రభావానికి గురవుతాయి. ఏ ఒక్కటీ అస్సలు ప్రభావితం కాకుండా ఉంటుందని చెప్పలేం. అయితే కొన్ని ఉద్యోగాలు మిగతావాటితో పోలిస్తే కొంత భద్రంగా ఉంటాయి. సులభంగా ఆటోమేట్‌ చేయడానికి వీలు లేని ఉద్యోగాల్లో ఉన్న వారికి కొంత వరకూ పర్వాలేదు. ఇంటర్‌పర్సనల్‌ స్కిల్స్‌ కలిగి ఉండాల్సిన ఉద్యోగాలకు అధిక భద్రత ఉంటుంది.

ఇప్పుడు మనుషులు చేస్తున్న ఉద్యోగాల్లో దాదాపు నాలుగో వంతు రేపు ఏఐ చేసేయవచ్చని అంచనా. లాజిస్టిక్స్‌ - సప్లై చెయిన్, వ్యవసాయ సంబంధిత కెరియర్లు, లా, రక్షణ రంగం, వైద్యం వంటి వాటిలో కొన్ని విభాగాలు మాత్రం అంత తేలికగా ప్రభావానికి గురికావనేది ఒక వాదన. అంతేకాదు.. నైపుణ్యాలకు మెరుగుపెడితే పోటీలో మరింత ముందంజలో ఉండొచ్చు.


ప్రణాళికాసామర్థ్యం


ఇచ్చిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ప్రణాళిక రచించడం వేరు.. అప్పటికప్పుడు మారిపోయే సందర్భాలకు తగిన విధంగా ప్రణాళికాబద్ధంగా నడుచుకోవడం, బృందాన్ని నడిపించడం కేవలం మనుషులకే సాధ్యమవుతుంది. ప్రణాళిక, వ్యూహాత్మక సామర్థ్యాలు మనుషుల నుంచి ఏఐకు గట్టి పోటీని ఇవ్వగలవు. పరిస్థితులను అంచనా వేయడం, రాబోయే సమస్యలను ముందుగానే పసిగట్టడం, నిరంతరం అప్రమత్తంగా ఉండటం.. ఇవన్నీ సంస్థలు అభ్యర్థుల నుంచి కోరుకునే నైపుణ్యాలు మాత్రమే కాదు, ఏఐ భర్తీ చేయలేని ముఖ్యమైన స్కిల్స్‌ కూడా. వీటిపై దృష్టి సారించిన అభ్యర్థులు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా నష్టపోయే అవకాశాలు తక్కువ.


ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్‌  
 

ఏఐ తెలివైనదే.. కానీ ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్‌ (ఈఐ) దానికి సులభం కాదు, కేవలం మనుషులకే సాధ్యం. ఎదుటివారి ఆలోచనలను, భావోద్వేగాలను, మానసిక పరిస్థితిని అర్థం చేసుకోవడం.. అందుకు తగిన విధంగా ప్రవర్తించడం.. అవసరాన్ని బట్టి ఆదరణ, అభిమానం చూపడం.. ఇవన్నీ దానికి రావు. నిజానికి స్థాయీ భేదం లేకుండా ఏ ఉద్యోగాలకైనా ఇది ఎంతో కొంత అవసరం అవుతూనే ఉంటుంది. ముఖ్యంగా బృందాల్లో పనిచేసినప్పుడు, లేదా వాటిని నడిపిస్తున్నప్పుడు ఈఐ తప్పక ఉండాలి. అందుకే దీన్ని పెంచుకునేందుకు అభ్యర్థులు దృష్టి పెట్టాలి. 


వీటితోపాటు డిజిటల్‌ లిటరసీ, డేటా లిటరసీ, డిజిటల్‌ థ్రెట్‌ అవేర్‌నెస్, క్రిటికల్‌ థింకింగ్‌.. వంటి నైపుణ్యాలు అభివృద్ధి చేసుకోవాలి. 


వేటిపై అధిక ప్రభావం?


అడ్మినిస్ట్రేటివ్, కోడింగ్, కస్టమర్‌ సర్వీస్, లీగల్‌లో కొన్ని విభాగాలు, టీచింగ్, ఫైనాన్స్, గ్రాఫిక్‌ డిజైనర్స్, ఇంజినీరింగ్, హ్యూమన్‌ రిసోర్స్‌ వంటి విభాగాల ఉద్యోగాలు అధికంగా ఆటోమేట్‌ అయ్యే అవకాశం ఉంటుందని మార్కెట్‌ నిపుణుల అంచనా. కేవలం టెక్నికల్‌ స్కిల్స్‌ కలిగి ఉండటం కాకుండా ఉద్యోగం ఎటువంటిదైనా మల్టీస్కిల్డ్‌గా ఉండేందుకు ప్రయత్నించడం ద్వారా కెరియర్లలో స్థిరంగా ఉండొచ్చు.


మరింత సమాచారం... మీ కోసం!

‣ జేఈఈ మెయిన్‌ విజయానికి కీలకాంశాలు

‣ ఒకటే పరీక్ష.. లక్షన్నర కొలువులు!

‣ ఎయిమ్స్‌ సంస్థల్లో 3 వేల ఉద్యోగాలు

‣ స్టేట్‌ బ్యాంకులో 8,773 క్లర్క్‌ కొలువులు

Posted Date: 23-11-2023


 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం