• facebook
  • whatsapp
  • telegram

నోట్సు రాయడం ఎలా ?

ఇటీవల ఒక అధ్యయనంలో తేలిన విషయం ఏమిటంటే రెండు గంటలపాటూ విన్న ఒక లెక్చర్‌ను పూర్తిస్థాయిలో మెదడులోకి ఎక్కించుకోవాలంటే దాన్ని కనీసం ఆరు గంటలపాటూ చదవాల్సి ఉంటుంది. సైన్స్ సబ్జెక్టుల విషయంలో ఇది పూర్తిగా వర్తిస్తుంది. దీనికోసం మనం పూర్తిగా సంసిద్ధులం కావాలి. మనం తరగతి గదిలో సొంతంగా తయారు చేసుకునే నోట్సు ఇందుకు చాలా ఉపయోగపడుతుంది. 

     సూత్రాలూ, భావనలూ, విశ్లేషణలూ ఉన్న సబ్జెక్టులను మరింత సులభంగా అర్థం చేసుకోవాలంటే మనం సొంతంగా నోట్సు తయారు చేసుకోవడం ఉత్తమమైన పద్ధతి. తరగతి గదిలో అధ్యాపకుడు పాఠం బోధిస్తున్న సమయంలోనే నోట్సు రాసుకోవడం ఇంకా మంచిది. అయితే అధ్యాపకుల్లో కొందరు చాలా వేగంగా బోధిస్తూ ఉంటారు. ఎన్నెన్నో క్లిష్టమైన అంశాలపై లెక్చర్లు ఇస్తుంటారు. వాటిని అప్పటికప్పుడు నోట్సులోకి ఎక్కించుకోవడం ఎలా? ఇది తెలుసుకునే ముందు అసలు నోట్సు రాసుకోవడంవల్ల ఉపయోగాలేమిటో తెలుసుకుందాం. 

      నోట్సు రాసుకోవాలంటే ముందుగా అధ్యాపకుడు చెప్పేది శ్రద్ధగా వినాల్సి ఉంటుంది. చెబుతున్న విషయం మనకు ఎంతవరకూ అర్థమయిందనే అంశం కూడా అప్పుడే తెలిసిపోతుంది. 

నోట్సును తిరిగి చదివేటప్పుడు ముఖ్యమైన పాయింట్లు ఏవనే విషయంపై ఒక స్పష్టత వస్తుంది. 

సొంతంగా తయారు చేసుకునే నోట్సులోని విషయాలు ఎక్కువకాలంపాటు గుర్తుంటాయి. 

      పరీక్షల సమయంలో టెక్స్ట్‌బుక్ లేదా వర్క్‌బుక్ లేదా స్టడీ మెటీరియల్ తిరగేస్తే, అంతకుముందు అవన్నీ నోట్సుగా రాసుకున్నవే కాబట్టి, సులభంగా అర్థమవుతాయి. గుర్తుంటాయి.
 

ముఖ్యమైన పాయింట్లను గుర్తించేదెలా?  

      తరగతిగదిలో లెక్చరర్లు, ప్రొఫెసర్లు, శిక్షకులు ఒక పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడు అందులో ముఖ్యమైన పాయింట్ల విషయంలో కొన్ని క్లూలు ఇస్తారు. వాటిని గుర్తించడానికి విద్యార్థి ఎంతో అప్రమత్తంగా ఉండాలి. అలాంటి క్లూలు మచ్చుకు కొన్ని..

బోర్డుపై అధ్యాపకుడు రాసే అంశాలు

బోధన సమయంలో అధ్యాపకుడు ఎక్కువగా రిపీట్ చేసే అంశాలు.

కొన్ని ముఖ్యాంశాలను చెప్పేటప్పుడు టీచర్ గొంతు పెంచడాన్ని లేదా ముఖ కవళికలను బట్టి వాటికున్న ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు.

ఎక్కువ సేపు అధ్యాపకుడు చెప్పే విషయాలు, ఆయనిచ్చే ఉదాహరణలు.

పాఠం మొత్తం పూర్తయ్యాక టీచర్ చెప్పే సమ్మరీ (క్లుప్తంగా పాఠ్యాంశాన్ని తిరిగి చెప్పడం). 

     ఈ క్లూల ద్వారా ముఖ్యమైన పాయింట్లను విద్యార్థి ఇట్టే పసిగట్టవచ్చు. లేదా తరువాత టెక్స్ట్ బుక్ తిరగేసినా ముఖ్యమైన పాయింట్లేవో తెలుస్తుంది. కానీ, ప్రతి పాఠానికీ టెక్స్ట్‌బుకక్ తిరగేయాలంటే ఎక్కువ సమయం తీసుకుంటుంది.
 

నోట్సు తీసుకునే పద్ధతులేమిటి?

      విద్యార్థి తన సొంత శైలిలో నోట్సు రాసుకోవాలి. అప్పుడే అది బాగా గుర్తుంటుంది. చాలావరకూ నోట్సు రాసుకునేటప్పుడు కొన్ని చిట్కాలు పాటించవచ్చు. అవి..

నోట్సు వీలైనంత క్లుప్తంగా ఉండాలి. 

      భాషపై పట్టు ఉంటే పదబంధా(ఫ్రేజ్)లను, పదాలను ఎక్కువగా ఉపయోగించవచ్చు. అంటే, పదబంధం సరిపోయేలా ఉంటే దానికో వాక్యం రాయాల్సిన అవసరం లేదు. పదం సరిపోయేలా ఉంటే దానికి పదబంధం రాయాల్సిన అవసరం లేదు.

అవసరమైన చోట్ల అబ్రివేషన్లు, సింబల్స్ ఉపయోగించాలి. అయితే మనకు బాగా తెలిసిన, గుర్తుండే సింబల్స్‌నే ఉపయోగించాలి.

సాధ్యమైనంతవరకూ మనం రాసుకునే నోట్సు మన సొంత పదాల్లోనే ఉండాలి. మళ్లీ చదివేటప్పుడు అవి మనకు అర్థం కావాలి.

ఫార్ములాలు, నిర్వచనాలు వంటివి మాత్రం కచ్చితంగా పూర్తిగానే ఉండాలి. వాటిని మార్చడం, కుదించడంలాంటివి సరికాదు.
 

రాసుకునేదెలా? 

ప్రధానమైన అంశాలు లేదా పాయింట్లను పేరాగ్రాఫులుగా, అంతగా ప్రాధాన్యం లేని చిన్న పాయింట్లను ఆ పేరాల కింద రాసుకోవాలి. నోట్సు చూడగానే ఏది ప్రధానమైందో, ఏది అప్రధానమైందో తెలుసుకునేలా ఉంటాలి. 

సాధ్యమైనంతవరకూ కొన్ని భావనలను రాసుకోగానే వాటికింద కొంత ఖాళీ వదలడం మంచిది. తరువాత ఇంట్లో టెక్స్ట్‌బుక్ చూసి, ఆ ఖాళీలను భర్తీ చేసుకోవచ్చు. ఇలా చేయడంవల్ల ప్రధానమైన ఉపయోగం ఏమిటంటే, మన వద్ద ఉండే విషయం (కంటెంట్) ఇంకెవరివద్దా ఉండదు. దీన్నే ఎక్స్‌క్లూజివిటీ అంటారు. 

అధ్యాపకుడు వేగంగా బోధించడంవల్ల ఎక్కడైనా కొన్ని పాయింట్లు రాసుకోవడం మిస్ అయితే, వాటిని మళ్లీ రాసుకునేందుకు వీలుగా అక్కడ ఖాళీ వదలాలి.

కొన్ని ముఖ్యమైన టర్మ్స్‌ను, అర్థాలను రాసుకునేందుకు వీలుగా నోట్సులో మార్జిన్‌స్పేస్ వదలడం మంచిది. 

    నోట్సు రాసుకునేముందు పేజీమీద తేదీని, పేజీ నెంబరునూ రాస్తే, రోజూ మనం నోట్స్ ఏమేరకు రాస్తున్నామననే విషయంపై మనకు ఒక స్పష్టత ఉంటుంది.  

Posted Date: 11-09-2020


 

నోట్సు రాయడం ఎలా?

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం