• facebook
  • whatsapp
  • telegram

విద్యానైపుణ్యాలు ఎందుకు?

ఆ రోజు జూనియర్ ఇంటర్ క్లాసంతా సందడిగా ఉంది. అది దసరా సెలవులైన తర్వాత రెండో రోజు. అంతకు ముందు రోజు వాళ్ల క్లాసుకు ఒక కొత్త లెక్చరర్ వచ్చారు. ఆయన పేరు చాణక్య. క్లాసుకు రాగానే వాళ్లందరికీ ఒక సరదా పరీక్షపెట్టారు. చిన్న చిన్న బొమ్మలూ, కూడికలూ తీసివేతలతో ఉన్న ఒక వంద బిట్లు ఉన్న పరీక్షాపత్రం ఇచ్చి దాన్ని అందరితో పూర్తి చేయించారు. దాని మార్కులు ఈ రోజే ఇస్తానన్నారు. విద్యార్థులంతా ఆ పరీక్షగురించే చర్చించుకుంటున్నారు. అయితే ఎవరికి ఫస్టు వస్తుందనే ప్రశ్న ఆ చర్చలో భాగం కాదు. ఎందుకంటే ఆ క్లాసులో ఎప్పుడు ఏ పరీక్ష పెట్టినా గీతకే మొదటి మార్కు వస్తుంది. వాళ్ల చర్చల్లా అసలాయన అలాంటి వింత పరీక్ష ఎందుకు పెట్టారనే.

     ఇంతలో అటెండర్ వచ్చి కొత్త మాస్టారు రావడం కొంచెం ఆలస్యమవుతుందని చెప్పి మార్కుల జాబితా చదవడం ప్రారంభించాడు. ఆ పరీక్షలో చాలామంది అనుకున్నట్లు గీతకు మొదటి మార్కురాలేదు. ఎప్పుడూ పదో ర్యాంకు తర్వాత ఉండే సీతకు అందరికంటే ఎక్కువ మార్కులు రాగా, బాగా మార్కులు వచ్చే చాలామందికి అనుకున్నదానికన్నా చాలా తక్కువ మార్కులు, ర్యాంకులు వచ్చాయి. సీత, గీత స్నేహితురాళ్లు, ఇద్దరికీ చదువంటే మంచి ఆసక్తి ఉంది. సాధ్యమైనన్ని ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని ఇద్దరూ ప్రయత్నిస్తారు. సీత సాధ్యమైనంత త్వరగా మిగిలిన పనులన్నీ ముగించుకొని ఎక్కువసేపు పుస్తకాలతో గడుపుతుంది.

       రాత్రులు కూడా ఎక్కువసేపు చదువుతుంది. గీత మాత్రం అంత ఎక్కువసేపు చదవదు. ముఖ్యంగా రాత్రులు పదిదాటి మెలకువ ఉన్నట్టే కనిపించదు. కానీ విచిత్రమేమిటంటే పరీక్షల్లో సీత కన్నా గీతకే ఎక్కువసార్లు మంచి మార్కులు వస్తాయి. దానితో సీత కన్నా గీత ఎక్కువ తెలివి ఉన్నదనే ఒక విశ్వాసం ఏర్పడిపోయింది. అందుకే వాళ్లు ఈ మార్కులు చూసి నమ్మలేకపోతున్నారు.

      అంతలో లెక్చరర్ చాణక్య క్లాసులోకి అడుగుపెట్టాడు. 'ఫ్రెండ్స్, నిన్నటి పరీక్షను ఐక్యూ టెస్ట్ అంటారు. అంటే ఒక మనిషిలో ఉండే ప్రాథమికమైన తెలివితేటలను కొలిచే పరీక్ష అన్నమాట సాధారణ విద్యార్థులందరికీ ఈ తెలివితేటలు ఒకేలా ఉంటాయి. అంటే ఇలాంటి పరీక్షలో 90 నుంచి 110 మార్కులు వస్తాయి.

       మీ క్లాసులో దాదాపుగా అందరికీ ఇవే మార్కులు వచ్చాయి. ఒకరిద్దరికి నాలుగయిదు తక్కువ వచ్చినా, ఎక్కువ వచ్చినా అదేమంత పెద్ద విషయం కాదు. దానికి అనేక కారణాలు ఉండవచ్చు. మీకు క్లాసు పరీక్షల్లో వస్తున్న మార్కులకీ మీ తెలివితేటలకీ అంత ఎక్కువ సంబంధం లేదని ఈ పరీక్షతో తేలిపోయింది. కానీ కొందరికి ఎంత చదివినా తక్కువ మార్కులు, మరికొందరికి కొద్దిసేపు చదివితేనే మంచి మార్కులు ఎందుకు వస్తున్నాయి? ఎవరైనా సమాధానం చెబుతారా?' ఆయన తన ఉపన్యాసం తాత్కాలికంగా ఆపి విద్యార్థుల వంక చూశాడు.

'కొంతమందికి చదువంటే ఆసక్తి, ఇష్టం తక్కువగా ఉండటం వల్ల' మూడో బెంచీ లోంచి మురళి సమాధానమిచ్చాడు.

'ఇష్టం లేకపోతే ఎక్కువసేపు చదవరు కదా? మనం మాట్లాడుతోంది నిజంగా చదివేవాళ్ల గురించి. చదువుతున్నట్లుగా పుస్తకాలు పట్టుకొని కూర్చుని కాలక్షేపం చేసే వాళ్ల గురించి కాదు'. 'లెక్చరర్ సరిగ్గా చెప్పకపోవడం వల్ల' వెనక బెంచీ నుంచి ఎవరో అరిచారు.

'అప్పుడు అందరికీ తక్కువ మార్కులు రావాలి కదా. సరే నేను ఇంకొన్ని ఉదాహరణలు చెబుతాను. ఒక వడ్రంగి ఒక రోజులో ఒక తలుపు చేస్తే, ఇంకో వడ్రంగి ఒకే రోజులో దాదాపుగా రెండు తలుపులు చేస్తాడు. ఒక దర్జీ మరొక దర్జీకన్నా వేగంగా చొక్కాలు కుడతాడు. వాళ్ల మధ్య తేడాలు ఎందుకు వస్తున్నాయి?'.

 'తక్కువ వేగంతో చేసేవాళ్లకంటే ఎక్కువ వేగంతో చేసే వాళ్లకి ఆ పని చేయడం బాగా వచ్చు కాబట్టి ఈ సారి ఆడపిల్లల రెండోబెంచీలోంచి రమ చెప్పింది.'

గుడ్. మంచి సమాధానం. బాగా రావడమంటే ఏమిటి?'

'టైం వేస్ట్ కాకుండా చేయడం', 'తప్పుల్లేకుండా చేయడం' మగపిల్లల మొదటి బెంచీ నుంచి మోహన్, ఆడపిల్లల మొదటి బెంచీ నుంచి వాణి ఒకేసారి చెప్పారు.

       'గుడ్. రెండూ సరైన సమాధానాలే. నిజానికి రెండూ కలిస్తేనే సరైన సమాధానం. అంటే ప్రతి పనినీ తప్పుల్లేకుండా, వేగంగా చేసే విధానాలు కొన్ని ఉంటాయని మనకు తెలిసినట్లే కదా. నిరంతర ప్రయత్నం ద్వారా ఆ విధానాలను అలవరుచుకోవడమే నైపుణ్యం. ఈ నైపుణ్యాలు నిరంతర ప్రయత్నం, సాధన ద్వారా మెరుగై ఒక తరం నుంచి మరో తరానికి అందుతాయి. అందుకే మనం చాలా పనులు మనముందు తరాల కన్నా వేగంగా పొరపాట్లు లేకుండా చేయగలుగుతున్నాం. ఆటల్లో కూడా గత రికార్డులు తేలికగా బద్దలవుతుండటానికి కారణమదే'

      'ఇంతకీ మనం ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే, అన్ని పనుల్లాగా చదువుకోవడం కూడా ఒక పనే. దానిలో విజయం సాధించడానికి కూడా కొన్ని నైపుణ్యాలు అవసరం. ఈ నైపుణ్యాలు ఎవరైనా నేర్చుకోవచ్చు. వీటిని అనుసరించి పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవచ్చు.

'ఓహో మీరు మార్కులు తెచ్చుకొనే చిట్కాలు చెబుతారన్నమాట?'

     'నేను చెబుతోంది చిట్కాల గురించి కాదు. చిట్కాలను ఇంగ్లిష్‌లో షార్ట్‌కట్స్ అంటారు. నైపుణ్యాలను స్కిల్స్ అంటారు. చిట్కాలు పరీక్ష, పరీక్షకీ; సబ్జెక్టు, సబ్జెక్టుకీ మారతాయి. నైపుణ్యాలు మొత్తం చదువంతటినీ తేలికగా మారుస్తాయి. అన్ని పరీక్షలకీ ఉపయోగపడతాయి. చిట్కాలు తాత్కాలికంగా అపాయం నుంచి బయటపడేందుకు పనికొస్తాయి. నైపుణ్యాలు అసలు అపాయమే రాకుండా చేస్తాయి. ఉదాహరణకు పులుసులో ఉప్పెక్కువ అయితే కాస్త పిండి కలపాలనేది చిట్కా, అసలు ఉప్పు సరిగ్గా ఎలా వేయాలో తెలుసుకోవడమే నైపుణ్యం'.

'ఈ నైపుణ్యాలు నేర్చుకొనేందుకు రోజుకు ఎంత సమయం కేటాయించాలి? ఏమైనా పుస్తకాలు కొనాలా?

      'లేదు. లేదు. వీటికోసం మీరు ప్రత్యేకంగా సమయం కేటాయించాల్సిన పనిలేదు. ఏవో కొత్త పుస్తకాలు కొనాల్సిన పనీలేదు. వివరంగా చెబుతా వినండి. వడ్రంగం పనిలో కలపను కొయ్యడం, చెక్కడం, అతికించడంలాంటి చిన్నచిన్న పనులుంటాయి. దర్జీపనిలో కొలతలు తీసుకోవడం, కత్తిరించడం, వాటిని కలిపి కుట్టడం అనే చిన్నచిన్న పనులుంటాయి. ఈ చిన్న పనులన్నీ బాగా చేస్తేనే ఒకపెద్ద వస్తువు చక్కగా తయారవుతుంది. అలాగే చదువు కూడా వడ్రంగం లాగా, దర్జీపనిలాగా ఒక పనే. దాన్ని బాగా చెయ్యాలంటే కొన్ని చిన్నచిన్న పనులు బాగా చేయడం రావాలి.'

'అవి సరిగ్గా రావడం లేదనే కదా మా బాధ' వెనక బెంచీలోంచి ఎవరో గట్టిగా గొణిగారు.

'నేను చెప్పేది అదే. ఎవరికీ పుట్టుకతోనే ఏదీ రాదు. వడ్రంగమూ రాదు, దర్జీపనీ రాదు, చదువూ రాదు'.

     'చేస్తే వస్తాయి మధ్య బెంచీలలోంచి ఎవరో అందుకున్నారు.' 'కాదు. చేస్తే రావు. అంటే ఎలాగో ఒకలాగు మనకు తోచినట్లు చేస్తే ఏ పనీ రాదు. ఏ పని ఎలా చేయాలో అలా చేస్తేనే వస్తుంది. అలా చేయడం నేర్చుకుంటే వస్తుంది. కొంతమంది ప్రత్యేకించి నేర్చుకోకుండా కొన్ని పనులు చేస్తూ ఉండవచ్చు. అది అదృష్టం తప్ప మరేమీ కాదు. అలాగే మీకు కొన్ని సబ్జెక్టులలో ఎక్కువ మార్కులు వచ్చి ఉండవచ్చు'.

'నైపుణ్యానికీ, అదృష్టానికీ తేడా ఏమిటి?' గీత అడిగింది.

      'మనకు తెలీకుండానే ఒక పనిని బాగా చేస్తే అది అదృష్టం. మనకు ఎందుకు చేయాలో, ఎలా చేయాలో తెలిసి బాగా చేస్తే అది నైపుణ్యం.' అదృష్టంలో మన ప్రమేయం ఉండదు. నైపుణ్యం పనిని పూర్తిగా మన నియంత్రణలో ఉంచుతుంది. పని ఫలితంపై మనకు ఒక స్పష్టత ఉంటుంది.

'చదువు బాగా రావాలంటే ఏ నైపుణ్యాలు కావాలి?'

      'చదువంటే నేర్చుకోవడం. అంటే కొత్త విషయాలూ, వివరాలూ వినీ, చదివీ తెలుసుకుని గుర్తుంచుకోవడం. మళ్లీ అడిగినప్పుడు తగిన విధంగా, తగినంత వేగంగా తప్పులు లేకుండా ఆ వివరాలను తిరిగి చెప్పగలగడం, రాయగలగడం లేదా ఆ వివరాల్లోని జ్ఞానాన్ని ఉపయోగించగలగడం.' అంతే కదా

'ఆ పనులన్నీ మేం రోజూ చేస్తున్నాం కదా? ఇంకా స్టడీ స్కిల్స్ ఏమిటి?' విసుగు ఆశ్చర్యమూ కలిపిన గొంతుతో సీత ప్రశ్నించింది.

      'నిజమే. చేస్తున్నారు కానీ సరిగ్గా అంటే మంచి ఫలితం వచ్చేలా చేయడంలేదు. అంటే చేయాల్సిన పద్ధతిలో చేయడం లేదు. పాఠం ఎలా వింటే బాగా అర్థమవుతుంది? ఎలా చదివితే బాగా గుర్తుంటుంది? నోట్సు ఎలా రాసుకోవాలి? పరీక్షకు ఎలా సన్నద్ధమవ్వాలి? సమయాన్ని ఎలా సర్దుబాటు చేసుకోవాలి? ఏకాగ్రత ఎలా పెంచుకోవాలి? మర్చిపోకుండా ఎలా రివిజన్ చేయాలి? చేతిరాతను ఎలా మెరుగు పరచుకోవాలి? రాసే వేగం ఎలా పెంచుకోవాలి? ఫార్ములాలు, పేర్లు, తేదీలు, సంవత్సరాలు ఎలా గుర్తుంచుకోవాలి? పరీక్షల్లో వందశాతం సమాధానాలు ఎలా రాయాలి?' ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వీటన్నిటినీ స్టడీ స్కిల్స్ అంటున్నారు. ఈ పనులన్నీటికీ నిపుణులు సూచిస్తున్న ఉత్తమ విధానాలున్నాయి. వాటిని అనుసరిస్తే అందరూ మంచి మార్కులు సాధించవచ్చు.

'నిపుణులు ఎవరు? వాళ్లకి ఈ విధానాలు ఎలా తెలుసు? అవి పాటిస్తే మంచి ఫలితాలు వస్తాయని హామీ ఏమిటి?'

      'మీలాంటి విద్యార్థులను అనేక సంవత్సరాలుగా గమనిస్తూ ఎక్కువ మార్కులు తెచ్చుకొనే విద్యార్థికీ, లేని విద్యార్థికీ; చదువులో చురుకుగా ఉండే విద్యార్థికీ లేని విద్యార్థికీ తేడా ఎక్కడ ఉందో గమనించే ఉపాధ్యాయులు చదువుకు సంబంధించిన ఇతర వృత్తులలో ఉన్నవాళ్లూ వీటిని క్రోడీకరించారు. ఇంతకు ముందు ఈ పద్ధతులను అనుసరించి చాలామంది చదువులో, పరీక్షల్లో విజయం సాధించారు కాబట్టి మీరు అదే పద్ధతిలో విజయం సాధించవచ్చు'.

'నాకిప్పుడు మార్కులు బాగానే వస్తున్నాయి కదా. అంటే నేను ఈ విద్యానైపుణ్యాలు నేర్చుకోవాల్సిన పని లేదా?'

      'మంచి మార్కులు రావడం ఒక్కటే కాదు. ఆ మార్కులకోసం ఎంత సేపు చదువుతున్నాం. ఎంత కష్టపడుతున్నాం అనేది కూడా ముఖ్యం కదా. విద్యానైపుణ్యాలు మీరు నేర్చుకుంటే మీరు తక్కువ సమయంలోనే మంచి మార్కులు సాధించడానికి కావాల్సిన చదువు పూర్తి చేయవచ్చు. ఇంకోలా చెప్పాలంటే మీకిష్టమైన ఇతర వ్యాపకాలూ వదులుకోకుండానే ఎక్కువ మార్కులు సాధించవచ్చు. అంటే ఎంజాయ్ చేస్తూ చదవచ్చన్నమాట'

'అయితే సార్ మనం ఎక్కడ నుంచీ మొదలెట్టాలి?' ఉత్సాహంగా అడిగింది సీత.

      'ఆగండి. దేనికీ తొందర పనికిరాదు. ఒక్కరోజులో ఏ మార్పూ సాధ్యం కాదు. నేను ఒక్కో విషయమూ వివరిస్తాను. దాన్ని మనం క్లాసులో చర్చిద్దాం. విడివిడిగానూ, సమష్టిగానూ మన చదువు పద్ధతుల్లో ఏ మార్పులు చేసుకోవాలో నిర్ణయించుకుందాం. ఉదాహరణకి సీతకి మార్కులు పెరగాలంటే ఆమె మార్చుకోవాల్సిన లేదా నేర్చుకోవాల్సిన విషయాలు కొన్ని ఉంటే, గీత మార్చుకోవాల్సిన, నేర్చుకోవాల్సిన విషయాలు వేరే ఉంటాయి. మన క్లాసు మొత్తం మార్చుకోవాల్సిన, అనుసరించాల్సిన పద్ధతులు కొన్ని ఉంటాయి. ఏమంటారు? అర్థమయ్యిందా?'

'అర్థమయ్యింది సార్' క్లాసంతా ఒకేసారి కోరస్‌గా పలికారు.

Posted Date: 11-09-2020


 

ఆవశ్యకత

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం