• facebook
  • whatsapp
  • telegram

Constable Jobs: కష్టపడ్డరు.. కొలువు కొట్టిండ్రు

 

టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ అక్టోబ‌రు 4న విడుదల చేసిన వివిధ విభాగాల కానిస్టేబుల్‌ ఫలితాల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు అభ్యర్థులు సత్తా చాటారు. వారి వివరాలు ఇలా...

పట్టు విడవని దంపతులు
మండలంలోని రావుట్ల గ్రామానికి చెందిన మందముల సుమన్‌, సౌమ్య దంపతులు సివిల్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగం సాధించారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా.. పట్టు విడవకుండ రెండేళ్లు శ్రమించడంతోనే ప్రభుత్వ ఉద్యోగం సాధించడం ఆనందంగా ఉందని తెలిపారు.

సోదరులకు..
మండలంలోని పోత్నూర్‌ గ్రామానికి చెందిన మేకల భరత్‌, మేకల దినేష్‌ సోదరులు టీఎస్‌ఎస్‌పీ, సివిల్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలు సాధించారు. భరత్‌ మూడేళ్లు గల్ఫ్‌లో పనిచేసి ఇక్కడ వచ్చి పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యారు. దినేష్‌ పీజీ చదువుతూనే ఉద్యోగానికి శ్రమించారు. ఒకేసారి అన్నదమ్ములిద్దరు ఉద్యోగాలు సాధించడంతో కుటుంబసభ్యులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

ఒకే ఇంట్లో ముగ్గురికి..
మద్నూర్‌ మండలం శేఖాపూర్‌కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ముళ్లు కానిస్టేబుళ్లుగా ఎంపికయ్యారు. గ్రామానికి చెందిన సురేష్‌ అనిత దంపతులకు ముగ్గురు కొడుకులు సతీష్‌, సచిన్‌, నితిన్‌. ఈ ముగ్గురికి పోలీసు ఉద్యోగాలు వచ్చాయి. ఈ కుటుంబానికి మూడెకరాల వ్యవసాయ భూమి ఉంది. తల్లిదండ్రులిద్దరూ వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. సివిల్‌, ఏఆర్‌ బెటాలియన్‌ విభాగాల్లో ముగ్గురు అన్నదమ్ములు ఎంపికై ఆదర్శంగా నిలిచారు. ముగ్గురు  శేఖాపూర్‌ ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి నుంచి అయిదో తరగతి వరకు చదివారు.  సతీష్‌, సచిన్‌ ఇద్దరు 6 నుంచి పదో తరగతి వరకు మండలంలోని మేనూర్‌ ప్రభుత్వ పాఠశాలో, నితిన్‌ మద్నూర్‌ బాలుర గురుకుల పాఠశాలలో చదువుకున్నారు. ఉద్యోగాలు వచ్చిన విషయం తెలుసుకున్న గ్రామస్థులు, స్థానిక ప్రజా ప్రతినిధులు వారి ఇంటికి వెళ్లి సన్మానించారు.

అన్నదమ్ములకు..
ఎంబీఏ చదివిన ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు పోలీస్‌ కానిస్టేబుల్‌ కొలువులు సాధించారు. రాజంపేట మండలం గుండారం గ్రామానికి చెందిన ర్యాకం శ్రీనివాస్‌ సివిల్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌గా ఎంపిక కాగా.. అతడి తమ్ముడు ర్యాకం సందీప్‌ టీఎస్‌ఎస్‌పీ పోలీస్‌ కానిస్టేబుల్‌ సాధించాడు. వారి తల్లిదండ్రులు పుష్ప- శ్యామయ్య. వీరు వ్యవసాయదారులు. తల్లిదండ్రులకు చేదోడుగా ఉంటూనే మెలకువలు నేర్చుకుంటూ కొలువులు సాధించారీ అన్నదమ్ములు.

వ్యవసాయం చేస్తూనే శ్రమించె..
పల్వంచ మండలం ఆరెపల్లి గ్రామానికి చెందిన ఏలేటి చందు ఇటీవల విడుదలైన పోలీసు నియామక ఫలితాల్లో సివిల్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగం సాధించారు. అతడు తొమ్మిదో తరగతిలో ఉండగా తండ్రి వ్యవసాయానికి చేసిన అప్పుల భారంతో మరణించాడు. అప్పటి నుంచి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఏలేటి చందు సొంతంగానే సన్నద్ధమై కొలువు సాధించాడు. గ్రామస్థులు అతడిని అభినందించారు.

క్రీడా కోటాలో ఉద్యోగం: 14 ఏళ్లు వాలీబాల్‌ ఆడి..
మా నాన్న విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయుడు. తల్లి మహాలక్ష్మి చదువుతోపాటు క్రీడల వైపు ప్రోత్సహించారు. శిక్షకుడు పవన్‌కుమార్‌ వద్ద వాలీబాల్‌లో శిక్షణ తీసుకున్నాను.  14 ఏళ్లుగా ఆడుతున్నాను. పాఠశాలలో సరదాగా ప్రారంభించిన క్రీడ ఉద్యోగం సాధించడానికి ఉపయోగపడడం సంతోషంగా ఉంది. ఎస్సై ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతాను.

పాఠశాల స్థాయి నుంచే..: ప్రకృతి, హాకీ క్రీడాకారిణి, మిర్దపల్లి
పాఠశాల స్థాయి నుంచే శిక్షకుడు పింజ సురేందర్‌ వద్ద హాకీలో శిక్షణ తీసుకున్నాను. జాతీయస్థాయిలో ఒక పతకం, రాష్ట్రస్థాయిలో పదిసార్లు పోటీల్లో పాల్గొన్నాను. అమ్మానాన్న పోశన్న, చిన్నుబాయి వ్యవసాయం చేస్తుంటారు. క్రీడా కోటాలో సివిల్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగం సాధించాను. అమ్మాయిలకు క్రీడల్లో ప్రవేశం ఉంటే ఉద్యోగం, ఉన్నత విద్యకు ఉపయోగపడుతుంది.

ఎస్సై అవుతా..: మల్లెల వెంకటేశ్‌, జక్రాన్‌పల్లి మండలం కలిగోట్‌
ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు నుంచి వలస వచ్చాం. అమ్మానాన్న మల్లెల కొండల్‌రావు, అంకమ్మ మేస్త్రీగా పనిచేస్తుంటారు. జడ్పీహెచ్‌ఎస్‌(కలిగోట్‌)లో 6వ తరగతి చదువుతున్నప్పటి నుంచి శిక్షకుడు మధుసూదన్‌ వద్ద వాలీబాల్‌ శిక్షణ తీసుకున్నాను. యానాంలో రెండేళ్లు శిక్షణ తీసుకున్నాను. నాలుగు జాతీయ స్థాయిలో పాల్గొన్నా. ఎనిమిది రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నాను.. భవిష్యత్తులో ఎస్‌ఐ ఉద్యోగం సాధిస్తాను.  

హోంగార్డు కుమారుడికి..
బిచ్కుంద పోలీస్‌స్టేషన్‌లో మహిళా హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న అనిత కుమారుడు ప్రశాంత్‌  పోలీస్‌ ఉద్యోగం సాధించాడు. అనిత-నగేష్‌ దంపతులకు ముగ్గురు కుమారులు. రెండో కుమారుడైన ప్రశాంత్‌ బీటెక్‌ చదివిన అనంతరం పోలీసు ఉద్యోగానికి సన్నద్ధమయ్యాడు. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో ఏఆర్‌ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. తండ్రి దర్జీ, తల్లిదండ్రుల ఆశయం నెరవేర్చిన ప్రశాంత్‌ను స్థానికులు అభినందించారు.

ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు హాకీ క్రీడాకారులు
మండలంలోని వెంగల్‌పాడ్‌ తండాకు చెందిన లావుడ్యా అరవింద్‌, లావుడ్యా సురేశ్‌ సోదరులు ఎల్లారెడ్డిపల్లి ఉన్నత పాఠశాలలో చదివే సమయంలో హాకీ నేర్చుకొని రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించారు. వీరిద్దరికీ కానిస్టేబుల్‌ ఉద్యోగాలు రావడంతో కుటుంబ సభ్యులు సంతోషించారు.

తాటిపల్లిలో ఐదుగురు మహిళలకు
మండలంలోని తాటిపల్లి గ్రామానికి చెందిన ఐదుగురు అమ్మాయిలు కానిస్టేబుల్‌ ఉద్యోగం సాధించినట్లు సర్పంచి తిరుపతి తెలిపారు. గ్రామానికి చెందిన మలావత్‌ అఖిల, టి.జ్యోతి, ఎం.లావణ్య, ఎం.పూర్ణ, కె.ప్రత్యూషలు ప్రభుత్వ కొలువులు సాధించడంతో మారుమూల గ్రామానికి పేరు వచ్చిందని గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఇంటర్‌తో 7,547 ఎగ్జిక్యూటివ్‌ కానిస్టేబుళ్లు

‣ తీర రక్షక దళంలో అసిస్టెంట్‌ కమాండెంట్లు

‣ ఇంటర్‌తో ఖగోళ పరిశోధన

 

Posted Date: 10-10-2023


 

పోటీ పరీక్షలు

మరిన్ని