• facebook
  • whatsapp
  • telegram

అంతరిక్ష కోర్సులో అద్భుత ప్రతిభ!

అర్థిక అడ్డంకులు దాటి శభాష్‌ అనిపించుకున్న యువతికలలు కనడానికి హద్దులెందుకు?కాలువ జోషితారెడ్డి కూడా అలానే ఆలోచించింది.. అందుకే ఆర్థిక పరిస్థితులు అడ్డొచ్చినా తన అంతరిక్ష లక్ష్యాన్ని నిజం చేసుకుంది. తాజాగా ‘నాసా’ అందించే ప్రతిష్ఠాత్మక ఐఏఎస్‌పీ కోర్సును విజయవంతంగా పూర్తి చేసి శభాష్‌ అనిపించుకుందీ అమ్మాయి..


వ్యోమగామిగా ఆకాశాన్ని తాకాలన్న కల. కానీ ఎటుచూసినా ఆర్థిక ఇబ్బందులు. అయినా తల్లి ఇచ్చిన ధైర్యంతో తన లక్ష్యాన్ని నిజం చేసుకుంది జోషిత. అన్నమయ్య జిల్లా  కలికిరి మండలంలోని కంభంవారిపల్లె జోషితా స్వస్థలం. మోహన్‌బాబు యూనివర్సిటీలో బీటెక్‌ సెకండియర్‌ చదువుతోంది. తల్లి శ్రీలత ప్రైవేటు ఉద్యోగి. చిన్నతనం నుంచీ వ్యోమగామి కావాలన్న తన ఆశయాన్ని నిజం చేసుకొనేందుకు అంతరిక్ష రంగం గురించిన వ్యాసాలు చదివేది. ఇంటర్నెట్‌లో సంబంధిత విషయాలపై అధ్యయనం చేసేది. ఈ నేపథ్యంలోనే ‘నాసా’ అందిస్తున్న ఐఏఎస్‌పీ కోర్సు గురించి తెలుసుకుంది. అంతరిక్ష రంగంవైపు విద్యార్థులను ప్రోత్సహించేందుకు.. అమెరికాలోని ఏరో స్పేస్‌ అండ్‌ రాకెట్‌ సెంటర్‌, నాసా ఆధ్వర్యంలో ఏటా నవంబర్‌లో ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ అండ్‌ స్పేస్‌ ప్రోగ్రాం(ఐఏఎస్‌పీ) నిర్వహిస్తారు. ఎంపికైన విద్యార్థులకు పదిరోజులు వ్యోమగామి శిక్షణ ఇస్తారు.


ప్రపంచవ్యాప్తంగా 50 మందికే ఈ అవకాశం కల్పిస్తారు. ఈ ఏడాది మన దేశం నుంచి నలుగురు ఎంపికైతే వాళ్లలో జోషిత ఒకరు. ‘నాకు చిన్నతనం నుంచీ వ్యోమగామి కావాలని కల. దాన్ని నిజం చేసుకునేందుకే ఐఏఎస్‌పీ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేశా. అన్ని ఇంటర్వ్యూల్లో ఎంపికయ్యా. మా ఇంటి ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో.. రాష్ట్రప్రభుత్వం అందించిన రూ.25 లక్షలతో ఈ శిక్షణ పూర్తిచేసుకున్నా’ అంటోన్న జోషిత నవంబర్‌లో ఐఏఎస్‌పీ శిక్షణను దిగ్విజయంగా పూర్తి చేసుకుని, బెస్ట్‌ ట్రైనర్‌ అవార్డునీ అందుకుంది. ‘కల్పనా చావ్లా, కెనడాకు చెందిన క్రిస్ట్‌హెర్డ్‌ఫీల్డ్ స్ఫూర్తితో నేనూ వ్యోమగామి శిక్షణకు సన్నద్ధమయ్యా. పైలట్‌, స్కూబా డైవింగ్‌, మల్టీయాక్సిస్‌ చైరింగ్‌ అంశాలపై శిక్షణ తీసుకున్నా. ఆ తర్వాత అమెరికా స్పేస్‌ సెంటర్‌లో వ్యోమగాములు, శాస్త్రవేత్తల పర్యవేక్షణలో అంతరిక్ష వర్క్‌షాపుల్లోనూ పాల్గొన్నా. ఇదంతా ప్రాథమిక శిక్షణ మాత్రమే. ఇంకా 1500 అడుగుల లోతులో స్కూబా డైవింగ్‌లో శిక్షణ తీసుకోవాల్సి ఉంది. ఇందుకు పోలెండ్‌ వెళ్లాల్సి ఉంటుంది. ఆ శిక్షణనీ పూర్తిచేయాలని ఉంది. భవిష్యత్తులో ఉచితంగా వృద్ధాశ్రమం పెట్టాలనీ, అంతరిక్ష విద్యపై అవగాహన కల్పించాలని ఉంది’ అంటోంది జోషితారెడ్డి.


- దేవేంద్రరెడ్డి కల్లిపూడి, సూళ్లూరుపేట
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ బాడీ లాంగ్వేజ్ ఎందుకు ముఖ్యం?

‣ ఇగ్నోలో నాన్‌ టీచింగ్‌ కొలువులు

‣ దిద్దుబాటుతో విజయం తథ్యం!

‣ వాయుసేనలో విశిష్ట ఉద్యోగాలు

Posted Date: 09-12-2023


 

ఇత‌రాలు

మరిన్ని