• facebook
  • whatsapp
  • telegram

సాగురంగానికి నీటి కొరత ముప్పు

వాతావరణ మార్పులతో ఆందోళన

ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులు వ్యవసాయ రంగాన్ని కలవరపెడుతున్నాయి. చైనాలో గత ఆరు దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. సాగునీటి కొరత వల్ల హుబై రాష్ట్రంలోనే 1.7 కోట్ల ఎకరాల్లో పంట నష్టం సంభవించడం దుస్థితికి అద్దం పడుతోంది. యాంగ్జే వంటి పెద్ద నది సైతం వర్షాభావంతో ఎండిపోయింది. మరోవైపు వాయవ్య రాష్ట్రం క్వింగ్‌హాయ్‌లో అతివృష్టితో వరదలు పోటెత్తాయి. అమెరికా ప్రభుత్వం మొదటిసారి కొలరాడో నదిలో నీటికొరతను ప్రకటించింది. భారతదేశం ఈ ఏడాది మార్చి నెలలో తీవ్రమైన ఎండలను చవిచూసింది. దీనివల్ల గోధుమ ఉత్పత్తి తగ్గింది. దేశంలోని పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఉన్న చోట్ల కూడా అధికంగా నీరు అవసరమయ్యే వరి, చెరకు వంటి పంటలను సాగుచేస్తున్నట్లు అధ్యయనాల్లో తేలింది. ప్రపంచవ్యాప్తంగా అధిక నీటి వినియోగం వ్యవసాయరంగంలోనే ఉంది. సంప్రదాయ సాగు పద్ధతుల్లో నీటి వృథా ఎక్కువగా ఉంటోంది. మారుతున్న వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటూ- ప్రజల ఆహారభద్రతకు ఆటంకం కలగకుండా చూడాలంటే వ్యవసాయంలో సమగ్ర నీటి యాజమాన్య పద్ధతులను ఆచరించాల్సిన అవసరం ఉంది.

భారత్‌లో ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉండటంతో ఇప్పటి వరకు దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. 143 ప్రధాన రిజర్వాయర్లలో నీటి మట్టాలు ఆశాజనకంగా ఉన్నాయి. పశ్చిమ్‌బెంగాల్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో మాత్రం వర్షపాతం తక్కువగా నమోదైంది. పశ్చిమ్‌ బెంగాల్‌లో జులై, ఆగస్టులో కొన్ని రోజులపాటు నెలకొన్న పొడి వాతావరణం వరి ఉత్పత్తిపై ప్రభావం చూపింది. వాతావరణ మార్పుల దృష్ట్యా భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు వీలుగా వ్యవసాయరంగాన్ని సమాయత్తం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వీటిలో ముఖ్యంగా సాగునీటి వనరులను పొదుపుగా వాడుకునే పద్ధతులవైపు రైతాంగాన్ని మళ్లించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని సూచిస్తున్నారు. భారతదేశం ప్రపంచ జనాభాలో 17శాతం, నీటివనరుల్లో నాలుగు శాతం కలిగి ఉందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దేశంలో నీటిపారుదలకు భూగర్భజలాలపైనే అధికంగా ఆధారపడున్నాం. చైనా, బ్రెజిల్‌తో పోలిస్తే భారత్‌లో రైతులు ధాన్యం ఉత్పత్తికి రెండు నుంచి నాలుగురెట్లు ఎక్కువ నీటిని ఉపయోగిస్తున్నారు. ‘వరల్డ్‌ రిసోర్సెస్‌ ఇన్‌స్టిట్యూట్‌’ నివేదిక ప్రకారం అత్యధిక నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న 17 దేశాల్లో భారత్‌ ఒకటి. నీతి ఆయోగ్‌ 2018 ‘కాంపోజిట్‌ వాటర్‌ మేనేజ్‌మెంట్‌ ఇండెక్స్‌ (సీడబ్ల్యూఎంఐ)’ ప్రకారం నీటికి డిమాండ్‌ 2050 నాటికి సరఫరాను మించిపోతుంది. 2030 నాటికి దేశంలోని 40శాతం ప్రజలకు తాగునీరు అందుబాటులో ఉండకపోవచ్చని వివరించింది. 54శాతం భూగర్భజలాలు క్షీణిస్తున్నాయని నివేదిక స్పష్టం చేసింది. ఇటీవలి అధ్యయనాలు సైతం ఉత్తరభారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా జనసాంద్రత అధికంగా ఉన్నచోట్ల భూగర్భజలాలు క్షీణిస్తున్నాయని వెల్లడించాయి. భూగర్భం నుంచి అధికంగా నీటిని తోడటం, పెరుగుతున్న జనాభా, అటవీ నిర్మూలన వంటి అంశాలు భూగర్భ జలాల తరుగుదలకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. నదులు, చెరువుల్లోని నీటినిసైతం పొదుపుగా వాడాల్సిన అవసరాన్ని ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి.

ప్రస్తుతం భారత్‌లో 90 లక్షల హెక్టార్లలో సూక్ష్మనీటి పారుదల విధానం అమలులో ఉంది. ఇందులో బిందు సేద్యం ద్వారానే  40 లక్షల ఎకరాల్లో పంటలు పండిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఏడు కోట్ల హెక్టార్లలో సూక్ష్మ నీటిపారుదల విధానం అమలు చేయవచ్చని నిపుణులు అంచనా వేశారు. అయితే ఆ లక్ష్యాన్ని సాధించే దిశగా ఇప్పటివరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన చొరవ చూపలేదనే చెప్పాలి. బిందు, తుంపర సేద్యాలను దేశంలో మరింతగా విస్తరించాలి. సూక్ష్మనీటి పారుదల వల్ల వివిధ పంటలకు 21శాతం నుంచి 50శాతం మేర నీరు ఆదా అవుతుంది. నీటి పొదుపు అనే కోణంలో మాత్రమే కాకుండా ఈ విధానాలతో అధిక దిగుబడులను సైతం సాధించవచ్చని ఇప్పటికే రుజువైంది. దేశంలో దాదాపు 80శాతం చిన్న సన్నకారు రైతులే కావడంతో సూక్ష్మ సేద్య విధానాలను ఆచరించడం వారికి భారంగా మారింది. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు రకాల రాయితీలు కల్పిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అవి సరిగ్గా అమలుకావడం లేదు. ప్రభుత్వాలు సూక్ష్మసేద్య విధానాలను రైతులకు అందుబాటులోకి తేవాలి. పారిశ్రామిక, గృహ అవసరాలకు సైతం నీటిని పొదుపుగా వాడే విధంగా ప్రజల్లో అవగాహన కల్పించాలి. ప్రజల భాగస్వామ్యంతోనే ఇది విజయవంతమవుతుంది. వ్యవసాయ రంగానికి, భవిష్యత్తు తరాలకు నీటి వనరులను అందించాలంటే ఉద్యమ స్ఫూర్తితో కార్యాచరణను అమలుపరచాలి.

- డి.ఎస్‌.బాబు
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పదేళ్లకు సరిపోయే పది ఉద్యోగ లక్షణాలు

‣ ఆన్‌లైన్‌ పరీక్షలు రాసేముందు!

‣ ఆహార సంస్థలో అందుకోండి ఉద్యోగాలు!

‣ నీట్‌ కటాఫ్‌ ఎంత?

‣ ఇండియాతో సత్సంబంధాల అభిలాషి!

Posted Date: 14-09-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని