• facebook
  • whatsapp
  • telegram

చట్టం... రైతు చుట్టం కావాలి!

సాగు రంగం వేగంగా మారుతున్న పరిస్థితుల్లో రైతులు మనుగడ సాగించాలంటే వారికి అవసరమైన న్యాయ సేవలు అందాలి. గణనీయస్థాయిలో ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడే మన దేశంలో చట్టాల్ని రైతులకు చేరువ చేయాలి.

తిండి కోసం పంటలు పండించే దశ నుంచి విపణిలో విక్రయించేందుకు సాగుచేసే దశ వరకు- శతాబ్దాలుగా వ్యవసాయ రంగంలో ఎన్నో మార్పులు చోటుచేసుకొన్నాయి. ఆ మార్పులకు తగినట్లుగా వ్యవసాయం సజావుగా సాగేందుకు పలు శాసనాలు, నియమాలు అమలులోకి వచ్చాయి. వ్యవసాయం వ్యాపారీకరణ చట్టాల అవసరాన్ని మరింత పెంచింది. స్వాతంత్య్రం తరవాత రైతుల మేలుకోసం ప్రభుత్వం పలు చట్టాలు చేసింది. ఆర్థిక సరళీకరణ, ప్రపంచ వాణిజ్య ఒప్పందాల కారణంగా గత ముఫ్పై ఏళ్లలో పదుల సంఖ్యలో కొత్త చట్టాలు వచ్చాయి. భూమి, వ్యవసాయం, ఆహారానికి సంబంధించి ఇప్పుడు ఒక్కో రాష్ట్రంలో రెండు వందలకు పైగా చట్టాలు ఉన్నాయి. కేవలం తినడం కోసం పంటలు పండించిన రోజుల్లో చట్టాలతో పెద్దగా అవసరం పడలేదు. భూమి శిస్తు వసూలు చేయడం ఆరంభమైన నాటి నుంచే సాగు శాసనాల అవసరం ఏర్పడింది. అప్పటి నుంచి నిన్నా మొన్నటి భూ సంస్కరణల వరకు లెక్కకు మిక్కిలి భూచట్టాలు అమలులోకి వచ్చాయి. భూమి హక్కుల్లో చిక్కులతో పంట దిగుబడి దెబ్బతింటోంది. రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. వ్యవసాయంలో ఆధునిక పరిజ్ఞానం వినియోగం పెరగడం, హైబ్రీడ్‌, జన్యుమార్పిడి విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల వినియోగం పెరిగినప్పటి నుంచి ఈ అంశాలపై పలు నియమాలు అమలులోకి వచ్చాయి.

అందుబాటులో లేని న్యాయ సేవలు

ప్రపంచ వాణిజ్య ఒప్పందాలు సాగు చట్టాల్లో పెనుమార్పులు తెచ్చాయి. ఆర్థిక సరళీకరణ విధానాలు, సాగులో మేధాసంపత్తి హక్కుల గుర్తింపు లాంటి పరిణామాల వల్ల వచ్చిన చట్టాలు, పంటల బీమా, పంట రుణాలు, మార్కెటింగ్‌, సాగు నీరు, సేంద్రియ సాగు లాంటి అంశాలపై చేసిన చట్టాలను కలుపుకొని ప్రతి రాష్ట్రంలో భూమి చట్టాలు కాకుండా మరో యాభైకి పైగా చట్టాలు అమలులో ఉన్నాయి. భూమి సమస్యలు ఉత్పన్నమైనప్పుడు, నాణ్యతలేని విత్తనాలు ఎరువులు పురుగు మందుల వల్ల నష్టం వాటిల్లినప్పుడు, మార్కెట్‌ మోసాలు జరిగినప్పుడు, పంటల బీమా అందనప్పుడు... ఇలా పలు సందర్భాల్లో చట్టంతో రైతులకు అవసరం ఏర్పడుతుంది. సమస్యల పరిష్కారానికి అధికారులను ఆశ్రయించాల్సి వచ్చినప్పుడు, కోర్టులకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు న్యాయ సేవలను పొందడం అవసరం. కానీ చట్టాలపై అవగాహన లేక, న్యాయ సహాయం అందక రైతులు వారికి మేలు చేసే చట్టాలున్నా లబ్ధి పొందలేక పోతున్నారు. రైతుల న్యాయపరమైన అవసరాలను గుర్తించడంపై మన దేశంలో ఎలాంటి అధ్యయనం జరగలేదు. పాశ్చాత్య దేశాల్లో ఎప్పటికప్పుడు అధ్యయనాలు నిర్వహించి, రైతులకు న్యాయ సేవలు అందించడానికి ప్రత్యేక కృషి చేస్తున్నారు.

పేదలు, మహిళలు, షెడ్యూల్డ్‌ కులాలు, తెగల ప్రజలకు ఉచిత న్యాయ సేవలను అందించేందుకు భారత ప్రభుత్వం 1987లో న్యాయసేవల ప్రాధికార సంస్థల చట్టాన్ని చేసింది. ఈ చట్టం కింద ఏర్పాటైన న్యాయ సేవా ప్రాధికార సంస్థలు వివిధ వర్గాల వారికి ఉచిత న్యాయ సలహాలను, సేవలను అందిస్తున్నాయి. కానీ, ఇందులో సాగు సమస్యల పరిష్కారానికి రైతులకు అందుతున్న సహాయం అంతంత మాత్రమే. భూమి సమస్యలు ఉన్న పేదలకు తగిన న్యాయ సహాయం అందడం లేదని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అప్పటి మంత్రి కోనేరు రంగారావు ఆధ్వర్యంలోని భూ కమిటీ పేర్కొంది. పేదలకు, మహిళలకు, షెడ్యూల్డ్‌ కులాలు, తెగలవారికి ఉచిత న్యాయ సేవలు అందించడానికి న్యాయ సేవా ప్రాధికారసంస్థలు కృషి చేస్తున్నాయి. గడిచిన దశాబ్దకాలంలో పారాలీగల్‌ వలంటీర్లు, న్యాయసహాయ క్లినిక్‌లు తదితర వినూత్న పథకాలతో పేదలకు న్యాయం అందించేందుకు కృషి జరుగుతోంది. ఇప్పుడు రైతుల సమస్యల పరిష్కారానికి తగిన న్యాయ సేవలు అందించడంపై న్యాయ సేవల ప్రాధికార సంస్థలు దృష్టి కేంద్రీకరించాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దశాబ్ద కాలం పాటు పేదల భూసమస్యల పరిష్కారానికి కృషి చేసిన పారాలీగల్‌ పథకం నిలిచిపోయింది. పది లక్షల మంది రైతుల భూమి సమస్యలు తీరేలా చేసిన సుమారు వెయ్యిమంది పారాలీగల్‌ వలంటీర్లు, కమ్యూనిటీ సర్వేయర్లు, న్యాయవాదులకు ఇప్పుడు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు వేరే బాధ్యతలు అప్పగించాయి. దేశవ్యాప్తంగా అమలు చెయ్యాలని భావించిన ఈ పథకం ఆరంభమైన చోటే ఆగిపోయింది. దీన్ని తిరిగి ప్రారంభించాలి. మండలానికి ఒక పారాలీగల్‌ వలంటీర్‌ను నియమించి వారి ద్వారా రైతుల సాగు సమస్యల పరిష్కారానికి న్యాయ సేవలు అందించాలి.

ప్రత్యేక పథకం అవసరం

రైతులకు ఉచిత న్యాయ సేవలు అందించడానికి న్యాయ సేవల ప్రాధికార సంస్థలు ప్రత్యేక పథకాన్ని రూపొందించాలి. గతంలో జాతీయ న్యాయ సేవల ప్రాధికారసంస్థ- గిరిజనులు, పేదలు, బాలలు, వయోవృద్ధులు తదితరుల కోసం పదికి పైగా ప్రత్యేక పథకాలను రూపొందించింది. న్యాయ సేవా ప్రాధికార సంస్థల్లో పారాలీగల్‌ వలంటీర్లుగా పనిచేస్తున్న వారికి సాగు చట్టాలపై ప్రత్యేక శిక్షణ ఇస్తే వారు రైతులకు న్యాయ సేవలు అందిస్తారు. ఈ సంస్థలు నిర్వహించే న్యాయ అవగాహన సదస్సుల్లో సాగు చట్టాల అంశాల్ని చేర్చాలి. న్యాయసహాయ క్లినిక్‌ల తరహాలోనే గ్రామాల్లో వ్యవసాయ న్యాయ క్లినిక్‌లు ఏర్పాటు చెయ్యాలి. న్యాయ కళాశాలల్లో సాగు చట్టాలను బోధన అంశంగా చేర్చాలి. ప్రతి రాష్ట్రంలో వ్యవసాయ చట్టాలపై అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చెయ్యాలి. చట్టాలను రైతుల చుట్టాలుగా తీర్చిదిద్దితేనే వారి ఆదాయానికి గండి పడకుండా నివారించవచ్చు. కర్షకుల హక్కులను కాపాడవచ్చు.

విస్తృత అధ్యయనాలు

వ్యవసాయ రంగంలో రెండు శాతం జనాభా కూడా లేని అమెరికాలో వందేళ్లుగా వ్యవసాయ చట్టాలపై విస్తృత అధ్యయనాలు జరుగుతున్నాయి. న్యాయవిద్యలో వ్యవసాయ చట్టాలపై కోర్సులు నిర్వహిస్తున్నారు. వ్యవసాయ చట్టాలపై మాస్టర్స్‌ డిగ్రీ ఇచ్చే కోర్సు అర్కాన్సస్‌ విశ్వవిద్యాలయంలో ఉంది. బహుశా ప్రపంచంలో ఇది ఏకైక కోర్సు. ఈ వర్సిటీలోనే అక్కడి ప్రభుత్వం సాగు చట్టాల అధ్యయన కేంద్రం, సాగు చట్టాల గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసింది. రైతులకు న్యాయ సేవలు అందించడానికి అమెరికాలో పలు సంస్థలు కృషి చేస్తున్నాయి. ఆఫ్రికా ఖండంలోని పలు దేశాల్లో రైతులకు ఉచిత న్యాయ సేవలు అందించే కృషి జరుగుతోంది.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పర్యావరణ పరిరక్షణ... పుడమికి సంరక్షణ!

‣ పొరుగుపై చైనా దూకుడు

‣ జీ20 అధ్యక్షత... భారత్‌పై గురుతర బాధ్యత!

‣ కశ్మీర్‌పై అమెరికా ద్వంద్వ వైఖరి

Posted Date: 18-11-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని