• facebook
  • whatsapp
  • telegram

రైతుకు తోడ్పాటుతోనే లాభసాటి సాగు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటిలో వ్యవసాయశాఖ ఉంటుంది. రాష్ట్రాలు సాధారణంగా నిధుల కొరత ఎదుర్కొంటుంటాయి. అందువల్ల  అతి కీలకమైన వ్యవసాయ రంగానికి కేంద్రం ఆర్థికసాయం అందిస్తుంది. ఆ నిధుల కేటాయింపులో రాష్ట్రాల వైవిధ్యం, వాటిమధ్య వైరుధ్యాలను గుర్తించడంలేదు. ఎలాంటి మార్పుచేర్పులకు అవకాశం లేకుండా మూస ధోరణిలో ఒకే విధానాన్ని పైనుంచి బలవంతంగా రుద్దడం వల్ల సాగు రంగం ఎన్నో సమస్యలను ఎదుర్కొంటోంది.

పంక్తిలో ఉన్న చివరి వ్యక్తికీ కేంద్ర ప్రభుత్వ సాయం చేరాలంటే- స్థానిక, స్వచ్ఛంద సంస్థలు, సామాజిక వ్యవస్థల భాగస్వామ్యంతో పథకాలు రూపొందాలి. అప్పుడు రాష్ట్రాలన్నీ విడివిడిగా అభివృద్ధి చెంది, కలిసికట్టుగా జాతీయ లక్ష్యాలను చేరడానికి అవకాశం లభిస్తుంది. అయితే, వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై అనేక కేంద్ర మంత్రిత్వ శాఖలు నిర్ణయాలు తీసుకోవాలి. దానివల్ల తీవ్ర కాలయాపన జరుగుతోంది. పత్తి ఎగుమతి చేయాలన్నా, పంచదార దిగుమతి చేసుకోవాలన్నా కనీసం మూడు, నాలుగు శాఖలను సమన్వయపరచాలి. ఏదైనా సత్వరం జరగాలంటే ప్రధాని అధ్యక్షతన ఒక కేబినెట్‌ కమిటీ నిర్ణయాలు తీసుకోవాలి. రాష్ట్ర, జిల్లా స్థాయుల్లోనూ ముఖ్యమంత్రులు, జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన అలాంటి యంత్రాంగాలు ఏర్పడి చురుగ్గా పనిచేయాలి. అందుకోసం కేంద్ర, రాష్ట్ర, జిల్లా స్థాయుల్లో ఇప్పటికే ఉన్న  మేనేజ్‌ (జాతీయ వ్యవసాయ విస్తరణ నిర్వహణ సంస్థ), సమేతి (రాష్ట్ర వ్యవసాయ నిర్వహణ, విస్తరణ శిక్షణ సంస్థ), ఆత్మా (వ్యవసాయ సాంకేతికత నిర్వహణ సంస్థ) వంటివాటి సహకారం తీసుకోవాలి.

అవసరాలకు అనుగుణంగా..

దేశీయంగా సాగు రంగానికి సంబంధించి ఆయా అంశాల్లో ప్రాధాన్యతా క్రమాన్ని నిర్ణయించుకొని క్రమపద్ధతిలో ఒక్కొక్కటీ పరిష్కరిస్తూ వెళ్ళాలి. అంతగా ప్రాధాన్యం లేనివాటి నుంచి దృష్టి పూర్తిగా మరలిపోకుండా చూసుకోవడమూ తప్పనిసరి. అందుకోసం ఎ, బి, సి వంటి క్రమాన్ని అనుసరిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి. ‘ఎ’ కేటగిరీలో పండించిన పంటపై కొద్దిపాటి లాభమైనా రైతుకు దక్కేలా చూడటం వంటి లక్ష్యాలను కచ్చితంగా సాధించాలి. ప్రజలకు ఆహార భద్రత కల్పించాలంటే ప్రకృతి వనరులైన భూమి, నీరు, గాలి కలుషితం కాకుండా చూడాలి. వాటిని పరిరక్షించాలి. రాయితీలు అందించడంలో పారదర్శకత, మొదటి విడత నిధులు సవ్యంగా ఖర్చయిన తరవాత మరో దఫా విడుదల చేయడం వంటి విధానాలు పాటించాలి. యంత్రాల కొనుగోలుకు బ్యాంకు నుంచి రుణం తీసుకున్నప్పుడు కొంత రాయితీ కల్పించాలి. ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్లు నిర్దేశిత వర్గాలు లేదా ప్రాంతాలు లేదా పంటలకు నేరుగా చేరాలి. సాగు రంగంలో పరిశోధన, విస్తరణపైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.  

ఇండియాలో 90శాతం చిన్న, సన్నకారు రైతులే. వీరంతా సమాఖ్యగా ఏర్పడి వృత్తినిపుణుల సేవలు వినియోగించుకుంటే ఖర్చులు ఆదా అవుతాయి. అలాంటి వ్యవస్థ ఏర్పడే వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించాలి. మొదట్లో సహకార వ్యవస్థ, తరవాతి రోజుల్లో స్వయం సహాయక సంఘాలు, ఇటీవల రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (ఎఫ్‌పీఓ)... ఇవన్నీ ఆ దిశగా సాగిన ప్రయత్నాలే. నేను కేంద్ర సర్వీసులో ఉన్నప్పుడు గత అనుభవాల ఆధారంగా పలు సంస్కరణలతో కూడిన ఒక సమగ్ర పథకాన్ని రూపొందించాను. కేంద్రం, రాష్ట్రాలతో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకొని, పాత ఏర్పాట్ల స్థానంలో ఒకేసారి భారీగా నిధులు ఇవ్వాలని ప్రతిపాదించాను. ఇది చాలా ప్రధానమైంది. 1990ల చివర్లో అది పాక్షికంగా అమలై స్థూల నిర్వహణ (మైక్రో మేనేజ్‌మెంట్‌) పథకంగా పేరుపడింది. తరవాతి రోజుల్లో అది కొద్ది మార్పులతో రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన (ఆర్‌కేవీవై), ప్రధానమంత్రి కిసాన్‌ వికాస్‌ యోజన (పీఎంకేవీవై)గా రూపుదిద్దుకొంది. కేంద్రం, రాష్ట్రం సమన్వయంతో ప్రాజెక్టులను రూపొందించే సత్సంప్రదాయానికి అది శ్రీకారం చుట్టింది. ఒక్కో రాష్ట్రం తన బలాబలాలను గుర్తించి అవసరాలకుË అనుగుణంగా వాటిని మార్చుకోవడమూ ప్రారంభమైంది. ఆహారధాన్యాల దిగుబడి, ఉత్పాదకత పెంపు, మహిళా కేంద్రితంగా వ్యవసాయాన్ని మార్చడం, ప్రాకృతిక వనరుల సద్వినియోగం, వ్యవసాయ రీతులు పర్యావరణ హితంగా ఉండేలా చూడడం వంటి జాతీయ లక్ష్యాలనూ చేరాల్సిన అవసరం ఉంది.

సమర్థ వ్యవసాయం

ప్రపంచమంతా స్మార్ట్‌ వ్యవసాయం వైపు పయనిస్తోంది. ఉన్నత సాంకేతికతతో, ఉత్తమ విశ్లేషణా శక్తితో దిగుబడిని పెంచి, కూలీల ఖర్చు తగ్గించి, ఎరువులుË, నీటి వసతి నిర్వహణా సామర్థ్యాన్ని ఇతోధికం చేసి చేపట్టే సాగును సమర్థ (ప్రిసిషన్‌) వ్యవసాయం అంటున్నారు. భారతీయ రైతు ప్రస్తుతం దాని ముంగిట్లో ఉన్నాడు. అన్నదాతకు, విపణికి మధ్య ఉన్న చట్ట, ప్రభుత్వ, నిర్వహణాపరమైన అడ్డంకులను తొలగించాల్సిన అవసరం ఉంది. రైతు ఎదగడానికి తోడ్పడి, వ్యవసాయమంటే కష్టపడి పొట్ట పోసుకునే ఒక వృత్తిగా కాకుండా, లాభసాటి వ్యాపారంగా మార్చగలిగినప్పుడే సాగు రంగంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గర్వంగా తలెత్తుకోగలుగుతాయి. అది జరగకుండా కేవలం జై జవాన్‌-జై కిసాన్‌, రైతే రాజు వంటి నినాదాలను హోరెత్తించడం వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు.  

నిపుణుల సేవలు

వ్యవసాయంలో ప్రపంచవ్యాప్త పరిణామాల ప్రభావం మన దేశ రైతులపైనా పడుతుంది. ఒక కేంద్ర కమిటీ వీటన్నింటినీ గమనిస్తూ ఆ సమాచారాన్ని ఎప్పటికప్పుడు రైతులకు చేరవేయాలి. వాటిలో అవకాశాలను గుర్తించడంతో పాటు రాబోయే ప్రమాదాలకు వారు సిద్ధమయ్యేలా చూడాలి. జాతీయ వ్యవసాయ విస్తరణ నిర్వహణ సంస్థ దేశ విదేశాల్లోని సంస్థలతో నిరంతర సమన్వయం ద్వారా ఆ కమిటీకి సేవలందించే సామర్థ్యాన్ని సంతరించుకోవాలి. ఈ సమాచారాన్ని రైతులు సమర్థంగా వినియోగించుకోవాలంటే నిపుణులు అవసరం. వారికి అవసరమైన సామగ్రినీ సమకూర్చాలి. రైతులు ఒక సమాఖ్యగా ఏర్పడితే ఇలాంటి నిపుణుల జీతభత్యాలు భరించడం తేలికవుతుంది. సమాచార, సాంకేతిక విప్లవం కొత్తపుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లో వ్యవసాయ పట్టభద్రులు, నిపుణులు- మార్కెట్లోకి కొత్తగా అందుబాటులోకి వచ్చిన వ్యవసాయ డ్రోన్లు, వాతావరణ సూచనలు వంటి వాటి గురించి రైతులకు మెరుగైన సమాచారం అందించగలరు. నాణ్యమైన, చవకైన విత్తనాలుË, ఎరువులుË, క్రిమిసంహారాల లభ్యత, పంట ప్రారంభానికి, కుప్పనూర్చడానికి అనువైన సమయం గురించీ తెలియజెప్పగలరు. కొనుగోలుదారులను వెతికి పట్టుకొని మెరుగైన బేరం సైతం కుదర్చగలరు.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఎన్నికల సమరాంగణంలో కన్నడసీమ

‣ మయన్మార్‌లో ఎన్నికల ప్రహసనం

‣ మితిమీరిన రుణం దేశానికే అరిష్టం

‣ ఆధునిక యుగానికి కొత్త డిజిటల్‌ చట్టం

‣ అఫ్గాన్‌ - భారత్‌ చెలిమికి బలిమి

‣ పెచ్చరిల్లుతున్న కార్చిచ్చుల ముప్పు

‣ విపత్తుల సునామీ

Posted Date: 17-04-2023గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని