• facebook
  • whatsapp
  • telegram

అఫ్గాన్‌ - భారత్‌ చెలిమికి బలిమి

అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌ మధ్య సంబంధాలు క్షీణించిన నేపథ్యంలో భారత్‌ వైపు నుంచి వ్యూహాత్మక అడుగులు పడ్డాయి. కాబూల్‌ నుంచి అమెరికా వెళ్ళిపోయాక మానవతా సహాయమనే అత్యుత్తమ విదేశాంగ విధానంతో ఇండియా ముందడుగు వేసింది. వైద్యపరమైన సహాయం, ఆహార ధాన్యాలు అందించడం ద్వారా అఫ్గాన్‌ ప్రజల మనసుల్ని గెలిచే మహత్తర ఎత్తుగడ వేసింది.

ఎన్నో దశాబ్దాలుగా అఫ్గాన్‌తో సుహృద్భావ సంబంధాలు పెంపొందించుకొనేందుకు భారత్‌ దౌత్యపరమైన శక్తియుక్తులతోపాటు, ఆర్థికపరమైన వనరులనూ పెద్దయెత్తునే వెచ్చించింది. తాలిబన్లతో సంబంధాల విషయంలో సరైన అడుగులు పడకపోతే, గత రెండు దశాబ్దాల్లో అఫ్గాన్‌లో భారత్‌ పట్ల ఏర్పడ్డ సద్భావనను కాస్తా నష్టపోయే ప్రమాదముంది. కాబూల్‌ విషయంలో గతం నుంచీ ఇండియా మానవతా సహాయ ప్రదాతగా కొనసాగుతూనే వస్తోంది. ఆహారం, మందులు, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల విషయంలో కాబూల్‌ తీవ్ర కొరతను ఎదుర్కొంటోంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇండియా తాలిబన్‌ ప్రభుత్వ సహాయంతో వ్యూహాత్మక సంబంధాల పునరుద్ధరణకు పునాదులు వేయడం ద్వారా మరింతగా సహాయ సహకారాలు అందించింది. అఫ్గాన్‌కు దూరంగా ఉండటం వల్ల భారత్‌కు ఎలాంటి ప్రయోజనం ఉండదు. తాలిబన్‌ సర్కారుతో క్రియాశీలక సంబంధాల్ని పెంపొందించుకోవడం ద్వారానే, పాక్‌కు ఎడంగా జరిగిన అఫ్గాన్‌ నుంచి ప్రయోజనాలు పొందవచ్చు. ఫలితంగా త్రాసును ఇటువైపు మొగ్గేలా చేసుకోవచ్చు. మానవతా సహాయం కింద అఫ్గాన్‌కు గోధుమల్ని వాఘా సరిహద్దు ద్వారా రవాణా చేస్తామన్న భారత్‌ ప్రతిపాదనను పాకిస్థాన్‌ తిరస్కరించింది. ఇండియా, అఫ్గాన్‌ ట్రక్కులు వేటినీ అనుమతించబోమని తెలిపింది. దీంతో ఇరాన్‌లో భారత్‌ నిర్మించిన చాబహార్‌ ఓడరేవు ద్వారా గోధుమలు పంపింది. భారత వైఖరిని తాలిబన్‌ సర్కారు ఘనంగా కొనియాడింది. అంతకుముందు భారత్‌ 50 టన్నుల మందులు, అయిదు లక్షల డోసుల కొవిడ్‌ టీకాలు, వెచ్చదనాన్నిచ్చే దుస్తులు, 28 టన్నుల విపత్తు నిర్వహణ సామగ్రిని పాకిస్థాన్‌ ద్వారా వాఘా సరిహద్దుల గుండా పంపించిన సంగతి తెలిసిందే.

పెరుగుతున్న ఉద్రిక్తతలు

అఫ్గాన్‌ను తాలిబన్లు 2021 ఆగస్టులో కైవసం చేసుకున్న తరవాత వివాదాస్పద అఫ్గాన్‌-పాక్‌ సరిహద్దుల్లో తరచూ ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. ఈ సరిహద్దు వివాదాల్ని పాక్‌ ఇటీవలి కాలందాకా తక్కువ చేసి చూపుతూ వస్తోంది. కానీ, పాక్‌లోని ఫష్తూన్‌ ప్రాంతంలో అశాంతి వాతావరణం పెచ్చరిల్లి, విస్మరించే స్థాయి దాటిపోయింది. పాకిస్థానీ తాలిబన్లుగా పేర్కొనే తెహ్రీకే తాలిబన్‌ పాకిస్థాన్‌ (టీటీపీ) పాక్‌లోపల ఉగ్రవాద కార్యకలాపాల్ని మరింత తీవ్రతరం చేసింది. ఫలితంగా పాక్‌ రక్షణ బలగాలు టీటీపీ నుంచి ప్రత్యక్ష దాడుల్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. అఫ్గాన్‌లో ఉగ్రవాద సురక్షిత స్థావరాలున్నాయంటూ పాక్‌ ఆరోపణలు గుప్పిస్తోంది.  అఫ్గాన్‌, పాకిస్థానీ తాలిబన్ల మధ్య సంబంధాలు మునుపెన్నడూ లేనంతగా బలపడ్డాయి. ఈ ఉగ్రవాద సంస్థలు పాకిస్థాన్‌ సరిహద్దు వెంబడి కంచె నిర్మించే యత్నాల్ని ఒప్పుకోవడం లేదు. ఒక పాకిస్థాన్‌ మేధాసంస్థ లెక్కల ప్రకారం- అఫ్గాన్‌లో తాలిబన్లు తిరిగి అధికారంలోకి వచ్చిన తరవాత యాభైశాతం దాకా ఉగ్రదాడులు పెరిగాయి. భద్రతా పరిస్థితులు అత్యంత వేగంగా క్షీణిస్తుండటానికి ఇది నిదర్శనంగా నిలుస్తోంది. డబ్బుల కోసం అపహరణలు, బెదిరింపులు తదితర నేరకార్యకలాపాలు ఇటీవలి కాలంలో తీవ్రంగా పెచ్చరిల్లాయి.

మానవతా సాయంతో మనసు గెలిచి..

ప్రపంచ శక్తుల మధ్య ప్రతిష్ఠను పెంపొందించుకోవాలంటే ముందుగా, దక్షిణాసియాలో ప్రభావాన్ని చూపాలని భారత్‌ విశ్వసిస్తోంది. ఈ మేరకు కళలు, సంస్కృతి, సంగీతం, సినిమాలు వంటి సున్నిత అంశాల ద్వారా చాలాకాలంగా ఇండియా తన ప్రభావాన్ని కనబరుస్తూ వస్తోంది. ఇది అఫ్గాన్‌ ప్రజల హృదయాల్ని, విశ్వాసాన్ని గెలిచేందుకు ఉపకరించింది. భారత్‌, అఫ్గాన్‌ సంబంధాలపై పాకిస్థాన్‌ అతిగా ఆందోళన చెందుతోంది. భారతదేశ ప్రభావాన్ని తగ్గించాలని, అఫ్గాన్‌ను తమవైపు తిప్పుకోవాలని పాక్‌ భావిస్తోంది. అయితే, తన సంకుచిత వైఖరి కారణంగా స్వీయ వైఫల్యమే ఎదురవుతోంది. చారిత్రకంగా, సాంస్కృతికంగా, మతపరంగా, జాతిపరంగా, భాషాపరంగా అఫ్గాన్‌తో వాణిజ్య సంబంధాల్లో ఉండే సానుకూలతను తనకు అనుకూలంగా మలచుకోవడంలో పాక్‌ విఫలమైంది. సైనికపరమైన అంశాలపైనే ఆధారపడుతూ తన విదేశీ విధానాన్ని సున్నిత అంశాల ఆధారంగా ఇనుమడింపజేసుకోవడంలో పూర్తిగా విఫలమైంది. పాకిస్థాన్‌ పలు ఉగ్రవాద సంస్థలకు, ఉగ్రవాదులకు అడ్డాగా మారింది. అలాంటి సంస్థలకు అండగా నిలుస్తుండటంతో అంతర్జాతీయంగా పాక్‌ ప్రతిష్ఠ మసకబారింది. ఫలితంగా, అఫ్గాన్‌లో పాక్‌తో పోలిస్తే భారత్‌ ప్రభావానికి, మృదుశక్తికి ఆమోదనీయత, అంగీకారయోగ్యత బాగా పెరిగాయి. కాబూల్‌లో అందరినీ కలుపుకొనిపోయే ప్రభుత్వం ఏర్పడాలని ఇండియా ఆశిస్తోంది. తాలిబన్లు అధికారాన్ని కైవసం చేసుకున్న తరవాత ఇండియా తన రాయబార కార్యాలయం నుంచి అధికారులను ఉపసంహరించుకున్నప్పటికీ మానవతా, సహాయ చర్యలను పర్యవేక్షించేందుకు గత ఏడాది జూన్‌లో ఒక సాంకేతిక బృందాన్ని మోహరించింది. తద్వారా దౌత్యపరమైన ఉనికిని చాటుకొనేలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది.

- నీరజ్‌కుమార్‌ సైబేవార్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పెచ్చరిల్లుతున్న కార్చిచ్చుల ముప్పు

‣ విపత్తుల సునామీ

‣ సవాళ్లు రువ్వుతున్న చైనా విస్తరణవాదం

‣ మాస్కో - బీజింగ్‌ చెట్టపట్టాలు

‣ కడలికి కర్బన చికిత్స

‣ వ్యవసాయం అన్నం పెడుతోందా?

Posted Date: 07-04-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం