• facebook
  • whatsapp
  • telegram

లాభసాటి సేద్యం కోసం..



సాగులో యాంత్రీకరణ ద్వారా చాలా దేశాలు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాయి. భారత్‌ మాత్రం ఈ విషయంలో చాలా వెనకంజలో ఉంది. ఈ క్రమంలో దేశీయంగా వ్యవసాయ యాంత్రీకరణకు మరిన్ని నిధులు అవసరమని పార్లమెంటరీ స్థాయీసంఘం ఇటీవల సూచించింది.


ప్రపంచంలోని అతిపెద్ద వ్యవసాయ ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ ఒకటి. ఇండియా అభివృద్ధికి వ్యవసాయరంగ పురోగతి అత్యంత కీలకం. ఇందుకోసం సాగులో యాంత్రీకరణను పెంచాల్సిన అవసరం ఉంది. దేశీయంగా చిన్న కమతాల కారణంగా సాగులో యంత్రాల వినియోగం సరిగ్గా లేదు. చిన్న సన్నకారు రైతులకు అనుగుణంగా వ్యవసాయంలో యాంత్రీకరణను ప్రోత్సహించడానికి కేంద్రం కృషిచేయాలని పార్లమెంటరీ స్థాయీసంఘం ఇటీవల సిఫార్సు చేసింది. పరిశోధన, అభివృద్ధికి పెట్టుబడులు పెంచాలని కోరింది. యాంత్రీకరణపై ప్రభుత్వ కార్యక్రమాలను మరింత సమర్థంగా అమలు చేయడానికి ప్రతి రాష్ట్రంలో వ్యవసాయ ఇంజినీరింగ్‌ ప్రాధికార సంస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సూచించింది. భవిష్యత్తులో భారత వ్యవసాయ కార్యకలాపాల్లో రోబోలు, కృత్రిమ మేధ(ఏఐ) కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని చెప్పింది.


భారత్‌లోని మొత్తం సాగుదారుల్లో 86శాతం చిన్న సన్నకారు రైతులే. వీరు రెండు హెక్టార్ల కంటే తక్కువ భూమిలోనే వ్యవసాయం చేస్తున్నారు. చిన్న కమతాల్లో వినియోగించేందుకు తగిన యంత్రాలు అందుబాటులో లేకపోతే సాగులో పురోభివృద్ధి ఉండదు. ప్రస్తుతం భారత మొత్తం సాగు రంగంలో యాంత్రీకరణ 47శాతం మేర ఉంది.ఈవిషయంలో అమెరికా(95శాతం), చైనా(60శాతం), బ్రెజిల్‌(75శాతం) మనకంటే ఎంతో ముందంజలో ఉన్నాయి. వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకత సామర్థ్యం మెరుగుపడటానికి యాంత్రీకరణ కీలకం. దేశీయంగా యాంత్రీకరణను 75శాతానికి తీసుకెళ్ళాలంటే, వేగవంతమైన చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులకు అనువైన వ్యవసాయ పరికరాలను ఆవిష్కరించాలి. వారు భారీ పరికరాలను కొనుగోలు చేసే స్థితిలో ఉండరు. చిన్నకమతాల్లో భారీ యంత్రాల వినియోగమూ కష్టమే. భారత్‌లో దాదాపు 55శాతం ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. 1960ల్లో వచ్చిన హరిత విప్లవంతో పంటల ఉత్పాదకత కొంతమేర పెరిగింది. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే అది తక్కువే. ఇండియా కన్నా చైనాలో వ్యవసాయ యోగ్యమైన భూమి తక్కువ. దిగుబడి మాత్రం అధికం. అభివృద్ధి చెందిన దేశాలు సాగు రంగంలో పరిశోధనలు, అభివృద్ధిపై అధికంగా దృష్టి సారిస్తున్నాయి. వ్యవసాయంలో పూర్తి యాంత్రీకరణను అమలు చేస్తున్నాయి. భారత్‌లోనూ ఇటీవలి కాలంలో సాగులో డ్రోన్లు, రోబోల వాడకం ప్రారంభమైంది. వాటిని అన్నదాతలందరికీ చేరువ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ఏటికేడు ఖర్చులు పెరిగిపోవడం, ఆ మేరకు పంటల ద్వారా ఆదాయం రాకపోవడంతో రైతులు నష్టపోవాల్సి వస్తోంది. సాగు లాభసాటిగా మారాలంటే ఖర్చులను తగ్గించాలి. యాంత్రీకరణతోనే ఇది సాధ్యం. దీనికోసం ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో పరిశోధనలను ప్రోత్సహించాలి. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి అన్ని రకాల పంటలకు అనువైన యంత్రాలను ఆవిష్కరించాలి.


సాగులో యాంత్రీకరణను ప్రోత్సహించడానికి కేంద్రం ప్రత్యేక పథకాన్ని అమలుచేస్తోంది. దీని ద్వారా చిన్న సన్నకారు రైతులకు ట్రాక్టర్లు, పంట కోత, వరి నాటు యంత్రాలు తదితరాల కొనుగోలుపై రాయితీలు అందిస్తోంది. వ్యవసాయ యంత్రాల అద్దె కేంద్రాల ఏర్పాటును ప్రోత్సహించడం ఈ పథకం మరో ప్రధాన లక్ష్యం. ఇందులో భాగంగా 2014-15 నుంచి ముప్ఫై ఏడు వేలకు పైగా వ్యవసాయ యంత్రాల అద్దె కేంద్రాలు ఏర్పాటయ్యాయి. గ్రామస్థాయిలో పదిహేడు వేలకు పైగా వ్యవసాయ యంత్రాల బ్యాంకులు కొలువు తీరాయి. ఇక్కడి నుంచి రైతులు తమకు అవసరమైన యంత్రాలను అద్దెకు తీసుకోవచ్చు. వివిధ రాష్ట్రాలు సైతం వ్యవసాయ యాంత్రీకరణకు ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నాయి. అయితే, పెద్ద రైతుల్లో యంత్రాల వినియోగం క్రమేపీ పెరుగుతోంది. పేద రైతులు మాత్రం వాటి వాడకంలో వెనకంజలో ఉన్నారు. వివిధ కారణాలవల్ల ఇటీవలి కాలంలో వ్యవసాయ కూలీల సంఖ్య తగ్గిపోయింది. దాంతో యాంత్రీకరణ అనివార్యంగా మారింది. అభివృద్ధి చెందిన దేశాల్లో మాదిరిగా భారత్‌లోనూ యాంత్రీకరణ విస్తృతమవ్వాలి. ఆయా యంత్రాల వాడకంపై రైతులకు అవగాహన కల్పించడమూ తప్పనిసరి. ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులకు యాంత్రీకరణ మరింతగా చేరువైతేనే దేశీయంగా వ్యవసాయ పురోభివృద్ధి మరింతగా పుంజుకొంటుంది.


- డి.సతీష్‌బాబు
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ మాతృభాషతోనే బలమైన పునాది

‣ వర్చువల్‌ ఇంటర్వ్యూలో విజయం సాధించాలంటే?

‣ విదేశీ భాషలు.. అదనంగా ప్రయోజనాలు

‣ 18 ఎయిమ్స్‌లలో నర్సింగ్‌ ఆఫీసర్లు

‣ పరీక్షల్లో విజయానికి మెలకువలు

Posted Date: 21-08-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం