• facebook
  • whatsapp
  • telegram

‘పసుపు బోర్డు’ పసిడి సిరులు పండిస్తుందా?



ప్రాచీనకాలం నుంచీ భారతదేశం సుగంధ ద్రవ్యాల సాగు, ఉత్పత్తికి ప్రసిద్ధి. దేశ సంస్కృతిలో పసుపుది ప్రత్యేక స్థానం. పసుపు సుగంధద్రవ్యాల్లో అత్యంత ముఖ్యమైన వాణిజ్య పంట. జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుతో పసుపు రైతుల సమస్యలకు మేలైన పరిష్కారాలు లభిస్తాయన్న ఆశలు చిగురిస్తున్నాయి.


ప్రపంచంలో అతిపెద్ద పసుపు ఉత్పత్తిదారు, వినియోగదారు, ఎగుమతిదారు మన దేశమే. ప్రపంచ పసుపు వాణిజ్యంలో భారత్‌ వాటా 62శాతానికి పైగా ఉంది. మనదేశంలో రైతులు ముప్ఫై రకాల పసుపును ఇరవై రాష్ట్రాల్లో సాగుచేస్తున్నారు. ఎక్కువగా మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఇది పండుతోంది. పసుపు సాగులో మహారాష్ట్ర మొదటి స్థానంలో, తెలంగాణ రెండో స్థానంలో ఉన్నాయి. 2022-23లో   3.24లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగుచేయగా, సుమారు 11.61లక్షల టన్నుల పసుపు దిగుబడి వచ్చింది. ఇందులో సుమారు రూ.1728 కోట్ల విలువైన 1.534 లక్షల టన్నుల పసుపు, అనుబంధ ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి అయ్యాయి.


గుర్తుకొచ్చేది.. నిజామాబాద్‌

మన దేశంలో నాణ్యమైన పసుపు పంట పేరు చెప్పగానే గుర్తుకువచ్చేది- తెలంగాణలోని పాత నిజామాబాద్‌ జిల్లా. ఇక్కడి రైతులు దశాబ్దాల తరబడి విస్తృతస్థాయిలో పసుపును సాగుచేస్తూ ప్రత్యేక గుర్తింపు పొందారు. వరంగల్‌, రంగారెడ్డి ప్రాంతాల్లోనూ ఈ పంట సాగవుతోంది. 2022-23లో తెలంగాణవ్యాప్తంగా 1.53లక్షల ఎకరాల్లో పసుపును సాగు చేయగా, 3.40లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. రాష్ట్రంలో దీని వినియోగం సుమారు ఇరవై వేల టన్నులే. మిగిలిన దిగుబడి ఇతర రాష్ట్రాలు, విదేశాలకు వెళుతోంది. కొంతకాలంగా పసుపు సాగును అనేక సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలు, మరోవైపు దుంపకుళ్లు, చీడపీడల ఉద్ధృతి పట్టిపీడిస్తున్నాయి. సాగు ఖర్చులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయాయి. తొమ్మిది నెలలపాటు ఆరుగాలం శ్రమించి సాగుచేసినా దిగుబడులు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. సరైన గిట్టుబాటు ధర లభించక పసుపు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ‘లక్ష్మీ పంట’గా భావించే పసుపు ధర గత పదేళ్లలో గణనీయంగా తగ్గిపోయింది. చాలాసార్లు పెట్టుబడులైనా తిరిగి రావడంలేదు. పసుపు సుగంధద్రవ్యాల విభాగంలో ఉండటంవల్ల కనీస మద్దతు ధరకు భరోసా దక్కడంలేదు. ఫలితంగా గత పదేళ్లలో దీని సాగు 70వేల ఎకరాల మేర తగ్గిపోయింది. మద్దతు ధర లభించకపోవడం పట్ల పసుపు రైతుల్లో ఆగ్రహం గూడుకట్టుకొంది. ఈ విషయమై వారు అనేక రూపాల్లో నిరసన వ్యక్తం చేశారు. దాంతో పసుపు పంటకు మద్దతు ధర, మార్కెటింగ్‌ వసతి, ఎగుమతి అవకాశాల కోసం ప్రత్యేకంగా జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ తెరమీదకు వచ్చింది. 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నిజామాబాద్‌ లోక్‌సభ స్థానానికి 178 మంది రైతులు నామినేషన్లు వేసి దాదాపు లక్ష ఓట్లు సాధించారు! దాంతో పసుపు బోర్డు ఏర్పాటు అంశం ఎంతో ఆసక్తి రేకెత్తించింది.


కేంద్రం రైతుల ప్రయోజనాలు, పరిశోధనలు, గిట్టుబాటు ధర వంటి అంశాలతో పాటు... పసుపు సహా 52 సుగంధ ద్రవ్యాల కోసం 1987లో కొచ్చిలో సుగంధ ద్రవ్యాల బోర్డును ఏర్పాటుచేసింది. అయినప్పటికీ, పసుపు పంటకు తగిన ప్రాధాన్యం దక్కడంలేదని రైతులు వాపోయారు. కాఫీ, తేయాకు, పొగాకు పంటలకు ఉన్నట్లే పసుపు పంటకూ ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలని వారు డిమాండ్‌ చేస్తూ వచ్చారు. నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలంటూ రైతులు ఏళ్ల తరబడి ఉద్యమించారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని ఇటీవల పాలమూరు సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. తదనుగుణంగా కేంద్ర మంత్రిమండలి ఆమోదముద్ర వేయడంతో కేంద్ర వాణిజ్య పరిశ్రమలశాఖ తెలంగాణలో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుకు గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీంతో పసుపు రైతుల దశాబ్దాల కల నెరవేరినట్లయింది. పసుపు, అనుబంధ ఉత్పత్తులపై అవగాహనను, వినియోగాన్ని పెంచడం... మార్కెటింగ్‌, రవాణా, ఎగుమతి అవకాశాలను వృద్ధి చేయడంతోపాటు పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు జాతీయ పసుపు బోర్డు ఇతోధికంగా తోడ్పడుతుంది. అంతర్జాతీయ స్థాయి నాణ్యత, ఆహార భద్రత ప్రమాణాలతో కూడిన పసుపు ఉత్పత్తులను తయారు చేసేందుకూ దోహదపడుతుంది. రైతులు, ఉత్పత్తిదారుల్లో నైపుణ్యాభివృద్ధి, సామర్థ్యం పెంపుదలకు ఈ బోర్డు ప్రత్యేకంగా దృష్టి సారించనుంది.


పటిష్ఠ ప్రణాళికలతోనే..

భారత్‌ నుంచి పసుపు ఎగుమతులు 2030 నాటికి సుమారు రూ.8330 కోట్లకు చేరతాయని అంచనా. పసుపు రైతులు ఏళ్ల తరబడి ఒకే రకమైన విత్తనాలను సాగు చేస్తున్నారు. దుంపకుళ్లు, చీడపీడలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకుని... నాణ్యమైన కర్క్యుమిన్‌ కలిగి, అధిక దిగుబడులను ఇచ్చే కొత్త వంగడాలను అభివృద్ధి చేసుకోవడం ఎంతో అవసరం. ఇటువంటి విత్తులను తక్కువ ధరకే పసుపు రైతులకు అందించాలి. ఆ దిశగా భారత వ్యవసాయ పరిశోధనా మండలి, వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాలను సమన్వయపరచాలి. వాటి సాయంతో వినూత్న పరిశోధన-అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలి. పసుపు దుంపలను తవ్వడం, ఉడకబెట్టడం, ఆరబెట్టడం, కొమ్ములను వేరుచేయడం వంటి ప్రక్రియల్లో ఆధునిక పద్ధతులపై రైతులకు శిక్షణ ఇవ్వాలి. ఒడిశాలోని కందమాల్‌, తమిళనాడులోని ఈరోడ్‌, మహారాష్ట్రలోని సాంగ్లీ రకాలకు భౌగోళికపరమైన గుర్తింపు ఉంది. ఇటువంటి ప్రత్యేక రకాల సాగు పట్ల దృష్టి సారించాలి. పసుపు పంట సమగ్రాభివృద్ధికి, రైతుల శ్రేయస్సుకు పటిష్ఠ ప్రణాళికలను రూపొందించి, చిత్తశుద్ధితో అమలు చేయాలి. అప్పుడే- పసుపు సాగు సిరులు కురిపిస్తుంది. ఆ దిశగా జాతీయ పసుపు బోర్డు ముందడుగు వేయాలని ఆశిద్దాం.


ప్రపంచవ్యాప్త గిరాకీ..

పసుపు దుంపల్లో ‘కర్క్యుమిన్‌’ అనే పదార్థం ఉండటంవల్లే అవి బంగారు వర్ణంలో ఉంటాయి. అంతర్జాతీయ విపణిలో అత్యంత గిరాకీ కలిగిన ఈ తరహా పసుపు తెలంగాణలో ఉత్పత్తి అవుతుంది. దీన్ని సాగుచేస్తే బంగారం పండించినట్లేనని గతంలో రైతులు గొప్పగా చెప్పుకొనేవారు. అందుకు తగ్గట్లే 2011లో తులం బంగారం రూ.16,000 ఉండగా, క్వింటాలు పసుపు కూడా అంతే ధర పలికింది! పసుపు సాగు చేయడానికి ఎకరానికి సుమారు 60 వేల రూపాయల వరకు ఖర్చవుతోంది. సుమారు పదహారు క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. బాగా పండితే దిగుబడి పాతిక క్వింటాళ్ల వరకు ఉంటుంది.


- డాక్టర్‌ జె.సురేష్‌ 

(హైదరాబాద్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆచార్యులు)
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ప్రకృతి రక్షణ.. జీవ వైవిధ్య పరిరక్షణ!

‣ పెద్దనోట్ల రద్దుతో ప్రయోజనమెంత?

‣ అజేయ శక్తిగా భారత వైమానిక దళం

‣ రైతును ప్రేమించిన తపస్వి

Posted Date: 10-10-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం