• facebook
  • whatsapp
  • telegram

సవాళ్లను అధిగమిస్తేనే వరి సిరులుప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు 07-06-2024 నుంచి రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో జరగనుంది. చైనా లాంటి దేశాలతో పోలిస్తే ఇండియాలో వరి ఉత్పాదకత తక్కువగా ఉంది. మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన వంగడాలను రూపొందించుకోవాలి. ప్రభుత్వాలు, పరిశోధనా సంస్థలు దీనిపై దృష్టి సారించాలి. 


దేశ ఆహార భద్రతకు అవసరమైన వరి సాగులో ఉభయ తెలుగు రాష్ట్రాలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. ఇటీవలి కాలంలో వరి సాగు విస్తీర్ణం పెరిగింది. సాగు ఖర్చులను తగ్గించుకోవడం ద్వారా రైతులు నికర ఆదాయాన్ని పెంచుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఉత్పత్తి అవుతున్న ధాన్యంలో దాదాపు సగం మన ఆహార అవసరాలకు సరిపోతుంది. మిగులు బియ్యాన్ని ఇతర దేశాలకు, రాష్ట్రాలకు ఎగుమతి చేయాలి. ఆయా దేశాల్లోని విపణులపై సరైన అధ్యయనం జరిపి అక్కడి వినియోగదారులకు అవసరమైన వరి రకాలను అభివృద్ధిపరచి ఎగుమతులను ప్రోత్సహించాలి. ఈ మేరకు ఖరీఫ్, రబీ సీజన్‌లో వరి ఎంత సాగుచేయాలో నిర్ణయం తీసుకోవాలి. తక్కువ దిగుబడులు నమోదవుతున్న మండలాల్లో వరి సాగును తగ్గించాలి. ఆ భూమిలో పప్పు, చిరుధాన్యాలు సాగు చేయాలి. దానివల్ల పప్పుధాన్యాల కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. నీటిని సైతం ఆదా చేసుకోవచ్చు.


అరకొర యాంత్రీకరణ

తెలుగు రాష్ట్రాల్లో పండుతున్న ధాన్యం 150కి పైగా దేశాలకు ఎగుమతి అవుతోంది. తద్వారా రూ.10వేల కోట్ల నుంచి రూ.12వేల కోట్ల దాకా ఆదాయం సమకూరుతోంది. గత రెండు మూడు దశాబ్దాల్లో చైనాలో వరి ఉత్పత్తి, ఉత్పాదకత రెండూ పెరిగాయి. దానివల్ల వరి విస్తీర్ణం పదిశాతం దాకా తగ్గింది. ఆ భూమిని ఇతర పండ్లతోటల సాగుకు మళ్ళించడం ద్వారా పౌష్టికాహార భద్రతను చైనా సాధించింది. ఇండియా సైతం ఇదే బాటలో సాగాలి. మెరుగైన రకాల సాగు ద్వారా ఇండియాలో వరి ఉత్పత్తిని, ఉత్పాదకతను గణనీయంగా పెంచి, ఆ పంట విస్తీర్ణాన్ని సుమారు పది శాతం అంటే, కోటి ఎకరాలకు తగ్గించే అవకాశం ఉంది. ఈ భూమిని ఇతర పంటలకు లేదా, పండ్ల తోటల సాగుకు బదలాయించుకోవచ్చు. విధానకర్తలు ఈ అంశంపై దృష్టిసారించాలి. వరి సాగు ద్వారా ఉత్పత్తి అవుతున్న మీథేన్‌ లాంటి ప్రమాదకర వాయువులను నిలువరించడం మనముందున్న ప్రధాన కర్తవ్యం. వరిలో నీటి వినియోగాన్ని వీలైనంత మేరకు తగ్గించడం ద్వారా ప్రమాదకర వాయు ఉద్గారాలను కట్టడి చేయవచ్చు. దీనిపై విస్తృత పరిశోధనలకు ప్రభుత్వాలు ఊతమివ్వాలి. 


వినియోగదారుల అవసరాలు ప్రస్తుతం మారిపోతున్నాయి. సన్నబియ్యం రకాల ఆవశ్యకత పెరుగుతోంది. ఆయా రకాలకు పోషకాలు జోడించి అందించాల్సిన అవసరం ఉంది. చైనా, జపాన్, ఫిలిప్పీన్స్, వియత్నాం లాంటి దేశాల్లో వరి సాగులో యాంత్రీకరణ ఎక్కువగా ఉంది. ఇండియాలో కొన్ని రాష్ట్రాల్లోనే యాంత్రీకరణ కనిపిస్తుంది. శ్రామికుల కొరతను అధిగమిస్తూ సాగు ఖర్చును తగ్గించుకోవడానికి వరిలో విస్తృత స్థాయిలో యాంత్రీకరణ అవసరం. ప్రభుత్వాలు దీన్ని అత్యంత ప్రాధాన్య అంశంగా తీసుకొని తగిన నిధులు కేటాయిస్తే యంత్రాలు ఎక్కువగా వినియోగంలోకి వస్తాయి. వరి సాగులో డ్రోన్ల వినియోగం సైతం పెరగాలి. 


ఇటీవలి కాలంలో వ్యవసాయంలో రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగం విపరీతంగా పెరిగింది. దీనివల్ల భూసారం దెబ్బతింటోంది. పంటల్లోకి పురుగుమందుల అవశేషాలు చేరి ప్రజారోగ్యాన్ని కుంగదీస్తున్నాయి. పురుగుమందుల అతి వినియోగం వల్ల తలెత్తే దుష్పరిణామాలపై రైతులకు అవగాహన కల్పించాలి. భూసారాన్ని పరీక్షించి అవసరం మేరకు ఎరువులు ఉపయోగించేలా చూడాలి. ప్రపంచంలో చాలా దేశాల్లో వస్తున్న వరి దిగుబడులు మనవద్ద సాధ్యం కావడం లేదు. దీనికి ప్రధాన కారణం వాతావరణ పరిస్థితులు, తక్కువ సూర్యరశ్మి లభ్యత. దీన్ని అధిగమించడానికి తక్కువ సూర్యరశ్మిలో అధిక దిగుబడి ఇచ్చే వంగడాలను రూపొందించాలి. చీడపీడలను, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొనే వరి వంగడాల సృష్టిపై దృష్టి సారించాలి. కొంతకాలంగా వరి భూముల్లో చౌడు సమస్య పెరుగుతోంది. చౌడును తట్టుకొనే రకాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది.


పరిశోధనలు కీలకం

వరి పరిశోధనలో నిమగ్నమైన దేశీయ, అంతర్జాతీయ సంస్థలు సాంకేతిక పరిజ్ఞానాన్ని పరస్పరం పంచుకోవాలి. వాటి సాయంతో మేలైన రకాల వంగడాల రూపకల్పనతో పాటు మంచి యాజమాన్య పద్ధతులను రూపొందించాలి. ఈ విషయంలో ఆహార భద్రతతో పాటు పోషకాల నాణ్యతకూ అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ఇటీవలి కాలంలో మధుమేహం చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఈ క్రమంలో మధుమేహాన్ని నియంత్రించే ధాన్యం రకాల ఆవశ్యకత పెరుగుతోంది. ఇలాంటి రకాల రూపకల్పన, సాగును పెంచాలి. సంప్రదాయ, అత్యాధునిక బయోటెక్నాలజీ పరిశోధనలను మిళితం చేసుకొని మెరుగైన రకాలను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వాలు దీనికి విస్తృత ప్రోత్సాహం అందించాలి. వ్యవసాయశాఖలతో పాటు అగ్రి వర్సిటీలు వరి సాగు పరంగా ఉన్న సవాళ్లు, అవకాశాలపై సూక్ష్మస్థాయిలో విస్తృతంగా చర్చించాలి. పరిశోధనలకు సమధిక ఆర్థిక వనరులను చేకూర్చడం ద్వారా వరి ఉత్పత్తిని తెలుగు రాష్ట్రాల్లో పెంచవచ్చు. తద్వారా రైతులకు ఆర్థిక ప్రయోజనం కలుగుతుంది.


సాగునీటి ఆదా

వరిలో నీటి వినియోగం పోనుపోను పెరుగుతోంది. వాతావరణ మార్పుల వల్ల భవిష్యత్తులో నీటి కొరత ముమ్మరించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వరి సాగులో నీటి అవసరాన్ని తగ్గించాలి. ప్రస్తుతం ఒక కేజీ బియ్యం ఉత్పత్తికి సుమారు నాలుగు వేల లీటర్ల నుంచి ఆరు వేల లీటర్ల నీరు అవసరమవుతోంది. ఒక కేజీకి రెండు వేల లీటర్ల నీరే అవసరమయ్యే వరి రకాలను రూపొందించడంతో పాటు సరైన యాజమాన్య పద్ధతులను అనుసరించడం ద్వారా గణనీయంగా జలాన్ని ఆదా చేయవచ్చు. ఈ నీటిని పరిశ్రమలకు, ఇతర పంటలకు మళ్ళించవచ్చు. దీనివల్ల భవిష్యత్తులో నీటి కొరతను అధిగమించవచ్చు.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ అందరి కృషితోనే పర్యావరణ పరిరక్షణ

‣ అగ్రరాజ్యం.. మారుతున్న వ్యూహం!

‣ భూగోళానికి వడదెబ్బ!

‣ ఓటరు తీర్పులో ఒదిగిన సందేశం

‣ హిమానీ నదాలు ముంచేస్తాయా?

Posted Date: 10-06-2024గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని