• facebook
  • whatsapp
  • telegram

పశ్చిమాన విపత్తుల కలకలం

అరేబియన్‌ జలధిలో ప్రమాదకర మార్పులు

ప్రకృతి విపత్తుల ముప్పు తక్కువైన దేశ పశ్చిమ తీరంలో కొన్నేళ్లుగా తీవ్రస్థాయి తుపానులు సంభవిస్తున్నాయి. తుపాను నివారణ, సహాయ చర్యలకు అవసరమైన వ్యవస్థాగత ఏర్పాట్లు అంతగా లేకపోవడం, దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన నౌకాశ్రయాలు ఇక్కడే ఎక్కువగా ఉండటంతో అరేబియా సముద్రంలో చోటుచేసుకుంటున్న మార్పులు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఫొని, అంపన్‌లతో పాటు ఇటీవలి తౌతే తుపానులు గుజరాత్‌, మహారాష్ట్ర, గోవా తదితర పశ్చిమ తీర రాష్ట్రాలను అల్లకల్లోలం చేశాయి. గత నెలలో గుజరాత్‌లోని సౌరాష్ట్ర తీరాన్ని తాకిన అతి తీవ్ర తుపాను తౌతే- ఆ రాష్ట్రంతోపాటు కేంద్ర పాలిత ప్రాంతం దివునూ ఓ కుదుపు కుదిపింది. కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్రలపైనా ప్రభావం చూపింది. రెండు లక్షల మందిని నిరాశ్రయులను చేసి దాదాపు 200 ప్రాణాలను హరించింది. 15 వేల కోట్ల రూపాయల ఆస్తినష్టాన్ని మిగిల్చింది. సరిగ్గా ఏడాది క్రితం మహారాష్ట్రపై విరుచుకుపడిన నిసర్గ తుపాను మూడు జిల్లాల్లోనే ఆరు వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తిపాస్తులను గంగపాలు చేసింది. 

ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరం

ప్రచండ గాలులకు చెట్లు, విద్యుత్తు, టెలిఫోన్‌ స్తంభాలు విరిగిపడటం, భారీ వర్షాలతో రహదారులు, వంతెనలు ధ్వంసం కావడం, తీరప్రాంత గ్రామాల్లోని సాగుభూములు కోతకు గురవడం... ఇలా తుపానులు తెచ్చిపెట్టే నష్టాలకు లెక్కే లేదు! వీటి వల్ల ఏటా స్థూలదేశీయోత్పత్తిలో రెండు శాతం, కేంద్ర ప్రభుత్వాదాయంలో 12శాతం నష్టపోవాల్సి వస్తోంది. 1891 నుంచి 2000 సంవత్సరం వరకు తూర్పు తీరంలో 308 తుపానులు సంభవిస్తే పశ్చిమ తీరంలో ఏర్పడినవి 48 మాత్రమే. తూర్పు సంద్రంలో సగటున ఏటా తొమ్మిది తుపానులు ఏర్పడితే పశ్చిమ జలధిలో ఒకటి మాత్రమే సంభవిస్తుండేది. కొన్నేళ్లుగా ఈ పరిస్థితి మారుతోంది. ముఖ్యంగా గత రెండేళ్లలో పశ్చిమ తీరంపై ఏకంగా ఎనిమిది తుపానులు విరుచుకుపడ్డాయి. వీటిలో నిసర్గ, తౌతే రెండూ అతి తీవ్ర తుపాన్లు కావడం గమనార్హం! బంగాళాఖాతం, అరేబియా సంద్రం రెండూ హిందూ మహాసముద్రంలో భాగమే అయినా భౌగోళికంగా వాటి మధ్య ఉన్న తేడాలు ఆయా ప్రాంతాల్లో తుపానుల రాకను ప్రభావితం చేస్తున్నాయి. బంగాళాఖాతం ఉపరితల ఉష్ణోగ్రత సాధారణంగా 29 నుంచి 31 డిగ్రీల వరకు ఉంటుంది. ఫలితంగా తూర్పుతీరంలో తరచుగా తుపానులు సంభవిస్తుంటాయి. అరేబియా సముద్రం ఒకప్పుడు చల్లగా ఉండేది. దాని ఉపరితల ఉష్ణోగ్రత గత కొన్నేళ్లుగా పెరుగుతూ ఇప్పుడు 29 డిగ్రీలకు చేరింది. పశ్చిమతీరంలో తుపానుల తీవ్రత అధికం కావడానికి ఇదే ప్రధాన కారణం. అడవుల నరికివేత, పారిశ్రామిక వ్యర్థాల వల్ల ఏర్పడే కర్బన ఉద్గారాలను సముద్రాలు శోషించుకోవడం వల్ల వాటి ఉపరితల ఉష్ణోగ్రతతో పాటు సముద్ర మట్టాలూ పెరిగి తుపానులు, సునామీల వంటి విపత్తులకు కారణమవుతున్నాయని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మరోవైపు, దేశంలోని 13 ప్రధాన నౌకాశ్రయాల్లో ఆరు పశ్చిమ తీరంలోనే ఉన్నాయి. మహారాష్ట్రలోని ముంబయి, నావా షీవా నౌకాశ్రయాలు, కాండ్లా (గుజరాత్‌), మోర్ముగోవా (గోవా), న్యూ మంగళూరు (కర్ణాటక), కొచ్చి (కేరళ) రేవులు దేశ ఆర్థిక వ్యవస్థకు చాలా కీలకమైనవి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో మన దేశం నుంచి విదేశాలకు సరకు ఎగుమతిలో ఈ ఆరు నౌకాశ్రయాల వాటా 49 శాతం కావడమే ఇందుకు నిదర్శనం. పారిశ్రామికపరంగానూ అత్యంత కీలక రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌ తుపానుల బారిన పడితే ఉత్పాదకత నెమ్మదించే ప్రమాదమూ ఉంది. 

సన్నద్ధత కీలకం

పశ్చిమ తీరం తరచూ తుపానుల ప్రభావానికి లోనవుతున్న నేపథ్యంలో ద్విముఖ వ్యూహాన్ని అనుసరించాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. అరేబియా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతను తగ్గించేందుకు పశ్చిమ తీర రాష్ట్రాల్లో సామాజిక వనాల పెంపకం, పారిశ్రామిక వ్యర్థాలను సముద్రంలోకి విడిచిపెట్టే చర్యల నియంత్రణ వంటి వాటిని తక్షణం చేపట్టాలి. తుపాను సహాయ, పునరావాసాలకు అవసరమైన మౌలిక వసతులనూ యుద్ధప్రాతిపదికన నిర్మించాలి. 1999లో భీకర తుపానుతో ఒడిశా చిగురుటాకులా వణికిపోయింది. తర్వాత ఆ రాష్ట్రం సహాయ, పునరావాస చర్యలపై దృష్టి సారించింది. పటిష్ఠ తుపాను షెల్టర్లు నిర్మించింది. గ్రామస్థాయి నుంచి వాలంటీర్లను ఏర్పాటు చేసుకుంది. అత్యవసర వేళ బాధితుల ఆకలి తీర్చేందుకు రేషన్‌ కిట్లను సదా సిద్ధంగా ఉంచుతోంది. ఇదే స్థాయిలో పశ్చిమ తీర ప్రాంత రాష్ట్రాలూ విపత్తులను ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావాలి. జాతీయ తుపాను ప్రమాద తీవ్రత తగ్గింపు కార్యక్రమం (ఎన్‌సీఆర్‌ఎంపీ) రెండో దశలో భాగంగా సముద్ర తీరప్రాంతాల్లో ఆస్తినష్టాన్ని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం 2015లో గుజరాత్‌, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళల్లో ప్రారంభించిన పనులు ఇప్పటికీ కొలిక్కి రాలేదు. వీటిని సత్వరం పూర్తిచేసి, అరేబియన్‌ సంద్రంలో జరుగుతున్న మార్పులను ఎప్పటికప్పుడు పసిగడుతూ ఆమేరకు అవసరమైన చర్యలను తీసుకుంటేనే పశ్చిమ తీరాన్ని కాచుకోగలం! 

- శ్యాంప్రసాద్‌ ముఖర్జీ కొండవీటి
 

Posted Date: 22-06-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం