• facebook
  • whatsapp
  • telegram

మద్దతుకు భరోసా.. రైతుకు దిలాసా!



వ్యవసాయం ప్రత్యక్షంగా, పరోక్షంగా దేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుగొమ్మ. కనీస మద్దతు ధరలకు (ఎంఎస్‌పీ) చట్టబద్ధత కల్పించాలనేది రైతుల డిమాండు. చట్టబద్ధతకు బదులుగా- పప్పుధాన్యాలు, మొక్కజొన్న, పత్తి వంటి వ్యవసాయ ఉత్పత్తులను మద్దతు ధరతో అయిదేళ్లపాటు ఒప్పంద పద్ధతిలో కొంటామని ప్రభుత్వం చెబుతోంది.


భారత్‌ 1960ల్లో తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొంది. 1965లో వచ్చిన పాకిస్థాన్‌ యుద్ధం పరిస్థితిని మరింత దిగజార్చింది. అయితే ఆ గడ్డుకాలాన్ని దేశం త్వరగానే అధిగమించింది. వ్యవసాయ శాస్త్రవేత్తలైన నార్మన్‌ బోర్లాగ్‌, ఎం.ఎస్‌.స్వామినాథన్‌ల కృషితో రూపొందించిన అధిక దిగుబడులిచ్చే గోధుమ, వరి వంగడాలు... నీటిపారుదల, రసాయన ఎరువులు, వ్యవసాయంలోని ప్రగతిశీల మార్పులను అందిపుచ్చుకొనే రైతుల తోడ్పాటుతో దేశంలో హరిత విప్లవం సాకారమైంది. ప్రజలకు ఆహార భద్రత కల్పించేందుకు వీలుగా గోధుమలు, బియ్యం కొనుగోలు చేసి, నిల్వ చేసి, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేయడానికి భారత ఆహార సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా రైతుల నుంచి బియ్యం, గోధుమలు సేకరించడానికి వీలుగా రూపొందించినదే కనీస మద్దతు ధర. మద్దతు ధరతో ప్రభుత్వ సేకరణ ద్వారా ధాన్యం, గోధుమలు పండించే రైతులకు ఆర్థికంగా భరోసా కలిగింది. ప్రజాపంపిణీ వ్యవస్థ సరఫరా చేసే ధాన్యాలు ప్రజలకు ఆహార భద్రత కల్పించాయి. ఏటా మద్దతు ధరలను 22 లేదా 23 వ్యవసాయ ఉత్పత్తులకు ప్రకటిస్తున్నారు. ప్రధానంగా కేవలం రెండు రకాల ఆహార ధాన్యాలనే అధికంగా, మిగతా పంటలను అతి తక్కువగా సేకరిస్తుండటంతో, వాటిని పండించే రైతులకు ఆర్థిక భద్రత కొరవడుతోంది.


ఆదాయాల పెంపు

రైతుల ఆదాయాలు పెంచడానికి గత రెండు దశాబ్దాల్లో రెండుసార్లు ప్రయత్నాలు జరిగాయి. 2004లో ఎంఎస్‌ స్వామినాథన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘జాతీయ రైతు కమిషన్‌’ కర్షకుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి 2004-06 మధ్య అయిదు నివేదికలు సమర్పించింది. ఆ నివేదికల్లో భూసంస్కరణలు, నీటిపారుదల, వ్యవసాయ రంగ ఉత్పత్తి సామర్థ్యం, రైతులకు రుణ సదుపాయాలు, పంటలకు బీమా, ప్రజలకు ఆహార భద్రత, రైతుల ఆత్మహత్యల నివారణ, వ్యవసాయ కమతాల్లో పోటీతత్వం వంటి అంశాలపై పలు సిఫారసులు చేసింది. వీటితోపాటు వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర నిర్ణయించడానికి సీ2+50 శాతం సూత్రాన్ని ప్రతిపాదించింది. దీని ప్రకారం సాగుకయ్యే అన్ని ఖర్చులను (రైతుశ్రమ, భూమి అద్దెతో పాటు) అంచనా వేసి, దానికి 50శాతం కలిపితే రైతుకు గిట్టుబాటు ధర వస్తుందని, దానినే మద్దతు ధరగా నిర్ణయించాలని సిఫార్సు చేసింది. అయితే ప్రభుత్వాలు స్వామినాథన్‌ కమిషన్‌ సూచనలను, సిఫార్సులను అరకొరగానే అమలు చేశాయి. మద్దతు ధర నిర్ణయించడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్‌’ మద్దతు ధరలు నిర్ణయించడంలో సీ2+50శాతం సూత్రాన్ని అనుసరించడం లేదు.


రైతుల ఆర్థిక స్థితిగతుల్ని మెరుగుపరచడానికి రెండో ప్రయత్నం 2016లో జరిగింది. ఆ ఏడాది- ప్రభుత్వం, రైతుల ఆదాయాలు 2022కల్లా రెట్టింపు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం అంతర మంత్రిత్వ శాఖల కమిటీని నియమించింది. ఈ కమిటీ రైతుల ఆదాయాలు రెట్టింపు చేయడానికి స్వామినాథన్‌ కమిషన్‌ తరహాలో అనేక సూచనలు చేసింది. వాటిలో వ్యవసాయోత్పత్తులకు నిజమైన ధరలు (గిట్టుబాటు ధరలు) దక్కేలా చూడటం కూడా ఒకటి. అయితే ఈ కమిటీ నివేదికసైతం పెద్దగా అమలుకు నోచుకోలేదు. 2022 నాటికి రైతుల ఆదాయాలు రెట్టింపు కాలేదు. ప్రత్యామ్నాయం అన్నట్లుగా- ప్రభుత్వం రైతుల సంక్షేమానికి, ప్రధానమంత్రి కిసాన్‌ పథకం, పంటల బీమా వంటి పథకాలు ప్రవేశపెట్టింది. ప్రభుత్వం ధాన్యం, గోధుమల్ని మాత్రమే ప్రధానంగా సేకరిస్తోంది. మిగతా ఉత్పత్తులను దాదాపు పూర్తిగా ప్రైవేటు వ్యాపారులే కొనడం వల్ల మద్దతు ధరలతో సంబంధమే ఉండటంలేదు. ధాన్యం, గోధుమల్లో సైతం మొత్తం ఉత్పత్తిలో 32 శాతం నుంచి 37శాతమే ప్రభుత్వం సేకరిస్తోంది. చట్టబద్ధత లేకపోవడంతో మద్దతు ధర కల్పించాలని ప్రైవేటు వ్యాపారులను ప్రభుత్వమూ ఆదేశించలేదు. ధాన్యం, గోధుమలు తప్ప, మిగిలిన వ్యవసాయ ఉత్పత్తులకు ప్రభుత్వం ప్రకటించే మద్దతు ధరలు పెద్ద ప్రహసనంగా మిగిలిపోతున్నాయి. మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తే- ప్రైవేటు వ్యాపారులు కొనకపోతే, ప్రభుత్వమే కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఇందుకు ప్రభుత్వం ఏటా భారీయెత్తున ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కొనుగోలు చేసిన ఉత్పత్తుల్ని నిల్వ చేయడానికి సరిపడా గోదాములు, శీతల గిడ్డంగులు ఏర్పాటు చేసుకోవాలి. అందుకే ప్రభుత్వం ఈ విషయంలో వెనకడుగు వేస్తోంది. ప్రధానంగా రెండు రకాల వ్యవసాయ ఉత్పత్తులనే ప్రభుత్వం సేకరిస్తుండటంతో, వాటినే సాగు చేయడానికి రైతులు మొగ్గుచూపుతున్నారు. మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేసేవారు లేక పప్పులు, నూనెగింజల వంటి ఇతర పంటల సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది. వినియోగదారుల అవసరాలు తీర్చడానికి, పెద్దయెత్తున విదేశ మారకద్రవ్యం వెచ్చించి దిగుమతి చేసుకోవలసి వస్తోంది.


ఆర్థిక భద్రత

ప్రభుత్వం అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు చట్టబద్ధత కల్పించి, ధరల స్థిరీకరణకు అవసరమైన మేరకు ప్రతి పంట కొనుగోలుకు మార్కెట్‌ జోక్యం విధానాన్ని అమలు చేస్తే, రైతులకు ధరలపై భరోసా ఏర్పడి అన్ని రకాల పంటలూ వేయడానికి ముందుకొస్తారు. భారత పత్తి సంస్థ ఇప్పటికే మార్కెట్‌ జోక్యం ద్వారా పత్తి ధరలను స్థిరీకరిస్తోంది. మిగతా పంటల విషయంలో సైతం ప్రభుత్వం అటువంటి సంస్థలు ఏర్పాటు చేసి మార్కెట్‌ జోక్యానికి చర్యలు తీసుకోవాలి. అప్పుడే, రైతులు వరి, గోధుమ పంటల సాగు తగ్గించి, మిగతా పంటలపై దృష్టి సారించే అవకాశం ఉంటుంది. రైతులు తమ ఆదాయాలకు రక్షణ కల్పించి, రుణ విముక్తులను చేయాలని ఆశిస్తున్నారు. దేశ ప్రజలకు ఆహార భద్రత కల్పిస్తున్న రైతులకు ఆర్థిక భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. రైతులు, రైతు కూలీల సంక్షేమానికి మరిన్ని చర్యలు తీసుకోవాలి. రైతుల ఆత్మహత్యల్ని నివారించాలి. ప్రభుత్వ చిత్తశుద్ధితోనే అన్నదాత పరిస్థితి మెరుగుపడుతుంది.


సాగు వ్యయం తగ్గితేనే..

ఆదాయాలు మెరుగుపడక పోవడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆర్థిక సంస్కరణల తరవాత విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, యంత్ర పరికరాలు వంటివన్నీ ప్రైవేటు వ్యక్తులు, సంస్థల చేతుల్లో చిక్కాయి. వీటి వ్యయాలు ఏటా పెరుగుతున్నాయి. నకిలీ విత్తనాలు, పురుగు మందులు,ఎరువుల వినియోగంతో సాగు ఖర్చులు పెరిగిపోయాయి. ప్రభుత్వం సబ్సిడీ ధరలకు ఎరువులను అందించడం తప్ప, సాగు ఖర్చులు తగ్గించే విధానాన్ని రూపొందించలేదు. ఆదాయాలు పెరిగి అప్పుల బారిన పడకుండా ఉండాలంటే సాగు ఖర్చు తగ్గాలి, దిగుబడులకు మంచిధర దక్కాలి.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ స్వేచ్ఛా వాణిజ్యంలో మరో ముందడుగు

‣ స్వల్ప వ్యయం సత్వర న్యాయం

‣ సాయుధ సంపత్తిలో స్వయం సమృద్ధి

‣ సేద్య సంక్షోభానికి ఎరువు

Posted Date: 27-03-2024



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం