• facebook
  • whatsapp
  • telegram

గాలి నాణ్యతకు హరిత ఇంధనం



మానవ చర్యల వల్ల వాయు కాలుష్యం అంతకంతకు పెచ్చుమీరుతోంది. ప్రపంచవ్యాప్తంగా అనేక నగరాలు, పట్టణాలు కాలుష్య కోరల్లో చిక్కుకొంటున్నాయి. ఒక్క వాయు కాలుష్యం కారణంగానే ఏటా సుమారు 67లక్షల మంది మృత్యువాత పడుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.


భారత్‌లో వాయు కాలుష్యం కోరలు చాస్తోంది. 2022లో వాయు నాణ్యత అత్యంత తక్కువగా ఉన్న 131 దేశాల్లో భారత్‌ ఎనిమిదో స్థానంలో నిలిచినట్లు స్వీడన్‌కు చెందిన ఐక్యూఎయిర్‌ సంస్థ వెల్లడించింది. దేశ ప్రజలు స్వచ్ఛమైన గాలికి నోచుకోలేక పోతున్నారని, వాయు కాలుష్యం ఏటా సుమారు 20లక్షల మందిని పొట్టనపెట్టుకుంటోందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరాల్లో ఒకటిగా దేశ రాజధాని దిల్లీ నిలుస్తోంది. కలుషిత గాలిని పీలుస్తుండటం వల్ల హస్తినవాసుల జీవితకాలం సగటున 11.9 ఏళ్లు తరిగిపోతున్నట్లు షికాగోలోని ‘ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్‌’ లెక్కగట్టింది. హైదరాబాద్‌, అహ్మదాబాద్‌, బెంగళూరు, ముంబయి, పుణె, చెన్నై, కోల్‌కతా వంటి నగరాల్లోనూ వాయు నాణ్యత నానాటికీ తీసికట్టుగా మారుతోంది.


ధూళి కణాల వల్ల..

పారిశ్రామిక, వాణిజ్య కార్యకలాపాలకు తోడు వాహనాలు, భారీ నిర్మాణ కార్యకలాపాలు, పంట వ్యర్థాలను తగులబెట్టడం మూలంగా వాయు కాలుష్యం చోటుచేసుకుంటోంది. ముఖ్యంగా సూక్ష్మ ధూళి కణాలు (పీఎం 2.5), చిన్నస్థాయి ధూళి కణాలు (పీఎం 10), సల్ఫర్‌ డైఆక్సైడ్‌, కార్బన్‌ మోనాక్సైడ్‌, నైట్రోజన్‌ డైఆక్సైడ్‌ స్థాయులు పెరగడం ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సూక్ష్మస్థాయి ధూళి కణాలు మనం పీల్చే గాలి ద్వారా శరీరంలోకి చేరి ఊపిరితిత్తులు, గుండె, మూత్రపిండాలను దెబ్బతీస్తాయి. మానసిక సమస్యలనూ తెచ్చిపెడతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రమాణాల ప్రకారం- ఏ ప్రాంతంలోనైనా ఘనపు మీటరు పరిమాణంలో పీఎం 2.5 ధూళి కణాలు అయిదు మైక్రోగ్రాములు మించకూడదు. అదే పీఎం 10 కణాలైతే 15 మైక్రోగ్రాములు దాటకూడదు. ఈ రెండు స్థాయులను కలిపి గాలి నాణ్యత (ఏక్యూఐ)ను లెక్కిస్తారు. దిల్లీ, చండీగఢ్‌, హరియాణా, పంజాబ్‌, మహారాష్ట్ర, త్రిపుర, పశ్చిమ్‌ బెంగాల్‌ వంటి చోట్ల ఏక్యూఐ వంద మైక్రో గ్రాములు మించిపోతుండటం ఆందోళనకరం. దేశంలో రోజూ పెద్ద సంఖ్యలో కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. వీటిలో పెట్రోలు, డీజిల్‌ను వినియోగిస్తుండటంతో వాయు కాలుష్యం పెరుగుతోంది. బొగ్గు ఉత్పత్తి, థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు, పారిశ్రామిక కార్యకలాపాలు సైతం వాయు నాణ్యతను దెబ్బతీస్తున్నాయి. మరోవైపు రైతులు పంట వ్యర్థాలను తగులబెడుతున్నారు. ఇటువంటి చర్యలవల్ల సల్ఫర్‌ డైఆక్సైడ్‌, నైట్రోజన్‌ ఆక్సైడ్‌ తదితర వాయువులు కలగలిసి గాలిలో ఒక చోటు నుంచి మరో చోటుకు ప్రయాణిస్తున్నాయి. తద్వారా అనేక ప్రాంతాలు కాలుష్యం బారిన పడుతున్నాయి.


ప్రపంచవ్యాప్తంగా గాలిలో పీఎం 2.5 ధూళి కణాలు హెచ్చుస్థాయిలో ఉండటంవల్ల గడచిన రెండు దశాబ్దాల్లో ఏటా సగటున 10లక్షల మందికి పైగా మృత్యువాతపడ్డారని ఆస్ట్రేలియాకు చెందిన మోనాష్‌ విశ్వవిద్యాలయ పరిశోధన తేల్చింది. ఇందులో 65శాతం మరణాలు ఆసియా ప్రాంతంలో చోటుచేసుకోగా, అత్యధికంగా అవి దిల్లీలోనే సంభవించాయని పరిశోధకులు నిర్ధారించారు. లాన్సెట్‌ ప్లానెటరీ హెల్త్‌ జర్నల్‌ ఈ వివరాలను ప్రచురించింది. శరీరంలోకి చేరే సూక్ష్మ ధూళి కణాలు నేరుగా రక్తంలో కలిసిపోతాయి. అక్కడి నుంచి గుండె ధమనులపై ప్రభావం చూపిస్తాయి. దానివల్ల హఠాత్తుగా గుండె పోటు సంభవించే ప్రమాదముంది. దీర్ఘకాలంపాటు పీఎం 2.5 ధూళి కణాలను పీలిస్తే- క్యాన్సర్లు, పక్షవాతం, అధిక రక్తపోటు, మధుమేహం, ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆందోళన, వ్యాకులత వంటి మానసిక సమస్యలకూ వాయు కాలుష్యం కారణమవుతోంది.


కొంతకాలంగా వాతావరణంలో బెంజీన్‌ స్థాయులు పెరుగుతున్నాయి. బెంజీన్‌ ఘనపు మీటరు గాలిలో అయిదు మైక్రో గ్రాములకు మించకూడదని డబ్ల్యూహెచ్‌ఓ చెబుతోంది. హైదరాబాద్‌లోని పాశమైలారంలో గత మే నెలలో 10.25 మైక్రోగ్రాములు; గత డిసెంబరులో హెచ్‌సీయూ ప్రాంతంలో 7.95 మైక్రోగ్రాముల చొప్పున బెంజీన్‌ స్థాయులు నమోదయ్యాయి. వాహన ఉద్గారాలు, శిలాజ ఇంధనాలను మండించడం వల్ల బెంజీన్‌ భూతం జడలు విప్పుతోందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాలిలో త్వరగా కలిసిపోయే ఈ మూలకం విచ్ఛిన్నం కావడానికి 10 నుంచి 30 ఏళ్లు పడుతుంది. అంటే దీని ప్రభావం సుదీర్ఘకాలం ఉంటుందన్న మాట. బెంజీన్‌తో కూడిన గాలిని పీల్చినవారిలో గుండె దడ, కళ్లు తిరగడం, తలనొప్పి, నీరసం, స్పృహ కోల్పోవడం, గాభరా వంటి లక్షణాలు తలెత్తే ప్రమాదముంది. ప్లాస్టిక్‌, డిటర్జెంట్‌, క్రిమిసంహారక మందులు, రబ్బరు, బల్క్‌ డ్రగ్‌, రసాయన పరిశ్రమల నుంచి వెలువడే వాయువుల్లో బెంజీన్‌ అధిక స్థాయిలో ఉంటుంది.


గట్టి చర్యలే కీలకం

ఎన్నో అనర్థాలకు కారణమవుతున్న వాయు కాలుష్య కట్టడికి ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలేవీ ఆశించిన స్థాయిలో ఫలితాలను ఇవ్వడంలేదు. ‘వాయు కాలుష్య నివారణ, నియంత్రణ చట్టం-1981’ సరిగ్గా అమలు కాలేదు. దాంతో కేంద్రం 2019లో జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం చేపట్టింది. దీని ద్వారా 131 నగరాల్లో సూక్ష్మ ధూళి కణాల తీవ్రతను 2024 నాటికి 30శాతం వరకు తగ్గించాలని తలపెట్టింది. ఇందుకోసం రూ.9,934 కోట్లను ప్రత్యేకించారు. 2023 చివరి నాటికి అందులో సగమైనా వినియోగించలేదు! చివరికి స్వచ్ఛ వాయు కార్యక్రమ గడువును 2026 వరకు పొడిగించి, కాలుష్య కారకాలను 40శాతం మేర తగ్గించాలని సంకల్పించారు. ఇప్పటికైనా కాలుష్య నియంత్రణ కోసం ప్రభుత్వాలు, వ్యవస్థలు, ప్రజలు చురుగ్గా కృషి చేయకపోతే- భవిష్యత్తు అంధకారమే అవుతుంది. సౌర విద్యుదుత్పత్తికి ఉద్దేశించిన ‘సూర్యోదయ యోజన’ వంటి పథకాలకు ప్రభుత్వాలు రాయితీలను పెంచాలి. పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహించాలి. ప్రజలు వీలైనంత వరకు ప్రజా రవాణా వ్యవస్థలనే ఉపయోగించాలి. పంట వ్యర్థాలను తగులబెట్టకుండా ప్రత్యామ్నాయ విధానాలపై రైతులకు అవగాహన కల్పించాలి. పచ్చదనం పెంపునకు గట్టి చర్యలు తీసుకోవాలి. అప్పుడే- వాయు నాణ్యత కొంతవరకైనా మెరుగుపడుతుంది.


ఆత్మహత్యలకు దారితీస్తూ..

వాయు కాలుష్యానికి, ఆత్మహత్యలకు మధ్య సంబంధం ఉన్నట్లు అమెరికా పరిశోధకులు చైనాలో చేపట్టిన అధ్యయనం సూచిస్తోంది. చైనాలో 2000 సంవత్సరంలో తలసరి ఆత్మహత్యల రేటు ప్రపంచ సగటు కన్నా చాలా ఎక్కువగా ఉండేది. 20 ఏళ్ల తరవాత ఆ రేటు గణనీయంగా దిగివచ్చింది. చైనా ప్రభుత్వం వాయు కాలుష్య నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంవల్లే బలవన్మరణాలు తగ్గుముఖం పట్టాయని పరిశోధకులు విశ్లేషించారు. కాలుష్య కారకాలు నాడీ మండలాన్ని దెబ్బతీసి ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నట్లు వారు గుర్తించారు.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ జీవ శాస్త్రాల్లో కొలువుకు విస్తృత అవకాశాలు

‣ కొత్త అవకాశాలకు.. జెన్‌ ఏఐ!

‣ మార్కులకు పరిష్కారం.. పునశ్చరణే!

‣ ఐటీ, కార్పొరేట్‌ రంగాల్లో రాణిద్దాం ఇలా..

Posted Date: 20-03-2024



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం