• facebook
  • whatsapp
  • telegram

ఆయువు తోడేస్తున్న వాయువు



మనిషి తప్పిదాల కారణంగా ప్రాణవాయువే మహా గరళమవుతోంది. వాయు కాలుష్యం ప్రపంచవ్యాప్తంగా ఏటా 70 లక్షల మందిని పొట్టన పెట్టుకుంటోంది. వారిలో దాదాపు 20లక్షల మంది భారతీయులే ఉంటున్నారు. ఈ మేరకు స్విట్జర్లాండ్‌కు చెందిన ఐక్యూ ఎయిర్‌ సంస్థ ఇటీవల ‘ప్రపంచ వాయు నాణ్యత నివేదిక- 2023’ను విడుదల చేసింది.


పరిశ్రమలు, గనుల తవ్వకం, విద్యుదుత్పత్తి, వాహనాలు వంటివి కాలుష్యాన్ని వెదజల్లడం సహజం. పలు దేశాలు ఆధునిక సాంకేతికతలు, ఉత్పత్తి విధానాలను అనుసరించడం ద్వారా కాలుష్యాన్ని కట్టడి చేస్తున్నాయి. భారత్‌ వంటి దేశాలు మాత్రం అటువంటి విధానాలను సరిగ్గా చేపట్టడంలేదు. బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ల తరవాత ప్రపంచంలోనే అత్యంత కాలుష్యభరిత దేశంగా ఇండియా పరువు మాస్తోంది. ఇప్పటికైనా భారత్‌ పర్యావరణహితకరమైన అభివృద్ధి విధానాలను అనుసరించడం అత్యావశ్యకమని ‘ప్రపంచ వాయు నాణ్యత నివేదిక-2023’ హితవు పలికింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అధ్యయనాల ఆధారంగా ‘ఐక్యూ ఎయిర్‌’ దీన్ని రూపొందించింది.


ఆరోగ్యాన్ని కబళిస్తూ..

ప్రపంచ జనాభాలో 91శాతం కలుషిత వాయు ప్రభావానికి గురవుతోంది. భారత్‌లో ఏకంగా 96శాతం నాణ్యతలేని గాలినే శ్వాసిస్తున్నారు. గాలిలో సూక్ష్మ ధూళి (పీఎం-2.5) కణాల గాఢత ఆధారంగా వాయు నాణ్యతను లెక్కిస్తారు. మొత్తం 134 దేశాల్లోని 7,812 ప్రాంతాల నుంచి సేకరించిన వాయు నాణ్యత గణాంకాలను ఐక్యూ ఎయిర్‌ సంస్థ క్రోడీకరించింది. భారత్‌లో పీఎం-2.5 సూక్ష్మధూళి కణాలు ఘనపు మీటరుకు 54.4 మైక్రోగ్రాములుగా ఉన్నట్లు పేర్కొంది. డబ్ల్యూహెచ్‌ఓ నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం, ఏ ప్రాంతంలోనూ ఘనపు మీటరు పరిమాణంలో పీఎం-2.5 సూక్ష్మధూళి కణాలు అయిదు మైక్రోగ్రాములకు మించకూడదు. ప్రపంచంలోని అత్యంత కాలుష్యభరితమైన 50 నగరాల్లో 42 భారతదేశంలోనే ఉన్నాయని తాజా నివేదిక వెల్లడించింది. అందులోనూ 92.7మైక్రోగ్రాముల సూక్ష్మ ధూళి కణాలతో దిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్యభరిత రాజధానిగా వరసగా నాలుగోసారి నిలిచింది! బిహార్‌లోని బెగుసరాయ్‌ 118.9 మైక్రోగ్రాములతో ప్రపంచంలోనే అత్యంత కాలుష్యభరిత పారిశ్రామిక నగరంగా మొదటి స్థానాన్ని ఆక్రమించింది. దేశంలోని 66శాతం నగరాలు తీవ్రస్థాయి వాయు కాలుష్యంతో సతమతమవుతున్నాయి. డబ్ల్యూహెచ్‌ఓ నిర్దేశించినట్లు- ఆస్ట్రేలియా, ఫిన్లాండ్‌, ఐస్‌లాండ్‌, న్యూజిలాండ్‌, మారిషస్‌, ఎస్తోనియా, గ్రెనెడాల్లో మాత్రమే సూక్ష్మ ధూళికణాలు ఘనపు మీటరుకు అయిదు మైక్రోగ్రాములు లేదా అంతకంటే తక్కువగా ఉంటున్నాయి. భారత్‌లో శరవేగంగా సాగుతున్న పట్టణీకరణ వాయు నాణ్యతను గణనీయంగా దెబ్బతీస్తున్నట్లు నివేదిక పేర్కొంది. పరిశ్రమలు, బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాల నుంచి అధిక మొత్తంలో కాలుష్యం వెలువడుతోంది. నిర్మాణ కార్యకలాపాలవల్ల దుమ్ము, ధూళి కణాలు అధిక సమయం గాలిలో ఉంటూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కట్టెలతో వంట చేయడం, పంట వ్యర్థాలను తగలబెట్టడం వంటి చర్యలు గ్రామీణ ప్రాంతాల్లో గాలి నాణ్యతను దెబ్బతీస్తున్నాయి. పంజాబ్‌, హరియాణా రైతులు పంట వ్యర్థాలను తగలబెడుతుండటంతో దిల్లీలో వాయునాణ్యత పడిపోతోంది. దట్టంగా పొగ వ్యాపించడంతో అక్కడి పాఠశాలలకు సెలవులు ఇవ్వాల్సి వచ్చింది.


మానవ చర్యల మూలంగా ఉత్పన్నమవుతున్న కాలుష్య కారకాలు తిరిగి ప్రజల ఆరోగ్యాన్నే పాడుచేస్తున్నాయి. సూక్ష్మ ధూళి కణాలు మనం పీల్చే గాలి ద్వారా నేరుగా శరీరంలో ప్రవేశించి రక్తంలో కలుస్తున్నాయి. క్రమంగా అన్ని అవయవాల్లోనూ తిష్ఠ వేస్తున్నాయి. పీఎం-2.5 సూక్ష్మధూళి కణాలు ఆకస్మిక గుండెపోటు, హృద్రోగాలు, నేత్ర సమస్యలు, శ్వాస సంబంధ వ్యాధులకు కారణమవుతున్నట్లు అనేక అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మరణిస్తున్న వారిలో 7.6శాతం సూక్ష్మ ధూళి కణాల కారణంగా వివిధ రోగాల బారిన పడినవారేనని ‘గ్లోబల్‌ బర్డెన్‌ ఆఫ్‌ డిసీజెస్‌’ అధ్యయనం విశ్లేషించింది. నాణ్యతలేని గాలిని పీల్చడంవల్ల అధిక రక్తపోటు, గుండె లయ తప్పడం, రక్తనాళాల్లో పూడికలు ఏర్పడటం వంటివి తలెత్తుతాయని హెచ్చరించింది. మెట్రో నగరాల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్లు పెరగడానికి వాయు కాలుష్యమూ కారణమవుతోంది. కలుషిత వాతావరణం చిన్నారుల్లో న్యుమోనియా, బ్రాంకైటిస్‌, ఆస్తమా వంటి సమస్యలు పెరగడానికి దారితీస్తోంది. వాయు కాలుష్యం నగరవాసుల్లో కుంగుబాటు, ఆందోళన వంటి మానసిక సమస్యలు పెరగడానికి కారణమవుతున్నట్లు పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. అంతేకాదు... మహిళల్లో సంతానలేమి, హార్మోన్ల అసమతుల్యత, రుతుక్రమంలో మార్పులు వంటి సమస్యలెన్నో తలెత్తుతున్నాయి. పీల్చే గాలి డబ్ల్యూహెచ్‌ఓ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే- భారత్‌లో సగటు ఆయుర్దాయం 5.2 ఏళ్లు, దిల్లీలోనైతే 11.9 సంవత్సరాల మేర పెరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు.


మేల్కొనకపోతే అనర్థమే

అంతకంతకు పెరిగిపోతున్న వాయు కాలుష్యం ఆర్థికంగానూ భారత్‌ను దెబ్బతీస్తోంది. గాలి నాణ్యత తగ్గిపోవడంవల్ల ప్రజారోగ్యం దెబ్బతినడం, సేద్య రంగంపై వాతావరణ మార్పుల ప్రభావం తీవ్రంగా ఉండటం, పారిశ్రామిక ఉద్పాదకత తగ్గడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దాంతో ఇండియా ఏటా ఏడు లక్షల కోట్ల రూపాయల మేర నష్టపోవాల్సి వస్తోందని ‘క్లీన్‌ ఎయిర్‌ ఫండ్‌’ సంస్థ అంచనా వేసింది. ఇది స్థూల దేశీయోత్పత్తిలో మూడు శాతం. పరిస్థితులు ఇలాగే కొనసాగితే 2030 నాటికి ఆ నష్టం జీడీపీలో 4.5శాతానికి పెరుగుతుందని ప్రపంచ బ్యాంకు హెచ్చరించింది. ఇలా ఎన్నో అనర్థాలకు కారణమవుతున్న వాయు కాలుష్య నియంత్రణకు ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలేవీ ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వడంలేదు. కాలుష్య నియంత్రణ మండళ్ల పనితీరు తీసికట్టుగా ఉంటోంది. 2019లో కేంద్రం చేపట్టిన జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం నత్తనడకన సాగుతోంది. కాలుష్యాన్ని నియంత్రించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం ప్రభుత్వాలు, వ్యవస్థలు, ప్రజలు కలిసికట్టుగా కృషి చేయాలి. ప్రజలు వ్యక్తిగత వాహనాలను వీడి ప్రజా రవాణా సాధానాలను ఉపయోగించాలి. పరిశ్రమలు ఆధునిక ఉత్పత్తి విధానాలను అనుసరించడం ద్వారా కాలుష్యాన్ని నియంత్రించాలి. పంట వ్యర్థాలను తగలబెట్టకుండా ప్రత్యామ్నాయ విధానాలపై రైతులకు అవగాహన కల్పించాలి. అన్ని చోట్లా పచ్చదనం పెంపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. అప్పుడే వాయు నాణ్యత మెరుగుపడుతుంది.


ఈవీలకు ప్రోత్సాహం

భారత్‌లో వాహనాల నుంచి పెద్దయెత్తున కాలుష్యం వెలువడుతోంది. 40శాతం వాయు కాలుష్యం రవాణా వ్యవస్థల నుంచే వస్తున్నట్లు అంచనా. మెట్రో నగరాలు, పెద్ద పట్టణాల్లో అది 70శాతం వరకు ఉంటోంది. దేశ జనాభాలో 60శాతం వ్యక్తిగత వాహనాలనే వినియోగిస్తున్నారు. వాటిలో 90శాతానికి పైగా పెట్రోలు, డీజిల్‌తో నడిచేవే ఉంటున్నాయి. ప్రజలు ఎలెక్ట్రిక్‌ వాహనాలు (ఈవీలు) కొనుగోలు చేసేలా ప్రభుత్వాలు ప్రోత్సహించాలి.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ బంగ్లాలో ప్రబలుతున్న భారత్‌ వ్యతిరేకత

‣ రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?

‣ అయోమయంలో అమెరికా ఓటరు

‣ మాట మార్చిన ముయిజ్జు

‣ నైపుణ్యాలే ఉపాధి సోపానాలు

Posted Date: 15-04-2024



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం