• facebook
  • whatsapp
  • telegram

మేక్రాన్‌ మహాజూదం



తాజా ఐరోపా సమాఖ్య పార్లమెంటరీ ఎన్నికల్లో మధ్యేవాద సంకీర్ణమే నెగ్గింది. ఫ్రాన్స్, జర్మనీలలో అతి మితవాద పార్టీలు అనుకున్నదానికన్నా ఎక్కువ ఓట్లు సంపాదించడం ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యంగా ఫ్రాన్స్‌ పెద్ద కుదుపునకు లోనైంది.


ఫ్రాన్స్‌కు చెందిన అతి మితవాద నేషనల్‌ ర్యాలీ పార్టీకి తాజా యూరోపియన్‌ పార్లమెంటరీ ఎన్నికల్లో తమ రినెసాన్స్‌ పార్టీ కన్నా రెట్టింపు ఓట్లు రావడం ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయల్‌ మేక్రాన్‌ను దిగ్భ్రాంతపరచింది. దాంతో ఆయన ఫ్రెంచి నేషనల్‌ అసెంబ్లీ (పార్లమెంటు) మధ్యంతర ఎన్నికలకు ఆదేశించారు. 1997 తరవాత ఫ్రాన్స్‌లో మధ్యంతర ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి. ఈ జూన్‌ 30, జులై ఏడు తేదీల్లో రెండు దశలుగా నేషనల్‌ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. 2022లో రెండోసారి దేశాధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి మేక్రాన్‌ పరిస్థితి ముళ్లమీద కూర్చున్నట్లు తయారైంది. 577 సీట్లున్న నేషనల్‌ అసెంబ్లీలో మేక్రాన్‌ పార్టీకి కేవలం 169 స్థానాలు ఉన్నాయి. నేషనల్‌ ర్యాలీ పార్టీకి 88 సీట్లు ఉన్నాయి. మేక్రాన్‌ ఇతర పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్నారు. ఇంతలో యూరోపియన్‌ పార్లమెంటు ఎన్నికల్లో మేక్రాన్‌ పార్టీ తీసికట్టు ఫలితాలను సాధించడం ఆయన పరిస్థితిని మరింత బలహీనపరచింది. పార్లమెంటు ఎన్నికల్లో నేషనల్‌ ర్యాలీ పార్టీ 243-305 సీట్లు గెలిచి మెజారిటీ సాధిస్తుందని గత డిసెంబరులో జరిగిన ఓ ప్రజాభిప్రాయ సేకరణలో తేలింది.


ఫ్రాన్స్‌లో నేషనల్‌ అసెంబ్లీ, దేశాధ్యక్ష ఎన్నికలు వేర్వేరుగా జరుగుతాయి. ఈ జూన్‌-జులైలలో నేషనల్‌ అసెంబ్లీ ఎన్నికలు జరిగితే, ఆపైన మూడేళ్లకు, అంటే 2027లో అధ్యక్ష ఎన్నికలు నిర్వహిస్తారు. రాబోయే ఎన్నికల్లో నేషనల్‌ ర్యాలీ పార్టీ గెలిచి అతి మితవాద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా, ఆ సర్కారు పట్టువిడుపులు లేని విధానాలతో రాబోయే మూడేళ్లలో అపఖ్యాతి మూటగట్టుకొంటుందని మేక్రాన్‌ భావిస్తున్నారు. దానివల్ల అధ్యక్ష ఎన్నికల్లో తానే తిరిగి గెలుస్తానని ఆయన అంచనా వేస్తున్నారు. నేషనల్‌ ర్యాలీ పార్టీ విదేశీయుల వలసలను గట్టిగా వ్యతిరేకిస్తోంది. వలస వచ్చినవారిని ఫ్రాన్స్‌ నుంచి వెళ్లగొడతానంటోంది. ఏడాదికన్నా ఎక్కువ కాలం నిరుద్యోగులుగా ఉన్న వలసదారులను వారి స్వదేశాలకు తిప్పి పంపేస్తానని చెబుతోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ను సైతం అది గట్టిగా సమర్థిస్తోంది. నేషనల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్‌ ర్యాలీ పార్టీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా విదేశాంగ, రక్షణ విధానాలు అధ్యక్షుడు మేక్రాన్‌ చేతిలోనే ఉంటాయి. దేశార్థికం, అంతర్గత భద్రత, వలస వ్యవహారాలను నేషనల్‌ ర్యాలీ ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఉక్రెయిన్‌కు నిధులు ఇవ్వకుండా అడ్డుకునే అధికారం సర్కారుకే ఉంటుంది.


పెరిగిన వలసలు, నేరాలు, జీవన వ్యయంపై ఫ్రెంచి ప్రజల్లో అసంతృప్తి చెలరేగుతోంది. పాలనానుభవం లేని నేషనల్‌ ర్యాలీ పార్టీ ఎంతవరకు దీన్ని అధిగమిస్తుందో చెప్పలేం. తరవాతి అధ్యక్ష ఎన్నికలు జరిగేలోపు నేషనల్‌ ర్యాలీ ప్రభుత్వం తన అతి మితవాద విధానాలతో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటుందని మేక్రాన్‌ భావిస్తున్నారు. మరోవైపు యూరోపియన్‌ పార్లమెంటు ఎన్నికల్లో నేషనల్‌ ర్యాలీ గెలుపుతో ఫ్రాన్స్‌లో మధ్యేవాద ఓటర్లను మేక్రాన్‌ తన వెనక సంఘటితం చేసుకునే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే నేషనల్‌ ర్యాలీ మైనారిటీ సర్కారును ఏర్పరచవలసి వస్తుంది. ఆ మైనారిటీ ప్రభుత్వం తాను ఆశించిన విధానాలను అమలు చేయలేక చతికిలపడుతుందనే విశ్లేషణ సైతం ఉంది. ఆర్థిక నిర్వహణా పెను సవాలు కానుంది. ప్రస్తుతం ఫ్రాన్స్‌ బడ్జెట్‌ లోటు జీడీపీలో 5.5శాతంగా ఉంది. దీన్ని భర్తీ చేయాలంటే ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించాలి. లేదా పన్నులు పెంచాలి. ప్రభుత్వ వ్యయం తగ్గితే సాధారణ ప్రజలకు, పన్నులు పెంచితే ధనికులకు, కార్పొరేట్‌ సంస్థలకు ఆగ్రహం వస్తుంది. ఇలాంటి గడ్డు స్థితిలో నేషనల్‌ ర్యాలీ ఎలా నెట్టుకొస్తుందనేది ఆసక్తికరమైన అంశం. 2027 అధ్యక్ష ఎన్నికల నాటికి ఆ పార్టీ ప్రజాదరణను కోల్పోవడం ఖాయమని మేక్రాన్‌ యోచిస్తున్నారని స్పష్టమవుతూనే ఉంది. ఇది పెద్ద జూదమని కొందరు, అతి ధీమాకు నిదర్శనమని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు ఈ ఏడాది జులై 26 నుంచి పారిస్‌లో ఒలింపిక్‌ క్రీడలు జరగనున్నాయి. అప్పటి నుంచి ప్రపంచ దృష్టి ఫ్రాన్స్‌పైన, ఆ దేశంలో అధికారంలోకి వచ్చే కొత్త సర్కారు మీదా కేంద్రీకృతమవుతుంది.


- వరప్రసాద్‌
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఉపాధికి ఊతమిచ్చే ఉన్నత విద్య

‣ సవాళ్ల ముంగిట ఆంధ్రప్రదేశ్‌.. సమర్థ ప్రణాళికలతో మహర్దశ

‣ అన్నదాతకు అండగా కృత్రిమ మేధ

‣ సేద్యానికి బలిమి... దేశానికి కలిమి!

‣ సాగర గర్భం... అంతర్జాల కేంద్రం

‣ కేంద్రానికి మిగులు సాయం

Posted Date: 14-06-2024



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం