• facebook
  • whatsapp
  • telegram

స్విస్‌ సదస్సుకు భారత్‌



ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ఇప్పట్లో ముగిసే సూచనలు కనిపించడం లేదు. ఉక్రెయిన్‌లో శాంతి స్థాపన కోసం జూన్(2024) 15, 16 తేదీల్లో స్విట్జర్లాండ్‌లో  కీలక సదస్సు జరగనుంది. ఇందులో భారత్‌ ఎటువంటి పాత్ర పోషిస్తుందన్నది సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది.


ఏడాది క్రితం ఉక్రెయిన్‌లోని బాఖ్ముట్‌ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్న రష్యన్‌ సేనలు తరవాత ఇజియం, కుపియాన్స్క్, బాలక్లియా పట్టణాలను కైవసం చేసుకున్నాయి. తాజాగా ఛాసివ్‌ యార్‌ పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడానికి పురోగమిస్తున్నాయి. పారిశ్రామిక, ఆర్థిక కేంద్రమైన ఖార్కివ్‌లో పాగా వేయడం కోసం రష్యా గట్టిగా ప్రయత్నిస్తోంది. ఈ మధ్య గట్టి ఎదురుదెబ్బలు తిన్న ఉక్రెయిన్‌లో మళ్ళీ పోరు ఉత్సాహం నింపడానికి అమెరికా 6,000 కోట్ల డాలర్ల సైనిక, ఆర్థిక సహాయం అందిస్తోంది. అమెరికా కాంగ్రెస్‌లో మురిగిపోతూ వచ్చిన ఉక్రెయిన్‌ సహాయ బిల్లుకు ఎట్టకేలకు ఇటీవల ఆమోదముద్ర పడింది. దాంతో ఉక్రెయిన్‌కు మరిన్ని నిధులు, ఆయుధాలు అందనున్నాయి.


ఉక్రెయిన్‌ - రష్యా యుద్ధానికి ముగింపు పలకడానికి భారత్‌ మధ్యవర్తిత్వం వహిస్తుందనే అంచనాలు మొదట్లో బలంగా వినిపించాయి. తరవాత అవి సద్దుమణిగినా ఉక్రెయిన్‌లో శాంతిని నెలకొల్పేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈనెల 15, 16 తేదీల్లో స్విట్జర్లాండ్‌లో జరిగే శాంతి సదస్సులో ఇండియా పోషించే పాత్రపై ఆసక్తి నెలకొంది. అయితే, ఈ సమావేశంలో రష్యా పాల్గొనడం లేదు. బ్రిక్స్‌ కూటమిలోని ఇతర సంస్థాపక సభ్య దేశాలైన చైనా, బ్రెజిల్, దక్షిణాఫ్రికాలు తాము హాజరయ్యేదీ లేనిదీ నిర్ధారించలేదు. స్విట్జర్లాండ్‌ నిర్వహించే సభలో 90 దేశాలు, ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థలు పాల్గొంటున్నాయి. వీటిలో సగం దేశాలు, సంస్థలు ఐరోపాకు చెందినవే.


భారత్, రష్యాల మధ్య 70 ఏళ్ల నుంచీ రక్షణ, దౌత్యపరంగా పటిష్ఠ మైత్రీబంధం ఉంది. భారత్‌ ఆయుధ దిగుమతుల్లో సింహభాగం రష్యా నుంచి వచ్చినవే. ఇటీవలి కాలంలో భారత్‌ ఆత్మనిర్భరత పేరుతో స్వదేశంలో ఆయుధ ఉత్పత్తికి ప్రాధాన్యమిస్తోంది. ఫ్రాన్స్, అమెరికా, ఇజ్రాయెల్‌ నుంచి ఆయుధాలను దిగుమతి చేసుకోవడం, సంయుక్తంగా ఉత్పత్తి చేయడం వంటివి చేపట్టింది. అంతర్జాతీయంగా భారత్‌ ఆర్థిక ప్రాధాన్యం పెరుగుతూ వస్తోంది. ఉక్రెయిన్‌పై రష్యా దండెత్తక ముందు ఆ రెండు దేశాలతో భారత్‌కు సన్నిహిత సంబంధాలు ఉండేవి. అందుకే ఇవి యుద్ధానికి రోజులు కావని భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధినేత వ్లాదిమిర్‌ పుతిన్‌తో అన్నారు. ఐరోపా వివాదాలు, యుద్ధాల్లో తలదూర్చడం ఇష్టంలేక రష్యా, ఉక్రెయిన్‌ల పట్ల భారత్‌ తటస్థ వైఖరి అనుసరిస్తోంది. పైగా ఉక్రెయిన్‌ యుద్ధంవల్ల అంతర్జాతీయ బలాబలాలు సమూలంగా మారే అవకాశం ఉంది. రష్యా, చైనాలు ఒక పక్క అమెరికా, నాటోలు మరో పక్క మోహరించి ప్రపంచాన్ని రెండు వైరి వర్గాలుగా విభజిస్తాయనే ఆందోళన నెలకొంది. ప్రచ్ఛన్న యుద్ధానికి ముందు ప్రపంచం అమెరికా, సోవియట్‌ శిబిరాలుగా విడిపోయి ఉండేది. అప్పట్లో భారత్‌ అలీనోద్యమం పేరిట రెండు శిబిరాలకు సమదూరం పాటించేది. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన తరవాత ప్రపంచంలో ఏ ఒక్క దేశమో ఆధిపత్యం చలాయించే పరిస్థితి ఉండకూడదనే భావన బలపడింది. బహుళ ధ్రువ ప్రపంచం సాకారమవుతుందనే ఆశలు వెల్లివిరిశాయి. ఉక్రెయిన్‌ యుద్ధం, తైవాన్‌ సమస్యతో అటువంటి ఆశలు భగ్నమయ్యే ప్రమాదం ఏర్పడింది. ఇప్పటికే రష్యా, చైనా, ఇరాన్, ఉత్తర కొరియా, సిరియాలు ఒక శిబిరంగా... అమెరికా, నాటోలు వైరి శిబిరంగా వ్యవహరిస్తున్నాయి. దీనివల్ల ఏర్పడే విపరిణామాలకు హమాస్‌-ఇజ్రాయెల్‌ పోరు, ఎర్ర సముద్రంపై హూతీల దాడులే నిదర్శనం. ఇటువంటి తరుణంలో తటస్థంగా వ్యవహరించదలచిన దేశాలు రాజకీయంగా ఒక శిబిరంతో, ఆర్థికంగా మరో శిబిరంతో సత్సంబంధాలు నెరపవచ్చు. ఉదాహరణకు ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యాను ఖండించని చైనా- ఆర్థికంగా అమెరికా, ఐరోపా సమాఖ్యలతో బలమైన బంధాన్ని కొనసాగిస్తోంది. భారత్‌ సైతం రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటూనే అమెరికాతో సత్సంబంధాలను నెరపుతోంది. రష్యా నుంచి చౌక ధరకు చమురు లభించడం భారత్‌కు ఆర్థికంగా ఎంతో కలిసివచ్చింది.


రష్యా - ఉక్రెయిన్‌ యుద్ధం ఏ విధంగా ముగుస్తుందనేదానిపై భిన్న అంచనాలు వినవస్తున్నాయి. ఇప్పటికే బాగా దగ్గరైన రష్యా, చైనాలు రేపు మరింత బలమైన పొత్తుకు తెరతీయనూవచ్చు. ఇక భారత్‌ రష్యా చమురు, ఆయుధాలను దిగుమతి చేసుకుంటూనే అమెరికాతో ఆర్థిక, రక్షణ బంధాన్ని పటిష్ఠపరచుకొంటోంది. ఇలా అంతర్జాతీయ సమీకరణలు మారుతున్న నేపథ్యంలో- ఉక్రెయిన్‌లో శాంతిసాధనకు స్విట్జర్లాండ్‌ ఏర్పాటు చేస్తున్న సభకు భారత్‌ హాజరవుతోంది. అక్కడ మధ్యవర్తిత్వ పాత్రను ఇండియా ఏమేరకు పోషిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.


- వివేక్‌ మిశ్రా 

(అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు)
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మేక్రాన్‌ మహాజూదం

‣ ఉపాధికి ఊతమిచ్చే ఉన్నత విద్య

‣ సవాళ్ల ముంగిట ఆంధ్రప్రదేశ్‌.. సమర్థ ప్రణాళికలతో మహర్దశ

‣ అన్నదాతకు అండగా కృత్రిమ మేధ

‣ సేద్యానికి బలిమి... దేశానికి కలిమి!

‣ సాగర గర్భం... అంతర్జాల కేంద్రం

‣ కేంద్రానికి మిగులు సాయం

Posted Date: 14-06-2024



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం