• facebook
  • whatsapp
  • telegram

జీ7లో భారత్‌ చేరుతుందా?



నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరవాత ఇరుగు పొరుగుతో పాటు పాశ్చాత్య సంపన్న దేశాలకు ఇండియాను దగ్గరచేసేందుకు యత్నిస్తున్నారు. తన విదేశాంగ విధానాన్ని చురుగ్గా ముందుకు తీసుకెళ్తున్నారు. తాజాగా ఇటలీలోని అపూలియాకు వెళ్ళి గ్రూప్‌ ఆఫ్‌7 (జీ7) సదస్సులో పాల్గొన్నారు.


ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అమెరికా, కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్‌లు సభ్య దేశాలుగా గ్రూప్‌ ఆఫ్‌7 (జీ7) కూటమి ఏర్పడింది. అప్పటికీ ఇప్పటికీ జీ7లో అవే దేశాలు సభ్యులుగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం భారత్‌ ప్రపంచంలోని అయిదు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదిగినా, ఇప్పటికీ వర్ధమాన దేశంగానే పరిగణన పొందుతోంది. అందువల్ల జీ7లో సభ్యత్వం లభించడం లేదు. మరోవైపు, ఇండియా ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. జీ7 బృందంలోని దేశాలతో ఇండియాకు ఆర్థిక, వాణిజ్య సంబంధాలు నానాటికీ విస్తరిస్తున్నాయి. అందువల్ల భారత్‌ పూర్తిస్థాయి సభ్యదేశం కాకపోయినా సన్నిహిత సమన్వయం కోసం జీ7 మన దేశాన్ని తరచూ ఆహ్వానిస్తోంది. ఇండియా ఇప్పటిదాకా 11 జీ7 సదస్సుల్లో పాల్గొంది. నరేంద్ర మోదీ ఒక్కరే వరసగా అయిదు సమావేశాలకు హాజరయ్యారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరవాత తాజాగా ఇటలీలోని అపూలియాలో జరిగిన జీ7 సదస్సులో మోదీ పాల్గొన్నారు. మూడో దఫా అధికారం చేపట్టిన తరవాత మోదీ జరిపిన తొలి విదేశీ పర్యటన ఇదే. తద్వారా భారత్‌ ప్రముఖ ఆర్థిక శక్తిగా ఎదుగుతోందని, ఇతర వర్ధమాన దేశాల వాణిని వినిపిస్తోందని చాటారు. అపూలియా భేటీ జీ7 స్వర్ణోత్సవ సదస్సు సైతం కావడం విశేషం.


చైనాపై విమర్శలు

తాజా జీ7 సదస్సులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జర్మనీ ఛాన్స్‌లర్‌ ఒలాఫ్‌ షోల్జ్, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయల్‌ మెక్రాన్‌తో మోదీ చర్చలు జరిపారు. హరిత ఇంధనం, పారిశ్రామిక వస్తూత్పత్తి, అంతరిక్షం, టెలికాం రంగాల్లో భారత్, ఇటలీ మధ్య సహకార వృద్ధిపై ఇరు దేశాల ప్రధానులు చర్చించారు. జపాన్, భారత ప్రధానులు ప్రత్యేక అంతర్జాతీయ వ్యూహపరమైన భాగస్వామ్యం కుదుర్చుకునే విషయమై సంప్రతింపులు జరిపారు. ముంబయి-అహ్మదాబాద్‌ హైస్పీడ్‌ రైల్వే ప్రాజెక్ట్‌ గురించీ చర్చించారు. బ్రిటన్‌ ప్రధాని రిషీ సునాక్‌తో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసుకునే విషయమై మోదీ మంతనాలు జరిపారు. ఐరోపా సమాఖ్య (ఈయూ) నుంచి నిష్క్రమించిన తరవాత భారత్‌ లాంటి ముఖ్యమైన దేశాలతో బ్రిటన్‌ విడివిడిగా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. పోప్‌ ఫ్రాన్సిస్‌తో మోదీ సమావేశం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇండియా సందర్శనకు రావలసిందిగా పోప్‌ను మోదీ ఆహ్వానించారు. జీ7 సదస్సులో భారత ప్రజాస్వామ్య పటిష్ఠత, ఇటీవల విజయవంతంగా నిర్వహించిన ఎన్నికల గురించి మోదీ ప్రసంగించారు. జీ7 సభ్యదేశాలైన ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికాలలో ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. బ్రిటన్, అమెరికాలలో సునాక్, బైడెన్‌లు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. వారిద్దరూ తొలి పదవీ కాలాన్ని పూర్తిచేసుకుని రెండోసారి ఎన్నికల్లో నిలబడుతున్నారు. ప్రధాని మోదీ వరసగా మూడోసారి విజయం సాధించారు. ఇండియాలో జరిగిన లోక్‌సభ ఎన్నికలు యావత్‌ ప్రజాస్వామ్య ప్రపంచానికి ఘన విజయమని మోదీ అభివర్ణించారు.


చైనా బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ప్రాజెక్టును చేపడితే పాశ్చాత్య దేశాలు ఇండియా-పశ్చిమాసియా-ఐరోపా ఆర్థిక నడవా ప్రాజెక్టు (ఐమెక్‌)ను ప్రకటించాయి. తాజా జీ7 సదస్సు ఐమెక్‌కు మద్దతు తెలిపింది. అంతర్జాతీయ రాజకీయాల్లో చైనా పాత్రపై జీ7 దేశాల అధినేతలు విమర్శలు గుప్పించారు. సదస్సు ముగింపు అనంతరం విడుదలైన సంయుక్త ప్రకటనలోనూ చైనా గురించి రెండు డజన్ల సార్లు ప్రస్తావించారు. దక్షిణ చైనా సముద్రంలో, తైవాన్‌ పట్ల బీజింగ్‌ దుందుడుకు పోకడలను తెగనాడారు. చైనా ఆర్థిక, వాణిజ్య విధానాలు జీ7 కూటమి దేశాల్లోని పరిశ్రమలకు, ఆర్థిక భద్రతకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని విమర్శించారు. చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి జీ7 దేశాలు పరస్పర పెట్టుబడులను, సహకారాన్ని వృద్ధి చేసుకుంటాయని, సరఫరా గొలుసులను పటిష్ఠపరచుకుంటాయని సంయుక్త ప్రకటన ఉద్ఘాటించింది.  


మరిన్ని దేశాలను చేర్చుకొని...

ప్రచ్ఛన్న యుద్ధ కాలంతో పోలిస్తే ప్రస్తుతం ప్రపంచం పూర్తిగా మారిపోయింది. బలాబలాల సమీకరణల్లోనూ ఎన్నో పరిణామాలు సంభవించాయి. ఒకప్పుడు అమెరికా, సోవియట్‌ కూటముల మధ్య చీలిన ద్విధ్రువ ప్రపంచం, ఇప్పుడు బహుళ ధ్రువ ప్రపంచంగా మారింది. అయినా, జీ7 కాలానుగుణంగా మారలేదు. కొత్త సభ్యులను చేర్చుకోలేదు. భారతదేశం ప్రధాన ఆర్థిక శక్తిగా ఆవిర్భవించింది. చైనాకు భిన్నంగా భారత్‌ ప్రజాస్వామ్య, స్వేచ్ఛాయుత దేశం. జీ7లో భారత్‌ను చేర్చుకోవలసిన సమయం వచ్చిందని అందరూ భావిస్తున్నారు. జీ7 భారత్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియాలను చేర్చుకుని జీ10గా ఆవిర్భవించాలనే వాదన బలంగా ముందుకొచ్చింది. మోదీని జీ7కు ఆహ్వానించిన ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ సైతం తలుపులు బిగించిన కోట జీ7 కాదని చాటారు. కనుక ఇండియాను జీ7లో చేర్చుకోవలసిన సమయం వచ్చినట్లే!


వర్ధమాన దేశాల వాణి

ఉక్రెయిన్‌పై దండెత్తిన రష్యాకు చైనా లోపాయికారి మద్దతిస్తోందని అపూలియా జీ7 సదస్సు ఆక్షేపించింది. ఉక్రెయిన్‌కు 5,000 కోట్ల డాలర్ల ఆర్థిక సహాయం అందించడంతో పాటు రష్యాపై ఆర్థిక ఆంక్షలను కఠినతరం చేయాలని నిర్ణయించింది. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీ అయిన ప్రధాని మోదీ- యుద్ధానికి త్వరగా స్వస్తి చెప్పి శాంతిని నెలకొల్పడానికి శక్తివంచన లేకుండా కృషిచేస్తామని హామీ ఇచ్చారు. వర్ధమాన దేశాల నుంచి ఐరోపాకు కొనసాగుతున్న వలసల గురించీ తాజా జీ7 సదస్సు చర్చించింది. వలసలను ఆపాలంటే వర్ధమాన దేశాల స్థితిగతులను మెరుగుపరచడానికి సంపన్న దేశాలు నడుంకట్టక తప్పదు. వర్ధమాన దేశాల ఆర్థిక, సాంకేతికతల అభివృద్ధికి చేయూతనివ్వాలి. మోదీ ఈ విషయాన్నే జీ7 సదస్సులో ప్రస్తావించారు. ఆఫ్రికా సహా అన్ని పేద దేశాల తరఫున గళం వినిపించారు. కృత్రిమ మేధ వంటి అధునాతన సాంకేతికతల విషయంలో పారదర్శకత పాటించాలని మోదీ జీ7 దేశాలకు పిలుపిచ్చారు. వాటిని భద్రంగా, అందరి మేలు కోసం వినియోగించాలని కోరారు. సాంకేతికతలపై గుత్తాధిపత్యం కోసం వెంపర్లాడకుండా జనబాహుళ్య సంక్షేమానికి వాటిని అంకితం చేయాలన్నారు.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ డ్రాగన్‌పై త్రైపాక్షిక భేటీ

‣ ఎగుమతుల వృద్ధికి అవకాశాలు అపారం

‣ ఇంధన భద్రతకు సానుకూల పవనం

‣ స్విస్‌ సదస్సుకు భారత్‌

‣ మేక్రాన్‌ మహాజూదం

‣ ఉపాధికి ఊతమిచ్చే ఉన్నత విద్య

‣ సవాళ్ల ముంగిట ఆంధ్రప్రదేశ్‌.. సమర్థ ప్రణాళికలతో మహర్దశ

Posted Date: 19-06-2024



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం