• facebook
  • whatsapp
  • telegram

సంస్కరణల బాటలో దూకుడు

ససేమిరా అంటున్న రాష్ట్రాలు

పలు రాష్ట్రాలు వద్దంటున్నా విద్యుత్‌ సంస్కరణల అమలుపై కేంద్రం పట్టుదలగా ముందుకు సాగుతోంది. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే  సంబంధిత బిల్లు ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఇందుకు సన్నాహకంగా, ఈ ఏడాది బడ్జెల్లో- తాము చేపట్టదలచిన చర్యలను ప్రభుత్వం వివరించింది. సంస్కరణల్లో ప్రధానంగా పేర్కొనవలసింది విద్యుత్‌ పంపిణీ, సరఫరా సంస్థల ప్రైవేటీకరణ. టెలికాం రంగంలో సర్వీసు ప్రొవైడర్లను ఎంచుకునే అవకాశం వినియోగదారులకు ఉన్నట్లే, ఇకపై విద్యుత్‌ రంగంలోనూ ఈ అవకాశం దక్కనుంది. నాణ్యమైన సేవలందించే వారిని ఎంచుకునే అవకాశం వినియోగదారుడికి కల్పించనున్నామని కేంద్రం చెబుతోంది. ఇందుకు లైసెన్సింగ్‌ విధానంలో మార్పులు చేయనుంది. డిస్కమ్‌లలో వ్యవస్థాగత మార్పులు చేయడం, ఫీడర్ల వికేంద్రీకరణ, ముందస్తుగా చెల్లించే స్మార్ట్‌మీటర్ల ఏర్పాటు తదితర చర్యలకు సిద్ధమవుతోంది. దీనితోపాటు సులభతర వాణిజ్యంపైనా ప్రత్యేకంగా దృష్టిసారించింది. మిషన్‌ హైడ్రోజన్‌, స్థానికంగా సౌరసెల్స్‌ తయారీ, పునరుత్పాదక ఇంధన రంగంలో మూలధనాన్ని సమీకరించడం వంటి ప్రతిపాదనలూ ఉన్నాయి.

అమలు దిశగా సన్నద్ధం

బడ్జెట్లో ప్రతిపాదించిన అంశాల అమలు దిశగా రాష్ట్రాలను సన్నద్ధం చేసే వైపు కేంద్రం కదులుతోంది. ప్రధాని మోదీ, కేంద్ర విద్యుత్‌ మంత్రి ఆర్‌.కె.సింగ్‌ విడివిడిగా ఆయా రాష్ట్రాలతో మాట్లాడి అభిప్రాయాలు తీసుకున్నారు. గ్రామాల్లో ప్రతి ఇంటికీ విద్యుత్‌ సౌకర్యం కల్పించాలన్న ధ్యేయంతో ప్రభుత్వం ముందుకెళుతోంది. 139 గిగావాట్ల విద్యుత్‌ సామర్థ్యాన్ని అదనంగా పెంచుకుని, ఒన్‌ నేషన్‌- ఒన్‌ గ్రిడ్‌- ఒన్‌ ఫ్రీక్వెన్సీ లక్ష్యాలను ఇప్పటికే సాధించామని ఇంధన మంత్రిత్వశాఖ ప్రకటించింది. పీఎం కుసుమ్‌ పథకం ద్వారా రైతులు తమ పొలాల్లో చిన్న ప్లాంట్లు ఏర్పాటు చేసి, వాటి ద్వారా 30 మెగావాట్ల సౌరవిద్యుత్తు ఉత్పత్తి చేయాలని, వచ్చే ఏడాదిన్నరలో పైకప్పుపై సౌర ప్రాజెక్టుల ద్వారా 40 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. పంపిణీ వ్యవస్థ ప్రైవేటీకరణకు సంకల్పించిన ప్రభుత్వం లైసెన్సింగ్‌ విధానంలో మార్పులు చేసి ఔత్సాహికులు ప్రవేశించేలా చేయాలనుకుంటోంది. ఎక్కువ మంది ఈ రంగంలో ఉంటే, వినియోగదారులు నాణ్యంగా సేవలందించే వారినే ఎంచుకోవచ్చని అభిప్రాయపడుతోంది.

దేశవ్యాప్తంగా విద్యుత్‌ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) ఆర్థిక ఒత్తిళ్లతో సతమతమవుతున్నాయి. డిసెంబరు 2020 నాటికి వాటి బకాయిల భారం రూ.1.35లక్షల కోట్లకు చేరింది. ప్రైవేటీకరణపై దృష్టి పెట్టిన ప్రభుత్వం ఫీడర్‌ సెపరేటర్లు ఏర్పాటు చేయడం, స్మార్ట్‌మీటర్లు బిగించడం తదితర మౌలిక సదుపాయాల కల్పనకు అయిదేళ్ల కాలవ్యవధిలో రూ.3,05,884 కోట్లను వాటికి కేటాయించింది. పవర్‌గ్రిడ్‌ ఆస్తుల నిర్వహణకు మౌలిక సదుపాయాల పెట్టుబడుల ట్రస్టును కొత్తగా ప్రారంభించనున్నారు. ఇది పెట్టుబడిదారులకు ద్వారాలు తెరుస్తుంది. అత్యధిక సామర్థ్యం కలిగిన సౌర ఉపకరణాల తయారీ కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి. సంస్కరణలు అమలైతే కేంద్ర రెగ్యులేటరీ కమిషన్‌ అన్ని నిర్ణయాలూ తీసుకుంటుంది. రుసుములు పెంచడం, నియామకాలు వంటి అంశాల్లో రాష్ట్రాల ప్రమేయం ఉండదు. దీంతో డిస్కమ్‌ల ఆదాయం బాగా దెబ్బతింటుందని, ఉద్యోగుల వేతనాలకు, పదవీ విరమణ ప్రయోజనాలకు సొమ్ము చెల్లించలేని పరిస్థితి తలెత్తుతుందన్న ఆందోళన ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. డిస్కమ్‌లకు ఉండే రుణభారం తదితర బాధ్యతలతో ప్రైవేటు సంస్థలకు సంబంధం ఉండదు. వాటికి సంబంధించిన లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను కారుచౌకగా ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేయాల్సి వస్తుంది. స్మార్ట్‌మీటర్లు బిగిస్తే రైతు ముందుగానే బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. వీటిని రీఛార్జి చేసుకుంటే డబ్బుకు సరిపడా విద్యుత్‌ సరఫరా అవుతుంది. ఉచిత విద్యుత్తు వినియోగించే రైతులు ఎవరెవరు ఎంతమేర వినియోగించారో తెలుసుకుని బిల్లులు వేయాలంటే వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ సబ్సిడీ ఖర్చును రాష్ట్ర ప్రభుత్వాలు డిస్కమ్‌లకు అందిస్తున్నాయి. ఇకపై రాష్ట్రాలకు ఈ నిర్ణయాధికారం ఉండదు. ప్రభుత్వం ఇవ్వదలచిన రాయితీ ప్రత్యక్ష నగదు బదిలీ కింద వినియోగదారుల ఖాతాల్లో నేరుగా జమ అవుతుంది.

బాధ్యత కేంద్రానిదే!

సంస్కరణలపై రాష్ట్రాలను ఒప్పించడంలో కేంద్రం విఫలమైంది. ఇదంతా తమపై బలవంతంగా రుద్దుతున్నారనే భావన ఆయా రాష్ట్రాల్లో వ్యక్తమవుతోంది. విద్యుత్‌ పంపిణీ సంస్థలు, ఉద్యోగుల గోడును కేంద్రం పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. దీనితో ప్రైవేటీకరణకు ద్వారాలు తెరిచి ప్రస్తుతం ఉన్న వ్యవస్థను ఛిన్నాభిన్నం చేయడానికి కేంద్రం సిద్ధమవుతున్నదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. విద్యుత్‌ సవరణ బిల్లు-2020 ముసాయిదాను విద్యుత్‌ మంత్రిత్వశాఖ వెబ్‌సైటులో ఉంచి అభిప్రాయాల స్వీకరణకు మూడు వారాల గడువిచ్చారు. తదుపరి తెచ్చిన సవరణ బిల్లు-2021 ముసాయిదాను కేవలం రాష్ట్ర డిస్కమ్‌లకు, ముఖ్య కార్యదర్శులకు మాత్రమే అందుబాటులో ఉంచడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. పారదర్శకత లేకుండా హడావుడిగా ముగించాలనే ధోరణి కేంద్రంలో కనిపించిందని, వివిధ భాగస్వామ్య పక్షాలను విస్మరించారనే ఆరోపణలున్నాయి. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల పంపిణీ సంస్థల అభిప్రాయాలు విన్న కేంద్రం వాటిపై తీసుకోబోయే చర్యల విషయంలో మాత్రం భరోసా ఇవ్వలేదు. దానికి తోడు విద్యుత్‌ ఆర్థిక సంస్థ (పీఎఫ్‌సీ), గ్రామీణ విద్యుత్‌ సంస్థ (ఆర్‌ఈసీ)ల నుంచి అందుతున్న రుణాలను నిలిపివేసి, పరోక్షంగా నిబంధనలు అమలు చేసి తీరాలన్న సంకేతాలిచ్చారు. దీనితో వినియోగదారులు, వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్‌ మీటర్లు బిగించక తప్పకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటిదాకా రాష్ట్రాల నుంచి సబ్సిడీలు పొందుతున్న వర్గాలు, రైతుల్లోనూ అనేక భయసందేహాలు వ్యక్తమవుతున్నాయి. వీటన్నింటిని నివృత్తి చేసి రాష్ట్రాలను సంసిద్ధం చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే.

బిల్లుపై వ్యతిరేకత

కేంద్రం తెచ్చిన విద్యుత్‌ సవరణ బిల్లును చాలా రాష్ట్రాలు వ్యతిరేకించాయి. దేశవ్యాప్తంగా విద్యుత్తు పంపిణీ సంస్థల ఉద్యోగులు నిరసనలు చేపట్టారు. ఫలితంగా విద్యుత్‌ పంపిణీ సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. డిస్కమ్‌ల ప్రైవేటీకరణలో భాగంగా చేపట్టదలచిన ఫ్రాంచైజీ విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించింది. బిల్లును వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం కూడా చేసింది. పునరుత్పాదక విద్యుత్‌ వినియోగం విషయంలో ప్రతి రాష్ట్రం నిబంధనల మేరకు సౌర తదితర విద్యుత్తును ఉత్పత్తి చేయాల్సి రావడం, లేనిపక్షంలో జరిమానా చెల్లించడమనే ప్రతిపాదనను తెలంగాణ తిరస్కరించింది. హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, జమ్ముకశ్మీర్‌, లదాఖ్‌ తమకున్న భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా ప్రైవేటు వైపు మొగ్గలేమని తేల్చిచెప్పేశాయి.

- పార్థసారథి చిరువోలు

Posted Date: 04-03-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం