• facebook
  • whatsapp
  • telegram

సమగ్ర కార్యాచరణ తక్షణావసరం

జీఎస్టీ మండలి భేటీపై అందరి దృష్టి  

దాదాపు ఏడు నెలల తరవాత వస్తు సేవల పన్ను (జీఎస్టీ) మండలి శుక్రవారం భేటీ కానుంది. దేశవ్యాప్తంగా కొవిడ్‌ రెండో దశ ధాటికి పెద్ద సంఖ్యలో ప్రజలు విలవిలలాడుతున్న నేపథ్యంలో- తాజాగా జరగబోతున్న 43వ మండలి సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఒక వైపు ఆరోగ్య వ్యవస్థలు కుదేలవడం, మరోవైపు ప్రజా వ్యయానికి సరిపడా వనరులు లేకపోవడంతో దాదాపు అన్ని రాష్ట్రాలూ ఆర్థికంగా అతలాకుతలం అవుతున్నాయి. ఆయా సమస్యల నుంచి రాష్ట్రాలను గట్టెక్కించేందుకు- జీఎస్టీ మండలి సమగ్ర కార్యాచరణ రూపొందించడం అత్యావశ్యకం. అదే సమయంలో ప్రస్తుత ఆరోగ్య సంక్షోభం వల్ల ఎదురైన సవాళ్లను పరిష్కరించే బాధ్యత సైతం జీఎస్టీ మండలిపై ఉంది. వీటితో పాటు దేశ ఆర్థికాన్ని వృద్ధి పథంలో నడిపించేందుకు అవసరమైన మధ్య, దీర్ఘకాలిక వ్యూహాలు రచించడమూ ఎంతో ముఖ్యం. అప్పుడే దేశ ప్రజలకు ప్రభుత్వాలపై నమ్మకం పెరిగే అవకాశం ఉంది.

ఒకే మాటపై కేంద్రం, రాష్ట్రాలు...

కొవిడ్‌పై పోరులో టీకాలను ప్రాణాలను రక్షించే సంజీవనిగా భావిస్తున్నారు. అలాంటి కరోనా టీకాలు, అత్యవసర వైద్య సదుపాయాలపై పన్నులు విధించడం ఇటీవల చర్చనీయాంశమైంది. ఇలాంటి పరిస్థితుల్లో పన్నుల నుంచి వీటికి ఉపశమనం కల్పించడం, శానిటైజర్లు, ఆక్సిజన్‌ యంత్రాలు, ఆక్సిమీటర్లు వంటి వస్తువులపై జీఎస్టీని తొలగించే అవకాశాన్ని మండలి అత్యవసరంగా పరిగణించాలి. కరోనా సంక్షోభ పరిస్థితుల్లో కార్పొరేట్‌, ప్రైవేటు రంగ సంస్థలకూ కొంతమేర తోడ్పాటును అందించాలి. తమ ఉద్యోగులను కొవిడ్‌ నుంచి రక్షించుకోవడానికి ఆయా సంస్థలు చేస్తున్న వ్యయంపై ఇన్‌పుట్‌ టాక్స్‌ క్రెడిట్లు పొందడానికి అనుమతించే విషయాన్నీ పరిశీలించాలి. ఈ కల్లోల కాలంలో సిబ్బంది బాగోగులపై యాజమాన్యాలు మరింత శ్రద్ధ పెట్టడానికి ఇది అక్కరకొస్తుంది. మరోవైపు, నిధుల కొరత కారణంగా ఇప్పటికే సతమతమవుతున్న రాష్ట్రాలపై- కేంద్రం అదనంగా టీకాల కొనుగోలు భారాన్నీ మోపింది. ఈ తరుణంలో తమ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని ఆయా రాష్ట్రాలు బలంగా డిమాండ్‌ చేసే అవకాశముంది. వాస్తవానికి నిరుడు లాక్‌డౌన్‌ సమయంలోనూ ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. అప్పుడూ రాష్ట్రాల ఆదాయానికి భారీగా గండిపడింది. జీఎస్టీ మండలి తమను ఆదుకుంటుందని అవి ఆశించాయి. కానీ వాటికి మండలి నుంచి ఊహించని సమాధానమే ఎదురైంది. ఫలితంగా జీఎస్టీ పరిహారాల చెల్లింపులపై రాష్ట్రాలు- కేంద్రం మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. దీనివల్ల ఓ దశలో కేంద్రం-రాష్ట్రాల మధ్య పెద్ద అగాధం ఏర్పడినట్టు కనిపించింది. సమాఖ్య విధానాన్ని అనుసరించే భారత్‌కు ఇది శ్రేయస్కరం కాదు. అందువల్ల గత పరిణామాలనూ మండలి దృష్టిలో పెట్టుకోవాలి. అవి మరోసారి పునరావృతం కాకుండా ఉండాలంటే, రాష్ట్రాలకు కేంద్రం ఈసారి పరిహారాలను త్వరితగతిన విడుదల చేయాలి. కరోనా విజృంభణ కారణంగా నష్టపోయిన ఆదాయాన్ని తిరిగి సంపాదించేందుకు చేపట్టాల్సిన చర్యలపై కేంద్రం, రాష్ట్రాలు- ఒకేమాట, ఒకేబాటపై నడవాలి. అప్పుడే సహకార సమాఖ్య స్ఫూర్తి పరిఢవిల్లుతుంది.

ప్రస్తుత పరిస్థితుల్లో స్వల్పకాలిక చర్యలతో ప్రజలకు కొంతమేర ఉపశమనం లభించే అవకాశం ఉంది. అయితే మండలి ఆలోచనలు ఇక్కడితోనే ఆగిపోకూడదు. దేశ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తునూ దృష్టిలో పెట్టుకుని జీఎస్టీ మండలి ముందుకు సాగడం ఈ సమయంలో ఎంతో అవసరం. అందుకే ఆయా రంగాలను పట్టి పీడిస్తున్న సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యాన్ని ఇవ్వాలి. ఉదాహరణకు, వ్యవసాయంలో అధికంగా వినియోగించే ఎరువులు వంటి వాటిపై ఇన్వెర్టెడ్‌ డ్యూటీ (పుర్తిగా తయారైన వస్తువుపై ఉండే పన్నుకన్నా, ముడిసరకులపై పన్ను ఎక్కువగా ఉండటం) విధించడం వల్ల వాటి ధరలపై ప్రభావం పడుతోంది. ఔషధ, జౌళి, ట్రాక్టర్ల ధరలపైనా ఇలాంటి సమస్యే ఉంది. ఈ లెక్కల చిక్కులతో చివరికి ప్రజలే విలవిలలాడుతున్నారు. ఇలాంటి పరిణామాలు ఆయా రంగాలకు నష్టాలను చేకూర్చడమే కాకుండా, ప్రభుత్వానికీ చేటే చేస్తాయి.  అందువల్ల ఈ సమస్యను ఎంత తొందరగా పరిష్కరిస్తే అంత మంచిది. ఇక కరోనా రెండో దశతో నలిగిపోయిన రంగాలకు జీఎస్టీ నుంచి కొంత ఉపశమనాన్ని అందించే చర్యలు చేపట్టాలి. సూక్ష్మ,చిన్న మధ్య తరహా పరిశ్రమల రంగంపై ప్రత్యేక దృష్టి సారించి, బకాయిలను సత్వరమే చెల్లించేందుకు ఏర్పాట్లు చేయాలి. ఈ సంక్షోభ సమయంలో ఇలాంటి సంస్థల మనుగడకు ఇది ఉపకరిస్తుంది. రెస్టారెంట్లు, పర్యాటకం, పర్యాటక నిర్వాహకులు చెల్లించాల్సిన జీఎస్టీ రేట్లపై కొంత కాలంపాటు కోత విధిస్తే, ఆయా రంగాల్లో కార్యకలాపాలు ఊపందుకుంటాయి. దీనివల్ల దేశంలో ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయి. తద్వారా ప్రజల ఆదాయం కూడా పెరుగుతుంది.

మినహాయింపులిస్తే...

ప్రస్తుతమున్న జీఎస్టీ స్ల్లాబులను తగ్గించడం లేదా హేతుబద్ధీకరించడం దీర్ఘకాలంలో దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి తోడ్పడుతుంది. అయితే ఇలా పన్నుల నుంచి కొన్ని వస్తువులు, రంగాలకు మినహాయింపునివ్వడం, స్లాబుల్లో మార్పుచేర్పుల వల్ల కేంద్ర- రాష్ట్రాల ఖజానాలు నిండుకుంటాయన్న వాదనలూ లేకపోలేదు. ఇలాంటి నిర్ణయాలతో అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు, పథకాల కోసం చేసే వ్యయాలు తగ్గిపోతాయనే ఆందోళనలు వ్యక్తం కావచ్చు. అయితే, ప్రస్తుతం మనం ఊహించని పెను సంక్షోభంలో చిక్కుకొని, కొట్టుమిట్టాడుతున్నామన్నది వాస్తవం. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కాలంటే అసాధారణమైన నిర్ణయాలు తీసుకోవాల్సిందే. ముఖ్యంగా- కీలక రంగాలకు జీఎస్టీ నుంచి ఉపశమనం లభిస్తే, అవి సంక్షోభం నుంచి బయటపడతాయి. తద్వారా వస్తు, సేవలకు గిరాకీ పెరుగుతుంది. ఫలితంగా, ఉద్యోగావకాశాలు పెరిగి దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుంది. పన్నుల ద్వారా వచ్చే ఆదాయం రోజురోజుకు పెరిగి, ప్రభుత్వాల ఖజానాలు కళకళలాడతాయి. అందువల్ల ప్రస్తుత సంక్షోభ వాతావరణంలో లెక్కల గురించి ఆలోచించకూడదు. దేశ ప్రజలు, ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న భారాన్ని పరిగణనలోకి తీసుకుని జీఎస్టీ మండలి గట్టి నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడే మెరుగైన ఫలితాలు లభిస్తాయి.

ఇంధన భారంపై చర్చిస్తారా?

ప్రస్తుత పరిస్థితుల్లో చమురు ఉత్పత్తులు, వాటి ధరల అంశం ముఖ్యమైనది. చమురు ఉత్పత్తుల ధరలు ఇప్పటికే ఆకాశాన్ని తాకుతూ, సామాన్యుడికి పెను భారంగా మారాయి. ఇంధన ధరలు పెరిగితే, ఆ ప్రభావం ఇతర రంగాలు, కార్యకలాపాలపైనా ఉంటుంది. ఈ విషయం ప్రభుత్వానికి తెలియనిదేమీ కాదు. పాలకులు చొరవ తీసుకుని ప్రజలకు మేలు చేయాల్సిన సమయమిది. చమురు ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే అంశాన్ని మండలి తప్పనిసరిగా చర్చించాలి.
 

Posted Date: 27-05-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం