• facebook
  • whatsapp
  • telegram

  న్యాయానికి సెలవులా?

ప్రపంచీకరణకు భారతావని తలుపులు బార్లాతెరిచిన 28 ఏళ్ల తరవాతా సంస్కరణల వెలుగు రేకలు సోకని కీలక రంగాలు రెండు దేశ ప్రగతిని దిగలాగుతున్నాయి. వాటిలో ఒకటి న్యాయం, రెండోది వ్యవసాయం! అన్నం పెట్టేవాడికే సున్నం పెట్టేలా ఉన్న దుర్విధానాలు రైతన్నల ఉసురుతీస్తుంటే- కాలానుగుణ మార్పులు, సవాళ్లకు దీటైన పరిష్కారాలకు నోచక ఎకాయెకి మూడు కోట్ల 17 లక్షల పెండింగ్‌ కేసుల భారంతో న్యాయపాలిక కుంగిపోతోంది. సామాన్యుడికి సత్వరన్యాయం ఎండమావిని తలపిస్తున్న దశలో కూడా గతంలో మాదిరిగానే ఈ ఏడాదీ సుప్రీంకోర్టు 190 రోజులు, బాంబే, దిల్లీ, గౌహతి, మణిపూర్‌ హైకోర్టులు 210 రోజుల వంతున పని చెయ్యనున్నాయి. శని ఆదివారాల సెలవుల్నీ కలుపుకొంటే సర్వోన్నత న్యాయపాలిక 175 రోజులపాటు అందుబాటులో ఉండదని, మరోమాటలో నెలకు 16 రోజులు మాత్రమే పని చేయనుందనీ వార్తాకథనాలు చాటుతున్నాయి. వేసవి సెలవులు 45 రోజులు, శీతకాల విరామం పక్షం రోజులు, హోలీకి వారం, దసరా, దీపావళి పర్వదినాలకు చెరో పది రోజుల వంతున సుప్రీంకోర్టుకు సెలవులు ఉండటంపై చిరకాలంగా భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. కోర్టుల్లో కేసుల విచారణ మందకొడిగా సాగుతుండడానికి కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ పార్లమెంటుకు నిరుడు ఏకరువు పెట్టిన వివిధ కారణాల్లో న్యాయస్థానాలకు దీర్ఘకాల సెలవులూ ఒకటి. రోజుకు 60కి పైగా వ్యాజ్య విచారణలు చేపట్టే న్యాయమూర్తులు- ఆయా కేసుల్లో తీర్పులు రాసుకోవడానికి, ఇతరేతర న్యాయసంబంధ పనులు చేసుకోవడానికీ సెలవుల్ని వినియోగించుకొంటారంటున్న న్యాయ నిపుణులు కోర్టులకు దీర్ఘకాల సెలవులకే ఓటేస్తున్నారు. సుప్రీంకోర్టులో 60వేలు, వివిధ హైకోర్టుల్లో దాదాపు 43 లక్షలు, దిగువ కోర్టుల్లో ఎకాయెకి రెండు కోట్ల 74 లక్షల పెండింగ్‌ కేసులు వెక్కిరిస్తున్నాయి. దిగువ కోర్టులు ఏడాదికి 245 రోజులే పనిచేస్తున్న వాతావరణం, దీటైన న్యాయసంస్కరణలు మరీచికగా మారడం- న్యాయార్థులకు ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తున్న నేపథ్యంలో సరైన దిద్దుబాట్లకు న్యాయవ్యవస్థ నడుంకట్టాలి!

‘ఆసుపత్రులు, విద్యుత్‌, నీటిసరఫరా మాదిరిగానే న్యాయపాలిక సైతం అత్యవసర సేవలందించేదిగా మారింది. ఆయా విభాగాలన్నీ మున్నూట అరవై అయిదు రోజులూ పనిచేస్తున్నప్పుడు- న్యాయవ్యవస్థ ఎందుకు వెనకాడాలి?’- 2014లో భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఆర్‌ఎం లోథా సంధించిన సూటిప్రశ్న అది. కోర్టు నిర్వహణ వ్యవస్థను విప్లవాత్మకంగా సరిదిద్దడం ద్వారా- ఇప్పటికే పనిభారం అధికంగా మోస్తున్న న్యాయమూర్తులపై అదనపు ఒత్తిడి లేకుండానే పరిస్థితుల్ని మెరుగుపరచగల వీలుందంటూ జస్టిస్‌ లోథా చేపట్టిన సంస్కరణలు అర్ధాంతరంగా ఆగిపోయాయి. సుప్రీంకోర్టుకు గరిష్ఠంగా పది వారాలపాటు ఉన్న వేసవి సెలవులు ఏడు వారాలకు దిగివచ్చింది చీఫ్‌ జస్టిస్‌ లోథా జమానాలోనే! ఆనాటికి ప్రధాన న్యాయమూర్తి సహా 31 మంది న్యాయమూర్తులున్న సుప్రీంకోర్టులో 14-15 ధర్మాసనాలు వ్యాజ్యాల్ని విచారించేవి. న్యాయమూర్తులు వ్యక్తిగతంగా తమకు అవసరమైనప్పుడు సెలవు తీసుకొనే పద్ధతి ప్రవేశపెట్టడం ద్వారా- ప్రతి రోజూ పది ధర్మాసనాలు అందుబాటులో ఉండేలా 365 రోజులూ సుప్రీంకోర్టును అవిరామంగా నిర్వహించగల వీలుందన్న జస్టిస్‌ లోథా, దానిపై న్యాయవాద సంఘాల నుంచి, హైకోర్టుల నుంచి సలహాలు కోరారు. పెండింగ్‌ కొండల్ని కరిగించడానికే కాదు, యువన్యాయవాదులు తమ వృత్తి నైపుణ్యాల్ని సాన పట్టుకోవడానికీ ఎంతగానో అక్కరకొచ్చే ఆ ప్రతిపాదనకు తగు మద్దతు లభించనే లేదు. కోర్టులకు బీగాలు బిగించడం కాకుండా, న్యాయమూర్తులు అవసరానుగుణంగా సెలవులు తీసుకోవడంవల్ల ఎకాయెకి 26 శాతం అదనపు పని సానుకూలపడుతుందన్న ఆ ప్రతిపాదన ఆచరణ యోగ్యమైనది. అమెరికాలోనూ అమలులో ఉన్న ఆ పద్ధతికి మళ్లడం ద్వారా- సత్వర న్యాయలక్ష్యాన్ని సుకరం చేసేందుకు సుప్రీంకోర్టే పూనిక వహించాలి!

సత్వర న్యాయం దొరకనిచోట శీఘ్రతర అభివృద్ధి ఉత్తమాట. ఆ వాస్తవాన్నే ఎలుగెత్తిన నిరుటి ఆర్థిక సర్వే- న్యాయపాలిక పని దినాలు పరిమితంగా ఉండటంపై ఆందోళన వ్యక్తీకరించింది. పని రోజులు పెంచి, కోర్టుల నిర్వహణను మెరుగుపరచి, అత్యధునాతన సాంకేతిక పరిజ్ఞాన వినిమయానికి చోటుపెడితే పరిస్థితులు మెరుగుపడతాయన్న ఆర్థిక సర్వే- దిగువ కోర్టుల్లో 2,279, హైకోర్టుల్లో 93 ఖాళీల భర్తీకి సిఫార్సు చేసింది. కొందరు న్యాయమూర్తులే నిస్పృహ చెందినట్లు ఇప్పటికీ ఎడ్లబండి కాలంలోనే ఉన్న న్యాయపాలిక భావి అవసరాలకు దీటుగా అక్కరకు రావాలంటే- విప్లవాత్మక సంస్కరణలకు సంసిద్ధం కావాలి. వేసవిలో విరామకాల బెంచ్‌ల ఏర్పాటు ద్వారా న్యాయసేవలకు అంతరాయం కలగకుండా సుప్రీంకోర్టు ఇటీవల కొత్త చొరవ కనబరుస్తోంది. న్యాయమూర్తులకు సెలవులు ఉండాలిగాని, న్యాయం సెలవు తీసుకోరాదన్న ఉన్నతాదర్శానికి అమెరికా బ్రిటన్‌ కెనడా లాంటివి ఎత్తుపీట వేస్తున్నాయి. అమెరికాలో కోర్టులకు ‘వేసవి విరామం’ వంటిదేమీ ఉండదు. వారాంతపు సెలవులు కాకుండా, జాతీయ పర్వదినాల వంటివాటి కారణంగా కెనడాలో 11 రోజులు, బ్రిటన్‌లో 24రోజులు న్యాయపాలిక సెలవులో ఉంటుంది. సుప్రీంకోర్టుతో మొదలుపెట్టి న్యాయపాలిక సెలవుల్ని పది పదిహేను రోజులు తగ్గించినా, కోర్టుల పనిగంటల్ని ఒక్క అరగంట పొడిగించినా పెండింగ్‌ కేసులపై దాని ప్రభావం గణనీయంగా ఉంటుందనీ లా కమిషన్‌ ఏనాడో సూచించింది. పని దినాల పెంపుపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారిస్తున్న సుప్రీంకోర్టు- జాతి ప్రయోజనాల రీత్యా స్వయం సంస్కరణల బాట పట్టడం, నేటి అవసరం!

Posted Date: 20-03-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం