• facebook
  • whatsapp
  • telegram

పేదరిక కట్టడిలో ‘ఉపాధి హామీ’

ఇతోధిక కేటాయింపులే పథకానికి ఊపిరి

నిధుల కొరతతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) లక్ష్యాలు నీరుగారిపోతున్నట్లుగా ఇటీవల కథనాలు వెలుగుచూశాయి. కూలీలకు వేతనాలు వంటి వాటిపై 21 రాష్ట్రాల్లో ప్రతికూల ప్రభావం పడే పరిస్థితులు నెలకొన్నట్లుగా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. వాటిపై స్పందించిన కేంద్రం- పథకం అమలుకు అవసరమైన నిధులను విడుదల చేసేందుకు కట్టుబడి ఉన్నట్లుగా ఉద్ఘాటించింది. గ్రామీణ పేదరిక నిర్మూలనకు కీలకమైన ‘ఉపాధి హామీ’పై నీలినీడలు కమ్ముకోవడం ఆందోళనకరం. పథకం అమలులోని లోపాలను సరిదిద్దడంపై ప్రభుత్వాలు సత్వరం దృష్టిసారించాలి.

ప్రపంచంలో అతిపెద్ద ప్రజాపనుల కార్యక్రమంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) పేరొందింది. కరోనా విజృంభణ తరవాత పనులు లేక అల్లాడిపోయిన ఎందరో కూలీలకు అది జీవనాధారమైంది. గ్రామీణ పేదరికాన్ని రూపుమాపి, వలసలను అరికట్టేందుకు ఉద్దేశించిన మేలిమి పథకమిది. దేశాభివృద్ధికి అది ఎంతగానో ఉపయోగపడుతోందని అనేక అధ్యయనాలు రుజువు చేశాయి. కోట్లాది గ్రామీణ పేదలకు వెన్నుదన్నుగా నిలుస్తున్న ఈ పథకాన్ని సమర్థంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. 

పల్లెభారతానికి భరోసా

ఉపాధి హామీ పథకం వల్ల దేశీయంగా వస్తున్న సానుకూల మార్పులను బెంగళూరులోని భారతీయ వైజ్ఞానిక సంస్థ (ఐఐఎస్‌సీ) పరిశోధన చాటిచెప్పింది. భూగర్భ జల నిల్వలు వృద్ధి చెందడం, వ్యవసాయానికి నీటి లభ్యత పెరగడం, సాగుభూమి విస్తీర్ణం అధికం కావడం వంటి సత్ఫలితాలను దీంతో సాధించినట్లుగా పేర్కొంది. ఈ పథకం వల్ల గ్రామీణ మహిళలు సంపాదన బాట పట్టడంతో కుటుంబ ఆదాయాల్లో 15శాతం మేర వృద్ధి నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వ అధ్యయనం వెల్లడించింది. దేశవ్యాప్తంగా 68.96 లక్షల కుటుంబాలకు అలా మేలు జరిగినట్లు ఎనిమిదేళ్ల క్రితమే వెలుగులోకి వచ్చింది. పల్లెప్రాంత పేదలకు అదనపు పనిదినాలను కల్పించడంలో ‘ఉపాధి హామీ’ కీలకంగా నిలుస్తున్నట్లు తెలంగాణలోని రంగారెడ్డి, నిజామాబాద్‌, వరంగల్‌ జిల్లాల్లో నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. ఓస్లో(నార్వే) విశ్వవిద్యాలయ పరిశోధకుడు అలెడ్‌ ఫిషర్‌ ఈ పథకం పట్ల ఆకర్షితులై, అనంతపురం జిల్లాలోని పలు గ్రామాలను సందర్శించారు. ఉపాధి హామీ అమలు తీరుతెన్నులను నిశితంగా పరిశీలించి, గొప్ప సంక్షేమ పథకంగా దాన్ని శ్లాఘించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ గణనీయమైన స్థాయిలో ప్రభావం చూపుతున్నట్లుగా లోగడ కర్ణాటకలో జరిగిన మరో అధ్యయనమూ స్పష్టం చేసింది. ఆ పథకంతో గ్రామీణ కూలీల అదనపు కొనుగోలు శక్తి పెరిగింది. ఫలితంగా గ్రామాల్లో వస్తుసేవల క్రయవిక్రయాలు ఊపందుకోవడంతో పాటు కొత్త ఉపాధి మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. తద్వారా గడచిన తొమ్మిదేళ్లలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థలోకి రెండు లక్షల కోట్ల రూపాయలు వచ్చి చేరాయి. ఉపాధి హామీ వల్ల విద్య, వైద్యం వంటి ప్రాథమిక అవసరాలను గ్రామీణులు తీర్చుకోగలుగుతున్నారని దేశంలోని పలు విశ్వవిద్యాలయాలు చేసిన ఎన్నో పరిశోధనలు చాటిచెప్పాయి. వాటన్నింటి దృష్ట్యా ఉపాధి హామీ పనిదినాలను 150 రోజులకు పెంచాలని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రంగరాజన్‌ తదితరులు గతంలో సూచించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి ఎస్సీ, ఎస్టీ వర్గాల కూలీలకు ఈ పథకం కింద ప్రత్యేక బడ్జెట్‌ను రూపొందించి, అందుకు అనుగుణంగా రాష్ట్రాలకు నిధులు విడుదల చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేక జాబితాను రూపొందించి పంపించాలని రాష్ట్రాలకు సూచించింది. ఇంతవరకు కూలీలు అందరికీ ఒకే పద్దు కింద వేతనాల చెల్లింపులు జరిగేవి. ఇకపై రాష్ట్రాలకు వర్గాల వారీగా వేతనాల నిధులు విడుదల కానున్నాయి. ఒక్కో వర్గానికి ఒక్కో జాబితా తయారు చేయాల్సి రావడం వల్ల సిబ్బందికి పనిభారం పెరుగుతుందని; కూలీలందరికీ సమాన హక్కులు దఖలుపడినప్పుడు, వారిలో చీలిక తేవడం సమంజసం కాదని ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ సంఘర్ష మోర్చా వాదిస్తోంది.

తక్కువ పనిదినాలు!

దేశవ్యాప్తంగా ఉపాధి హామీ కింద చెల్లిస్తున్న రోజువారీ వేతనాల్లో  వ్యత్యాసాలు నెలకొన్నాయి. బిహార్‌, ఝార్ఖండ్‌ వంటి రాష్ట్రాల్లో అవి అత్యల్పంగా, కర్ణాటక వంటి చోట్ల అత్యధికంగా ఉన్నాయి. వాటికి మధ్యస్థంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చెల్లింపులు జరుగుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో పథకం అమలు తీరుతెన్నులపై విజన్‌ ఇండియా ఫౌండేషన్‌, దిల్లీ ఐఐటీ సంయుక్తంగా జరిపిన అధ్యయనంలో ఆసక్తికర అంశాలెన్నో వెలుగుచూశాయి. చట్టంలో వంద పనిదినాలను ప్రతిపాదించినప్పటికీ, జాతీయస్థాయిలో సగటున యాభై కన్నా తక్కువ రోజులపాటే ‘ఉపాధి హామీ’ లభిస్తుండటం వాటిలో కీలక విషయం. ఈ పథకం కింద పనిచేసే వారందరూ నిరుపేదలు. వారికి అందాల్సిన కనీస పనిదినాల సాయాన్నీ ప్రభుత్వాలు అందించలేకపోవడం దురదృష్టకరం. చట్టానికి అనుగుణంగా కూలీలకు పనిదినాలను కచ్చితంగా కల్పించాలి. దేశవ్యాప్తంగా కూలీలకు చెల్లించాల్సిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలి. బకాయిల చెల్లింపులను త్వరితగతిన చేపట్టాల్సిన అవసరంపై న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను గౌరవించాలి. పథకం నిధులను దారి మళ్ళించకుండా వాటిని పేదరిక నిర్మూలనకు తద్వారా గ్రామీణాభివృద్ధికి ఉపయోగించాలి. పథకంలో ఏదైనా అవినీతి చోటుచేసుకుంటే వేగంగా తగిన చర్యలు తీసుకోవడం తప్పనిసరి. గ్రామీణ పేదరిక నిర్మూలన ఎంతవరకు సాధ్యమైందో తెలుసుకోవడానికి అయిదేళ్లకు ఒకసారి ప్రామాణికమైన విస్తృతస్థాయి అధ్యయనాలు సైతం నిర్వహించవలసిన అవసరం ఉంది. పల్లె ప్రాంత ప్రజల జీవన ప్రమాణాల్లో వచ్చిన మార్పులతో పాటు పథకం అమలుకు సంబంధించి క్షేత్రస్థాయి వాస్తవాలను తెలుసుకోవడానికి ఆ పరిశోధనలు ఉపయోగపడతాయి.

ఆందోళనకరమీ అలక్ష్యం

గ్రామీణులకు ఎంతగానో అక్కరకొస్తున్న ఉపాధి హామీ పథకం అమలులో ఎన్నో సమస్యలు మేటవేయడం దురదృష్టకరం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూలీలకు సకాలంలో నగదు చెల్లించకపోవడం శోచనీయం. పాత బకాయిలను నిలిపివేయడమే కాకుండా సంబంధిత నిధులను ఇతర పథకాలకు మళ్ళించే పెడపోకడలు కొన్ని రాష్ట్రాల్లో కనపడుతున్నాయి. వేతనాల చెల్లింపులో సర్కారీ అలక్ష్యాన్ని సుప్రీంకోర్టు గతంలోనే తీవ్రంగా గర్హించింది. స్వరాజ్‌ అభియాన్‌ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలుచేసిన ప్రజాప్రయోజన వాజ్యంపై న్యాయస్థానం స్పందిస్తూ- ‘తీరుబడిగా వేతనాలు ఇస్తామంటే ఎలా కుదురుతుంది? కరవు సాయం చేయడమంటే ఏదో ముష్టి పడేస్తున్నామన్న భావన ఉండటం మంచి పద్ధతి కాదు’ అని వ్యాఖ్యానించింది.

- ప్రొఫెసర్‌ బి.రామకృష్ణారావు (విశ్రాంత ఆచార్యులు, ఆంధ్రా యూనివర్సిటీ)
 

Posted Date: 25-11-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం