• facebook
  • whatsapp
  • telegram

పల్లవించని రైతు సంక్షేమం

కర్షకులను నిరాశపరచిన బడ్జెట్‌

‘కరోనా కష్టకాలంలో మీరంతా త్యాగాలు చేసిన ఫలితంగానే ఆర్థికవ్యవస్థ నిలదొక్కుకోగలిగింది’ అంటూ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ పలు వర్గాల వారిని స్తుతిస్తూనే- వారందరికీ మొండిచేయి చూపించారు. ‘మీ కష్టం మాకు కావాలి... కానీ మీ ఇబ్బందులతో మాకేమీ పనిలేదు’ అనే సందేశం ఈ బడ్జెట్లో అంతర్లీనంగా కనిపించింది. వరసగా రెండేళ్లు కరోనా మహమ్మారి అన్ని వర్గాల ప్రజల ఆశల్ని చిదిమేసి వారిని అప్పుల పాలు చేసిన పరిస్థితుల్లో- పాలకులు పెద్దగా పట్టించుకోని వ్యవసాయరంగమే ఆర్థిక వ్యవస్థకు చోదకశక్తిగా నిలిచింది. కానీ, కేంద్ర బడ్జెట్‌ మాత్రం అన్నదాతల కన్నీళ్లు తుడవడానికి గట్టిగా ప్రయత్నించలేదు.

ఊసులేని అన్నదాత శ్రేయం  

గడచిన ఏడాది కాలంలో సంక్షేమం దిశగా ఎంతో చేశామని చెప్పుకొన్న ఏడు అంశాల్లోనూ రైతుల ఊసు ఒక్కటీ లేదు. మోదీ రెండో దఫా అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది బడ్జెట్‌లో సాగురంగానికి ఉజ్జ్వల భవిష్యత్తును కల్పించే దిశగా అడుగులు పడుతున్నాయా అనిపించింది. ఆ బడ్జెట్లో ప్రస్తావించిన అంశాలన్నీ తరవాతి కాలంలో ఉనికిలో లేకుండా పోయాయి. సబ్సిడీని క్రమంగా తగ్గించుకుంటూ, పోషకాధారిత ఎరువుల విధానం తీసుకొస్తామని చెప్పిన కేంద్రం- తరవాత ఆ సంగతినే విస్మరించింది. మూడేళ్లుగా సేంద్రియ సాగు విధానాలను ప్రోత్సహిస్తామనడం మంచిదే అయినా... ఎరువుల సబ్సిడీపై కోత రైతులకు ఇబ్బందులు తెచ్చి పెట్టేదే. నిరుడు ఖరీఫ్‌లో అన్ని రకాల ఎరువుల ధరలను కంపెనీలు అమాంతం పెంచేశాయి. ఆయా సందర్భాల్లో కేంద్రం ఇచ్చే సబ్సిడీల కారణంగానే రైతులు తట్టుకోగలిగారు. ఇకనుంచీ రైతులు ఆ భారాన్ని సొంతంగా మోయక తప్పదు. వివాదాస్పదమైన మూడు సాగు చట్టాలను రద్దు చేసి రైతుల ఆగ్రహాన్ని చల్లార్చేయత్నం చేసిన కేంద్రం- మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలన్న అన్నదాతల ప్రధాన డిమాండును పెడచెవిన పెట్టింది. పంజాబ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో నిప్పుకణంలా ఎగసిన రైతుల పోరాటం తమను భస్మీపటలం చేస్తుందన్న భయంతో సాగు చట్టాలను రద్దు చేసిన కేంద్రం ఈసారి బడ్జెట్లో అన్నదాతలకు వరాలు కురిపిస్తుందనే అందరూ భావించారు. పైగా అయిదు రాష్ట్రాల్లో ఎన్నికలకు ముందు వచ్చిన బడ్జెట్‌లో రైతు సంక్షేమం ప్రధానాంశంగా ఉంటుందని భావించిన వారికి తీవ్ర నిరాశ తప్పలేదు. పంటల బీమా పీఎం కిసాన్‌, ఉపాధి హామీ, ఎరువుల సబ్సిడీ, ప్రధానమంత్రి ఆశా పథకం, మార్కెట్‌ జోక్యనిధి, కనీస మద్దతు ధరల పథకం, సేద్యంలో మౌలిక వసతుల కల్పన, రైతు ఉత్పత్తిదారుల సంఘా(ఎఫ్‌పీఓ)లకు గతంతో పోలిస్తే కేటాయింపులు బాగా తగ్గాయి. 1.63 కోట్ల మంది రైతుల నుంచి 1,208 లక్షల టన్నుల వరి, గోధుమల్ని సేకరించేందుకు రూ.2.37లక్షల కోట్లు వెచ్చించామంటూ కేంద్రం బడ్జెట్లో వెల్లడించింది నిజానికి గతేడాదితో పోలిస్తే ఇది తగ్గింది. 1.97 కోట్ల మంది రైతుల నుంచి 1,286 లక్షల టన్నుల వరి, గోధుమల్ని సేకరించేందుకు 2020-21లో కేంద్రం రూ.2.48 లక్షల కోట్లు వెచ్చించిన సంగతి ఇక్కడ ప్రస్తావనార్హం. అన్ని పథకాలకూ కోతలు పెడుతూపోతే, అన్నదాతల సంక్షేమం ఎలా సాధ్యపడుతుందో కేంద్రమే చెప్పాలి. రైతు సంక్షేమాన్ని పరిగణనలోకి తీసుకోని కేంద్రం ఆధునిక సాగు విధానాలను అమలు చేయించడం ద్వారా వ్యవసాయ ఎగుమతులను పెంచే వ్యూహాలు రచించడం బడ్జెట్లో కొసమెరుపు. ఈ దిశగా ప్రస్తావించిన మరికొన్ని నిర్ణయాలు సాగుకు ఊతమిస్తాయంటున్నారు. ముఖ్యంగా ఆహారశుద్ధి యూనిట్లను తొలిసారిగా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) నమూనాలో ఏర్పాటు చేయాలని భావించడం గొప్ప నిర్ణయం. వ్యవసాయోత్పత్తులకు విలువ జోడించే అంకుర సంస్థలు ఏర్పాటు చేసే వారికి ఆర్థిక సాయం అందించడం మంచిదే. అంకుర సంస్థలను ఎఫ్‌పీఓలతో అనుసంధానించే కసరత్తు సైతం చేస్తే గ్రామీణ రైతులకు ఆధునిక సాగు ఫలాలు అందుతాయి. రసాయన రహిత వ్యవసాయాభివృద్ధికి ప్రోత్సాహకాలు అందిస్తూ- సేంద్రియ, సహజ వ్యవసాయ విధానాలను విస్తృతంగా ప్రోత్సహిస్తామని పేర్కొనడం ఆహ్వానించదగ్గ అంశం. ఈ మేరకు గంగా పరీవాహక ప్రాంతం వెంబడి ప్రకృతి వ్యవసాయ కారిడార్‌ను ఏర్పాటు చేస్తామనడం హర్షణీయం. యాంత్రీకరణను పెద్దయెత్తున ప్రోత్సహిస్తామని ఆర్థికమంత్రి చెప్పారు. పురుగుమందుల పిచికారీకి కిసాన్‌డ్రోన్లు వినియోగిస్తామన్నారు. రైతులకు వ్యవసాయ పనిముట్లు, యంత్రాలను అద్దె ప్రాతిపదికన అందించాలన్న నిర్ణయం వెల్లడించారు. రెండేళ్ల క్రితమే ఈ ప్రతిపాదనను బడ్జెట్లో ప్రస్తావించినా- నేటికీ అది అమలుకు నోచుకోలేదు.


 

చేయూతనిస్తేనే మనుగడ

రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేయాలన్న మోదీ ప్రభుత్వ లక్ష్యం నెరవేరే సూచనలు కనిపించడం లేదు. ఆ లక్ష్యం సాధించాలంటే రైతుల ఆదాయాన్ని ఈ ఏడాదికల్లా రూ.21,146 కు పెంచాల్సి ఉంది. రైతు ఆదాయం రెట్టింపు కమిటీ (డీఎఫ్‌ఐ) ఇచ్చిన నివేదిక కర్షకుడి సంపాదన సగటున రూ.13 వేలు కూడా దాటలేదని వెల్లడించింది. దేశంలో రైతుల సగటు ఆదాయం ఆరు వేల రూపాయలకు మించి లేదని రెండేళ్లనాడు నీతి ఆయోగ్‌ సైతం పేర్కొంది. వంటనూనెల కోసం దిగుమతులపై ఆధారపడకుండా దేశీయంగా ఉత్పత్తి పెంచే వ్యూహాలను అమలు చేస్తామని కేంద్రం బడ్జెట్లో చెప్పింది. నిజానికి దేశంలో ఆయిల్‌పామ్‌సహా ఇతర నూనెగింజల సాగును విస్తృతంగా చేపట్టేందుకు రెండు దశాబ్దాల క్రితమే ప్రయత్నాలు జరిగాయి. ఈ మేరకు జాతీయ ప్రాజెక్టులెన్నో అమలులోకి వచ్చినా ఫలితం లేకపోయింది. పామాయిల్‌ ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న మలేసియా కంటే ఆయిల్‌పామ్‌ సాగుకు అత్యుత్తమ నేలలు మనకున్నాయి. కానీ, ఈ దిశగా శ్రద్ధ పెట్టకపోవడంవల్లే నేటికీ నూనెగింజల ఉత్పత్తిలో ఆశించిన పురోగతిని సాధించలేకపోయాం. చిరుధాన్యాలను సైతం మద్దతు ధరల జాబితాలో చేరిస్తే కోట్లాది రైతులకు మేలు జరుగుతుంది. ఆపత్కాలంలో నిలదొక్కుకుని ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచిన సాగురంగంపై ఆధారపడిన వారిలో విశ్వసనీయత పెంపొందించడం కేంద్రం బాధ్యత. శక్తిమంతమైన ఆర్థికవ్యవస్థగా రూపాంతరం చెందే క్రమంలో భారత ఆర్థికానికి ఇరుసు లాంటి వ్యవసాయాన్ని విస్మరించడం క్షేమకరం కాదని పాలకులు గుర్తించాలి.

- అమిర్నేని హరికృష్ణ
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ రహస్యాల అన్వేషణలో కీలక అడుగు

‣ ప్రమాదంలో రాజ్యాంగ ప్రమాణాలు

‣ భద్రతా విధానంలోనూ పెడపోకడే

‣ యెమెన్‌లో ఆరని రావణకాష్ఠం

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 04-02-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం