• facebook
  • whatsapp
  • telegram

సేద్య పర్యాటకం.. రైతుకు ఊతం!

ప్రపంచ వ్యవసాయ పర్యాటక దినోత్సవం. సాగు కార్యకలాపాలను పర్యాటకంతో జతచేసి సందర్శకులకు ఉల్లాసాన్ని పంచే వ్యాపార నమూనాయే అగ్రి టూరిజం. ఇది రైతులకు అదనపు ఆదాయాన్ని అందిస్తుంది. గ్రామీణ ఆర్థికానికి ఎంతో మేలు చేకూరుస్తుంది.

వ్యవసాయ పర్యాటకంలో భాగంగా సాగు క్షేత్రాల్లో లేదా ప్రత్యేక అతిథి కేంద్రాల్లో సందర్శకులకు బస ఏర్పాటు చేస్తారు. వారికి స్థానికంగా లభించే సంప్రదాయ వంటలను అందిస్తారు. సాగు కార్యకలాపాలను పర్యాటకులు దగ్గర నుంచి చూడవచ్చు. వారు నేరుగా వాటిలో పాలుపంచుకోవచ్చు. ఇదే అగ్రి టూరిజం మౌలిక స్వరూపమని ప్రపంచ పర్యాటక సంస్థ విశ్లేషించింది. వ్యవసాయ పర్యాటకం వల్ల రైతులకు అదనపు ఆదాయం లభిస్తుంది. తొలుత మహారాష్ట్రలో మొదలైన అగ్రి టూరిజం ప్రస్తుతం వేగంగా విస్తరిస్తోంది. దేశీయంగా  రెండేళ్లుగా నగరాలకు చుట్టుపక్కల ఎన్నో వ్యవసాయ క్షేత్రాలు పుట్టుకొచ్చాయి. చాలా పాఠశాలలు తమ విద్యార్థులను వాటి సందర్శనకు తీసుకెళ్తున్నాయి. గ్రామీణ జీవన విధానం గురించి చిన్నారులు తెలుసుకోవడానికి ఈ క్షేత్రాలు తోడ్పడతాయి. పట్టణ ప్రాంత కుటుంబాలు సైతం తమ పిల్లలతో అప్పుడప్పుడూ ఒక రోజంతా వ్యవసాయ క్షేత్రాల్లో గడిపేందుకు ఆసక్తి చూపుతున్నాయి. కార్పొరేట్‌ ఉద్యోగులూ రిసార్టులు వంటివాటిని కాకుండా వ్యవసాయ క్షేత్రాలను సందర్శిస్తున్నారు. ఒత్తిడి నుంచి వారు బయటపడి ఉల్లాసంగా గడపడానికి అగ్రి టూరిజం తోడ్పడుతోంది. 

భారతదేశానికి వ్యవసాయాన్ని వెన్నెముకగా భావిస్తారు. దేశీయంగా డెబ్భై శాతానికి పైగా జనాభా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాలపై ఆధారపడి జీవిస్తోంది. వృత్తి, వ్యాపారాలతో పోలిస్తే భారత సంస్కృతి అధికంగా వ్యవసాయంతోనే ముడివడి ఉంది. ఈ క్రమంలో రైతులు వ్యవసాయ పర్యాటకం ద్వారా దేశ సంస్కృతిని, పల్లె జీవనాన్ని పర్యాటకులకు పరిచయం చేయడం ద్వారా భిన్న మార్గంలో ఆదాయం ఆర్జించడానికి అవకాశం లభిస్తోంది. ఉద్యోగాల సృష్టి, పేదరిక నిర్మూలన, సుస్థిర మానవాభివృద్ధికి పర్యాటకాన్ని ఒక ప్రధాన సాధనంగా పాలకులు భావిస్తున్నారు. దేశానికి భారీగా విదేశ మారక ద్రవ్యం అందించే రంగాల్లో పర్యాటకం ఒకటి. ప్రపంచవ్యాప్తంగా పర్యాటక రంగం ఏటా నాలుగు శాతం వృద్ధిని నమోదు చేస్తున్నట్లు ప్రపంచ టూరిజం సంస్థ అంచనా వేసింది. ఇండియాలో మాత్రం అది 10.1శాతం వృద్ధితో దూసుకుపోతోంది. ప్రపంచ పర్యాటకంతో పోలిస్తే ఇది రెండున్నర రెట్లు అధికం. ఒక అధ్యయనం ప్రకారం భారత్‌లో అగ్రి టూరిజం ఏటా 20శాతం వృద్ధిని నమోదు చేస్తోంది. 2021లో ప్రపంచ వ్యవసాయ పర్యాటక విపణి విలువ 595 కోట్ల డాలర్లు. 2023-2028 మధ్య ఇండియాలో అగ్రి టూరిజం 19శాతం సమ్మిళిత వార్షిక వృద్ధిరేటును నమోదు చేస్తుందని అంచనా. పర్యాటకులు వ్యవసాయ క్షేత్రాల్లో ఒక రైతు మాదిరిగా గడపడానికి వ్యవసాయ పర్యాటకం అవకాశం కల్పిస్తుంది. అక్కడ పాలు పితకడం, నాగలితో దుక్కి దున్నడం, బావిలో స్నానం, చెట్లు ఎక్కడం, వృక్షాల నుంచి పండ్లను కోయడం, నాట్లు వేయడం తదితర కార్యకలాపాలను వారు స్వయంగా చూడవచ్చు లేదా చేయవచ్చు. దాంతో పట్టణ వాసులు, పిల్లలకు నూతన అనుభూతి సొంతమవుతుంది. పల్లెపట్టుల్లోని సంప్రదాయ వంటలు, ఇతర ఆహార పదార్థాలను వారు రుచి చూడవచ్చు. వ్యవసాయ పర్యాటకం వల్ల రైతులకు సరికొత్త వినియోగదారుల విపణి అందివస్తుంది. దానివల్ల స్థానిక వ్యవసాయ ఉత్పత్తులపై ప్రజల్లో అవగాహన పెరుగుతుంది. సాగు ప్రాధాన్యం, రైతుల సాధకబాధకాలు అందరికీ తెలిసివస్తాయి.

వ్యవసాయ పర్యాటకం వల్ల స్థానికంగా ఉండే వ్యాపారాలు, సేవలు సైతం పుంజుకొంటాయి. దానివల్ల ఉపాధులు పెరుగుతాయి. సంప్రదాయాలు, కళలు, చేతివృత్తుల పరిరక్షణ, పునరుద్ధరణకు అవకాశం దక్కుతుంది. ముఖ్యంగా గ్రామీణ ఆర్థికానికి దీనివల్ల ఎంతో మేలు కలుగుతుంది. ఈ క్రమంలో వ్యవసాయ పర్యాటకాన్ని మరింతగా ప్రోత్సహించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కంకణబద్ధం కావాలి. అవకాశాన్నిబట్టి మరింత మంది రైతులు ఇందులో భాగస్వాములయ్యేలా చూడాలి. పర్యాటక నిర్వాహకులు వ్యవసాయ పర్యాటకం కోసం ప్రత్యేక ప్యాకేజీలు అందించేలా చూడాలి. అగ్రి టూరిజానికి మరింత దన్ను దక్కాలంటే గ్రామీణ, ఆరోగ్య, సాహస పర్యాటకాల్లో దాన్ని సమ్మిళితం చేయాల్సిన అవసరం ఉంది.

- డాక్టర్‌ మైల త్యాగరాజు

(సహాయ ఆచార్యులు, విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం)
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కర్ణాటకలో హోరాహోరీ పోరు

‣ క్వాంటమ్‌ పోటీకి భారత్‌ సై

‣ అద్దెకు రణసేన!

‣ ఆహార శుద్ధితో ఆదాయ స్థిరత్వం

Posted Date: 22-05-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం