• facebook
  • whatsapp
  • telegram

పశ్చిమాసియాలో డ్రాగన్‌ దూకుడుకు చెక్‌!

సౌదీ - ఇరాన్‌ల మధ్య ఇటీవల సయోధ్య కుదర్చడం ద్వారా పశ్చిమాసియాపై చైనా పట్టు పెంచుకుంది. అదే ఊపులో ఇజ్రాయెల్‌ పాలస్తీనా మధ్య శాంతి ఒడంబడిక కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇదీ సాకారమైతే- ప్రాంతీయంగా డ్రాగన్‌ బలీయ శక్తిగా అవతరిస్తుంది. ఈ నేపథ్యంలో ఇండియా, అమెరికా అప్రమత్తమయ్యాయి.

భారత జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్‌ డోభాల్‌ తాజాగా సౌదీలో చేపట్టిన పర్యటన సర్వత్రా ఆసక్తి రేకెత్తించింది. యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ అధ్యక్షతన అమెరికా, యూఏఈల ఎన్‌ఎస్‌ఏలతో ఆయన సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంశాలతోపాటు పశ్చిమాసియా ప్రాంత భద్రత, అభివృద్ధిపై చర్చించారు. పశ్చిమాసియాను ఇండియాతో అనుసంధానించే మెగా రైల్‌ నెట్‌వర్క్‌ ప్రాజెక్టుపైనా వారి భేటీలో సమాలోచనలు జరిగినట్లు తెలుస్తోంది. చైనా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌ (బీఆర్‌ఐ)కు ఇది పశ్చిమాసియాలో ప్రత్యామ్నాయంగా మారగలదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రాంతీయంగా డ్రాగన్‌ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు అవకాశాలుండటంతో ఇండియా, అమెరికా ఈ ప్రాజెక్టుపై ఉత్సుకత కనబరుస్తున్నాయని చెబుతున్నారు. ఈ మెగా ప్రాజెక్టులో భాగంగా తొలుత గల్ఫ్‌, అరబ్‌ దేశాలను పలు రైల్వే నెట్‌వర్క్‌ల ద్వారా అనుసంధానిస్తారు. ఆ మార్గాలన్నింటినీ ఓడరేవులకు కలుపుతారు. అక్కడి నుంచి సముద్ర మార్గాల్లో భారత ఉపఖండానికి రవాణా సదుపాయాలు కల్పిస్తారు. పశ్చిమాసియా క్వాడ్‌గా పిలుచుకునే ఐ2యూ2 (ఇండియా, ఇజ్రాయెల్‌, అమెరికా, యూఏఈ) కూటమి వేదికగా ఇజ్రాయెల్‌ తొలిసారి ఈ భారీ మౌలిక వసతుల సంయుక్త ప్రాజెక్టును ప్రతిపాదించింది. ఇజ్రాయెల్‌ ప్రతిపాదనల్లో సౌదీ అరేబియానూ జత చేర్చడం ద్వారా అమెరికా ఈ ప్రాజెక్టు ప్రణాళికలను విస్తరించింది. పశ్చిమాసియా ఆర్థిక, సాంకేతిక, దౌత్య రంగాల్లో పురోగమించేందుకు అది దోహదపడుతుందని వివరించింది. సౌదీతో అంతగా సత్సంబంధాలు లేకపోవడంతో ప్రాజెక్టు సంబంధిత తాజా చర్చల్లో ఇజ్రాయెల్‌ పాల్గొనలేదు. అయితే మున్ముందు ఈ మెగా ప్రాజెక్టులో అది భాగస్వామిగా మారడం దాదాపు లాంఛనప్రాయంగానే కనిపిస్తోంది.

సౌదీ-ఇరాన్‌ల మధ్య దౌత్య సంబంధాల పునరుద్ధరణ ద్వారా యావత్‌ ప్రపంచాన్ని చైనా ఆశ్చర్యానికి గురిచేసింది. పశ్చిమాసియాలో దీర్ఘకాలంగా ఆధిపత్య ధోరణి కనబరుస్తున్న అమెరికాకు ఆ పరిణామం మింగుడుపడటం లేదు. ఈ నేపథ్యంలో సౌదీతోపాటు పశ్చిమాసియా దేశాలతో సంబంధాలను తిరిగి బలోపేతం చేసుకోవాలని, ప్రాంతీయంగా చైనా దూకుడుకు ముకుతాడు వేయాలని బైడెన్‌ సర్కారు యోచిస్తోంది. ప్రతిపాదిత మెగా రైలు ప్రాజెక్టు అందుకు దోహదపడుతుందని భావిస్తోంది. బీఆర్‌ఐకి ఇది ప్రత్యామ్నాయమవుతుందని ఆశిస్తూ దానిపై ప్రత్యేక ఆసక్తి కనబరుస్తోంది. స్థానికంగా రవాణా సదుపాయాలు మెరుగుపడటంతో పాటు పర్యాటక రంగం పుంజుకొనేందుకు ఆస్కారం ఉంటుంది కాబట్టి పశ్చిమాసియా దేశాల నుంచి మెగా రైలు ప్రాజెక్టుకు వ్యతిరేకత ఎదురయ్యే అవకాశాలు చాలా తక్కువ. రైల్వే రంగంలో ఇండియాకు ఉన్న నైపుణ్యాలను ఈ ప్రాజెక్టులో సద్వినియోగం చేసుకోవాలన్నది ఐ2యూ2 యోచన. దానికి దిల్లీ సుముఖంగానే ఉంది.

అమెరికా, చైనా, రష్యాల తరవాత ప్రపంచంలో నాలుగో అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌ మనది. రోజూ ఇక్కడ దాదాపు 2.4 కోట్ల మంది రైళ్లలో ప్రయాణిస్తుంటారు. 20.3 కోట్ల టన్నుల సరకు రవాణా జరుగుతుంటుంది. ఇప్పటికే శ్రీలంకలో ఇలాంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను భారత్‌ విజయవంతంగా పూర్తిచేసింది. ప్రతిపాదిత ప్రాజెక్టు సైతం దిగ్విజయంగా పూర్తయితే మౌలిక వసతుల కల్పనలో, ముఖ్యంగా రైల్వే రంగంలో ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకోవచ్చు. దానికితోడు- మన దేశ ఇంధన భద్రతకు పశ్చిమాసియా కీలకం. ఆ ప్రాంతంలో బీజింగ్‌ ప్రాబల్యం పెరిగితే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలుంటాయి. కాబట్టి అక్కడి దేశాలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండాలి. పశ్చిమాసియాతో ఇండియా అనుసంధానత మెరుగైతే ముడిచమురు రవాణా వేగవంతమవుతుంది. దీర్ఘకాలంలో మనకు వ్యయాలు తగ్గుతాయి. మరోవైపు- పశ్చిమాసియా దేశాలతో అనుసంధానానికి భూతల మార్గాలను ఉపయోగించుకోకుండా ఇండియాకు పాకిస్థాన్‌ అడ్డంకిగా మారింది. ఈ పరిస్థితుల్లో సముద్రం ద్వారా వాటితో అనుసంధానమయ్యేందుకు మెగా రైలు నెట్‌వర్క్‌ ప్రాజెక్టు ఉపకరిస్తుంది. గల్ఫ్‌ దేశాలతో మన వాణిజ్య బంధం బలోపేతమయ్యేందుకూ దోహదపడుతుంది. గల్ఫ్‌లో పనిచేసే భారతీయులకూ ఈ ప్రాజెక్టు ప్రయోజనకరంగా మారే అవకాశముంది.

- నవీన్‌ కుమార్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కర్ణాటకలో హోరాహోరీ పోరు

‣ క్వాంటమ్‌ పోటీకి భారత్‌ సై

‣ అద్దెకు రణసేన!

‣ ఆహార శుద్ధితో ఆదాయ స్థిరత్వం

Posted Date: 13-05-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం