• facebook
  • whatsapp
  • telegram

ఆధునికీకరణే ఆయువుపట్టు!

‘డ్రిప్‌’ వినియోగంతోనే ఆనకట్టలకు బలం
 

దేశంలో 80శాతం ఆనకట్టలు 25ఏళ్లకు పైబడినవే. కొన్నేళ్లుగా వాటిలో నిర్మాణ, సాంకేతిక, నిర్వహణ లోపాలు బయటపడుతున్నాయి. 92శాతం జలాశయాలు అంతర్రాష్ట్ర నదీ పరీవాహక ప్రాంతాల్లో ఉండటంతో ఏ ప్రభుత్వమూ వాటిని ఆధునికీకరించే ప్రయత్నం చేయడం లేదు. కొన్ని రాష్ట్రాలు నిర్వహణ కోసం నిధులు ఖర్చు చేస్తున్నా, అధిక శాతం కాల్వల మరమ్మతు తదితర పనులకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. సరైన కార్యాచరణ ప్రణాళిక, వనరులు, సాంకేతిక పరిజ్ఞానం లేక... ఆధునికీకరణను విస్మరించడంతోపాటు, నిర్వహణనూ పక్కన పెడుతున్నాయి. దీనివల్ల క్రస్టుగేట్లు బిగుసుకుపోవడం, స్లూయిజ్‌లు పూడుకొని పోవడం, గేట్లు ఊడి ప్రవాహంలో పడిపోవడం, స్పిల్‌వే నుంచి నిత్యం నీరు వృథాకావడం పునరావృతమవుతున్నాయి. మహారాష్ట్రలో మూడు డ్యామ్‌ల నిర్వహణ సరిగ్గా లేదని కేంద్ర జలసంఘం ఇటీవల నోటీసులు జారీచేసింది!.
 

యాభైఏళ్లు దాటినవే అధికం
2019 లెక్కల ప్రకారం దేశంలో మొత్తం అయిదువేలకుపైగా ప్రాజెక్టులుంటే- ఇందులో వందేళ్లకు పైబడినవి 293. యాభై నుంచి వందేళ్ల మధ్య కాలానికి చెందినవి 25శాతం ఉన్నాయి. ఎంత పటిష్ఠంగా నిర్మించినా ప్రతి సీజన్‌లో కనీస మరమ్మతులు చేయడంతో పాటు కాలం గడిచే కొద్దీ తలెత్తే లోపాలను సరిదిద్దాల్సి ఉంటుంది. ఏటా కొత్త వాటికి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసే ప్రభుత్వాలు పాత వాటికి లైనింగ్‌ చేసేందుకైనా ఇష్టపడటం లేదు. ఈ నిర్లక్ష్యం వల్ల స్వాతంత్య్రం వచ్చాక 40 ఆనకట్టలు కూలిపోయాయి. ఇందులో 44శాతం వైఫల్యాలు వరదను అంచనా వేయలేకపోవడంతో, 25శాతం స్పిల్‌వే సామర్థ్యం సరిపోక జరిగితే- 14శాతం ప్రమాదాలకు అధ్వాన నిర్వహణ తీరే కారణం. 1951-60 మధ్య 10 ఆనకట్టలు తెగిపోతే, మళ్ళీ ఆ స్థాయిలో 2001-2010 మధ్య తొమ్మిది ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు అధికంగా రాజస్థాన్‌లో 11, మధ్యప్రదేశ్‌లో 10, గుజరాత్‌లో అయిదు ఆనకట్టలు విఫలమయ్యాయి. 2019 జులైలో మహారాష్ట్ర కొంకణ్‌ ప్రాంతంలో రత్నగిరిలోని తివేర్‌ ఆనకట్ట తెగి 23 మంది చనిపోయారు. 2009 నాటి వరదలప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని శ్రీశైలం జలాశయం పరిస్థితి అధికారుల్ని తీవ్ర ఆందోళనకు గురిచేసింది. దానికి సమీపంలోని కర్నూలు, నల్గొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల ప్రజలను అప్రమత్తం చేయాల్సి వచ్చింది.
 

దేశంలో 40 ప్రాజెక్టుల బాధ్యతలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, అయిదు ప్రైవేటు సంస్థలు పర్యవేక్షిస్తుండగా, మిగతా వాటన్నింటినీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే చూస్తున్నాయి. జాతీయ ఆనకట్టల భద్రత ప్రాధికార సంస్థ అయిదువేల జలాశయాలను పర్యవేక్షిస్తున్నా పనిభారం కారణంగా పూర్తిస్థాయిలో పట్టించుకోవడం లేదు. రాష్ట్రాల నిర్వహణ విభాగాలకు నిధులు కేటాయించడం లేదు. కొన్ని చోట్లయితే అలాంటి విభాగాలే లేవు. ఉన్నచోట్ల సరైన మానవ వనరులు, సంస్థాగత సౌకర్యాలు లేవని ‘ఆనకట్టల పునర్‌వ్యవస్థీకరణ అభివృద్ధి కార్యక్రమం (డ్రిప్‌)’ వెల్లడించింది. ముఖ్యంగా ఆనకట్టల నిర్మాణ లక్ష్యాల్లో వరదల నియంత్రణ ఒకటి. కొన్నేళ్లుగా ఈ విషయాన్ని విస్మరించి వాటిని కాపాడుకునేందుకే ప్రవాహాన్ని దిగువకు వదిలేస్తున్నారు. ఆ నీరే ముంపునకు కారణమవుతోంది. బ్రహ్మపుత్ర, గంగా పరీవాహక ప్రాంతాల్లో ప్రతి వానాకాలంలో ఈ సమస్య తలెత్తుతోంది. ఇటీవలి వర్షాలకు తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కేరళ, మహారాష్ట్రల్లోనూ ఈ సమస్య కనిపించింది. నిర్వహణ సంస్థల వద్ద చాలా కట్టడాల నిర్మాణ సంబంధ రేఖాచిత్రాలూ ఉండటం లేదు. భారీ వరద వస్తే వెంటనే కిందికి పంపేందుకు ప్రస్తుతం ఉన్న మార్గాలు సరిపోవడం లేదు. చాలా చోట్ల ఆగస్టు, సెప్టెంబరు వర్షాలకు వరద అంచనా విఫలమై క్రస్టుగేట్ల పైదాకా నీరొచ్చింది. వరదను సాఫీగా పంపేందుకు నదికి సమాంతరంగా కాల్వలు తవ్వడం, అదనపు గేట్ల ఏర్పాటు దిశగా ఇప్పుడిప్పుడే కొన్ని రాష్ట్రాలు ఆలోచిస్తున్నాయి. కొన్ని రోజులుగా నాగార్జునసాగర్‌ కుడి కాల్వ తొమ్మిదో నంబరు గేటు ఊడి వేల క్యూసెక్కుల నీరు పోతోంది. నిరుడు మూసీ ప్రాజెక్టు గేటు ఊడిపోవడం నిర్వహణలో నిర్లక్ష్యానికి నిదర్శనం.
 

అనుమానాలు తొలగాలి
‘డ్రిప్‌’ ఉపయోగించే నిధుల్లో గరిష్ఠ భాగం ప్రపంచ బ్యాంకువే. ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు నిధులూ ఉన్నాయి. ఈ రుణాలు తీర్చేందుకు- బాగుపడిన జలాశయాలపైనే ఆధారపడాలని కేంద్రం భావిస్తోంది. అంటే పర్యాటకం, చేపల పెంపకం వంటివాటితో వచ్చే ఆదాయాన్ని రుణాలు తీర్చడానికి మళ్లించాలని యోచిస్తోంది. దీంతో తమ ఆదాయానికి గండి పడుతుందేమోనని రాష్ట్ర ప్రభుత్వాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. నీటిపారుదల వ్యవస్థను క్రమంగా కేంద్రం తన గుప్పిట్లోకి తీసుకుంటుందేమోనని ఆందోళన చెందుతున్నాయి. భవిష్యత్తులో ఆయకట్టు రైతులపై ప్రపంచ బ్యాంకు ఒత్తిడి పడుతుందేమోననేది విపక్షాల అనుమానం. ఈ ఆందోళనలు, అనుమానాలను నివృత్తి చేస్తే ఆయా ప్రభుత్వాలు సహకరించి పనుల్లో వేగం పెరిగే అవకాశం ఉంది. నిరుడు తీసుకొచ్చిన ఆనకట్టల భద్రత చట్టం లక్ష్యాలను ‘డ్రిప్‌’ కొంత సాధిస్తోంది. కార్యక్రమం అమలులో ఉన్నప్పుడే కాకుండా రాష్ట్రాలు ఆ స్ఫూర్తిని నిరంతరం కొనసాగించాలి. ఒక్కరోజే అతి తక్కువ విస్తీర్ణంలో పదుల సెంటీమీటర్ల వర్షం పడుతున్న పరిస్థితుల్లో నీటి ప్రవాహం, వర్షపాతం వివరాలు నిత్యం గమనిస్తూ స్పందించే వ్యవస్థను రాష్ట్రాలు సమకూర్చుకోవాలి. రాతి, సిమెంటు కట్టడాల దృఢత్వం, భద్రత పర్యవేక్షణకు ‘డ్రిప్‌’ రూపొందించిన విధివిధానాలు అనుసరణీయం. రాష్ట్ర నీటిపారుదల శాఖ కేవలం నీటి పంపిణీపైనే కాకుండా జలాశయాల బాధ్యతనూ భుజాన వేసుకోగలగాలి. అంతర్రాష్ట్ర ప్రాజెక్టులే ఎక్కువగా ఉండటంవల్ల రాష్ట్రాల నడుమ సమన్వయానికి ఓ వ్యవస్థ అవసరం. వ్యవసాయ సీజన్‌కు ఆటంకం కలగకుండా పనులు చేపట్టాలి. స్థానిక ప్రభుత్వాల సాయంతో చిన్న, పెద్ద, మధ్యతరహా ప్రాజెక్టుల పనులూ చేపడితే వేల మందికి ఉపాధిÅ దొరుకుతుంది. అప్పుడే కేంద్ర జలసంఘం పేర్కొన్నట్లు ‘ఉత్తమ జలాశయాలతో ఉత్తమ ప్రపంచం’ ఆవిష్కృతమయ్యేది!
 

పునరుజ్జీవానికి బాటలు
బహుళార్థ సాధక ప్రాజెక్టుల పునరుజ్జీవానికి కేంద్ర ప్రభుత్వం 2012లో ‘ఆనకట్టల పునర్‌వ్యవస్థీకరణ, అభివృద్ధి కార్యక్రమం(డ్రిప్‌)’ తీసుకొచ్చింది. ఇందులో- ఆనకట్టల పునరుజ్జీవనం, భద్రత, పనితీరు మెరుగుదల, అత్యవసర ప్రణాళిక, నిఘా-నిర్వహణకు పది ఏజెన్సీల సాంకేతిక సాయం తీసుకుంటారు. ఇప్పటికే ఒక దశ పూర్తయింది. రెండు, మూడో దశల కింద రూ.10,211 కోట్లతో 19 రాష్ట్రాల్లో 736 ప్రాజెక్టులను 2021-2031 మధ్య పునరుద్ధరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌వి 31, తెలంగాణవి 29 ఉన్నాయి. మొదటి దశలో 198 ప్రాజెక్టులకు ఆనకట్ట బాగోగులు, పునర్‌వ్యవస్థీకరణ పర్యవేక్షణ వ్యవస్థ, భూకంప ప్రమాద విశ్లేషణ సమాచారం, వరద అంచనాలో కంప్యూటర్‌ ఆధారిత వ్యవస్థలు సమకూర్చడంతోపాటు- క్రస్టుగేట్లు, సిమెంటు నిర్మాణాల పునరుద్ధరణ వంటి పనులెన్నో చేపట్టారు.
 

- భామన్‌
 

Posted Date: 28-11-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని