• facebook
  • whatsapp
  • telegram

సమాఖ్యతత్వమే శ్రీరామరక్ష!

కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలు

కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై చర్చ మళ్ళీ మొదలైంది. దేశ సాంకేతిక విజ్ఞాన, అభివృద్ధి రంగాల్లో మారుతున్న ప్రాథమ్యాలను దృష్టిలో పెట్టుకొని కేంద్రం, రాష్ట్రాల మధ్య అధికారాలను పునర్‌ నిర్వచించాలని; ఆ మేరకు రాజ్యాంగంలోని ఏడో షెడ్యూలుపై సవిస్తర చర్చ జరగాలని పదిహేనో ఆర్థిక సంఘం ఛైర్మన్‌ ఎన్‌.కె.సింగ్‌ తాజాగా వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి జాబితాల్లోని అంశాలను కాలానుగుణంగా మార్చాలన్న వాదన ఇప్పటిది కాదు. సమాఖ్య స్ఫూర్తిని గౌరవిస్తూ; మారుతున్న ఆర్థిక, సామాజిక పరిణామాల దృష్ట్యా రాష్ట్రాలకు మరింత స్వేచ్ఛనిచ్చే విధంగా సంస్కరణలు తీసుకురావాలన్న గళాలు కొంతకాలంగా ఊపందుకుంటున్నాయి. కేంద్ర ప్రాయోజిత పథకాల రూపేణా ఏటా సుమారు ఆరునుంచి ఏడు లక్షల కోట్ల రూపాయల మేర వ్యయం జరుగుతోంది. ఇందులో కేంద్రం వాటాగా మూడున్నర లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు, అంటే స్థూల దేశీయోత్పత్తిలో 1.2శాతం అన్నమాట! ఖర్చు ఇబ్బడిముబ్బడిగా కనిపిస్తున్నా ఆయా పథకాలు రాష్ట్రాల ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా లేవని, ఆ మేరకు పథకాల కూర్పులో సృజనాత్మకంగా మార్పులు చేసుకునే స్వేచ్ఛ రాష్ట్రాలకు ఉండాలని ఎన్‌.కె.సింగ్‌ అభిప్రాయపడ్డారు. కేంద్ర, రాష్ట్ర అధికారాల విభజనపై భారత రాజ్యాంగంలో స్పష్టమైన వివరణలున్నాయి. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలకు కచ్చితమైన అధికార పరిధులు నిర్దేశిస్తూనే; దేనికీ మితిమీరిన అధికారం దఖలుపడకుండా రాజ్యాంగం వాటికి కొన్ని పరిమితులూ నిర్దేశించింది.

పరిమితులతో కూడిన అధికారాలు

రాజ్యాంగంలోని పదకొండో భాగంలో కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై 19 అధికరణల్లో విస్తృత వివరణలున్నాయి. 246-అధికరణ ప్రకారం కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి జాబితాల కింద అధికారాల విభజన జరిగింది. దాని ప్రకారం కేంద్రం తన అధికారాలను వినియోగించుకోకుండా రాష్ట్రాలు దాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అడ్డుకోలేవు. కానీ, ఈ మూడు జాబితాల   పరిధిలోకి రాని ఏ అంశమైనా కేంద్రం అజమాయిషీ కిందికే వస్తుందని అధికరణ-248 స్పష్టం చేస్తోంది. కేంద్ర, ఉమ్మడి జాబితాల్లోని అంశాలపై చట్టాలు చేసేందుకు పార్లమెంటుకు సంపూర్ణ అధికారాలున్నాయి. రాష్ట్ర జాబితాలోని అంశాలపై కేంద్రం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో, మరీ ముఖ్యంగా అది జాతి ప్రయోజనాలతో (అధికరణ-249) ముడివడి ఉన్నప్పుడు మాత్రమే జోక్యం చేసుకోగలుగుతుంది. ఆత్యయిక సందర్భాల్లో (అధికరణ-250) అదీ రెండు లేదా మూడు రాష్ట్రాలు అభ్యర్థించినప్పుడు (అధికరణ-252) రాష్ట్ర జాబితాలోని అంశాలపై చట్టాలు చేసే అవకాశం కేంద్రానికి దఖలుపడుతుంది. రాజ్యాంగంలోని 368-అధికరణ అత్యంత కీలకమైనది. చట్టాల రూపకల్పనకు సంబంధించి పార్లమెంటు అధికార పరిమితులను ఈ అధికరణ స్పష్టంగా విశదపరుస్తోంది. రాష్ట్ర జాబితాలోని అంశాల్లో మార్పులుగానీ, వాటిని ఇతర జాబితాల్లోకి బదలాయిస్తూ పార్లమెంటు చేపట్టే సవరణలుగానీ- రాష్ట్రాల శాసన సభల ఆమోదం తరవాతే చట్టబద్ధతను సంతరించుకుంటాయని ఏడో షెడ్యూలులోని అధికరణ 368(2) తేల్చిచెబుతోంది. రాజ్యాంగ సభలో జరిగిన చర్చల్లో సంవిధాన నిర్మాతలు ఈ అంశంపై విస్తృత చర్చ జరిపారు. సభలోని కొందరు సభ్యులు రాష్ట్రాలు కేవలం చట్టాలను అమలు చేసే ఏజెన్సీలుగానే ఉండాలని అభిప్రాయపడ్డారు. కానీ, మెజారిటీ సభ్యులు అందుకు భిన్నంగా స్పందించారు. రాష్ట్రాల మధ్యగానీ లేదా కేంద్ర రాష్ట్రాలనడుమగానీ ఘర్షణ తలెత్తితే అంతర్రాష్ట్ర మండలి (అధికరణ 263) సహకారంతో విభేదాలను పరిష్కరించుకోవాలని వారు అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ నిర్మాతల ముందుచూపునకు ఇది నిదర్శనం.

సమన్వయమే కీలకం

భారత్‌... రాష్ట్రాల సమాహారం. బహుళత్వానికి, వైవిధ్యతకు మారుపేరైన భారతావనికి పరిధికి మించిన కేంద్రీకరణ సరిపోదు. దానివల్ల అనేక వ్యవస్థలు ప్రతికూలంగా ప్రభావితమవుతాయి. రాజ్యాంగ నిర్మాతలు ఆశించిన లక్ష్యాలకు అలాంటి ప్రయత్నాలు గండికొడతాయి. కేంద్రీకరణపట్ల మితిమీరిన యావ కేంద్రం, రాష్ట్రాల మధ్య పరస్పర విశ్వాసానికి తూట్లు పొడుస్తుంది. కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయ సాధనకు ఏర్పాటైన జాతీయ సమగ్రతా మండలి, అంతర్రాష్ట్ర మండలి కేంద్ర హోంశాఖ సారథ్యంలో బాధ్యతలు నిర్వహిస్తాయి. అలాకాకుండా ఈ రెండు మండళ్లను ఏకం చేసి, ఒక స్వతంత్ర ప్రతిపత్తిగల వ్యవస్థగా తీర్చిదిద్ది, దాన్ని కేంద్ర ప్రభుత్వ విభాగం కింద కాకుండా పార్లమెంటుకు జవాబుదారీగా మారిస్తే బాగుంటుంది. రాష్ట్రాల అవసరాలు, ప్రయోజనాలపట్ల కేంద్రం వీలైనంత మేర సానుకూల ధోరణితో వ్యవహరిస్తే స్ఫూర్తిమంతంగా ఉంటుంది.

సమస్యగా మారిన ‘కేంద్రీకరణ’

పార్లమెంటులో ఏదైనా రాజకీయ పార్టీకి పూర్తి మెజారిటీ దక్కితే- రాష్ట్రాల అధికారాలను కబ్జాచేసేందుకు ప్రయత్నించే సంస్కృతి మన దేశంలో ఏడో దశకంలో మొదలైంది. 1980ల్లో ఆ తరహా సంఘర్షణలు ఊపందుకున్నాయి. సంకీర్ణ ప్రభుత్వాల ఆగమనంతో ఆ తరవాత క్రమంగా ఇలాంటి విభేదాలు సద్దుమణిగాయి. గవర్నర్ల సహకారంతో రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం చలాయించే సంప్రదాయం పదేళ్ల క్రితం వరకూ కొనసాగింది. ఇప్పుడు ఆ పెత్తనం స్వభావం మారింది. మితిమీరిన కేంద్రీకరణ ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సమస్య. ముఖ్యంగా ఆర్థిక అంశాలకు సంబంధించి అధికారాన్నంతా ఒక్కచోట ఒడిసిపట్టాలనే ధోరణి విస్తరిస్తోంది. ప్రధానిగా వాజ్‌పేయీ జమానాలో కేంద్ర, రాష్ట్రాల మధ్య ఘర్షణ వాతావరణం తగ్గించే ప్రయత్నాలు జోరుగా సాగాయి. ఇరుపక్షాల మధ్య వైరుధ్యాలు శ్రుతిమించకుండా 1988లో జస్టిస్‌ సర్కారియా నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ తరవాత ఇదే అంశంపై జస్టిస్‌ ఎం.ఎన్‌.వెంకటాచలయ్య సారథ్యంలో ఏర్పాటైన జాతీయ రాజ్యాంగ సమీక్షా సంఘం 2002 మార్చిలో నివేదిక సమర్పించింది. కేంద్ర, రాష్ట్రాల మధ్య ఘర్షణల నివారణకు ఈ రెండు కమిటీలూ కొన్ని విలక్షణ సూచనలు చేశాయి. అధికరణ-263 కింద ఏర్పాటైన అంతర్రాష్ట్ర మండలిని శాశ్వత వ్యవస్థగా తీర్చిదిద్దాలని సర్కారియా కమిషన్‌ సిఫార్సు చేసింది. మారిన    సామాజిక, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని పూర్తిస్థాయిలో సంస్కరించుకోవాలని కొంతకాలంగా వినిపిస్తున్న డిమాండ్లు హేతుబద్ధమైనవి కావు. భారత రాజ్యాంగం అర్థ సమాఖ్య తత్వాన్ని ప్రబోధిస్తోంది. వివిధ అంశాలపై కేంద్ర, రాష్ట్రాలకు అది చాలినంత వెసులుబాటు ఇస్తోంది. ప్రజా ప్రయోజనావసరాలకోసం కేంద్ర, రాష్ట్రాలు రెండూ నిధులు కేటాయించవచ్చునని అధికరణ-282 స్పష్టంగా చెబుతోంది. విభిన్నమైన సామాజిక నేపథ్యాలు, సవాళ్లతో కూడిన చారిత్రక పరిస్థితుల్లో విధులు నిర్వర్తించిన రాజ్యాంగ నిర్మాతల మేధోపరిధి సువిశాలమైనది. భారతావనికి ఎదురయ్యే అనేక సమస్యలను, సంక్లిష్టతలను వారు ముందుగానే ఊహించగలిగారు. విస్తృత ప్రాతిపదికలతో రాజ్యాంగ నిబంధనలు రూపొందించారు. కాబట్టి, ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని సంస్కరించుకోవడం కన్నా, దాన్ని స్ఫూర్తిమంతంగా ఆచరించే రాజకీయ నిబద్ధతే చాలా ముఖ్యం!

 

Posted Date: 30-12-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం