• facebook
  • whatsapp
  • telegram

సశక్త దేశానికి ఘన ప్రతీక

భారత పార్లమెంటు అంటే- ప్రపంచ జనాభాలో 17.7 శాతం భావి భాగ్యరేఖల్ని ఒద్దికగా తీర్చిదిద్దాల్సిన అత్యున్నత శాసన నిర్మాణ వేదిక. బ్రిటిషర్ల జమానాలో ఏనాడో 1927లో ప్రారంభమైన పార్లమెంటు భవనం తొమ్మిది దశాబ్దాలకు పైగా ఎన్నెన్నో చారిత్రక ఘటనలకు నెలవైన జనస్వామ్య వారసత్వ పేటిక! దాని విశిష్టతను పదిలంగా కాపాడుకుంటూనే దేశ స్వాతంత్య్ర 75వ వార్షికోత్సవం నాటికి స్వయంసమృద్ధ భారతావని సత్తా చాటేలా, ప్రాచీన సంప్రదాయం, భావి తరం ఆకాంక్షల కలబోతలా కొత్త పార్లమెంటు భవన నిర్మాణానికి మోదీ సర్కారు సంకల్పించింది. అవసరాలకు అనుగుణంగా ప్రస్తుత భవనానికి 1975, 2002, 2017 సంవత్సరాల్లో అదనపు హంగులు జతచేసినప్పటికీ లోటుపాట్లు కనిపిస్తున్నాయని, సభ నిర్వహణకు ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానం చాలడం లేదంటూ కొత్త పార్లమెంటు నిర్మాణానికి ఉభయ సభాపతులు చేసిన విజ్ఞప్తిని కేంద్ర సర్కారు మన్నించింది. కొవిడ్‌ నేపథ్యంలో వ్యక్తిగత దూరం సహా పలు జాగ్రత్తలు పాటిస్తూ వానకాల సమావేశాలు నిర్వహించినప్పుడు- స్థలాభావం ఎంత సమస్యాత్మకంగా ఉందో దేశ ప్రజలందరి కళ్లకు కట్టింది. ప్రతిష్ఠాత్మకంగా కేంద్రం తలపెట్టిన సెంట్రల్‌ విస్టా ఆధునికీకరణ ప్రాజెక్టులో భాగంగా కొత్త పార్లమెంటు భవనానికి డిసెంబరు పదో తేదీనే ప్రధాని మోదీ శంకుస్థాపన చేసినా, తన తుది తీర్పును బట్టే తదుపరి కార్యాచరణ ఉండాలని సుప్రీం న్యాయపాలిక నిర్దేశించడం తెలిసిందే. ప్రభుత్వ ప్రాథమ్యాల్ని తాము నిర్దేశించజాలమంటూ సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టుపై అభ్యంతరాల్ని మెజారిటీ తీర్పు కొట్టేయడంతో- రానున్న వందేళ్ల అవసరాలకు దీటైన సమున్నత కళాకౌశల భవన నిర్మాణం వచ్చే ఏడాదికి సాకారం కానుండటం, దేశ ప్రజలందరికీ గర్వకారణమే! భిన్న మతాల్లో త్రికోణమితికిగల పవిత్రతకు ప్రాధాన్యమిచ్చి నయా పార్లమెంటు నమూనాను అలా తీర్చిన ప్రభుత్వం- జాతీయ చిహ్నాలైన నెమలి, కమలం, అరటి చెట్టు ప్రతిబింబించేలా లోక్‌సభ, రాజ్యసభ, కాన్‌స్టిట్యూషన్‌ హాల్‌లను శోభస్కరం చేయనుంది. శ్రేష్ఠ్‌భారత్‌ లక్ష్య సాధనలో ఇదో మైలురాయి!  

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండియా, స్థూల దేశీయోత్పత్తి పరంగా ఆరో స్థానానికి ఎదిగింది. సవరించిన అంచనాల మేరకు ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌ పరిమాణం దాదాపు 27 లక్షల కోట్ల రూపాయలు కాగా, ప్రతిష్ఠాత్మక పార్లమెంటు భవనం కోసం వెయ్యికోట్లు వ్యయీకరిస్తే తప్పు పట్టాల్సిందేముంది? 130 కోట్లు పైబడిన జనాభాగల ఇండియాలో లోక్‌సభ సభ్యుల సంఖ్య కనీసం వెయ్యిగా ఉండాలని భారతరత్న ప్రణబ్‌ ముఖర్జీ అభిలషించారు. పార్లమెంటు సభ్యుల సంఖ్య స్థిరీకరణ 2026తో ముగియనున్న నేపథ్యంలో కేంద్రం 888 మంది సభ్యుల్ని దృష్టిలో ఉంచుకొని లోక్‌సభను తీర్చిదిద్దుతోంది. అదే రాజ్యసభలో 384 మంది కూర్చోగలిగేలా తలపెట్టిన కార్యాచరణలో- వందేళ్ల అవసరాల మదింపు హేతుబద్ధంగా జరిగిందా అన్నది పునరాలోచించాలి. భూకంప ప్రమాద తీవ్రత రీత్యా దేశాన్ని అయిదు జోన్లుగా విభజిస్తే, తీవ్ర భూకంప ముప్పు ఎదుర్కొంటున్న నాలుగో జోన్‌లో సెంట్రల్‌ విస్టా ప్రాంతం మొత్తం ఉంది. 26 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం గల ఈ పరగణాలోనే రాష్ట్రపతి భవన్‌, పార్లమెంటు, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి కార్యాలయాలు, నివాసాలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, సుప్రీంకోర్టు, దిల్లీ హైకోర్టు, దిగువ న్యాయస్థానాలు, ఎంపీలు, మంత్రులు, న్యాయమూర్తులు, త్రివిధ దళాధిపతుల కార్యాలయాలు, నివాసాలు ఇలా ఎన్నో ఉన్నాయి. అత్యంత తీవ్రమైన భూకంపాన్ని తట్టుకోగల విధంగా ఆధునిక సాంకేతికతతో చేపట్టదలచిన భూరి నిర్మాణాలు- భారతావని చిర యశస్సుకు కరదీపికలు కాగలుగుతాయి. ఆత్మనిర్భరతకు ఆనవాళ్లుగా దేశప్రగతి పథ ప్రస్థానాన్ని మరింత సరళతరం వేగవంతం చేయడానికి స్ఫూర్తి రగిలిస్తాయి!

- ఈనాడు ఎడిటోరియ‌ల్‌
 

Posted Date: 12-01-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం