• facebook
  • whatsapp
  • telegram

బలిపీఠంపై భావస్వేచ్ఛ!

రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛ ప్రతి పౌరుడికీ దఖలుపడిన ప్రాథమిక హక్కు. ఏ పాటి విమర్శనూ సహించలేని సర్కార్ల దమన నీతికి సాక్షీభూతంగా నిలిచిన ఐటీ చట్టంలోని 66ఏ విభాగం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు అడ్డంగా కొట్టేసి దాదాపు ఆరేళ్లు అవుతున్నా- దానికింద కేసులింకా నమోదవుతుండటమే సిగ్గుచేటు! అంతర్జాల వేదికలపై ప్రభుత్వాలకు మింగుడుపడని అంశాల మీద అభిప్రాయాల్ని కలబోసుకోవడమే మహాపరాధమన్నట్లుగా 66ఏ సెక్షన్‌ కింద 11 రాష్ట్రాల్లో 1988 కేసులు నమోదయ్యాయి. విచిత్రం ఏమిటంటే, 2015 మార్చి నెలలో సంబంధిత చట్ట నిబంధనను న్యాయపాలిక కొట్టేసిన తరవాతే ఎకాయెకి 1307 కేసుల్ని పోలీసులు బనాయించినట్లు రికార్డులు చాటుతున్నాయి. 66ఏ రద్దుకు ముందు, ఆ తరవాతా పెట్టిన కేసుల్లో 799 ఇంకా పెండింగులోనే ఉన్నాయన్న ఇంటర్నెట్‌ ఫ్రీడమ్‌ ఫౌండేషన్‌- ఇప్పటికీ పోలీసు యంత్రాంగం ఆ చట్టం కింద కేసులు పెడుతూనే ఉందని స్పష్టీకరించింది. వివాదాస్పద నిబంధనపై ‘సుప్రీం’ వేటుకు కారణమైన శ్రేయా సింఘాల్‌ ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి బీజావాపనం జరిగింది మహారాష్ట్రలోనే. 320 పెండింగ్‌ కేసులతో నేడు మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలవడం- భావ ప్రకటన స్వేచ్ఛకు బలిపీఠికగా దాని స్థానాన్ని సుస్థిరం చేసేదే! 66ఏ నిబంధనను తాము దుర్వినియోగం చెయ్యబోమని, వేరెవరికీ ఆ అవకాశం లేకుండా విధి విధానాల్ని కట్టుదిట్టం చేస్తామనీ ఎన్‌డీఏ ప్రభుత్వం భరోసా ఇచ్చినా- భవిష్యత్‌ సర్కార్ల పనిపోకడలకు ప్రస్తుత ప్రభుత్వం ఎలా పూచీపడగలదంటూ దాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అయినా ఆ నిబంధన కింద అనుచిత నిర్బంధాలు ఆగక సాగుతుండటంపై 2019 జనవరిలో కన్నెర్ర చేసిన ‘సుప్రీం’ న్యాయపాలిక- తన ఆదేశాల్ని అతిక్రమించిన అధికారుల్ని జైలుకు పంపుతామనీ హెచ్చరించింది. నాటి తీర్పు ప్రతుల్ని దిగువ కోర్టులకు పంపాలని హైకోర్టులకు, పోలీసుల్లో అవగాహన పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు సూచించినా- క్షేత్రస్థాయిలో భావ ప్రకటన స్వేచ్ఛ క్షతగాత్రమవుతూనే ఉంది!

‘ప్రతివాదన చేయగల అవకాశం ఉన్నంతకాలం- మనకు నచ్చని భావ ప్రకటనను సమర్థంగా ఎదుర్కోవాలేగాని, బలవంతంగా ఎవరి నోరూ నొక్కేయకూడదు’- విఖ్యాత అమెరికన్‌ న్యాయమూర్తి లూయీ బ్రాండిస్‌ వ్యాఖ్య అది. ప్రజాస్వామ్యానికి భావ ప్రకటన స్వేచ్ఛే ప్రాణస్పందన అయినప్పుడు కర్కశ చట్టాలతో దాని పీక నొక్కేయడం అక్షరాలా నిరంకుశత్వమవుతుంది. అంతర్జాల వేదికలపై ఎవరినైనా నొప్పించే వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదంటూ కేరళ పోలీసు చట్టంలో కొత్త నిబంధనలకు చోటుపెట్టిన పినరయి ప్రభుత్వం, విమర్శల ధాటికి వెరచి వెనక్కి తగ్గింది. రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు కొట్టేసిన 66ఏ నిబంధనకు ఎన్నో సారూప్యాలుగల కేరళ సవరణ ప్రస్తుతానికి అటకెక్కినా- ఏమాత్రం విమర్శనూ సహించలేని అసహన ధోరణులే అనేక చోట్ల గజ్జెకట్టి ఆడుతున్నాయి. చట్టబద్ధంగా శాంతి భద్రతల పరిరక్షణకు పాటుపడాల్సిన రక్షక భట యంత్రాంగం- రాజును మించి రాజభక్తి ప్రదర్శనలో రాటుతేలిపోవడంతో, ప్రాథమిక హక్కులూ దిక్కులేనివి అవుతున్నాయి. రాజ్యాంగంలోని 19 (2) అధికరణ భావప్రకటన స్వేచ్ఛ నియంత్రణకు ఎనిమిది ప్రాతిపదికల్ని ప్రస్తావించింది. ఏం మాట్లాడారు, ఎంత పరుషంగా మాట్లాడారు అనే దానికన్నా- ఆ భావ ప్రకటనవల్ల హింసాద్వేషాలు ప్రజ్వరిల్లే ప్రమాదం ఉందా అన్నదే కీలకం కావాలంది. పరుష విమర్శల్నే కాదు, విమర్శనాత్మక విశ్లేషణల్నీ స్వీకరించలేకపోతున్న ప్రభుత్వాల పెడధోరణులే 66ఏ, జాతీయ భద్రతాచట్టం, రాజద్రోహ అభియోగాల్లో ప్రస్ఫుటమవుతున్నాయి. పాలక పక్షాలకు దర్యాప్తు నిఘా సంస్థలు, పోలీసు యంత్రాంగాలు రాజకీయ పనిముట్లుగా దిగజారబట్టే అవ్యవస్థ ఊడలు దిగి విస్తరిస్తోంది. రాజకీయ బాసులకు కాదు, రాజ్యాంగానికి బద్ధులై పోలీసులు నడుచుకొన్నప్పుడే- పౌర హక్కులకు మన్నన దక్కుతుంది!

- ఈనాడు ఎడిటోరియ‌ల్‌
 

Posted Date: 19-01-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం