• facebook
  • whatsapp
  • telegram

విద్యార్థుల నమోదుకు గ్రహణం

చట్టాల అమలుతోనే సమస్య పరిష్కారం

ఏ దేశ అభివృద్ధి అయినా నాణ్యమైన మానవ వనరులపైనే ఆధారపడి ఉంటుందనేది కాదనలేని సత్యం. విద్యార్థులకు బాల్యం నుంచి ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించినప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఇది ప్రభుత్వాల బాధ్యత కూడా. అందుకే బడి ఈడు పిల్లలందరినీ పాఠశాలల్లో చేర్చడం, వారంతా చదువు మానేయకుండా చూడటంపై దృష్టి సారించి సత్ఫలితాలు సాధిస్తున్నాయి. కానీ, కరోనా విసిరిన సవాళ్లకు విద్యావ్యవస్థ అస్తవ్యస్తమైంది. పాఠశాలలు మూతపడటంతో విద్యార్థులు ప్రత్యక్ష బోధనకు దూరమయ్యారు. ఆన్‌లైన్‌ విద్య కేవలం గత విద్య సంవత్సరం పాఠశాలలో నమోదైన పిల్లలకే పరిమితమైంది. అనేక కారణాలతో బడికి దూరమైన విద్యార్థులకు మాత్రం శాపంగా మారింది. ఎందరో బడి ఈడు పిల్లలు విద్యాహక్కును కోల్పోయినట్లయింది. ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం ప్రకారం ఆరు నుంచి 14 ఏళ్ల మధ్య పిల్లలందరూ బడిలో నమోదై, నాణ్యమైన విద్యను పొందాలి. కుటుంబ ఆర్థిక, సామాజిక ప్రతికూలతలు, పెరిగిన డిజిటల్‌ అంతరాలు విద్యార్థులను బడికి దూరం చేస్తున్నాయి. ఉపాధి నిమిత్తం వలస వెళ్లిన కుటుంబాల పిల్లల నమోదు, విద్యపై నీలినీడలు కమ్ముకున్నాయి. బడి మానేసిన విద్యార్థుల్లో అభ్యసన క్షీణతతో పాటు వారిపట్ల దుర్విచక్షణ పెరిగిపోతోందని అనేక అధ్యయనాలు చాటుతున్నాయి. ఫలితంగా ఇప్పటివరకు బాలలు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితుల నుంచి బాల్యాన్ని రక్షించడానికి ప్రభుత్వాలు రూపొందించిన చట్టాలు, చేపట్టిన చర్యలను కరోనా తారుమారు చేసింది. వాటిని ఎదుర్కొని బాలలందరికీ నాణ్యమైన విద్యనందించడం ప్రభుత్వాలకు సవాలుగా మారింది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా సృష్టించిన సంక్షోభంతో బాలల విద్యలో సార్వత్రిక అందుబాటు, నాణ్యత, సమానత సాధించడం ప్రధాన సమస్యగా మారింది. ఈ విపత్తు వల్ల రాబోయే విద్యా సంవత్సరంలో 2.4 కోట్ల మంది పిల్లలు తిరిగి విద్యను కొనసాగించకపోవచ్చని, వీరు ఇప్పటికే బడిబయట ఉన్న 25.8 కోట్ల మంది పిల్లలకు అదనంగా జతపడే అవకాశం ఉందని యునెస్కో నివేదిక ఇటీవల పేర్కొంది. దీనికి తోడు పేద కుటుంబాలు ఉపాధి కోల్పోయి పిల్లలను పనుల్లోకి నెట్టే ప్రమాదం మరింత కనిపిస్తోందని తెలిపింది. ఈ అనిశ్చిత పరిస్థితుల వల్ల భారత్‌లో అమలవుతున్న విద్యాహక్కు చట్టం అమలుకు నోచుకోక దళిత, గిరిజన, బలహీన వర్గాల పిల్లల పరిస్థితి మరింత విషమ స్థితికి చేరుకునే ప్రమాదం ఉందని సైతం నివేదిక హెచ్చరించింది. జాతీయ కుటుంబ సర్వే సంస్థ ప్రకారం ప్రస్తుతం భారతదేశంలో బడి బయట ఉన్న  పిల్లల సంఖ్య 3.22 కోట్లు. ఇది ఏడాది కాలంలో రెట్టింపు అయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. మరోవైపు కైలాస్‌ సత్యార్థి చిల్డ్రన్స్‌ ఫౌండేషన్‌ సర్వే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అనంతరం బాలకార్మిక వ్యవస్థ బలోపేతం కావడంతో పాటు పిల్లల అక్రమరవాణా పెరిగే అవకాశం ఉందని, కార్మిక చట్టాలు దుర్వినియోగమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. బాల్యవివాహాలు కూడా పెరిగే అవకాశాలున్నాయని హెచ్చరించింది. ఈ దుర్విచక్షణకు ప్రధాన కారణం విద్యార్థులు బడిబయట ఉండటమేనని, వారిని బడిలో చేర్పించి నాణ్యమైన విద్యను అందించడమే ఏకైక పరిష్కారమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బడిబయట ఉన్న విద్యార్థుల గుర్తింపు, నమోదు, వారి చదువు కొనసాగింపుపై కేంద్ర విద్యా శాఖ ఇటీవల విడుదల చేసిన మార్గదర్శకాలు ఈ సందర్భంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఈ మార్గదర్శకాల ప్రకారం... స్వచ్ఛంద సేవకులు, స్థానిక ఉపాధ్యాయులు, సమాజ భాగస్వామ్యంతో బడి బయట ఉన్న పిల్లలతో పాటు ప్రత్యేక అవసరాల పిల్లలను గుర్తించాలి. వారికి నిరంతర విద్య అందేలా కృషి చేయాలి. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు బడి బయట ఉన్న 6-18 ఏళ్ల మధ్య వయసు పిల్లల గుర్తింపు కోసం ఇంటింటికీ వెళ్లి సమగ్ర సర్వే నిర్వహించాలి. ప్రవేశోత్సవ్‌, స్కూల్‌ చలో అభియాన్‌, తెలుగు రాష్ట్రాల్లో అమలవుతున్న బడిబాట లాంటి కార్యక్రమాలతో విద్యాసంవత్సరం ప్రారంభంలో ప్రత్యేక నమోదు కార్యక్రమం చేపట్టి, కరోనా నియమావళితో పిల్లల హాజరుపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం కీలకమైన ప్రక్రియ. తరగతుల వారీగా విద్యార్థుల అభ్యసన స్థాయులను గుర్తించి పాఠశాల వాతావరణానికి వారిని సంసిద్ధులుగా చేయాలి. ప్రతి పాఠశాలలో మౌలిక వసతుల కల్పనతోపాటు స్వచ్ఛత కార్యక్రమాలకు పెద్దపీట వేయాల్సి ఉంది. కరోనా నియమావళితో బోధన కొనసాగించడానికి ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. పేద కుటుంబాలకు సామాజిక భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. బడి ఈడు పిల్లలకు పని నుంచి విముక్తి కల్పించాలి. బాలల సంరక్షణ చట్టాలను పటిష్ఠంగా అమలు చేసినప్పుడే బడి ఈడు పిల్లలంతా బడుల్లో ఉండేందుకు మార్గం సుగమమవుతుంది. బాలికల విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం. బడిలో చేరిన పిల్లలకు సంవత్సరంపాటు ప్రత్యేక ఉపకార వేతనం అందించి ఆర్థికంగా ఆదుకోవాలి. ఈ చర్యలు బాల్యానికి మంచి విద్యనందించడంతో పాటు రక్షణ కల్పిస్తాయి.

- సంపతి రమేష్‌ మహారాజ్‌
 

Posted Date: 16-02-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం