• facebook
  • whatsapp
  • telegram

దేశరక్షణకు నిధుల సవాలు

నిరాశ కలిగించిన కేటాయింపులు

సరిహద్దుల్లో చైనా కవ్వింపులు మితిమీరినందువల్ల కేంద్ర బడ్జెట్లో ఈసారి రక్షణ రంగానికి కేటాయింపులు పెరుగుతాయని కొందరు భావించారు. కొవిడ్‌ విసిరిన సవాళ్ల కారణంగా ఆర్థిక వ్యవస్థ చతికిలపడినందువల్ల రక్షణ కేటాయింపులు అనూహ్యంగా పెరగకపోవచ్చనీ మరికొందరు ఊహించారు. బడ్జెట్‌ కేటాయింపుల్ని గమనిస్తే- ఆరోగ్య రంగానికి పెద్దపీట వేసి, రక్షణపై ఆచితూచి వ్యవహరించినట్లు కనిపించింది. కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగానికి చేసిన కేటాయింపులు పెద్దగా ఆశ్చర్యపరచలేదు. ఆరోగ్య రంగానికి నిరుటితో పోలిస్తే కేటాయింపులు 137శాతం పెరగగా, రక్షణకు ఉద్దేశించిన నిధులు మాత్రం బొటాబొటీగా కేవలం 1.48శాతమే పెరిగాయి. కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ కుదేలై, తలెత్తిన అనివార్యతల ప్రభావం రక్షణ కేటాయింపులపై ప్రసరించినట్లు కనిపిస్తోంది. నిరుడు సవరించిన వ్యయం ప్రకారం రక్షణ రంగానికి నాలుగు లక్షల 71వేల కోట్ల రూపాయలు కేటాయించగా, ఈ దఫా ఆ మొత్తాన్ని బడ్జెట్‌ అంచనాల ప్రకారం నాలుగు లక్షల 78వేల కోట్ల రూపాయలకు పెంచారు. అంటే పెరుగుదల కేవలం ఏడువేల కోట్ల రూపాయలు మాత్రమే! భారత సైనిక శక్తి సామర్థ్యాన్ని బలోపేతం చేసేందుకు- స్థూల దేశీయోత్పత్తిలో రక్షణ రంగానికి కేటాయింపులు మూడు శాతం ఉండాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. నిపుణుల మాట ఎలా ఉన్నా- బడ్జెట్లో మాత్రం ఆ వైపు చొరవ కనిపించలేదు.

ఆధునికీకరణకు విఘాతం

స్థూల దేశీయోత్పత్తిలో రక్షణ రంగానికి ఈ ఏడాది చేసిన కేటాయింపుల వాటా 1.63శాతమే. గడచిన పదేళ్లుగా వార్షిక బడ్జెట్లో రక్షణకోసం చేస్తున్న ఖర్చు క్రమంగా తగ్గుతూ వస్తోంది. 2011-’12 ఆర్థిక సంవత్సరానికి రక్షణకు జీడీపీలో కేటాయించిన మొత్తం రెండు శాతం; ఇప్పుడది 0.37శాతం కోసుకుపోయింది. రక్షణకు బడ్జెట్లో రూ.4,78,000 కోట్లు కేటాయించగా, అందులో రూ.1,16,000 కోట్లను పదవీ విరమణ చేసిన సైనికుల పింఛన్లకోసమే ఉపయోగించనున్నారు. రక్షణ సేవలకోసం రూ.3,62,000 కోట్లు వ్యయం చేయనున్నారు, గతంతో (రూ.3,37,000 కోట్లు) పోలిస్తే ఈ మొత్తం పాతిక వేల కోట్ల రూపాయలు అధికం కావడం కొంతలో కొంత ఊరట కలిగించే పరిణామం. ఆయుధాల ఆధునికీకరణ; యుద్ధ ట్యాంకులు, విమానాల కొనుగోలు వంటి నిర్మాణాత్మక అవసరాలకు అక్కరకొచ్చే మూలధన వ్యయం ఈ ఆర్థిక సంవత్సరం రక్షణ కేటాయింపుల్లో రూ.1,35,000 కోట్లుగా ఉంది. కిందటేడు రక్షణ రంగంలో సవరించిన అంచనా మూలధన వ్యయం (రూ.1,34,510 కోట్ల)తో పోలిస్తే ప్రస్తుత కేటాయింపుల్లో పెంపు రూ.490కోట్లు మాత్రమే. అంటే పెరుగుదల 0.5 శాతం కంటే తక్కువేనన్నమాట!

కొన్నేళ్లుగా నిధుల కేటాయింపు చాలినంతగా లేకపోవడంతో త్రివిధ దళాల ఆధునికీకరణ ఆశించినంత వేగంగా జరగడం లేదు. దేశ రక్షణ, సైనిక శక్తి సామర్థ్యాలు, నూతన సవాళ్లను ఎదుర్కొని నిలిచే పటుతర ఆయుధ సంపత్తి వంటివన్నీ కేంద్ర బడ్జెట్లో కేటాయింపుల ద్వారానే సాధ్యపడతాయి. సరిహద్దుల్లో సైన్యం ప్రభావశీలతతో ముడివడిన కీలకాంశానికి తగిన స్థాయిలో ప్రాధాన్యం దక్కడంలేదు. నిరుటి బడ్జెట్లో సవరించిన అంచనా వ్యయం (నికరంగా ఖర్చు చేసిన మొత్తం) ప్రకారం సైన్యానికి రూ.33,213 కోట్లు, నౌకాదళానికి రూ.37,542 కోట్లు, వాయుసేనకు రూ.55,055 కోట్లు కేటాయించారు.

పాఠాలు నేర్పుతున్న గతానుభవాలు

పశ్చిమ, తూర్పు సరిహద్దుల్లో పాకిస్థాన్‌, చైనాల నుంచి కవ్వింపుల నేపథ్యంలో నిరుటితో పోలిస్తే సైన్యానికి రూ.3,269 కోట్ల మేర కేటాయింపులు పెంచి ఆ మొత్తాన్ని రూ.36,482 కోట్లకు తీసుకువెళ్ళిన ప్రభుత్వం- మిగిలిన రెండు రంగాలపై ఆ స్థాయిలో శ్రద్ధ కనబరచలేదు. నౌకా రంగానికి కేటాయింపుల్లో రూ.4,288 కోట్లు కోతపెట్టి ఆ మొత్తాన్ని రూ.33,254 కోట్లకు దిగలాగడం; వాయుసేనకు కేటాయింపులను రూ.1,840 కోట్లు తగ్గించి ఆ మొత్తాన్ని రూ.53,215 కోట్లకు పరిమితం చేయడం గమనార్హం. ఈ ఏడాది రక్షణ రంగానికి బడ్జెట్లో ఆశించిన స్థాయిలో పెద్దపీట వేయలేదన్నది సుస్పష్టం. ఆర్థిక సంక్షోభంనుంచి కోలుకొని, కరోనా సృష్టించిన విలయం నుంచి బయటపడిన తరవాత వచ్చే ఏడాదైనా- జాతి రక్షణకు కీలక ప్రాధాన్యం దక్కుతుందేమో వేచి చూడాలి. రక్షణ విభాగాలను ఆధునికీకరించి, ఎదురవుతున్న సవాళ్లకు దీటుగా సైన్యాన్ని సన్నద్ధం చేయడంపై మొదటి నుంచీ ప్రభుత్వాలు మల్లగుల్లాలు పడుతూనే ఉన్నాయి. ఈ విషయంలో కచ్చితమైన విధానాన్ని రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. స్థూల దేశీయోత్పత్తిలో ఇంత కనిష్ఠ మొత్తాన్ని రక్షణ రంగానికి కేటాయించడం గత ఆరు దశాబ్దాల్లో ఇదే ప్రథమం. దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ సారథ్యంలో ఓ ఏడాది బడ్జెట్‌ కేటాయింపుల్లో రక్షణ రంగానికి కనిష్ఠ ప్రాధాన్యం దక్కింది. దురదృష్టవశాత్తు ఆయన హయాములోనే 1962లో చైనాతో యుద్ధంలో భారత్‌కు పరాభావం ఎదురైంది. దీన్ని హెచ్చరికగా తీసుకొని- రక్షణకు సమధిక ప్రాధాన్యం ఇవ్వడంపై ప్రభుత్వం దృష్టిపెట్టాలి!

- సి.ఉదయ్‌ భాస్కర్‌
(రచయిత- రక్షణ రంగ నిపుణులు)

 

Posted Date: 16-02-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం