• facebook
  • whatsapp
  • telegram

స్వావలంబన పథంలో రక్షణ రథం

ఆయుధ రంగంలో ‘ఆత్మనిర్భరత’

ప్రతి చిన్న అవసరానికీ విదేశాల వైపు చూసే దుస్థితిని మార్చాలన్న మహదాశయంతోనే స్వావలంబన, స్వయం సమృద్ధి అనే మాటలను కొంతకాలంగా ప్రభుత్వాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఆ క్రమంలోనే మోదీ సర్కారు ‘ఆత్మనిర్భరత’ అన్న భావనను బలంగా ప్రజాబాహుళ్యంలోకి తీసుకువచ్చింది. రక్షణ అవసరాలకు సంబంధించి యుద్ధ విమానం మొదలు క్షేత్రస్థాయిలో సైనికులు వాడే తుపాకి తూటాల వరకు విదేశాలపైనే ఆధారపడే దురవస్థను పరిమార్చాలన్నది  కేంద్ర ప్రభుత్వ సంకల్పం. ఆ మేరకు దేశీయ పరిశ్రమలకు దన్నుగా నిలిచి, వాటిని రక్షణ రంగ ఉత్పత్తులకు కేంద్రాలుగా మార్చాలని ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది. శత్రుమూకలపై ఎక్కుపెట్టే ప్రతి ఆయుధాన్ని, ఆత్మరక్షణకు ఉపయోగించే ప్రతి పరికరాన్ని స్వావలంబన బాటపట్టి దేశీయంగానే రూపొందించుకోవడం నేటి చారిత్రక అవసరం. ఆ దృష్ట్యా ‘ఆత్మ నిర్భరత’ అన్న మాట రక్షణ రంగంలో దేశీయ వికాసానికి సరికొత్త బావుటా కావాలి!

సొంత బలం పెంచుకొనే దిశగా...

స్టాక్‌హోమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్‌ (సిప్రి) నివేదిక ప్రకారం- ప్రపంచంలో అత్యధికంగా ఆయుధాలు దిగుమతి చేసుకునే దేశాల్లో సౌదీ అరేబియా తరవాతి స్థానం భారత్‌దే. రఫేల్‌ వంటి ఫైటర్‌ జెట్‌ మొదలు సిపాయిలు ప్రయోగించే సాధారణ ఆయుధాలవరకు అనేక ఉత్పత్తులను విదేశాలనుంచే భారత్‌ దిగుమతి చేసుకుంటోంది. అమెరికా, చైనాల తరవాత రక్షణపై అత్యధికంగా వ్యయం చేస్తోంది భారతదేశమే. చైనా, పాకిస్థాన్‌ వంటి వైరి దేశాలు చుట్టూ ఉండటంవల్ల రక్షణ అన్నది భారతావనికి ఇప్పుడు అత్యంత ప్రాధాన్యాంశంగా మారింది. 2021-22 బడ్జెట్లో రక్షణ రంగంలో కొత్త పరికరాల కొనుగోలు, ఇతర అవసరాలకోసం కేటాయించిన మొత్తంలో 63శాతం అంటే రూ.70,221 కోట్లు దేశీయంగా రక్షణ అవసరాలకు, ఆయుధాల కొనుగోలుకు కేటాయించడం విశేషం. రక్షణరంగానికి సంబంధించి స్వావలంబన బాటపడితే దానివల్ల వివిధ దేశీయ పరిశ్రమలు, అంకురాలు సానుకూలంగా ప్రభావితమవుతాయి. మరోవంక శ్రామిక శక్తికీ పెద్దయెత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభ్యమవుతాయి.

స్వావలంబన క్రమంలో విదేశాలనుంచి దిగుమతి చేసుకుంటున్న 101 ముఖ్యమైన రక్షణ ఉత్పత్తులపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఇటీవల జాబితా రూపొందించింది. మరో జాబితానూ ఇదే తరహాలో త్వరలోనే రూపొందించే అవకాశాలున్నాయి. దీనివల్ల దేశీయ రక్షణ పరిశ్రమలపై ఒత్తిడి పెరుగుతుంది. తక్కువ సమయంలో దేశ అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన రక్షణ ఉత్పత్తులతో ముందుకు రావడం నిజంగా సవాలే. ‘నిషేధిత జాబితాలో ఫిరంగులు, ప్రత్యర్థిపై దాడి చేయడానికి ఉపయోగించే తుపాకులు, చిన్నపాటి యుద్ధ నౌకలు, ప్రతి ధ్వనుల సాయంతో నీటి అడుగున ఉన్న వస్తువుల జాడ తెలుసుకొనే పరికరాలు, రవాణా అవసరాలకు అక్కరకొచ్చే యుద్ధ విమానాలు వంటి అత్యాధునిక ఆయుధ వ్యవస్థలున్నాయి’- భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఇటీవల ఓ ట్వీట్‌లో వెల్లడించిన వివరాలివి. హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌)తో 83 రకాల దేశీయ తేలికపాటి యుద్ధవిమానాల (ఎంకే 1ఏ తేజస్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌) తయారీకోసం ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకొంది.  పదివేల కోట్ల రూపాయలతో సంచిత నిధి ఏర్పాటు చేసి, దేశీయంగా ఉన్న చిన్న, మధ్య తరహా రక్షణ పరిశ్రమలకు ప్రోత్సాహం అందించడంతోపాటు; అంకురాలకు దన్నుగా నిలవాలని నిర్ణయించారు. దానితోపాటు స్థానిక తయారీ సంస్థలను ప్రోత్సహించి, వాటిని రక్షణ పరికరాల ఉత్పత్తివైపు నడిపించాలనీ నిర్ణయించారు. అత్యవసర సాంకేతిక విభాగాల్లో పరిణతి, పురోభివృద్ధి సాధించే క్రమంలో పరిశోధనల కోసం డీఆర్‌డీఓ సారథ్యంలో దేశవ్యాప్తంగా ఎనిమిది అత్యాధునిక సాంకేతిక కేంద్రాల ఏర్పాటును తలపెట్టారు. భారత్‌లో యూనిట్లు స్థాపించేందుకు అంతర్జాతీయ స్థాయి రక్షణ పరికరాల తయారీ సంస్థలను ప్రోత్సహించడంతోపాటు, దేశీయ కంపెనీలతో ‘జాయింట్‌ వెంచర్లు’ కుదుర్చుకునేందుకూ వాటికి అవకాశం ఇవ్వనున్నారు. దేశ రక్షణ ఉత్పత్తి, ఎగుమతుల ప్రోత్సాహక విధానం (డీపీఈపీపీ 2020); రక్షణ ఉత్పత్తుల సమీకరణ విధానం (డీఏపీ)-2020 ప్రకారం ఆయుధ తయారీలో స్వావలంబన దేశానికి అత్యంత కీలకం.

యుద్ధ సన్నద్ధత కీలకం

రక్షణ విభాగం, సాయుధ బలగాలు, దేశీయ రక్షణ పరిశ్రమల మధ్య నిర్మాణాత్మక అనుసంధానం, అవగాహన పెంచడమే ‘ఆత్మ నిర్భర్‌’కు అర్థం... పరమార్థం! అమెరికా, పశ్చిమ ఐరోపా దేశాల్లో రక్షణ పరిశ్రమకు, ప్రభుత్వాలకు మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. దేశ రక్షణకు ఎప్పుడు, ఏం కావాలన్న విషయంలో వాటి మధ్య అద్భుతమైన సమన్వయం, అవగాహన ఉంటాయి. దురదృష్టవశాత్తు భారత్‌లో రక్షణ పరిశ్రమలకు, ప్రభుత్వానికి మధ్య ఏమాత్రం సమన్వయం, సహకారం లేవు. సరిహద్దుల్లో రెండువైపులనుంచీ యుద్ధ ముప్పును ఎదుర్కొంటున్న దేశంగా భారత్‌ ఎల్లవేళలా సమరసన్నద్ధంగా ఉండాలి. తక్షణ యుద్ధ అవసరాల విషయంలో అప్రమత్తత తప్పనిసరి. స్వావలంబన పథంలో ఇప్పుడిప్పుడే అడుగు మోపిన దేశీయ రక్షణ పరిశ్రమలకు కొన్ని రకాల ఆయుధాలు, పరికరాల తయారీకి ఎక్కువ సమయమే పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఆలస్యం చేయకుండా సాధ్యమైనంత సత్వరం దేశీయ రక్షణ పరిశ్రమలను పట్టాలకెక్కించాలి. ఒకవైపు ‘ఆత్మనిర్భర్‌’ గురించి బలంగా మాట్లాడుతూ, మరోవంక రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 49శాతంనుంచి 74శాతానికి పెంచాలంటూ ప్రభుత్వం నిర్ణయించడం అయోమయానికి దారితీస్తోంది. అంతర్జాతీయ రక్షణ ఉత్పత్తి సంస్థలను భారతావనిలోకి ఎర్రతివాచీ పరచి పెద్దయెత్తున ఆహ్వానిస్తే- ఇక దేశీయ రక్షణ పరిశ్రమ ఎదుగుదలకు అవకాశం ఎక్కడుంటుంది? అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, భారీ పెట్టుబడులు, నిపుణ కార్మిక శక్తి వంటి సానుకూలతలున్నప్పుడే అంతర్జాతీయ స్థాయి కంపెనీలతో దేశీయ రక్షణ కంపెనీలు పోటీపడగలవు. ఇందుకోసం కేవలం స్వావలంబన పేరిట నినాదాలకే పరిమితం కాకుండా- క్షేత్రస్థాయిలో అసలైన ప్రోత్సాహకాలతో ప్రభుత్వం ముందుకు రావాలి. అప్పుడే అంతర్జాతీయ పోటీని తట్టుకుని భారతీయ రక్షణ పరిశ్రమ నిలదొక్కుకోగలదు. భారతీయ రక్షణ ఎగుమతులు 2015-’19 మధ్యకాలంలో దాదాపు 700 శాతం పెరిగాయి. దృఢ సంకల్పంతో, స్థిరమైన పెట్టుబడులతో కదలితే... రక్షణ రంగంలో ‘ఆత్మ నిర్భరత’ను సాధించడం అసాధ్యమైన విషయమేమీ కాదు.

దిగుమతి నిషేధ జాబితా

సాయుధ దళాలు, డీఆర్‌డీఓ, రక్షణ రంగంలోని పీఎస్‌యూలు, ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ, ఆయుధ తయారీ ప్రైవేటు సంస్థలతో చర్చల అనంతరం విదేశాలనుంచి దిగుమతి చేసుకునే రక్షణ రంగ ఉత్పత్తుల నిషేధ జాబితా రూపొందించారు.  2020-2024 కాలానికి ఈ నిషేధం అమల్లో ఉంటుంది.

మరిన్ని రక్షణ ఉత్పత్తులను దిగుమతుల నిషేధ జాబితాలో చేర్చేందుకు సంసిద్ధమవుతున్నట్లు రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటించారు.

స్థానిక కంపెనీలకే కాంట్రాక్టులు

వచ్చే ఆరేడేళ్లలో భారతీయ కంపెనీలకు రక్షణ ఉత్పత్తుల రూపేణా నాలుగు లక్షల కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్టులు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది. దేశీయంగానే రక్షణ ఉత్పత్తుల సమీకరణకు ఈ ఏడాది సుమారు రూ.70వేల కోట్లు కేటాయించారు.

మరఫిరంగులు, చిన్నసైజు యుద్ధ నౌకలు, నీటి అడుగున ఉన్న వస్తువులను ప్రతిధ్వనుల సాయంతో పసిగట్టే రక్షణ పరికరాలు, రవాణా యుద్ధ విమానాలు, రాడార్లు వంటివాటిని దేశీయంగానే తయారు చేసుకోవాలని నిర్ణయం.

- సంజీవ్‌ కె.బారువా

Posted Date: 13-03-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం