• facebook
  • whatsapp
  • telegram

జనోద్యమంగా జలసంరక్షణ

దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం

వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకే కాదు- సకల ప్రాణుల మనుగడకూ అత్యవసరమైన ప్రాకృతిక వనరు... నీరు. వాతావరణ మార్పులు, మితిమీరిన వినియోగం, నదీప్రవాహాల్లో తీవ్రమైన హెచ్చుతగ్గులు, అతివృష్టి అనావృష్టుల వల్ల వర్షాలు గతి తప్పుతున్నాయి. భూగర్భ జలమట్టాలు పడిపోవడం, నీటి నాణ్యత నానాటికీ తీసికట్టుగా తయారవుతున్నందువల్ల జల సంరక్షణ, నిర్వహణ పద్ధతుల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురాక తప్పదు. వర్షాధార భారతంలో వాన నీటి సంరక్షణ యుద్ధ ప్రాతిపదికన జరగాలి. లేదంటే ఈ గడ్డపై జీవుల మనుగడకే ప్రమాదం పొంచిఉంది. ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 28నాటి ‘మన్‌ కీ బాత్‌’లో వాన నీటి సేకరణ, సంరక్షణకు, మన జలవనరుల ప్రక్షాళనకు అత్యంత ప్రాధాన్యమిచ్చారు. తదనుగుణంగా ప్రపంచ జల వనరుల దినమైన మార్చి 22న కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో దేశమంతటా జలశక్తి అభియాన్‌ రెండో దశకు శంఖం పూరించారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా సర్పంచులు, జిల్లా మేజిస్ట్రేట్లను ఉద్దేశించి ప్రసంగించారు. అందరూ జల్‌ సంచయ్‌(జల సంరక్షణ)ను జన్‌ ఆందోళన్‌(ప్రజా ఉద్యమం)గా చేపట్టాలని పిలుపిచ్చారు. దీన్ని పురస్కరించుకుని సర్పంచులు అందరూ తమతమ పంచాయతీలలో జల సంరక్షణ ఇతివృత్తంగా గ్రామ సభలను నిర్వహించి జల శపథాలు పట్టారు.

పెరుగుతున్న అవగాహన

జలశక్తి అభియాన్‌ (జేఎస్‌ఏ) మొదటి దశ కింద 2019 జులై-నవంబరు మధ్య కాలంలో జల సంరక్షణ ఉద్యమం నిర్వహించారు. నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న 256 జిల్లాల్లోని 1,592 బ్లాకుల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ బ్లాకుల్లో భూగర్భ జలాన్ని మితిమీరి తోడేయడంతో తీవ్ర నీటి కొరత ఏర్పడింది. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా జేఎస్‌ఏని చేపట్టాయి. నీటి సంరక్షణ-వాన నీటి సేకరణ; చెరువులు, బావుల వంటి సంప్రదాయ జలవనరుల పునరుద్ధరణ; నీటి పునర్వినియోగం, జల వనరుల పునఃపూరణ; వాటర్‌షెడ్‌ అభివృద్ధి; భారీయెత్తున అడవుల పెంపకమనే అయిదు లక్ష్యాల సాధనపై జేఎస్‌ఏ దృష్టి కేంద్రీకరించింది. కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శులు/ అదనపు కార్యదర్శుల నాయకత్వంలో సాంకేతిక అధికారులు నీటి ఎద్దడి ఏర్పడిన 256 జేఎస్‌ఏ జిల్లాలను మూడుసార్లు సందర్శించారు. జేఎస్‌ఏ కింద తీసుకుంటున్న చర్యలను జిల్లా యంత్రాంగం ఈ అధికార బృందాలకు ఎప్పటికప్పుడు తెలియజేస్తోంది. జలశక్తి అభియాన్‌ మూలంగా అన్ని ప్రభుత్వ విభాగాలు, సంస్థలు, ప్రభుత్వాధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, పంచాయతీలు, పౌరుల్లో నీటి సంరక్షణ ఆవశ్యకత గురించి అవగాహన, చైతన్యం పెరిగాయి. ఈ 256 జిల్లాల్లో జేఎస్‌ఏ కింద మొత్తం 3.3 లక్షల వాన నీటి సంరక్షణ కట్టడాలు, వాటర్‌ షెడ్‌ నిర్మాణాలను పూర్తిచేశారు. 16,000 సంప్రదాయ జలాశయాలను పునరుద్ధరించారు. 228 జిల్లా యంత్రాంగాలు జేఎస్‌ఏ మొదటి దశ కింద జల సంరక్షణ ప్రణాళికలను రూపొందించుకున్నాయి. ఆధునిక సాంకేతికతలతో శాస్త్రీయ జల సేకరణ, సంరక్షణ ప్రణాళికల రూపకల్పన జేఎస్‌ఏ రెండో దశ కింద ప్రతి జిల్లా రిమోట్‌ సెన్సింగ్‌ ఉపగ్రహాలు, జీఐఎస్‌ మ్యాపింగ్‌ సాంకేతికతల సాయంతో తమ భూభాగంలోని జలవనరులను, నీటి నిల్వ వసతులను గుర్తించి, మరిన్ని నిల్వ వసతుల నిర్మాణం చేపడతాయి. దీనివల్ల అవసరమైన వెంటనే మరమ్మతులు చేపట్టడం వీలవుతుంది. ఈ పనుల కోసం మొబైల్‌ యాప్‌ను రూపొందించారు. జల శక్తి అభియాన్‌లో తాము సాధిస్తున్న పురోగతిని జిల్లా యంత్రాంగాలకు ఎప్పటికప్పుడు తెలియడానికి ప్రత్యేక పోర్టల్‌ను ప్రారంభించారు.

కేంద్రం, రాష్ట్రాల సమన్వయం

ఇంతవరకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు విడివిడిగా చేపడుతున్న జేఎస్‌ఏ పథకాలను ఇకనుంచి ఆర్థిక, సాంకేతిక, నిర్వహణ పరంగా సమన్వయం చేస్తారు. ప్రజా ఉద్యమ నిర్మాణం కేవలం వాన నీటి సంరక్షణకే పరిమితం కాకుండా, ప్రజలంతా ఈ మహోద్యమంలో పాలుపంచుకునేలా ప్రోత్సహించడం జేఎస్‌ఏ రెండో దశ ధ్యేయం. జల సంరక్షణ, భూగర్భ జల పొరల పునఃపూరణ వంటి కార్యక్రమాల్లో ప్రభుత్వ విభాగాలకు తోడు సాధారణ పౌరులు, స్వచ్ఛంద సంస్థలు, రైతులు, విద్యార్థులు, మహిళా స్వయంసహాయక బృందాలు, యువజన సంఘాలు, పంచాయతీ రాజ్‌ సంస్థల సభ్యులు పెద్దయెత్తున పాల్గొంటేనే ఆశించిన ఫలితాలను అందుకోగలం. జలశక్తి శాఖ నుంచి ఆర్థిక గ్రాంటు జేఎస్‌ఏ రెండో దశ కింద జీఐఎస్‌ మ్యాపింగ్‌ చేపట్టడం కోసం ప్రతి జిల్లాకు ప్రోత్సాహకంగా కేంద్ర జలశక్తి శాఖ తలా రెండు లక్షల రూపాయల చొప్పున కేటాయిస్తుంది. జేఎస్‌ఏ మొదటి దశలో సాధించిన ప్రయోజనాలను నిలబెట్టుకొంటూనే రెండో దశలో సాధించబోయే విజయాలను మరింత ముందుకుతీసుకెళ్ళాలి. అన్ని రకాల జలాశయాల డిజిటల్‌ పట్టికను, సంబంధిత వివరాలను భాగస్వాములకు అందుబాటులో ఉంచాలి. చెరువులు కబ్జా కాకుండా విద్యార్థులు, స్వచ్ఛంద సేవకులతో, స్థానిక ప్రజలద్వారా నిఘా పెంచవచ్చు. స్వచ్ఛంద శ్రమదానానికి అందరూ సిద్ధం కావాలి. జల సంరక్షణ రీతుల్లో రైతులకు శిక్షణ ఇచ్చి, వారు ఉత్సాహంగా కర్తవ్యం నిర్వహించేట్లు చూడాలి. అధికంగా నీరు అవసరమయ్యే పంటలకు సూక్ష్మ నీటిపారుదల పద్ధతులను వర్తింపజేయాలి. అన్ని ప్రభుత్వ భవనాలూ వాన నీటి సేకరణ, నిల్వను విధిగా చేపట్టాలి. పలు పాఠశాల భవనాలకు ఇటువంటి ఏర్పాట్లు చేసినా అవి సరిగ్గా వినియోగంలోకి రావడం లేదు. జల శక్తి అభియాన్‌ ముగిసిన తరవాత, ఈ కార్యక్రమంలో సాధించిన విజయాలను, నిర్మించిన కట్టడాలను కాపాడుకొనేందుకు ప్రతి జిల్లాలో ప్రత్యేక సెల్‌ను నెలకొల్పాలి.

‘వాననీటిని ఒడిసిపట్టు’

జలశక్తి అభియాన్‌ రెండో దశ కింద అన్ని రాష్ట్రాలు, సంబంధిత శాఖలు, సంస్థలు ప్రజా భాగస్వామ్యంతో వర్షజలాల సేకరణ, సంరక్షణ  నిర్మాణాలను చేపడతాయి. నేల పొరల స్వభావాన్ని, మారుతున్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వానా కాలం రావడానికి ముందే వర్షజలాల సేకరణ, నిల్వ కట్టడాల నిర్మాణాన్ని పూర్తిచేస్తాయి. భవనాల పైకప్పుల మీద కురిసే వాన నీటిని సేకరించి ఇంకుడు గుంతలో నిల్వచేయడం, నీటి చెలమలు, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం వంటివి జేఎస్‌ఏ రెండో దశ కింద పెద్దయెత్తున చేపడతారు. ‘వాన నీటిని ఒడిసిపట్టు’ నినాదంతో ఈ కార్యక్రమాలను చేపడతారు. జిల్లాల్లోని చెరువులు, ఇతర జలవనరులను లెక్కించి, జియో ట్యాగ్‌ చేస్తారు. ఆక్రమణలను నిర్మూలించి- చెరువులు, ఇతర జలాశయాల్లో పూడిక తీసి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుతారు. దిగుడు బావులకు మరమ్మతులు చేస్తారు. ఎండిపోయిన బోరు బావుల్లోకి వాన నీటిని పంపి భూగర్భ జల పొరలను పునఃపూరిస్తారు. నదులను పునరుద్ధరించడం, చిత్తడి నేలల సంరక్షణ, పునరుద్ధరణ వంటి కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తారు. జేఎస్‌ఏ రెండో దశలో చేపడుతున్న వినూత్న చర్యల కింద- అన్ని జిల్లాల్లో జల సంరక్షణపై కార్యక్రమాలను ఈ ఏడాది వానాకాలం రావడానికి ముందే మొత్తం 729 జిల్లాల్లోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చేపట్టదలచారు.

Posted Date: 29-03-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం