• facebook
  • whatsapp
  • telegram

నగర జీవికి నీటి వెతలు

ముంచుకొస్తున్న జల సంక్షోభం

విశ్వవ్యాప్తంగా నగరాల్లో నీటి సంక్షోభం ముంచుకొస్తోంది. భూగర్భ జలం పూర్తిగా అడుగంటిపోయే- ‘డేజీరో’ ముప్పు పొంచి ఉండటమే ఇందుకు కారణం. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర నీటి ఎద్దడి నెలకొన్న నగరాల్లో భారత్‌కు చెందినవే 30 దాకా ఉన్నాయి. నీతిఆయోగ్‌ ఇటీవల విడుదల చేసిన సంయుక్త జల నిర్వహణ సూచీ ప్రకారం- హైదరాబాద్‌, దిల్లీ, బెంగళూరు, చెన్నై వంటి నగరాలు ‘డే జీరో’ స్థితికి అతి చేరువలో ఉన్నాయి. 2019లో చెన్నైలో సంభవించిన తీవ్ర నీటి ఎద్దడి లాక్‌డౌన్‌ వాతావరణాన్ని తలపించింది. హోటళ్లు, రెస్టారెంట్లు, వ్యాపారాలన్నీ మూతపడ్డాయి. సమర్థమైన జల సంరక్షణ చర్యలు చేపట్టకపోతే 2030నాటికి దేశంలోని ప్రధాన నగరాలన్నీ దాహార్తితో అల్లాడుతాయని ‘వరల్డ్‌ వైడ్‌ ఫండ్‌ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌)’ నివేదిక వెల్లడించింది. నీటి ఒత్తిడి సూచీ ప్రకారం జల సంక్షోభం ముప్పు పొంచి ఉన్న దేశాల్లో భారత్‌ 46వ స్థానంలో ఉంది.

వ్యవస్థలకు సవాలు

భూగర్భ జలాలు అడుగంటుతూ ఉండటానికి- శరవేగంతో సాగుతున్న పట్టణీకరణ, భారీగా నీటి వినియోగం పెరగడం, వాతావరణ మార్పులు, జలవనరుల విధ్వంసం ముఖ్య కారణాలు. వలసలతో నగరాల్లో జనాభా కిక్కిరిసిపోవడంవల్ల నీటి వినియోగం రెండింతలవుతోందని నీతిఆయోగ్‌ వెలువరించిన ‘సమీకృత నీటి నిర్వహణ సూచీ’ వెల్లడించింది. సంవత్సరానికి 1.5శాతం చొప్పున- 1990నుంచి తలసరి నీటి లభ్యత రేటు పడిపోతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. భారత్‌లోని నగరాల సగటు జనాభా పెరుగుదల రేటు 49శాతం. 2035నాటికి సుమారు 15 కోట్ల నగర జనాభా నీటి అవసరాలను తీర్చాల్సి ఉంటుంది. భారీగా పెరుగుతున్న జనాభా నీటి అవసరాలను పరిమిత జల వనరులతో తీర్చగలిగేలా కార్యాచరణను రూపొందించడం పురపాలికల ముందున్న అతి పెద్ద సవాలు. వాతావరణ మార్పుల దుర్బలత్వ సూచీలో మన దేశాన్ని అధిక ముప్పు ఉన్న దేశంగా గుర్తించారు. 2015తో పోలిస్తే 2060నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో అయిదు శాతం మేర వరస నీటి కరవు దినాలు పెరుగుతాయని అధ్యయనాలు చాటుతున్నాయి. రక్షిత మంచి నీటి సదుపాయానికి నోచుకోక, జబ్బుల బారిన పడటంతో దేశంలో ఏటా రెండు లక్షల మంది మృత్యువాత పడుతున్నారు. తీవ్ర నీటి కొరతవల్ల జీడీపీకి వాటిల్లుతున్న నష్టం ఏటా ఆరు శాతమని నీతిఆయోగ్‌ తేల్చింది. పారిశ్రామిక వ్యర్థాల కారణంగా నగరాల్లోని నీటి వనరులు కాలుష్య కాసారాలుగా మారుతూ ప్రజలను అనారోగ్యం బారిన పడేస్తున్నాయి. దేశంలో నానాటికీ పెచ్చరిల్లిపోతున్న నీటి సంక్షోభానికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు ప్రత్యేకించిన పథకాలకు రూపకల్పన చేసింది. 2024నాటికి దేశమంతా కుళాయిల ద్వారా మంచి నీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆకర్షణీయ నగరాల్లో మంచి నీటి సరఫరా మౌలిక వసతుల నిర్మాణం కోసం అమృత్‌ పథకాన్ని ప్రారంభించింది.  

దేశంలో 64శాతం సాగునీటి అవసరాలకు, గ్రామీణ ప్రాంతాల్లో 85శాతం తాగునీటి అవసరాలకు, 50శాతానికి పైగా పట్టణ అవసరాలకు భూగర్భ జలాలనే విరివిగా వినియోగిస్తున్నారు. ప్రపంచంలో అతి పెద్ద భూగర్భజల వినియోగదారు భారతదేశమే. ప్రతి సంవత్సరం సుమారు 25వేల కోట్ల ఘనపు మీటర్లకుపైగా భూగర్భ జలాన్ని విచక్షణారహితంగా తోడేస్తున్నారు. పారిశ్రామిక అవసరాల కోసం భారీయెత్తున భూగర్భ జలాన్ని వినియోగించడం కూడా నగరాల్లో తీవ్ర నీటి కొరతకు కారణమవుతోంది. బెంగళూరు, దిల్లీ, అహ్మదాబాద్‌లలో 1998-2020 మధ్య భూగర్భజల మట్టాలు 80శాతం పడిపోయాయి. ఇది ఇలాగే కొనసాగితే, తీవ్ర నీటి ఎద్దడికి దారి తీసే ప్రమాదం ఉంది.

ఉరుముతున్న ఎద్దడి

నీటికి డిమాండ్‌ పెరగడం అంటే జల వనరులపై ఒత్తిడి పెరగడమే. ఈ నేపథ్యంలో పటిష్ఠమైన జల సంరక్షణ చర్యలు అత్యంత ఆవశ్యకం. పరిశ్రమల్లో సౌర విద్యుత్తును వినియోగించడం వల్ల నీటి వాడకాన్ని తగ్గించే వీలుంది. వాన నీటిలో ఎనిమిది శాతమే తిరిగి భూమిలోకి ఇంకుతోంది. ప్రతి వర్షం నీటి చుక్కనూ ఒడిసిపట్టే ప్రయత్నం జరగాలి. ఇంకుడు గుంతలను విస్తృతంగా ప్రోత్సహించాలి. శుద్ధి చేసిన మురుగు నీటిని పారిశ్రామిక అవసరాలకు వినియోగించాలి. నదీ జలాల్లో పారిశ్రామిక వ్యర్థాలు చేరకుండా కఠిన నియంత్రణలు అమలు చేయాలి. నగరాల్లోని చెరువులు, కుంటల ఆక్రమణలను నిరోధించి వాటికి తాగునీటి జలాశయాలుగా పునరుజ్జీవం కల్పించాలి. నగరాల్లో తాగునీటి సరఫరాలో లీకేజీలను తగ్గించాలి. సహజ వనరుల సద్వినియోగంపై అశోక్‌ చావ్లా కమిటీ చేసిన ఉపయుక్తమైన సూచనలను అమలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి నీటి చుక్కా విలువైనదిగా భావించి పౌరులు పొదుపుగా వ్యవహరించడం అలవాటు చేసుకోవాలి. పౌరులు, ప్రభుత్వాల సమష్టి కృషి, పటిష్ఠమైన ప్రణాళికా రచన, సాంకేతికత జోడించిన సమర్థ నీటి నిర్వహణ వ్యవస్థలతో- ఉరుముతున్న నీటి సంక్షోభాన్ని నివారించవచ్చు. ‘డే జీరో’ను దరిదాపుల్లోకి రాకుండా నిరోధించవచ్చు. ఈ లక్ష్య సాధన కోసం నీటి సంరక్షణను, నిర్వహణను ఒక యజ్ఞంలా చేపట్టాల్సిన బాధ్యత అందరిమీదా ఉంది.

- పుల్లూరు సుధాకర్‌
(పట్టణాభివృద్ధి వ్యవహారాల నిపుణులు)

 

Posted Date: 10-04-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం