• facebook
  • whatsapp
  • telegram

రాజ్యాంగ హక్కుగా ఆరోగ్యం!

కొవిడ్‌ సంక్షోభంతో తల్లడిల్లుతున్న బాలల యోగక్షేమాలు చూసుకోవడానికి అన్ని దేశాలు ప్రత్యేక కార్యబృందాలను నియమించాలని నోబెల్‌ బహుమతి గ్రహీత కైలాస్‌ సత్యార్థి కోరుతున్నారు. స్వదేశంలోనూ, విదేశాల్లోనూ చిన్న పిల్లలకు ఆరోగ్యవంతమైన బాల్యం అందించడానికి ఆయన చిరకాలంగా పాటుపడుతున్నారు. సత్యార్థి పోరాటం వల్లనే భారత్‌లో 90,000 మంది బాలలకు వెట్టిచాకిరీ నుంచి విముక్తి లభించింది. 2015లో ప్రపంచంలోని గొప్ప నాయకుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన సత్యార్థి... 2025కల్లా అన్ని దేశాల్లో బాల కార్మిక దురాచారాన్ని రూపుమాపడానికి కట్టుబడి ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఇటీవల నిర్వహించిన ప్రపంచ ఆరోగ్య సదస్సులో కీలక ప్రసంగం చేసిన వారిలో ఆయన కూడా ఒకరు. బాలలకు న్యాయం జరగాలని, ఆరోగ్యాన్ని రాజ్యాంగ హక్కుగా పరిగణించాలని సత్యార్థి డిమాండ్‌ చేస్తున్నారు. కొవిడ్‌ వల్ల ప్రపంచవ్యాప్తంగా బాలలు ఎదుర్కొంటున్న కడగండ్ల గురించి కైలాస్‌ సత్యార్థి  ‘ఈటీవీ భారత్‌’తో మాట్లాడారు.

ప్ర. డబ్ల్యూహెచ్‌ఓ ఆరోగ్య సదస్సులో చేసిన ప్రసంగంలో బాలల హక్కుల సంరక్షణకు మీరు ఎలాంటి ప్రతిపాదనలు చేశారు?

జ. ఈ సదస్సులో దేశాధినేతల బదులు- సామాజిక కార్యకర్త, భారతీయుడినైన నాకు కీలక ప్రసంగం చేసే అవకాశం ఇవ్వడం అపూర్వ గౌరవం. అణచివేతకు, దోపిడీకి గురవుతున్న నిస్సహాయ బాలల దుస్థితి గురించి ఆలకించడానికి ప్రపంచం సిద్ధం కావడం నిజంగా గణనీయ పరిణామం. దీన బాలల వాణిగా వారి సమస్యలు, పరిష్కారాల గురించి మాట్లాడే అవకాశం నాకు లభించింది. పేద బాలలకు మామూలు రోజుల్లోనే చదువు గగనకుసుమం. ఈ కొవిడ్‌ కాలంలో ప్రపంచమంతటా కోట్లమంది చిన్నారులు చదువుకు దూరమైపోతున్నారు. పేద పిల్లలతో వెట్టిచాకిరీ చేయించడం, వారిపై లైంగిక అకృత్యాలకు పాల్పడటం,  వ్యభిచారంలోకి దించడం ఈ ఉపద్రవ కాలంలో ఎక్కువైపోతోంది. వారికి పోషకాహారమూ అందడం లేదు. బాలల చదువును, వారి ఆరోగ్యాన్ని వేర్వేరు అంశాలుగా పరిగణించలేం. ప్రపంచ దేశాలు ఈ వాస్తవాన్ని గ్రహించి, బాలలు మరిన్ని కష్టాల పాలబడకుండా శీఘ్రమే కార్యాచరణ ప్రారంభించాలి. బాలల సంక్షేమం కోసం పనిచేస్తున్న యునిసెఫ్‌, డబ్ల్యూహెచ్‌ఓ, యునెస్కో తదితర ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థలన్నీ ఒక్కటై ఈ కొవిడ్‌ కష్టకాలంలో బాలలను ఆదుకోవాలి. దీనికోసం సమితి ఓ ఉన్నత స్థాయి బృందాన్ని ఏర్పాటుచేయాలి. బాలలను కొవిడ్‌ కష్టాల నుంచి గట్టెక్కించి మెరుగైన భవిష్యత్తు చూపడమనేది ఏదో ఒక్క ప్రభుత్వ శాఖ వల్లనే సాధ్యమయ్యే విషయం కాదు. అన్ని దేశాల ఆరోగ్య, విద్యా శాఖలు చేయీచేయీ కలిపి పనిచేస్తేనే అది సుసాధ్యమవుతుంది. దీనితోపాటు ప్రతి దేశంలో బాలల బాగోగుల కోసం ప్రత్యేక కార్యబృందాన్ని ఏర్పాటు చేయాలి. ఆ బృందాలు బాలల మేలుకు చేసే సిఫార్సులను ప్రభుత్వాలు శ్రద్ధగా అమలు చేయాలి.

ప్ర. వివిధ దేశాల ప్రభుత్వాలు కరోనా వైరస్‌పై పోరుకు పెద్దయెత్తున కదిలినా, బాలల కోసం ఎక్కడా ప్రత్యేక ప్రణాళికలను చేపట్టలేదు. కారణాలు ఏమిటి?

జ. బాలలకు ముఖ్యంగా బడుగు వర్గాల పిల్లలకు ప్రభుత్వాల రాజకీయ, ఆర్థిక, సామాజిక, ప్రాధాన్యాలలో మొదటి నుంచీ సముచిత స్థానం లభించడం లేదు. అందుకే, పేదింటి బాలల్లో చాలామందికి చదువుకునే అవకాశాలు చిక్కడం లేదు. ఆరోగ్య, విద్యా బడ్జెట్లలో, సంక్షేమ, సంరక్షణ బడ్జెట్లలో పేద బాలల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనిపించడం లేదు. చట్టాల్లోనూ ఇదే పరిస్థితి. అంతర్జాతీయ అభివృద్ధి గ్రాంట్లలో బాలలకు ప్రత్యేక కేటాయింపులూ లేవు. ఈ లోపాలను సరిదిద్దినట్లయితే, బాలలకు జాతీయ, అంతర్జాతీయ వనరుల్లో సముచిత వాటా దక్కుతుంది. ఈ లక్ష్య సాధనకు గతేడాది మార్చి నుంచి దాదాపు 80 మంది దేశాధినేతలు, నోబెల్‌ గ్రహీతలు, ఐక్యరాజ్యసమితి విభాగాధిపతులను కలుపుకొని వెళ్లడానికి కృషి చేస్తున్నాను.

ప్ర. భారత్‌లో బాలలపై కరోనా ఎలాంటి ప్రభావం చూపుతోంది?

జ. మన దేశంలో అనేకానేక బడుగు వర్గాల పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం పెద్ద వరం. ఈ పథకం వారిని విద్యాలయాలకు రప్పించడంతోపాటు వారికి పోషణ కూడా అందిస్తోంది. కరోనా వల్ల విద్యా సంస్థలు మూతపడటం పేద పిల్లలపాలిట శాపమైంది.

ప్ర. ఆన్‌లైన్‌ తరగతుల్లో పాల్గొనడానికి కావలసిన అంతర్జాలం సౌకర్యం, స్మార్ట్‌ఫోన్ల వంటివి పేద పిల్లలకు లేకపోవడంతో పరిస్థితి మరింత దిగజారింది. దీనికి పరిష్కారాలేమిటి?

జ. వలస కూలీలతోపాటు ఇతర వర్గాల పేద పిల్లలకు అంతర్జాల సౌకర్యం కల్పించడం ప్రభుత్వ బాధ్యత. స్మార్ట్‌ఫోన్లు అందించడానికి ప్రభుత్వంతోపాటు స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్లు ముందుకు రావాలి. పాత ఫోన్లను విరాళంగా ఇవ్వాలని మత నాయకులు తమ అనుయాయులకు సూచించాలి.

ప్ర. కొవిడ్‌ కడగండ్ల మధ్య పిల్లల మానసిక ఆరోగ్యం దెబ్బతింటోందని వార్తలు వస్తున్నాయి. దీని గురించి ప్రభుత్వం ఏం చేయాలి?

జ. బాలలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారానికి పలు రంగాల నిపుణులతో జాతీయ స్థాయిలో ఒక కార్యబృందాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశాను. ఈ బృందంలో బాలల మనస్తత్వవేత్తలు, మానసిక చికిత్సకులకు సభ్యత్వం కల్పించాలి. లాక్‌డౌన్లను ఎత్తివేశాక పిల్లలతోపాటు ఉపాధ్యాయులకూ మానసిక సలహాలు ఇవ్వాలి.

ప్ర. పేద కుటుంబాల్లో పిల్లలు పని చేయకపోతే పూట గడవదు. బాలలతో పనిచేయించే దురాచారం తొలగాలంటే దారిద్య్ర నిర్మూలన జరగాలనే వాదన  ఉందికదా?

జ. పేదలకు ఏడాదిలో కనీసం 100 రోజులైనా పూర్తిగా పని దొరకడం లేదు. బాలలతో వెట్టిచాకిరీ చేయిస్తున్నారంటే, ఆ మేరకు పెద్దవాళ్లకు ఉపాధి అవకాశాలు దూరమవుతున్నాయన్న మాట. బాలలతో చాకిరీ, నిరక్షరాస్యత, పేదరికం ఈ మూడూ కలిసి పిల్లాపెద్దలను పేదరికంలో ఉంచుతున్నాయి. విద్యా హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడం సమస్యకు మంచి పరిష్కారం.

ప్ర. కరోనా మహమ్మారి మన ప్రజారోగ్య యంత్రాంగంలోని లోపాలను బయట పెట్టింది. బాలలు, వృద్ధులకు సరైన చికిత్స అందడం లేదు. ఈ విషమ స్థితిని ఎలా అధిగమించాలి?

జ. మన ప్రజారోగ్య యంత్రాంగాన్ని పటిష్ఠం చేయాలంటే, ఆరోగ్యాన్ని రాజ్యాంగ హక్కుగా గుర్తించి, ఆరోగ్య సంరక్షణ వసతులను విస్తరించాలి. అలా జరగకపోవడం వల్లే ప్రజలు ప్రైవేటు చికిత్సను ఆశ్రయించక తప్పడం లేదు. కానీ, ప్రైవేటులో ఆస్పత్రి పడకలు, వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ సదుపాయాలకు లక్షల రూపాయల బిల్లు వేస్తున్నందు వల్ల రోగుల కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. ఆర్థికంగా చితికిపోతున్నాయి.

Posted Date: 07-06-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం