• facebook
  • whatsapp
  • telegram

కావేరితో అనుసంధానం సాకారమయ్యేనా?

ఆటంకాలను అధిగమించడమే కీలకం

సుదీర్ఘకాలంగా చర్చలకు పరిమితమైన గోదావరి-కావేరి నదుల అనుసంధాన ప్రక్రియలో ఒకడుగు ముందుకు పడింది. కానీ ఈ ముందడుగు కాగితాలకే పరిమితమవుతుందా లేక కార్యరూపం దాలుస్తుందా అన్నది ప్రధానమైన ప్రశ్న. భాగస్వామ్య రాష్ట్రాల అంగీకారం లభించడం, భారీ నిధులు అవసరం కావడం రెండూ ప్రధాన సమస్యలే. ఈ రెండింటినీ అధిగమించడం అంత సులభంగా జరిగే పని కాదు. దేశంలో చేపట్టిన నదుల అనుసంధానంలో మహానది-గోదావరి-కృష్ణా-పెన్నా-కావేరి ఒకటి. మహానదిలో మిగులు లేదని ఒడిశా, గోదావరి నీరు తమ అవసరాలకు మాత్రమే సరిపోతాయని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చెబుతూ వచ్చాయి. అయితే పై నుంచి నీటిని మళ్లిస్తే అనుసంధానంపై తమకు అభ్యంతరం లేదని పేర్కొన్నాయి. దీనిపై చర్చలు తప్ప ఒక్క అడుగూ ముందుకు పడలేదు.

కొత్త ఆయకట్టుకు నీరు

గత లోక్‌సభ ఎన్నికలకు ముందు దేవాదుల-దుమ్ముగూడెం మధ్యలో అకినేపల్లి నుంచి నాగార్జునసాగర్‌-సోమశిల ద్వారా కావేరిపై ఉన్న గ్రాండ్‌ ఆనకట్ట వరకు నీటిని మళ్లించేందుకు జాతీయ జల అభివృద్ధి సంస్థ(ఎన్‌డబ్ల్యూడీఏ) ప్రాజెక్టు నివేదికను తయారు చేసింది. రాష్ట్రాలు సానుకూలంగా లేకపోయినా- ఇంద్రావతిలో ఛత్తీస్‌గఢ్‌కు కేటాయించినా వినియోగించుకోని నీటిని మళ్లిస్తామని కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ పేర్కొంది. అకినేపల్లి నుంచి చేపడితే నాగార్జునసాగర్‌ ఆయకట్టు ప్రాంతం భూసేకరణలో పోతుందని తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేయడం తదితర కారణాల వల్ల అది పెండింగ్‌లో పడింది. దీన్ని మార్పు చేసి, ఇచ్చంపల్లి నుంచి నాగార్జునసాగర్‌ ద్వారా చేపట్టేలా నిర్ణయం జరిగింది. దీని ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు కూడా ప్రయోజనం ఉంది. కొత్త ఆయకట్టుకు నీరందడంతోపాటు, పాత ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. ఈ రెండు రాష్ట్రాలు వ్యతిరేకించకపోవచ్చని కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ భావిస్తోంది. ఇచ్చంపల్లి వద్ద బ్యారేజి నిర్మించి రోజుకు 2.2 టీఎంసీల చొప్పున 143 రోజుల్లో 247 టీఎంసీల వరద నీటిని మళ్లించి 9.44 లక్షల హెక్టార్ల ఆయకట్టు సాగుకు, తాగేందుకు, పారిశ్రామిక అవసరాలకు ఇవ్వాలన్నది లక్ష్యం. చెన్నై తాగు, పారిశ్రామిక అవసరాలకు ప్రత్యేక కేటాయింపు ఉంది. జూన్‌ నుంచి అక్టోబరు వరకు నీటిని మళ్లిస్తారు. ఇందుకోసం 1,211 కి.మీ. దూరం కాలువ తవ్వాల్సి ఉంటుంది. జూన్‌లో, అక్టోబరులో మళ్లించే నీటివల్ల దిగువన ఉన్న ప్రాజెక్టులపై ప్రభావం పడే అవకాశం ఉంది. జూన్‌లో వచ్చే నీటిని వరద నీటిగా భావించలేం కాబట్టి, ఎంత వరద ప్రవాహం ఉన్నప్పుడు నీటిని మళ్లించాలన్నదానిపై ముందుగానే స్పష్టతకు రావాల్సి ఉంది.

ముందుకు కదలని ప్రాజెక్టులు

అనుసంధానానికి రాష్ట్రాలు అంగీకరిస్తాయా అన్నది ప్రధాన సందేహం. ప్రాజెక్టు నివేదిక ప్రకారమే... ఛత్తీస్‌గఢ్‌ అంగీకరించలేదు. మహారాష్ట్ర కొన్ని అభ్యంతరాలు, సందేహాలు వ్యక్తం చేసింది. ఈ పథకం ద్వారా మళ్లించే 247 టీఎంసీలలో, 176.5 టీఎంసీలు శ్రీరామసాగర్‌-ఇచ్చంపల్లి మధ్య లభించే  మిగులు కాగా, మిగిలినవి ఇంద్రావతిలో ఛత్తీస్‌గఢ్‌కు కేటాయించి ఇంకా వాడుకోనివి. వాస్తవానికి ఒడిశాలోని మహానది నుంచి గోదావరి-కృష్ణా-పెన్నా మీదుగా కావేరివరకు నీటిని తీసుకెళ్లాలన్నది నదుల అనుసంధానం ప్రణాళిక. కేంద్రం ఒడిశాతో చర్చించినా ఫలితం లేకపోవడంతో, బ్రహ్మపుత్ర-గంగ-సువర్ణరేఖ-మహానది-గోదావరి అనుసంధానం చేపట్టాలని, ఈలోగా మొదటి దశగా గోదావరిలో మిగులు, ఛత్తీస్‌గఢ్‌ వాడుకోలేని నీటిని మళ్లించాలన్నది నిర్ణయం. అయితే బ్రహ్మపుత్ర- గోదావరి అనుసంధానానికి ఎన్ని దశాబ్దాలు పడుతుందో చెప్పలేం. ఎందుకంటే నదుల అనుసంధానం గురించి మాట్లాడటం ప్రారంభించి ఇప్పటికి రెండు దశాబ్దాలైనా పెద్దగా ముందడుగు పడలేదు.

కేంద్రం అకినేపల్లి నుంచి కావేరి వరకు నీటిని మళ్లించేలా డీపీఆర్‌ను తయారు చేయించినా, రాష్ట్రాల నుంచి సానుకూలత లేకపోవడంతో తాజాగా ఇచ్చంపల్లి నుంచి నీటిని మళ్లించేలా మార్పు చేసింది. తెలంగాణ సూచన మేరకు ఈ మార్పు చేసినట్లు పేర్కొన్నా, మహానది నుంచి తేకుండా గోదావరిలో ఉన్న మిగులును మళ్లించే ప్రతిపాదనకు తెలంగాణ ఏ మేరకు అంగీకరిస్తుందో చూడాల్సి ఉంది. తమ అవసరాలు పోనూ మిగులు ఉంటే మళ్లించడానికి అభ్యంతరం లేదంటున్న తెలంగాణ- శ్రీరామసాగర్‌-ఇచ్చంపల్లి మధ్య మిగులు ఉందంటున్న జాతీయ జల అభివృద్ధి సంస్థతో ఏకీభవించే అవకాశం లేదు. మొదట ఈ ప్రతిపాదన చేసినపుడు ఛత్తీస్‌గఢ్‌లో అధికారంలో ఉన్న భాజపా ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేయకపోయినా- వ్యతిరేకత తెలపలేదు. కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పటికే వ్యతిరేకించింది. తమ వాటాను మళ్లించడానికి వీల్లేదని, పూర్తిగా వినియోగించుకోవడానికి ప్రణాళిక రూపొందించామని పేర్కొంది. ఇంద్రావతిపై బోథ్‌ఘాట్‌ వద్ద 169 టీఎంసీలతో బహుళార్థక సాధక ప్రాజెక్టును ప్రతిపాదించినట్లు వెల్లడించింది. ఇంద్రావతిలో తమకు 40 టీఎంసీల కేటాయింపు ఉందని, దట్టమైన అటవీ ప్రాంతం కారణంగా ఇక్కడ వాడుకోలేని నీటిని పక్క బేసిన్‌లో వాడుకోవడానికి ప్రణాళిక రూపొందిస్తున్నామని మహారాష్ట్ర పేర్కొంది.

రాష్ట్రాలు సహకరిస్తేనే...

గోదావరిలో తెలంగాణ 954.23 టీఎంసీలకు గాను 1,355 టీఎంసీలతో ప్రాజెక్టులను ప్రతిపాదించిందని, ఎగువనుంచి వచ్చే ప్రవాహాన్ని అడ్డుకోవడం వల్ల తమకు ఇబ్బంది ఏర్పడుతుందని, ఈ అంశాన్ని జాతీయ జల అభివృద్ధి సంస్థ పరిగణనలోకి తీసుకోలేదన్నది ఆంధ్రప్రదేశ్‌ అభిప్రాయం. దీంతోపాటు గోదావరి నుంచి బనకచెర్ల వరకు 200 టీఎంసీలు, గోదావరి-పెన్నా అనుసంధానానికి 320 టీఎంసీలతో ప్రాజెక్టులు చేపడుతున్నాం కాబట్టి తమకు సమస్య అవుతుందనీ పేర్కొంది. అయితే దీనిపై ఇప్పటి వరకు ఏపీ స్పష్టమైన వైఖరి వెల్లడించలేదు. గోదావరి నీటిని కృష్ణా నదికి మళ్లిస్తున్న కారణంగా కర్ణాటక, మహారాష్ట్రలు వాటా అడుగుతున్నాయి. కావేరిలో తమిళనాడుకు ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది కాబట్టి- ఆ మేరకు తమకు కూడా కేటాయించాలని కర్ణాటకతోపాటు కేరళ, పాండిచ్చేరి కోరుతున్నాయి. తమిళనాడు ఈ అనుసంధానంతో ఎక్కువ ప్రయోజనం పొందే రాష్ట్రం కాబట్టి అదొక్కటే పూర్తి సానుకూలతతో ఉంది. రాష్ట్రాల అభిప్రాయాలను తోసిపుచ్చి ముందుకెళ్లడం కేంద్రానికి సాధ్యమయ్యే పనికాదు. ఛత్తీస్‌గఢ్‌ అంగీకరించకపోతే 50 శాతం నీటిలభ్యత ప్రకారం వినియోగించుకొంటామని కేంద్రం ప్రతిపాదించింది. గోదావరి జల వివాద ట్రైబ్యునల్‌ 75శాతం నీటి లభ్యత ప్రకారం రాష్ట్రాలకు చేసిన కేటాయింపులు పోనూ మిగిలిన నీటిని వాడుకొనే హక్కు దిగువన ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఉంది. అంటే ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు. ఈ రెండు రాష్ట్రాల మధ్య కచ్చితమైన వాటా, నీటి వినియోగం తేల్చడానికి త్వరలో ట్రైబ్యునల్‌ కూడా ఏర్పాటయ్యే అవకాశం ఉంది. నికర జలాలు, మిగులు జలాలు ఎంత వినియోగించుకోవచ్చో తేల్చుకొని ఆ మేరకు ప్రాజెక్టులను తమ అవసరాలకు తగ్గట్లుగా రూపకల్పన చేసుకొనే అవకాశం ఉన్న తెలంగాణ తాజా ప్రతిపాదనకు ఏ మేరకు అంగీకారం తెలుపుతుందో చూడాల్సి ఉంది. ఈ పథకం ముందుకెళ్లాలంటే కేంద్రం ప్రతిపాదనతో ఛత్తీస్‌గఢ్‌, తెలుగు రాష్ట్రాలు ఏకీభవించాల్సి ఉంటుంది. అవసరమైన నిధులిచ్చి ఈ ప్రాజెక్టును కేంద్రం చేపట్టగలదా లేదా అన్నది తరవాతి విషయం. రాష్ట్రాలు అంగీకరించి సహకరించకపోతే మాత్రం ఈ ప్రాజెక్టు ముందుకెళ్లడం ఆచరణ సాధ్యం కాదు.

నిధుల లభ్యత సందేహాస్పదం

గోదావరి-కావేరి అనుసంధానానికి రూ.85,962 కోట్లు ఖర్చవుతుందని కేంద్రం అంచనా వేసింది. నిర్మాణం సమయంలో పెరిగిన ధరలు వర్తింపజేయడం, భూసేకరణ, పునరావాసానికి అయ్యే ఖర్చు మొత్తం పరిగణనలోకి తీసుకొంటే సుమారు లక్ష కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. ఈ మొత్తాన్ని కేంద్రమే భరించాల్సి ఉంటుంది. కొన్నేళ్లుగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై కేంద్రం పెట్టే వ్యయం తగ్గింది. నదుల అనుసంధానంలోనే ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లకు ప్రయోజనం కలిగించే కెన్‌-బెట్వా అనుసంధానానికి అన్ని అనుమతులు వచ్చినా, పెద్దగా పురోగతి లేదు. పోలవరానికి జాతీయహోదా కల్పించినా నిధుల విడుదలలో జాప్యం, మొత్తం వ్యయానికి ఆమోదం తెలపకపోవడం వంటివి చూస్తూనే ఉన్నాం. ఈ పరిస్థితుల్లో అయిదేళ్లలో  ఏడాదికి సగటున రూ.20 వేల కోట్లు ఖర్చు చేయడం సాధ్యమా అన్నది ప్రశ్న. రాష్ట్రాల్లో ప్రాజెక్టుల నిర్వహణ వ్యయం రైతుల నుంచి వసూలు చేయడం లేదు. ఈ ప్రాజెక్టు కింద మాత్రం నీటికి తగిన ధర ఉండాలని, హెక్టారుకు రూ.1,500 చొప్పున వసూలు చేయాలని డీపీఆర్‌లోనే పొందుపరచారు.

- ఎం.ఎల్‌.నరసింహారెడ్డి
 

Posted Date: 07-06-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం