• facebook
  • whatsapp
  • telegram

మనసులు గెలిస్తేనే ప్రశాంత కశ్మీరం

ప్రజాస్వామ్య ప్రక్రియతోనే సుసాధ్యం

జమ్మూకశ్మీర్‌లో శాంతిసాధన కోసం ఎంతో కాలంగా కృషి జరుగుతున్నా- అదంత తేలికైన వ్యవహారమేమీ కాదు. ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న బాహ్యశక్తుల జోక్యం, వేర్పాటువాదం, వేళ్లూనుకుపోయిన మత విభజన వంటి క్లిష్ట సమస్యలు జమ్మూకశ్మీర్‌ ప్రజలను దశాబ్దాలుగా వేధిస్తున్నాయి. 2019 ఆగస్టులో అధికరణ 370 రద్దుతో జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి ముగిసింది. రాష్ట్రం రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా రూపాంతరం చెందింది. కేంద్ర సర్కారు చర్యపై ఆ ప్రాంత రాజకీయ నేతలు, ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది. కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకించిన కశ్మీరీ నేతలను ప్రభుత్వం నిర్బంధించింది. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రంలోని ఎన్డీయే సర్కారు వ్యవహరిస్తోందంటూ కశ్మీరీ నేతలు ఆరోపించగా, శాంతి పునరుద్ధరణకే తమ చర్యలంటూ ప్రభుత్వం సమర్థించుకుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఎవరూ ఊహించని విధంగా ప్రధాని మోదీ- జమ్మూకశ్మీర్‌కు చెందిన రాజకీయ పక్షాల నేతలను జూన్‌ 24న సమావేశానికి ఆహ్వానించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోకూడదనే ఉద్దేశంతోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జమ్మూకశ్మీర్‌కు పూర్తిస్థాయి రాష్ట్ర హోదాను పునరుద్ధరించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని హోంమంత్రి చెప్పిన విషయాన్నే- మోదీతో భేటీలో కశ్మీర్‌ నేతలు ప్రధానంగా ప్రస్తావించారు. కేంద్రం, జమ్మూకశ్మీర్‌ మధ్య అంతరాన్ని పూడ్చటంలో ఈ సమావేశం కీలక పరిణామంగా మారుతుందని భావిస్తుండగా, జమ్మూలోని భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌) స్టేషన్‌పై తాజాగా జరిగిన డ్రోన్‌ దాడి ఈ ప్రక్రియకు సవాలుగా నిలుస్తోంది. చర్చలు జరుగుతున్న సందర్భంలోనే దాడి జరగడం చూస్తే ఆ ప్రాంతంలో శాంతి సాధన ఎంత క్లిష్టతరమో అర్థమవుతుంది. 

అధికరణ 370, 35ఏ రద్దు తరవాత జమ్మూకశ్మీర్‌లో ఉగ్ర కార్యకలాపాలు, ఘటనలు తగ్గిపోయాయంటూ కేంద్రం తన చర్యలను సమర్థించుకోవడానికి యత్నిస్తోంది. కేంద్రం చెబుతున్న అంశాల్లో కొంత వాస్తవం ఉంది. ఎందుకంటే- అధికరణ 370, 35ఏల రద్దుతో హింసాత్మక ఘటనలు, ఉగ్రవాదం ఊపందుకుంటాయన్న వాదనలు తెరపైకి వచ్చాయి. అందుకు భిన్నంగా అధికరణ రద్దు తరవాత కశ్మీర్‌లో ఉగ్రవాద, హింసాత్మక ఘటనలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. కేంద్రం చేసిన నిరంతర ప్రయత్నాల కారణంగా ఇది సాధ్యమైంది. ఈ క్రమంలో భద్రతా బలగాలు పలువురు ఉగ్రవాదుల్ని హతమార్చగా, కొంతమంది లొంగిపోయి ప్రధాన స్రవంతిలోకి తిరిగివచ్చారు. ఇది కూడా ఉగ్రచర్యలు, హింస తగ్గడానికి తోడ్పడింది. హింస, ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గుముఖం పట్టగానే శాంతియుత పరిస్థితులను నెలకొల్పినట్లు ప్రభుత్వాలు ఘనంగా చెప్పుకొంటాయి. అంతమాత్రాన జమ్మూకశ్మీర్‌లో నిజంగా శాంతిభద్రతల్ని పునరుద్ధరించినట్లు కాదు. పాకిస్థాన్‌, వేర్పాటువాదం వంటి అత్యంత సంక్లిష్ట సమస్యల్ని పరిష్కరించనంత వరకు కశ్మీర్‌ లోయలో శాంతిస్థాపన కేంద్రంలో ఏ ప్రభుత్వానికైనా పెద్ద సవాలే. ఇవి జాతీయవాదం, సార్వభౌమాధికారంతో ముడివడి ఉన్న అంశాలు. వాటిని పరిష్కరించకపోతే ఉగ్రవాదాన్ని పెంచి పోషించే బయటి శక్తుల నుంచి సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. ఇటీవలి డ్రోన్‌ దాడి ఘటనే ఇందుకు సరైన ఉదాహరణ. దీనివెనక పాకిస్థాన్‌ హస్తం ఉందంటూ వార్తాకథనాలూ వెలువడ్డాయి. జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత మెహబూబా ముఫ్తీ కూడా కశ్మీర్‌ సమస్య శాశ్వత పరిష్కారానికి పాకిస్థాన్‌, వేర్పాటువాదులతో ప్రభుత్వం చర్చలు జరపాలని పేర్కొన్నారు. ఆమె వ్యాఖ్యలను ఎవరూ స్వాగతించలేదు. 

భారత్‌ పొరుగు దేశాల్లో చోటుచేసుకొనే భౌగోళిక, రాజకీయ మార్పులను కూడా ఈ వ్యవహారాల్లో కీలకంగా భావించాల్సి ఉంటుంది. అఫ్గానిస్థాన్‌లో క్రమంగా తాలిబన్లు బలపడుతున్నారు. లష్కరే తొయిబా, హిజ్బుల్‌ ముజాహిదీన్‌ వంటి ఉగ్రసంస్థలతో తాలిబన్లకు ఉన్న సంబంధాలు- కశ్మీర్‌ లోయలో ఉగ్రకార్యకలాపాలపై ప్రభావం చూపే అవకాశముంది. అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల ఆధిపత్యం, ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్‌ సహకారం, అధికరణ 370 రద్దుపై వ్యతిరేకత వంటి అంశాలన్నీ కలగలిసి కశ్మీర్‌లో శాంతి పునరుద్ధరణ ప్రక్రియకు ప్రధాన అవరోధాలుగా మారే ముప్పుంది. ప్రస్తుత పరిస్థితుల్లో చర్చలను కేంద్ర ప్రభుత్వం అంతరాయాలు లేకుండా కొనసాగించాలి. ప్రజాస్వామిక  ప్రక్రియలో జమ్మూకశ్మీర్‌కు పూర్తిస్థాయి రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తే అక్కడి ప్రజలకు ప్రభుత్వంపై విశ్వాసం పెరుగుతుంది. ప్రజాస్వామ్యబద్ధంగా, చర్చల ద్వారా ప్రజల మనసులు గెలుచుకునే ప్రయత్నాలు చేస్తేనే కశ్మీరంలో శాంతిస్థాపన సాధ్యమవుతుంది.

- డాక్టర్‌ అంశుమన్‌ బెహెరా

(బెంగళూరు ఐఐఎస్‌సీలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్డ్‌స్టడీస్‌లో అసోసియేట్‌ ప్రొఫెసర్‌)
 

Posted Date: 30-06-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం