• facebook
  • whatsapp
  • telegram

వలస జీవులకు తిండిగింజలు

ఒకే దేశం - ఒకే రేషన్‌ కార్డు అమలు సాధ్యాసాధ్యాలు

‘ఒకే దేశం - ఒకే రేషన్‌’ పథకాన్ని జులై 31లోపు అమలు చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. సంక్షోభం నుంచి బయటపడేంత వరకు సామాజిక వంటశాలలను నిర్వహించి వలస కార్మికులకు ఆహారం అందించాలని సూచించింది. వలస కార్మికులకు అందుతున్న సంక్షేమ పథకాలపై దాఖలైన పలు పిటిషన్లను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం, వారికి ఉచితంగా రేషన్‌ పంపిణీ చేయాలని కేంద్రానికి స్పష్టం చేసింది. ఈ సందర్భంగా, దేశంలో ఉన్న అసంఘటిత రంగ కార్మికుల వివరాల నమోదు ప్రక్రియలో జాప్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అన్ని వ్యవస్థలు, గుత్తేదారుల వివరాలను 1970 అంతర్‌ రాష్ట్ర వలస కార్మికుల చట్టం కింద నమోదు చేయాలని సూచించింది. దేశవ్యాప్తంగా ‘ఒకే దేశం - ఒకే రేషన్‌’ను అమలు చేయాలంటే, ప్రజా పంపిణీ వ్యవస్థలో ఈ-పోస్‌ (ఎలెక్ట్రానిక్‌ పాయింట్‌ ఆఫ్‌ సేల్‌) యంత్రాలను ఏర్పాటు చేయాలి. అన్ని రేషన్‌ కార్డులను ఆధార్‌ సంఖ్యతో అనుసంధానించాలి. 2020 జూన్‌ ఒకటో తేదీ నాటికి 23కోట్ల మంది రేషన్‌ కార్డుదారులకు అందించేలా రేషన్‌ కార్డు పోర్టబిలిటీని అమలు చేసింది ప్రభుత్వం. దేశంలోని 5.4లక్షల ప్రజా పంపిణీ వ్యవస్థల్లో దేని నుంచైనా తిండి గింజలు పొందగలిగే వెసులుబాటును కల్పించడం కోసం 2013 జాతీయ ఆహార భద్రత చట్టం కింద కేంద్రం ఈ చర్యలు చేపట్టింది. అంతర్‌ రాష్ట్ర వలసల కారణంగా కార్మికులు నష్టపోకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

అర్హులకు అందాల్సిన న్యాయం

జాతీయ ఆహార భద్రత చట్టం(ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) లబ్ధిదారుల్లో అనేక మంది ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశా నుంచి బతుకుతెరువు కోసం పంజాబ్‌, హరియాణా, మహారాష్ట్రలకు తరలివెళుతుంటారు. రబీ, ఖరీఫ్‌ పంట ప్రారంభ సమయంలో ఈ వలసలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు రాష్ట్రం పరిధిలోనూ అంతర్గతంగా వలసలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కుటుంబంలోని కొందరు ఇతర రాష్ట్రాలకు వలస వెళుతుంటారు. వీరికి ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కింద సబ్సిడీ తిండి ధాన్యాలు అందడం లేదు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్‌లలో రాష్ట్రవ్యాప్తంగా, అంతర్రాష్ట్ర పరిధిలో రేషన్‌ కార్డు పోర్టబిలిటీని పైలట్‌ ప్రాజెక్టు కింద అమలు చేశారు. ఆ తరవాత, ఏ చౌక ధరల దుకాణం నుంచి అయినా రేషన్‌ సరకులు పొందేవిధంగా అంతర్రాష్ట్ర పోర్టబిలిటీని హరియాణా, ఝార్ఖండ్‌, కర్ణాటక, కేరళ, పంజాబ్‌, రాజస్థాన్‌, త్రిపురలకు విస్తరించారు. రాష్ట్రాల్లోని ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌)లను కేంద్రం పరిధిలోని వాటితో అనుసంధానించాల్సి ఉంది. ఇందులో భాగంగా రేషన్‌ కార్డు, లబ్ధిదారుల వివరాలను నకిలీలకు తావివ్వకుండా ఒకచోటకు చేర్చాలి. దేశంలో 2021 జూన్‌ 28 నాటికి 5.46లక్షల చౌక ధరల దుకాణాలు ఉన్నాయి. 23.63కోట్ల రేషన్‌ కార్డు లబ్ధిదారులు ఉన్నారు. అసోం, ఛత్తీస్‌గఢ్‌, దిల్లీ, పశ్చిమ్‌ బంగ ఒకే దేశం- ఒకే రేషన్‌ పథకంలో ఇంకా చేరలేదు. పథకాన్ని వ్యతిరేకిస్తున్న దిల్లీ- ఈ-పోస్‌ యంత్రాలను ప్రారంభించలేదు. పథకంలో జాతీయ ఆహార భద్రతచట్టంయేతర రేషన్‌ కార్డుదారులను కూడా చేర్చాలని పశ్చిమ్‌ బంగ డిమాండ్‌ చేస్తోంది. వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ వ్యవస్థ మంత్రిత్వశాఖ ప్రకారం 2019 ఆగస్టు నుంచి మొత్తం మీద 27.83 పోర్టబిలిటీ లావాదేవీలు జరిగాయి. ఇందులో ఏకంగా 19.8 కోట్ల లావాదేవీలు కరోనా సంక్షోభ సమయం 2020 ఏప్రిల్‌ నుంచి 2021 మే మధ్యలో జరిగినవే.

ఎదుర్కోవాల్సిన సవాళ్లెన్నో!

ఒకే కుటుంబానికి చెందిన పలువురు రేషన్‌ కార్డుదారులు ఎక్కడికైనా వలస వెళ్తే, ఆయా ప్రాంతాల్లో వివరాలు సరిచేయడం సవాలుతో కూడుకున్న విషయం. రాష్ట్రాలకు ఆహారధాన్యాల కేటాయింపు క్రియాశీలకంగా, నెలవారీ పంపిణీ ఆధారంగా ఉండాలి. నిల్వ, పంపిణీ విషయంలో ఆయా రాష్ట్రాల్లో అవసరాలకు తగ్గట్లుగా భారత ఆహార సంస్థ చర్యలు చేపట్టాలి. ప్రస్తుతం డిమాండుకు తగ్గట్లు మూడు నెలలకు సరిపడా సరకులను మాత్రమే ఈ సంస్థ నిల్వ చేస్తోంది. ఇప్పటికీ చాలా ఈ-పోస్‌ యంత్రాలను సమకూర్చాల్సి ఉంది. ముఖ్యంగా, వలసలు ఎక్కువగా ఉండే బిహార్‌, పశ్చిమ్‌ బంగ ఈ ప్రక్రియలో వెనకబడటం ఆందోళనకరం. లబ్ధిదారులను ప్రామాణీకరించేందుకు, సబ్సిడీతో కూడిన తిండిధాన్యాల పంపిణీలో ఎలెక్ట్రానిక్‌ సమాచారాన్ని నమోదు చేసేందుకు ఈ-పోస్‌ యంత్రాలు ఉపయోగపడతాయి.

దేశంలో కాలానుగుణంగా గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు వలస వెళ్లే వారి సంఖ్య 12 కోట్ల వరకు ఉంటుందని అంచనా. నిర్మాణం, వ్యవసాయం, సేవ, తయారీ రంగాల్లో అనధికారిక కార్మికులుగా వీరు చేరతారు. సహజంగా, పని చేస్తున్న చోట సరకుల్ని పొందేందుకు వీరికి అనుమతి ఉండదు. దీనికితోడు దేశంలోని అనేక పథకాలకు నివాసం ఆధారంగానే అనుమతులు ఉండటం మరో సమస్య. వీరికి సంబంధించిన గణాంక సమాచారాన్ని రూపొందించడంలో ప్రభుత్వాలు దారుణంగా విఫలమయ్యాయి. ఆహార భద్రతను పోషక భద్రతగా అభివర్ణించింది జాతీయ ఆహార భద్రత చట్టం. అందువల్ల మధ్యాహ్న భోజనం, ఆరోగ్య సంరక్షణ, ఇతరత్రా సౌకర్యాలు పేద, వలస కార్మికులకు దూరంకాకుండా చూసుకోవాలి. ఆధార్‌, డిజిటలీకరణపైనే ‘ఒకే దేశం- ఒకే రేషన్‌’ అధారపడి ఉంది. సొంత గ్రామాల్లో ఉండిపోయిన వలస కార్మికుల కుటుంబాలకు ఆధార్‌, డిజిటల్‌ రేషన్‌ కార్డులు దక్కవన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వారి జీవితాలను మెరుగుపరచడం ప్రభుత్వం బాధ్యత. వలస కార్మికులందరికీ సంక్షేమ పథకాలు అందాలి. హక్కుల రక్షణకు కార్మిక చట్టాలు అందుబాటులో ఉండాలి. అప్పుడే వారికి న్యాయం జరుగుతుంది.

రాష్ట్రాల సంసిద్ధతే కీలకం

ప్రస్తుతం ఆరు కోట్ల టన్నులకు పైగా వరి, గోధుమ ఎఫ్‌సీఐ, కేంద్ర, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్లు, ప్రైవేటు గోడౌన్లలో నిల్వ చేస్తున్నారు. ఏడాదిలో 81కోట్లమంది లబ్ధిదారులకు వీటి ద్వారా ఆహార ధాన్యాలు సరఫరా అవుతాయి. ఈ-పోస్‌ యంత్రాలతో చౌకధర దుకాణాలను అనుసంధానిస్తే, ఎఫ్‌సీఐ సరఫరా గొలుసు నిర్వహణ సామర్థ్యం పెరగడంతో పాటు అవినీతికి అడ్డుకట్ట పడుతుంది. ఇలాంటి సాంకేతికతలను అమలు చేసేందుకు అన్ని రాష్ట్రాలు ముందుకు రావాలి.


 

Posted Date: 07-07-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం