• facebook
  • whatsapp
  • telegram

సంఖ్యాబలిమితో వృద్ధిబాట

ప్రపంచ జనాభా దినోత్సవం

దేశమంటే మట్టికాదోయ్‌ దేశమంటే మనుషులోయ్‌ అన్నారు గురజాడ అప్పారావు. ఏ దేశాభివృద్ధికైనా మానవ వనరులే ప్రాణవాయువు. తమ శ్రామిక శక్తిని ఆర్థిక వృద్ధికి వెన్నెముకగా మార్చుకోవడమన్నది ఆయా దేశాల విధానాలు, ప్రణాళికల పైనే ఆధారపడి ఉంటుంది. భవిష్యత్తులో తీవ్ర ఆహార సంక్షోభం తలెత్తుతుందన్న అంచనాతో చైనా దశాబ్దాల పాటు నిర్బంధ జన నియంత్రణను కఠినంగా అమలు చేసింది. శ్రామిక జనాభా తగ్గిపోవడంతో తప్పు తెలుసుకుని 2016లో ఇద్దరు పిల్లలకు అనుమతిచ్చింది. దాని వల్ల పెద్దగా ఒరిగిందేమీ లేక ఇటీవల ఆ సంఖ్యను మూడుకు పెంచింది. జనాభా పరంగా భారత్‌ 2025 నాటికి డ్రాగన్‌ దేశాన్ని (ప్రస్తుతం 142 కోట్లు) అధిగమిస్తుందని 2019లో ఐక్యరాజ్య సమితి నివేదిక పేర్కొంది. 2048 నాటికి భారత జనాభా 160 కోట్లకు చేరి, ఆ తరవాత 2100 నాటికి 32 శాతం తగ్గి 109 కోట్లకు పరిమితమవుతుందని గతంలో వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవ్తేతల అధ్యయనం పేర్కొంది. అయినా అధిక జనాభా పరంగా భారత్‌ అగ్రస్థానంలో నిలుస్తుంది. ఇటీవలి గణాంకాల ప్రకారం 2019లో భారత జనాభా 134 కోట్లు. దేశంలో శ్రామిక వయో జనాభా (20-59 ఏళ్లు) 2021-31 మధ్యలో ఏటా 97 లక్షలు, 2031-41 మధ్యలో సాలీనా 42 లక్షల చొప్పున వృద్ధిచెందుతుందని నిపుణుల అంచనా. ఒకవైపు కొవిడ్‌ రక్కసి విజృంభణతో కొలువులు తెగ్గోసుకుపోతుండటం, మరోవైపు నైపుణ్యాలు నానాటికీ సన్నగిల్లుతున్న తరుణంలో కొత్తగా శ్రామిక ప్రపంచంలోకి వచ్చే వారికి ఉపాధి ఎలా అందుతుందన్నదే కీలక ప్రశ్న!

భారత్‌లో శ్రామిక వయో జనాభా 2011లో 61 శాతం ఉంటే, 2036 నాటికి 65 శాతానికి చేరుతుందని కేంద్ర మంత్రిగా హర్షవర్ధన్‌ ఈ ఫిబ్రవరిలో ప్రకటించారు. మొత్తంగా చూస్తే ఏటా 1.2 కోట్ల శ్రామిక శక్తి దేశానికి అదనంగా జతపడుతోంది. జనాభా పెరుగుదల దేశాభివృద్ధిపై ప్రతికూల ప్రభావం కనబరుస్తుందని 18వ శతాబ్దం చివర్లో ప్రఖ్యాత ఆర్థిక వేత్త థామస్‌ మాల్థస్‌ సూత్రీకరించారు. పరిమిత వనరులు, సాంకేతిక పరిజ్ఞానం అంతగా అభివృద్ధి చెందని రోజుల్లో ఆ సిద్ధాంతాన్ని చాలా మంది విశ్వసించారు. కానీ, కాలక్రమంలో సాంకేతిక విజ్ఞానం కొత్తపుంతలు తొక్కడం, వనరులను విస్తృతంగా ఉపయోగించుకోవడం వల్ల జనాభా పెరుగుదల ఆయా దేశాలకు వరంగా మారిందనే చెప్పుకోవాలి. రెండో ప్రపంచ యుద్ధం తరవాత ప్రపంచ జనాభా రెట్టింపైంది. ప్రపంచ జీడీపీ అయిదు రెట్ల వరకు అధికమైంది. చైనా, జపాన్‌, దక్షిణ కొరియా లాంటి చాలా దేశాలు పెరిగిన శ్రామిక జనాభాతో ఎంతగానో అభివృద్ధి సాధించాయి. ప్రస్తుత కాలంలో సాంకేతికత ఒక్కటే దేశాభివృద్ధికి ఆయువుపట్టు కాదు. ఉత్పాదక ఉద్యోగిత, అందుబాటులో ఉన్న సాంకేతికతను సమర్థంగా వినియోగించుకోవడం చాలా అవసరం. కరోనా విజృంభించక ముందే నిరుద్యోగిత రేటు దేశంలో 45 ఏళ్ల గరిష్ఠానికి చేరింది. మొన్న మే నెలలో నిరుద్యోగిత రేటు ఏకంగా 14.73 శాతాన్ని తాకి, జులై ఆరంభానికి 7.3 శాతానికి దిగివచ్చింది. ఉపాధికి అవసరమైన నైపుణ్యాలు లేకపోవడం మన దేశంలో మరో ప్రధాన సమస్య. 2018లో వెలువడిన ప్రథమ్‌ నివేదిక ప్రకారం అయిదో తరగతిలో ఉన్న విద్యార్థుల్లో కేవలం సగం మంది మాత్రమే రెండో తరగతి పుస్తకం చదవగలిగిన స్థితిలో ఉన్నారు. కొవిడ్‌ 1, 2 దశలలో లక్షల మంది విద్యార్థులు బడులు, కళాశాలలకు దూరమయ్యారు. ఆన్‌లైన్‌ పాఠాలు నిర్వహించినా, ఎంతో మంది సెల్‌ఫోన్లు, ఇతర డిజిటల్‌ ఉపకరణాలు అందుబాటులో లేక పాఠాలు వినలేకపోయారు. నిరుద్యోగిత, నైపుణ్యాల లేమిని అధిగమిస్తూ దేశాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించడంపై పాలకులు శ్రద్ధపెట్టాల్సి ఉంది.

పొంచి ఉన్న సంక్షోభం

భారత్‌లో 2036 నాటికి 15-24 మధ్యలో ఉండే యువ జనాభా 23 కోట్ల నుంచి 22 కోట్లకు తగ్గుతుందని అధికారిక అంచనాలు వెల్లడిస్తున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో అరవై ఏళ్లకు పైబడిన వారు 10 కోట్లు (8.6 శాతం). ఏటా ఇది మూడు శాతం పెరుగుతూ 2050 నాటికి 32 కోట్లకు చేరుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. వీరి సంక్షేమం కూడా దేశానికి ప్రధానమే. కరోనా రెండో దశలో ప్రాణవాయువు అందుబాటులో లేక ఎంతోమంది మృత్యువాత పడ్డారు. ఎందరో పెద్ద వయసువారు ఈ మహమ్మారికి బలయ్యారు. ఈక్రమంలో మెరుగైన వైద్య సదుపాయాల కల్పన సైతం పాలకుల ప్రాధాన్యం కావాలి. పెరిగే శ్రామిక జనాభాకు అనుగుణంగా విద్య, శిక్షణ, ఉపాధి రంగాల మీద భారత్‌ నిశితంగా దృష్టిసారించాలి. లేకుంటే అంతకంతకూ పెరిగే జనాభాతో దేశం పెను సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదు.

- ఎం.అక్షర
 

Posted Date: 12-07-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం